పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) బర్త్ డే స్పెషల్ !

Spread the love

ప్రస్తుతం పవర్లో ఉన్న పవన్ కళ్యాణ్ కి అభిమానులు సినిమాల్లో పెట్టుకున్న పేరు పవర్ స్టార్ . ఈ రోజు పవర్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియచేస్తూ ఆయన సినీ, రాజకీయ ప్రయాణాలపై విశ్లేషణ చేసుకుందాం.

పవన్ కళ్యాణ్ బాల్యం

1968 సెప్టెంబర్ 2 న బాపట్లలో కొణిదెల వెంకట్రావు.. అంజనాదేవి దంపతులకు కళ్యాణ్ బాబు జన్మించారు. ఈయనకు చిరంజీవి , నాగబాబు అనే ఇద్దరు అన్నయ్యలు , ఇద్దరు అక్కయ్యలు ఉన్నారు. బాల్యం నుంచి పవన్ కళ్యాణ్ కు మార్షల్ ఆర్ట్స్ అంటే ఇష్టం. సినీ కెరీర్ తొలినాళ్లలో కూడా కళ్యాణ్ బాబు ఏదో ఒక సన్నివేశంలో మార్షల్ ఆర్ట్స్ ఉండేలా చూసుకునేవారు. అయితే చదువులో మాత్రం తాను వెనకబడ్డానని గతంలో ఆయనే స్వయంగా కొన్ని ఇంటర్వ్యూలలో చెప్పారు.

నక్సలైట్ కాబోయి

చిన్నప్పట్నుంచి పవన్ కళ్యాణ్ లో ఆవేశం పాలు ఎక్కువే. సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలకు వ్యతిరేకంగా ఏదో ఒకటి చెయ్యాలన్న కసితో ఒకానొక దశలో తుపాకి చేతబట్టుకుని అడవిలో అన్నల దగ్గరికి వెళ్ళాలన్న ఆలోచనలు కూడా వచ్చేవని కొన్ని సందర్భాలలో ఆయన చెప్పారు. కానీ ఎప్పుడైతే ఆయన అన్నయ్య చిరంజీవి తన సినీ కెరీర్లో వేగంగా ఎదిగారో ఆ ప్రభావం తమ్ముడు కళ్యాణ్ బాబు మీద కూడా పడింది.

అన్నదమ్ముల అనుబంధం

మెగా కుటుంబంలో అన్నదమ్ముల అనుబంధం చూస్తే ఎవరికైనా ముచ్చటేస్తుంది. తమ్ముళ్లు నాగబాబు , కళ్యాణ్ బాబులకు అన్నయ్య అంటే ప్రేమ. అలాగే అన్నయ్య చిరంజీవికి తమ్ములంటే ప్రాణం. ఎటువంటి పొరపొచ్చాలు లేకుండా ఒకరికొకరు చేదోడువాదోడుగా ఉండే అన్నదమ్ములను మెగా కుటుంబంలో చూస్తాం. సినీ కెరీర్లో తాను పైకి ఎదగడమే కాదు ఇద్దరు తమ్ముళ్లు కూడా ఎదిగారంటే అది అన్నయ్య చిరంజీవి ఇచ్చిన ప్రోత్సాహమే. అలాగే ఇటీవల నాగబాబుకు ఏపీలో క్యాబినెట్ రాంక్ పదవి వచ్చిందంటే అది తమ్ముడి ప్రోత్సాహమే.

సినీ రంగ ప్రవేశం

1996 లో అక్కడ అమ్మాయి – ఇక్కడ అబ్బాయి సినిమాతో కళ్యాణ్ బాబు వెండితెర అరంగేట్రం చేశారు. అప్పటికి కళ్యాణ్ బాబు అంటే చిరంజీవి తమ్ముడుగా మాత్రమే గుర్తింపు ఉంది. అక్కడ్నుంచి మొదలైన ఆయన సినీ ప్రయాణం తొలిప్రేమ, ఖుషి, జల్సా , అత్తారింటికి దారేది లాంటి సినిమాలు హిట్ కొట్టడంతో కళ్యాణ్ బాబు కాస్తా పవర్ స్టార్ అయ్యారు. జ్యోతిష్యుల సలహాతో ఆయన పేరు కళ్యాణ్ బాబు కాస్తా పవన్ కళ్యాణ్ గా మారింది. పవన్ కళ్యాణ్ కి పవర్ స్టార్ ట్యాగ్ లైన్ తోడవడంతో ఒక్కసారిగా ఆయన ఇమేజ్ పెరిగిపోయింది.

మధ్యలో జానీ వంటి డిజాస్టర్లు తగులుకోవడంతో ఆయన సినీ ప్రయాణం ఒడిదుడుకులతో సాగింది. అన్నయ్య చిరంజీవితో పోలిస్తే పవన్ కళ్యాణ్ సినీ కెరీర్ మందకొడిగా సాగింది. అయినా ఆశ్చర్యం ఏంటంటే అన్నయ్యతో సమానంగా పవన్ కళ్యాణ్ కూడా విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్నారు.

వివాదాల్లో పవన్ కళ్యాణ్

సినీ జయాపజయాల సంగతి ఎలా ఉన్నా పవన్ కళ్యాణ్ లోని ఆవేశపరుడు మాత్రం తగ్గలేదు. బహిరంగ వేదికల్లో కూడా తన మనసులోని విప్లవ భావాలను బాహాటంగానే పంచుకునేవారు. ఈ నేపథ్యంలో కత్తి మహేష్ తో పవన్ కళ్యాణ్ సంవాదం వివాదాలకు దారి తీసింది. అతడితో అటోఇటో తేల్చుకుంటానని సవాల్ చేసి ఫిలిమ్ ఛాంబర్ హాలు దగ్గర వేచి చూసిన సంఘటన అప్పట్లో మీడియాలో సంచలనం సృష్టించింది.

ఆ గొడవ సద్దుమణిగిన తరుణాన చిరంజీవి కూతురి ప్రేమ వివాహం విషయంలో ఏకంగా రివాల్వర్ పట్టుకుని మరో సంచలనం సృష్టించారు. పవన్ కళ్యాణ్ దూకుడు స్వభావం వల్ల అప్పట్లో పరిటాల రవితో కూడా గొడవలు జరిగినట్టు కొన్ని ప్రింట్ మీడియాలలో కథనాలు కూడా వచ్చాయి.

రాజకీయాల్లో కూడా అదే దూకుడు

2008 లో అన్నయ్య చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీకి యువజన విభాగం అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించారు. స్వభావాల్లో చిరంజీవికి, పవన్ కళ్యాణ్ కి చాలా విరుద్ధాలు ఉన్నాయి. ఏ విషయంలో అయినా సరే చిరంజీవి ఆచితూచి ముందుకు వెళ్తారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం దూకుడుగా వెళ్తారు. హైదరాబాదులో జరిగిన ప్రజారాజ్యం ప్రచార సభలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ స్పీచ్ ఇస్తూ చొక్కా విప్పి గాల్లో గిరగిరా తిప్పడం అప్పట్లో సంచలనం సృష్టించింది. సినిమాలు వదిలేసి రాజకీయాల్లోనే ఆటో ఇటో తేల్చుకోవాలని కసితో దిగిన పవన్ కళ్యాణ్ ఆవేశం మీద ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడం ద్వారా చిరంజీవి నీళ్లు చల్లారు.

ఇది పవన్ కళ్యాణ్ ఊహించని పరిణామం. దూకుడుగా సాగుతున్న పవన్ పొలిటికల్ కెరీర్లో ఒక్కసారిగా స్తబ్దత ఆవరించింది. అటు చేతిలో సినిమాలు వదులుకోవడం , ఇటు రాజకీయ శూన్యం ఏర్పడటం పవన్ కళ్యాణ్ ను కుంగదీసాయి. దాంతో అసంతృప్తితో కొంతకాలం అన్నయ్య చిరంజీవికి దూరంగా ఉన్నారు.

సొంత రాజకీయ పార్టీ స్థాపన

అయినా సరే రాజకీయాల పట్ల పవన్ కళ్యాణ్ తన దృక్పథాన్ని మార్చుకోలేదు. 2014 మార్చిలో జనసేన పేరుతో సొంత రాజకీయ పార్టీని స్థాపించారు. మొదటిసారి నేరుగా ఎన్నికలకు వెళ్లకుండా టీడీపీకి మద్దతు ఇచ్చారు.

2019 ఎన్నికల్లో మాత్రం టీడీపీకి మద్దతు విరమించి రాష్ట్రం మొత్తంమీద 140 స్థానాల్లో జనసేన అభ్యర్ధులను పోటీకి నిలిపారు. తను స్వయంగా గాజువాక, భీమవరం స్థానాల నుంచి పోటీ చేశారు. అయితే ఊహించని విధంగా పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోవడమే కాకుండా కేవలం ఒకేఒక్క రాజోలు స్థానం దక్కించుకుని జనసేన చతికిల పడింది. తరువాయి కాలంలో ఆ ఒక్క ఎమ్మెల్యే కూడా వైసీపీకి మద్దతు ఇవ్వడంతో జనసేన ఖాళీ అయ్యింది.

వేరొకళ్ళు అయితే ఈ పరిణామాలతో దుకాణం బంద్ చేసుకుని తిరిగి సినిమాల్లోకి వెళ్ళిపోయేవారు. కానీ పవన్ కళ్యాణ్ నిరాశ పడలేదు. పోయినచోటనే వెతుక్కోవాలన్నట్టు ఓపిగ్గా వేచి చూశారు.

2024 ఎన్నికల్లో కూటమి ఏర్పాటు చేసి గేమ్ చేంజర్ అయ్యారు. పిఠాపురం స్థానం నుంచి గెలిచి కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. తాను రాజకీయాల్లో బిజీగా ఉన్న సమయంలో పెండింగ్ పడిన సినిమాలను పూర్తి చేయడం కోసం రీ ఎంట్రీ ఇచ్చారు. హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ ,OG వంటి సినిమాలు పవర్ స్టార్ సెకండ్ ఇన్నింగ్స్ ను పీక్ కి తీసుకెళ్ళాయి.

పవన్ కళ్యాణ్ లో కనిపిస్తున్న రాజకీయ పరిణితి

రెండోసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న సమయంలో పవన్ కళ్యాణ్ లో కొంత రాజకీయ పరిణితి కనిపించింది. ఆవేశం స్థానంలో ఆలోచనతో నిర్ణయాలు తీసుకోవడం మొదలుపెట్టారు. రాజకీయాల్లో ఎక్కడ తగ్గాలో.. ఎక్కడ నెగ్గాలో తెలుసుకున్నారు. 2024 ఎనికల్లో గేమ్ చేంజర్ పాత్ర పోషించారు. వైసీపీని అధికారం నుంచి తప్పించి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి పావులు కదిపారు.

అటు కేంద్రంలోని బీజేపీని, ఇటు రాష్ట్రంలో టీడీపీని కూటమిలో జట్టు కట్టడానికి ఒప్పించారు. ఒకరకంగా పవన్ కళ్యాణ్ వ్యూహం ఆయన కన్నా చంద్రబాబుకి రాజకీయంగా కలిసివచ్చింది. అందివచ్చిన అవకాశాన్ని అటు బీజేపీ.. ఇటు టీడీపీలు తెలివిగా వాడుకున్నాయి. ఫలితంగా ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం దక్కించుకుంది.

పవన్ కళ్యాణ్ ను వెంటాడుతున్న ఆరోగ్య సమస్యలు

రాజకీయాల్లో ప్రవేశించిన అతి కొద్దికాలంలోనే డిప్యూటీ సీఎం స్థాయికి ఎదగడం పవన్ కళ్యాణ్ సాధించిన గొప్ప అచీవ్మెంట్ కిందనే భావించాలి. డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ లో మరింత పెద్దరికం, హుందాతనం వచ్చింది. వెనకటిదూకుడు స్వభావం ఇప్పుడు మచ్చుకు కూడా కనపడదు.

అయితే దురదృష్టవశాత్తు పవన్ కళ్యాణ్ ను ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. సైనస్ ఇబ్బందులతో సర్జరీ చేయించుకుని కోలుకుంటున్న సమయంలోనే భుజానికి సర్జరీ జరగడంతో పార్టీకి, ప్రభుత్వానికి ఎక్కువ సమయం కేటాయించలేక విశ్రాంతి తీసుకోవాల్సి వస్తుంది.

2029 ఎన్నికల వ్యూహం

మరోపక్క జనసేనాని 2029 ఎన్నికల నాటికి పూర్తి ఆరోగ్యంతో రాష్ట్రంలో తమ పార్టీని పూర్తి మెజారిటీ తో అధికారంలోకి తీసుకువచ్చి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించాలని జనసైనికులు కోరుకుంటున్నారు. వారు కోరుకుంటున్నట్టుగానే 2029 లో అధికారం హస్తగతం చేసుకోవడానికి జనసేనాని ఇప్పట్నుంచే నిశ్శబ్దంగా పావులు కదుపుకుంటూ పోతున్నారు. అప్పటికల్లా ప్రస్తుతం ఉన్న రాజకీయ సమీకరణాలు ఖచ్చితంగా మారిపోతాయనడంలో సందేహం లేదు.

ఈ రోజు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మరోసారి శుభాకాంక్షలు!


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *