కీర్తి సురేష్ టైటిల్ పాత్రలో నటించిన డోరోతి తమిళ్ మూవీ (Dorothy Movie) అక్టోబర్ రెండు నుంచి తెలుగులో కూడా థియేటర్లలో రిలీజ్ అయ్యింది. ఈరోజు నుంచి (అక్టోబర్ 23, 2026) ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది.
ఇప్పుడు డోరోతి మూవీ ఎలా ఉందో చూద్దాం.
కధేంటంటే?
తమిళనాడులోని ఓ విలేజ్ లో నివాసం ఉంటున్న సుబ్బు (సనంత్) కార్తీ ( రిషికాంత్) చిన్నతనం నుంచి ఒకరంటే ఒకరు విడిచి ఉండలేని ప్రాణ స్నేహితులుగా ఉంటారు. వీళ్లిద్దరిలో సుబ్బు చిన్నప్పటినుంచే దూకుడు స్వభావంతో ఉండగా.. కార్తీ మాత్రం మృదు స్వభావంతో ఉంటాడు. అందుకే కార్తీకి ఏ కష్టం వచ్చినా సుబ్బు అండగా నిలబడి అతడికి ధైర్యం చెప్తూ ఉంటాడు.
సుబ్బు చిన్న తనంలోనే అతడి తల్లి.. సోదరి చనిపోవడంతో తండ్రి.. అన్నల మధ్య స్త్రీ సంరక్షణ లేకుండా పెరుగుతాడు. తన తల్లి.. సోదరి ల చావుకు కూడా తండ్రే కారణమని సుబ్బు నమ్ముతాడు.
ఇదిలా ఉండగా పెరిగి పెద్దయిన తర్వాత సుబ్బు ఇంట్లోకి వదిన రూపంలో డోరోతి (కీర్తి సురేష్) అడుగు పెడుతుంది. దాంతో సుబ్బు తన వదిన డోరోతితో అనుబంధం పెంచుకుంటాడు. ఈ పరిస్థితుల్లో డోరోతి ఉరి వేసుకుని చనిపోతుంది. ఆమె చావుకు తన తండ్రి.. అన్నలే కారణమని సుబ్బు వాళ్ళ మీద కోపం పెంచుకుంటాడు. కానీ డోరోతి మరణంతో సుబ్బులో విచిత్రమైన మార్పులు వస్తాయి.

మరోపక్క అతడి స్నేహితుడు కార్తీ ఒక హత్య కేసులో ఇరుక్కుని కొంతకాలం విలేజ్ కి దూరంగా ఉండాల్సి వస్తుంది. సుబ్బు ప్రవర్తనను సహించని అతడి తండ్రి కార్తీని పిలిపించి ఒక టాస్క్ అప్పచెబుతాడు.
సుబ్బు ప్రవర్తనలో మార్పులు రావడానికి కారణం ఏంటి? మహిళగా మారాలని సుబ్బు ఎందుకు అనుకుంటాడు? సుబ్బు తండ్రి కార్తీని పిలిపించి అప్పగించిన టాస్క్ ఏంటి? అసలు డోరోతి ఎందుకు ఆత్మహత్య చేసుకుంది? అందుకు కారకులు ఎవరు? అనేది మిగిలిన కథ.
ఎలా ఉంది?
కథలో ప్రశ్నలు చదివాక కథేంటో మీకు అర్థమయ్యే ఉంటుంది. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించిన డోరోతి మూవీ తమిళ సినీ ఇండస్ట్రీ నుంచి విమర్శలతో పాటు ప్రశంసలు కూడా అందుకుంది.
ఇద్దరు హీరోలను స్వలింగ సంపర్కులుగా చూపించడంతో ఈ సినిమా దర్శకుడు విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది. అదే సమయంలో జెండర్ వివక్షకు గురి అవుతున్న హిజ్రాల కన్నీటి జీవితాల వెనుక ఉన్న అమానవీయ కోణాలను హృద్యంగా ఆవిష్కరించడం ప్రశంసలు అందుకుంది. ఓవరాల్ గా ఈ సినిమా తమిళ సినీ పరిశ్రమలో వివాదాల సుడిగుండంలో ఇరుక్కుంది.
ఇదే సినిమాని దగ్గుబాటి రానా అక్టోబర్ 2 న తెలుగులో విడుదల చేశారు. తెలుగులో కూడా ఈ సినిమా కథాంశం మీద చర్చ నడిచింది కానీ తమిళ్ ఇండస్ట్రీతో పోలిస్తే తక్కువే. అయితే ఈ రోజు నుంచి ఓటిటిలో కూడా స్ట్రీమింగ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఆడియన్స్ స్పందన ఎలా ఉందో తెలుస్తుంది.
తమిళ్ దర్శకులు ఎక్కువగా సామాజిక సమస్యల కోణంలో కథలు రాసుకుని తెరకెక్కిస్తారు. కుల వివక్ష.. మతం మంటల నేపథ్యంలో గతంలో తమిళ్ సినిమాలు చాలా వచ్చాయి. అయితే ఆ అంశాల మీద ఇప్పటికే చాలా సినిమాలు వచ్చేశాయి కాబట్టి దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు లింగ వివక్ష అంశాన్ని తలకెత్తుకుని స్టోరీ రాసుకున్నారు.
నిజానికి కార్తీక్ సుబ్బరాజు రాసుకున్న పాయింట్ మంచిదే.. కానీ అదే పాయింటును మరింత ప్రభావంతంగా తెరకెక్కించడంలో ఆయన తడబడ్డారు. చిన్నతనం నుంచి స్త్రీ సంరక్షణ లేని సుబ్బు మహిళగా మారాలనుకోవడం.. అందుకోసం ట్రాన్స్ జెండర్లతో సహవాసం చేయడం.. ఈ క్రమంలో సమాజంలో వివక్షత కు గురి అవుతున్న ట్రాన్స్ జెండర్ల జీవితాలను వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేయడం.. లాంటి అంశాలు బాగానే ఉన్నాయి. కానీ తాను చెప్పాలనుకున్న పాయింటును దర్శకుడు సామాన్య ప్రేక్షకుడికి కూడా అర్థమయ్యేలా చెప్పాడా? లేదా? అన్నదే అసలు ప్రశ్న. ఈ ప్రశ్నకు చాలామంది నో అనే చెప్తున్నారు.
సినిమా స్టార్టింగ్ లోనే ” సుబ్బును చంపేశాను ” అని కార్తీతో డైలాగ్ చెప్పించి దర్శకుడు ఆడియన్స్ ని ఎంగేజ్ చేసే ప్రయత్నం చేసిన తీరు బాగుంది. అయితే అదే టెంపో కొనసాగి ఉంటే బాగుండేది. కానీ సుబ్బు.. కార్తీల చిన్ననాటి జీవితం.. పెరిగి పెద్దయిన తర్వాత గ్యాంగ్ స్టర్ లుగా మారాలనుకోవడం.. ఇందుకోసం ఒక వ్యక్తి మీద అటాక్ చేయడానికి ప్రయత్నించి భయంతో పారిపోవడం..సినిమాల్లో లిప్ లాక్ సీన్ చూసి తాము కూడా అలాగే అమ్మాయిలకు లిప్ కిస్ ఇవ్వాలని అనుకోవడం..వంటి సీన్లు దర్శకుడు కామెడీ ట్రాక్ కోసం రాసుకున్నట్టుంది.
అయితే అప్పటికి అసలు స్టోరీ ఏంటో అర్థం కాక ఈ సాగతీత సన్నివేశాలతో ఆడియన్స్ కి విసుగు కూడా వస్తుంది. ఎప్పుడైతే కీర్తి సురేష్ ఎంటర్ అవుతుందో అప్పట్నుంచి అసలు కథలోకి వెళ్తాం. కీర్తి సురేష్ రాకతో సినిమాకి కూడా మంచి జోష్ వచ్చింది. అదీ కాసేపే.. కీర్తి సురేష్ పాత్ర ఎంత వేగంగా వస్తుందో.. అంతే వేగంగా నిష్క్రమిస్తుంది.
టైటిల్ రోల్ పోషిస్తున్న కీర్తి సురేష్ కు దర్శకుడు మరింత స్కోప్ ఇవ్వాల్సింది. నిజానికి కథంతా డోరోతి పాత్ర చుట్టూ కన్నా సుబ్బు.. కార్తీల చుట్టూనే తిరుగుతుంది. దర్శకుడు చెప్పాలనుకున్న పాయింటుకు.. టైటిల్ కూ.. సినిమాలో నడిపిన కథనానికి సరిగా సింక్ అవలేదు.
ఇక సెకండాఫ్ అంతా దాదాపు లారీ ప్రయాణంతోనే సరిపోతుంది. ఎంతసేపూ లారీ ముందుకు వెళ్తుందే కానీ కథ ముందుకు వెళ్లదు. కార్తీ బాధేంటో ఎవరికీ అర్ధం కాదు. ప్రాణ స్నేహితుడి కోసం ఆ పాత్ర ఏమన్నా గట్టి ఎమోషన్లు పండించిందా? అంటే అదీ లేదు. పోనీ తనకు అప్పగించిన టాస్క్ పూర్తి చేయలేక ఆ పాత్ర సంఘర్షణ అనుభవించిందా? అంటే.. అదీ లేదు. ఒకవేళ ఆ సన్నివేశాలలో ఎమోషన్లు.. సంఘర్షణలు ఉన్నా ఆడియన్స్ కి సరిగా కనెక్ట్ కాలేదు.
సెకండాఫ్ మొత్తానికి థ్రిల్ పంచే సీన్ ఏమన్నా ఉందంటే అది సుబ్బు ప్లేసులో కార్తి ఓ బిచ్చగాడిని ప్లాన్ చేయడం ఒకటే ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమాలో ఉన్న ఏకైక ట్విస్ట్ అదొక్కటే. ఇక కీర్తి సురేష్ ఎందుకు ఆత్మహత్య చేసుకుంది? అందుకు కారకులు ఎవరు? అనే విషయాలను దర్శకుడు ఫస్టాఫ్ లోనే మర్చిపోయినట్టున్నారు. పోనీ సెకండాఫ్ లో అయినా సరే దర్శకుడు గుర్తు తెచ్చుకుని క్లారిటీ ఇస్తారేమో అని చూస్తే ఏమీ ఉండదు.
సరే.. దర్శకుడు జెండర్ వివక్ష ఎదుర్కుంటున్న హిజ్రాల జీవితాల గురించి.. వాళ్ళ కష్టాల గురించి సెకండాఫ్ లో ఎక్కువ భాగం కేటాయించడం వరకు ఓకే.. కానీ ఎవరూ ఊహించని విధంగా ఇద్దరు స్నేహితులని స్వలింగ సంపర్కులుగా మార్చి వాళ్లిద్దరి మధ్య లిప్ లాక్ సీన్ పెట్టి ది ఎండ్ అని శుభం కార్డ్ వేశాడు చూసారూ.. ఇది చాలామందికి డైజెస్ట్ కాదు.
అప్పటిదాకా ఆ ఇద్దరు ప్రాణ స్నేహితుల మధ్య ఉన్న బాండింగ్ చూసి పొంగిపోయిన ఆడియన్స్ ఉత్సాహం మీద దర్శకుడు క్లైమాక్సులో బిందెడు నీళ్లు చల్లాడు. అమ్మాయిలకు లిప్ కిస్ ఇవ్వాలని ఆశ పడ్డ ఆ ఇద్దరు స్నేహితులు చివరికి తామిద్దరమే లిప్ కిస్ ఇచ్చుకోవాల్సి వస్తుందని పాపం ఊహించి ఉండరు.. వాళ్ళే కాదు ఎవరూ ఊహించి ఉండరు.. ఒక్క దర్శకుడు తప్ప.
ఎవరెలా చేశారు?
టైటిల్ రోల్ పోషించిన కీర్తి సురేష్ కు ఈ సినిమాలో తగినంత స్కోప్ దక్కలేదు. అసలు ఆ పాత్రకు కీర్తి సురేష్ లేకపోయినా.. జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నా కూడా నడుస్తుంది. కీర్తి సురేష్ లాంటి చక్కటి నటిని సినిమాలోకి తీసుకు వచ్చినప్పుడు ఆమె పాత్రకు ఫుల్ స్కోప్ ఉండేలా చూసుకోవాలి. ఈ విషయంలో దర్శకుడు సరిగా డిజైన్ చేసుకోలేకపోయారు. అయితే కీర్తి సురేష్ కనిపించిన కాసేపు చక్కటి పెర్ఫార్మెన్స్ ఇచ్చి ఆకట్టుకుంది.
ఇక కీర్తి సురేష్ తర్వాత సుబ్బు పాత్ర పోషించిన సనంత్ నటన గురించి చెప్పుకోవాలి. మహిళ వేషధారణలో.. హావభావాలలో సనంత్ నటన నెక్స్ట్ లెవెల్ ఉంది. ఒకరకంగా చెప్పాలంటే ఈ సినిమా సెకండాఫ్ ఆడియన్స్ ని ఎంగేజ్ చేసిందంటే అది కేవలం సనంత్ నటన వల్ల మాత్రమే. తనకిచ్చిన పాత్రకు ప్రాణం పెట్టి కష్టపడి నటించాడు.
కార్తీ పాత్రలో రిషికాంత్ నటన కూడా బాగానే ఉంది కానీ ఎందుకో ఆడియన్స్ అతడి పాత్రతో పూర్తిగా కనెక్ట్ కాలేకపోయారు.
సాంకేతికత
ఈ సినిమాకి ఇళయరాజా సంగీతం అందించారు. ఇళయరాజా సంగీతానికి మార్కులు వేయడం అంటే ఎల్కేజీ పిల్లోడు లెక్కల మాస్టారికి ఒకటో ఎక్కమ్ పాఠాలు నేర్పించడమే అవుతుంది.
తిరునావుక్కరుసు అందించిన సినిమాటోగ్రఫీ కూడా బాగానే ఉంది. ముఖ్యంగా సెకండాఫ్ లో ఔట్ డోర్ సీన్స్ ని బాగా క్యాప్చర్ చేశారు.
నిర్మాణ విలువలు కూడా బాగానే ఉన్నాయి.
విశ్లేషణ
ముందే చెప్పినట్టు సామాజిక సమస్య కోణంలో దర్శకుడు కథ రాసుకుని తెరకెక్కించారు. అయితే ఈ సినిమాలో దర్శకుడు ట్రాన్స్ జెండర్ల కోణంలో కథనాన్ని నడిపించారు. సందేశం అయితే బాగానే ఉంది. కానీ దర్శకుడు తాను చెప్పాలనుకున్న సందేశాన్ని తెర మీద మరింత ఎఫెక్టివ్ గా ప్రజెంట్ చేయలేకపోయారు.
దానికి తోడు స్టోరీ నెమ్మదిగా ముందుకు సాగడం ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది. నిజానికి దర్శకుడు ట్రాన్స్ జెండర్ల కోణంలో కథ చెప్పాలనుకుంటే నేరుగా వాళ్లతోనే మూవీ ప్లాన్ చేసుకుని ఉంటే యాప్ట్ గా ఉండేదేమో? సినిమా స్టార్టింగ్ నుంచి ఇద్దరు ప్రాణ స్నేహితుల కోణంలో కథ నడిపి క్లైమాక్స్ లో మాత్రం హఠాత్తుగా స్వలింగ సంపర్కులుగా కథని మార్చడం బహుశా ఆడియన్సుకి షాక్ ఇవ్వడానికి దర్శకుడు ఎంచుకున్న వ్యూహం అయ్యుంటుంది. దర్శకుడి వ్యూహం ఫలించి ఎండింగులో ఆ ఇద్దరు హీరోల లిప్ లాక్ సీన్ చూసి ప్రేక్షకులు షాక్ అయ్యారు. శుభమ్.
నెట్ ఫ్లిక్స్ లో తెలుగులో కూడా అందుబాటులో ఉంది కాబట్టి వన్ టైమ్ వాచ్ మూవీ కింద చూడాలనుకునేవారు ఓ లుక్కేయండి.
నటీనటులు: కీర్తి సురేష్, సనంత్, రిషికాంత్ తదితరులు
సంగీతం: ఇళయరాజా
సినిమాటోగ్రఫీ: తిరునావుక్కరసు
నిర్మాత: జ్యోతి దేశ్ పాండే
దర్శకత్వం: కార్తీక్ సుబ్బరాజు
ఓటిటి: నెట్ ఫ్లిక్స్
స్ట్రీమింగ్ డేట్: 23-10-2026
రేటింగ్: 2/5
