ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు (AP Local Body Elections) నోటిఫికేషన్ విడుదల కాగానే ఆయా పార్టీల నాయకుల్లో.. కార్యకర్తల్లో.. టికెట్లు ఆశించే అభ్యర్థుల్లో కొత్త ఉత్సాహం వచ్చింది. ప్రజాక్షేత్రంలో ప్రత్యర్ధి రాజకీయ పార్టీల మీద పోటీకి దిగి గెలుపో ఓటమో తేల్చుకోవడానికి ఆయా పార్టీల స్థానిక నాయకులు సన్నాహాలు చేసుకోవడం మొదలు పెట్టారు.
ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి అన్ని పార్టీల కార్యకర్తలు రెడీ అయ్యారు. కూటమి కట్టిన పార్టీలు నీకెన్ని.. మాకెన్ని అనే సీట్ల లెక్కలు తేల్చుకునే పనిలో బిజీ అయ్యారు. చివరికి పొత్తులు కుదిరాయి. అభ్యర్ధుల పేర్లు బయటికి వచ్చాయి.. బీ ఫారాలు చేతికి అందాయి. బీ ఫారాలు చేతికి అందడంతో పోటీ చేసే అభ్యర్ధుల హడావుడి అయితే మామూలుగా లేదు.
అనుభవజ్ఞుల చేత జాగ్రత్తగా నామినేషన్ పత్రాలను రాయించుకుని రెడీగా పెట్టుకున్నారు. ఇక నామినేషన్ కేంద్రాలకు వెళ్ళి తమ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ ఆఫీసర్ చేతిలో పెట్టడమే మిగిలింది.
ఇంతవరకు అంతా ప్రజాస్వామ్య ప్రక్రియలో జరిగినట్టు అనిపిస్తుంది కదా? కానీ అసలు కథ ఇక్కడినుంచే మొదలౌతుంది. మామూలుగా అయితే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులు రిటర్నింగ్ అధికారి కి నామినేషన్ పత్రాలు సమర్పించడం.. అధికారులు ఆ పత్రాలను స్క్రూటినీ చేసి అన్నీ కరెక్ట్ గా ఉంటే ఆమోదించడం.. తప్పులుంటే తిరస్కరించడం జరుగుతుంది. నామినేషన్ ఆమోదం పొందిందంటే అభ్యర్ధి ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం పొందినట్టే. ఇక అక్కడ్నుంచి అభ్యర్ధులు ప్రచారం చేసుకోవడం.. ఓటరు తీర్పు కోరడం మాత్రమే మిగిలి ఉంది. ఇదంతా ఎవరికీ తెలియదని కాదు.. అందరికీ తెలిసిందే.. అయితే ప్రస్తుతం కూడా ఎన్నికల ప్రక్రియ గతంలో మాదిరే ప్రొసీజర్ ప్రకారమే జరుగుతున్నాయా అనేదే ఇప్పటి ప్రశ్న?
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల తంతును గమనించిన వారెవరైనా ఈ ప్రశ్నకు నో అనే సమాధానం చాలా తేలిగ్గా చెప్పగలరు. ఉన్న వాస్తవం కూడా అదే.
ప్రస్తుతం ఏపీలో ఏం జరుగుతుంది?
స్థానిక సంస్థల ఎన్నికల్లో బలవంతుడిదే రాజ్యం అవుతుంది. కొన్ని ప్రాంతాల్లో పోటీ చేసే అభ్యర్ధులు తమ నామినేషన్ పేపర్లను గట్టిగా పట్టుకుని రహస్యంగా.. బిక్కు బిక్కు మంటూ.. భయం.. భయంగా నామినేషన్ కేంద్రాలకు వెళ్తున్నారనేది సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్న కొన్ని వీడియోలను చూస్తే అర్థమైపోతుంది.
సరే చివరికి ఎలాగోలా నామినేషన్ కేంద్రానికి చేరుకుని లోపలికి అడుగుపెడుతున్నంతలోనే వెనకనుంచి ఎవరో వచ్చి వాళ్ళ చేతుల్లో ఉన్న నామినేషన్ పత్రాలను లాక్కుని చించి పారేయడాలు.. పారిపోవడాలు కూడా జరుగుతూనే ఉన్నాయి. ఇదేమీ చీకట్లో జరుగుతున్న వ్యవహారమేమీ కాదు.. పట్టపగలు నలుగురూ చూస్తుండగానే నామినేషన్ పత్రాలను గుంజుకుని నడిరోడ్డు మీద విసిరేస్తున్నారు. చాలాచోట్ల ఇందుకు పోలీసులే సాక్ష్యులు అవుతున్నారు. కొన్ని వీడియోలు చూస్తే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం కూడా స్పృష్టంగా కనిపిస్తుంది. నడిరోడ్డు మీద నామినేషన్ పత్రాలను చించేయడం అంటే ప్రజాస్వామ్యాన్ని నడిరోడ్డు మీదే ఖూనీ చేసినట్టు అన్నమాట. ఇలాంటి సంఘటనలు గత ప్రభుత్వ హయాంలో కూడా జరిగాయి ..ఇప్పుడూ జరుగుతున్నాయి. ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకూడదనేది ఈ ఆర్టికల్ ముఖ్య ఉద్దేశ్యం.
ఎవరిది బాధ్యత?
ఎన్నికలను పారదర్శకంగా.. ప్రశాంతంగా.. జరిపించాల్సిన బాధ్యత పూర్తిగా ఎన్నికల కమిషన్ మీదే ఉంటుంది. తమకు అందిన ఫిర్యాదుల మీద సత్వరమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి పౌరుడు ఎన్నికల్లో స్వేచ్ఛగా తన ఓటు హక్కును వినియోగించుకునే పరిస్థితులను కల్పించాల్సి ఉంటుంది. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్ధులకు రక్షణ కల్పించాల్సి ఉంటుంది. పోలీసుల చేత నిష్పక్షపాతంగా ఎన్నికల విధులు నిర్వహించేలా బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది.
మరి ఇవన్నీ జరిగాయా? లేదా ? అనే ప్రశ్నకు అసలు వాస్తవాలు ఇప్పటికే ఏపీ ప్రజలకు తెలుసు అనే సమాధానం వస్తుంది. అయితే సరైన ఫిర్యాదు ఉంటేనే కదా ఎన్నికల సంఘం చర్యలు తీసుకునేది? అని మనం అనుకోవచ్చు. నిజానికి బహిరంగంగా జరుగుతున్న ఇలాంటి దుశ్చర్యల మీద ఎన్నికల సంఘానికి ఒకళ్ళు ఫిర్యాదు చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎన్నికల సంఘం తనకున్న విచక్షణాధికారాలను ఉపయోగించి స్వతంత్రంగా విచారణ జరిపి చర్యలు తీసుకోవచ్చు.

సరే.. ఫిర్యాదుల సంగతి కూడా ఆలోచిద్దాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమాలు.. దౌర్జన్యాలు జరుగుతున్నాయని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వయంగా SEC ని కలిసి ఫిర్యాదు చేశారు. కనీసం ఆ ఫిర్యాదు అందుకున్న SEC తక్షణమే కఠిన చర్యలు తీసుకున్నా కొంతవరకు సార్థకత ఉండేది. ఆ ఫిర్యాదు తర్వాత కూడా రాష్ట్రంలో అలాంటి కొన్ని సంఘటనలు జరగడం విచారకరం. SEC కి ఫిర్యాదు చేసిన జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర గవర్నర్ ను కూడా స్వయంగా కలిసి స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న తీరుపై ఆయనకు ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు చేసిన జగనే ఆ తర్వాత .. గవర్నర్ మంచి వారే కానీ ఆయన చేతిలో ఏమీ లేదని తేల్చేసి న్యాయస్థానాలను ఆశ్రయించారు. చివరికి సుప్రీమ్ కోర్ట్ జోక్యంతో ఎన్నికలను వాయిదా వేయాల్సి వచ్చింది. ఎక్కడైతే నామినేషన్ పత్రాలను చించేశారో అక్కడ తిరిగి నామినేషన్ దాఖలుకు అవకాశం కల్పించారు. దాంతో ప్రజాస్వామ్యం పరిస్థితి చావు తప్పి కన్ను లొట్టపోయిన చందం అయ్యింది. చూసారా.. ఏపీలో ఎన్నికలు జరుగుతున్న తీరు మీద అభ్యంతరాలు ఎక్కడ్నుంచి మొదలై ఎక్కడికి వెళ్లిందో? అది కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో .. ఇక్కడే ఇలా ఉంటే ఇక 2029 లో జరగబోయే సాధారణ ఎన్నికల్లో పరిస్థితి ఎలా ఉంటుందో ?
ప్రభుత్వం బాధ్యత ఏంటి?
ఎన్నికలు పారదర్శకంగా.. ప్రశాంతంగా నిర్వహించడంలో రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత కూడా ఉంటుంది. పైకి స్టేట్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం SEC కంట్రోల్ లోకి వెళ్ళిపోయినట్టు కనిపిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వ కనుసన్నల్లోనే అది నడుచుకుంటుందనేది బహిరంగ రహస్యమే.. ముఖ్యంగా పోలీస్ యంత్రాంగంలో కింది స్థాయి అధికారులు చాలావరకు ప్రభుత్వ పెద్దల అదుపాజ్ఞలకు లోబడే పనిచేస్తారనేది కూడా తెలిసిన విషయమే. అందుకే ఎన్నికల సమయంలో ప్రభుత్వ పెద్దలు పోలీసుల ద్వారా తమ పనులను చక్కబెట్టుకుంటారు. వారి ఆటలో పావులుగా మారేది పోలీసులే.. కేసుల పాలయ్యేది కార్యకర్తలే.. చివరకు బలయ్యేది రౌడీలే.
సరే.. ఇందులో పోలీసులను కూడా తప్పు పట్టలేం.. ఎన్నికల సమయంలో వారి పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా ఉంటుంది. ప్రభుత్వ పెద్దల మాటలు వినకపోతే ఏం జరుగుతుందో వాళ్లకు తెలుసు.. అలాగే భవిష్యత్తులో ఇప్పుడున్న ప్రతిపక్షం అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందో కూడా వాళ్లకు తెలుసు.. కానీ గత కొన్నేళ్లుగా ఏపీలో జరుగుతున్న పరిణామాలను చూసి వాళ్ళు కూడా రాటుదేలిపోయారు. మహా అయితే సస్పెండ్ చేస్తారు.. ఆలోగా ఏదో ఒక పార్టీలో చేరిపోయి రాజకీయ నాయకుడిగా మారిపోయి సేఫ్టీ జోన్ లోకి వచ్చేసాం అనుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో చాలామంది ఐపీఎస్ అధికారులు రాజకీయాల్లోకి రావడం వెనుక విధి నిర్వహణలో వారు ఎదుర్కున్న అనుభవాలు కూడా ఒక కారణం అయ్యుంటాయి.

సరే.. పోలీసుల సంగతి అలా ఉంచుదాం. ఇప్పుడు ఈ పోలీసులను వాడుకుంటున్న రాజకీయ నాయకుల సంగతి చూద్దాం. పోలీసుల గురించి చెప్పుకోవాలంటే వీళ్లు అధికార పార్టీకి నచ్చుతారు. ప్రతిపక్షానికి నచ్చరు. ఇది ఫిక్స్ అండ్ పర్మనెంట్ అన్నమాట. ఎవరు ఎటు మారినా పోలీసుల మీద అధికార.. ప్రతిపక్షాల అభిప్రాయాలు మాత్రం మారవు.
గతంలో టిడిపి అధికారంలో ఉండి జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోలీసుల తీరు పట్ల ఆయన బాహాటంగా విమర్శలు చేశారు. పోలీసులు తన పట్ల వ్యవహరించిన తీరుకు నిరసనగా వైజాగ్ ఎయిర్పోర్ట్ లో ధర్నా కూడా చేశారు. ఎన్నికల్లో అధికార పార్టీ చేస్తున్న అక్రమాలకు పోలీసులు కొమ్ము కాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చివరకు అధికార.. ప్రతిపక్ష స్థానాలు మారాయి. ఇప్పుడు జగన్ ప్రభుత్వానికి పోలీసుల పనితీరు నచ్చింది. ప్రతిపక్షంలో ఉన్న టీడీపీకి పోలీసుల తీరు అస్సలు నచ్చలేదు. గతంలో పోలీసులకు వ్యతిరేకంగా జగన్ ధర్నా చేస్తే మారిన పరిస్థితుల నేపద్యంలో లోకేష్ ధర్నా చేశారు. ఈసారి ఆయన ధర్నా చేయడమే కాదు.. ప్రభుత్వ పెద్దల అడుగులకు మడుగులు ఒత్తిన పోలీసుల పేర్లు రెడ్ బుక్ లో రాసుకున్నారు.మరోపక్క పోలీసులు
చంద్రబాబును అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపించారు. చంద్రబాబును జైలుకు పంపడంలో పోలీసులు.. ప్రభుత్వ పెద్దల విజయం సాధించారు. కానీ ఆ విజయం తమ పరాజయానికి నాంది అవుతుందని ఆ క్షణాన వాళ్ళు ఊహించలేదు.
తిరిగి ఎన్నికల్లో అధికార.. ప్రతిపక్షాల స్థానాలు మారాయి. జగన్ అధికారం కోల్పోయి బాబు అధికారంలోకి వచ్చారు . ఇప్పుడు మళ్లీ సేమ్ స్టోరీ రిపీట్ అవుతుంది. పోలీసుల పని తీరు పట్ల అధికార పక్షం కిమ్మనటం లేదు.. షరా మామూలుగా ప్రతిపక్షం పోలీసుల మీద నిప్పులు కురిపిస్తుంది.
ఇందాక ఓ వీడియోలో ఒక మహిళా ఎస్సై మాజీ మంత్రి విడుదల రజని వెనక్కి తోసేయడంతో ఆమె కింద పడిపోవడం కనిపించింది . విడుదల రజని కేవలం ఒక పార్టీ నాయకురాలు మాత్రమే కాదు.. మాజీ మంత్రి కూడా.. కనీసం ఆమె హోదాని గుర్తించి అయినా సరే ఆ మహిళా ఎస్సై కొంత సంయమనం పాటించి ఉండాల్సింది. చివరకు ఈ విషయం SEC దృష్టికి చేరడంతో ఆ మహిళా ఎస్సైని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
ముగింపు
ఈ మొత్తం ఉదంతం చూస్తే మనకు మూడు విషయాలు అర్ధం అవుతాయి. పోలీసులు ఏ పార్టీ అధికారంలో ఉంటే వారికి అనుకూలంగా వ్యవహరిస్తారు. అలాగే ఏ పార్టీకి చెందిన నాయకులు అధికారంలో ఉంటే ఆ పార్టీ నాయకులు పోలీసులను తమకు అనుకూలంగా వాడుకుంటారు.
ఇక మూడో విషయం అత్యంత ముఖ్యమైనది.. ఓటర్లు అన్నీ గమనిస్తూ ఉంటారు.. ఎవరిది తప్పు? ఎవరిది ఒప్పు? అనే అంచనాకు వస్తారు. అంతిమంగా తమ తీర్పును ఓటు రూపంలో ఇస్తారు. రాజకీయ నాయకులు గమనించాల్సింది ఓటరు తీర్పులోని పరిణితినే.

మళ్ళీ అధికారం దక్కాలనుకునే నాయకుడు ఓటరు తీర్పులోని సహేతుకతని విశ్లేషణ చేసుకుంటాడు. తన హయాంలో జరిగిన తప్పొప్పులను బేరీజు వేసుకుంటాడు. భవిష్యత్తులో అటువంటి తప్పులు దొర్లకుండా జాగ్రత్తలు పడతాడు. అంతేకానీ అధికారం శాశ్వతంగా తమ చేతుల్లోనే ఉంటుందనే భ్రమలో పోలీసులను ఇష్టారాజ్యంగా వాడుకుని ప్రయోగాలు చేస్తే బెడిసికొట్టడమే కాకుండా ఏం జరుగుతుందనేది ఒక్కసారి వెనుతిరిగి చూసుకుంటే తెలుస్తుంది. అందుకే నాయకులు గతానుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని తమను తాము మలుచుకుంటే ఓటర్లు రెండో ఆలోచన చేయరు.
