ముందుగానే ఊహించినట్టు కవిత సొంత కుంపటి పెట్టుకుంది. బిఆర్ఎస్ నుంచి సస్పెండైన పదినెలల్లోనే తెలంగాణా రాష్ట్ర సేన (TRS )పేరుతో సొంత రాజకీయ పార్టీ ప్రారంభించింది.
ఈ శనివారం హైదరాబాద్ దగ్గరలోని మునీరాబాద్ లో ఓ కన్వెన్షన్ హాల్ లో జరిగిన పార్టీ ఆవిర్భావ సమావేశంలో ఆమె ప్రసంగించారు.
కవిత ప్రసంగం కాంగ్రెస్,బీజేపీ, బిఆర్ఎస్ లను టార్గెట్ చేస్తూ కొనసాగినా అందులో అధికభాగం తన తండ్రి కేసీఆర్ ను నేరుగా విమర్శించడానికే కేటాయించారు.
ఈ పరిణామాలను ఒకసారి విశ్లేషించుకుందాం .
కవిత అలక ఎప్పుడు మొదలైంది?
గత ఏడాది కవిత అమెరికా నుంచి తిరిగి వస్తున్న సమయంలో తండ్రిని ఉద్దేశించి ఆమె రాసిన లేఖ లీక్ అయి సంచలనం సృష్టించింది.
పార్టీలో జరుగుతున్న పరిణామాల పట్ల తన ఆవేదనను తెలియచేస్తూ ఆమె లేఖ కొనసాగింది. డియర్ డాడీ అంటూ రాసిన లేఖలో అధికారం కోల్పోయిన తర్వాత బిఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలను ఆమె నేరుగా తండ్రికి ఏకరువు పెట్టింది. వరంగల్ సభలో బీజేపీని మరింత బలంగా విమర్శించి ఉండాల్సిందని పేర్కొంది. పార్టీ క్యాడర్ కు కేసీఆర్ అందుబాటులో లేకపోవడంతో సరైన దిశా నిర్దేశం చేసేవారు కరువయ్యారని ఆమె తన ఆవేదన వ్యక్తం చేసింది. వెంటనే పార్టీ సమావేశాన్ని ఏర్పాటుచేసి కార్యకర్తలకు మార్గదర్శనం చేయాల్సిందిగా కేసీఆర్ ను కోరింది.
అయితే తాను వ్యక్తిగతంగా తండ్రికి రాసిన లేఖను కావాలనే కొందరు లీక్ చేశారని అప్పట్లో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమెరికా నుంచి తిరిగి వచ్చిన కవిత ఏమన్నారు?
మొదటిసారిగా బిఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ నాయకత్వాన్ని ఆయన కూతురే లేఖ ద్వారా స్వయంగా ప్రశ్నించడంతో ఈ అంశం అటు పార్టీలోనూ, ఇటు మీడియాలోనూ సంచలనం సృష్టించింది.
జరుగుతున్న పరిణామాలను విపక్షాలు సైతం జాగ్రత్తగా పరిశీలించాయి . మొదట్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కూడా కవిత లేఖ అంశాన్ని సీరియస్ గా తీసుకోలేదు . ఇదంతా కేసీఆర్ ఆడిస్తున్న డ్రామా అని కొట్టిపారేశారు. పైకి అలా ప్రకటనలు చేసినా అందరి దృష్టి కవిత మీదే పడింది .
ఇదిలా ఉండగా అమెరికా నుంచి తిరిగొచ్చిన కవిత శంషాబాద్ ఎయిర్ పోర్టులోనే మీడియా సమావేశం నిర్వహించింది.
ఆ సమావేశంలోనే మొదటిసారిగా కవిత నోరు విప్పి పార్టీలో జరుగుతున్న పరిణామాలను బయటపెట్టారు . నిజానికి కేసీఆర్ దేవుడు, ఆయన చుట్టూ దయ్యాలు చేరాయని, త్వరలో ఆ దయ్యాల బండారం బయటపెడతానని ఇన్ డైరెక్ట్ గా హరీష్ రావు, సంతోష్ కుమార్ లను ఉద్దేశిస్తూ తీవ్ర వాఖ్యలు చేశారు .
అనంతరం ఆమె ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి వెళ్ళి కేసీఆర్ ను కలవాలని ప్రయత్నం చేశారు . కానీ కవితకు ఎర్రవల్లి ఎంట్రీ లభించలేదు. దాంతో కవిత ఇష్యూ లో కేసీఆర్ స్టాండ్ కూడా అందరికీ అర్థమైంది .
చేసేదిలేక ఆమె తన రెండో అస్త్రం నేరుగా హరీష్ రావు మీద సంధించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో హరీష్ రావు అవినీతికి పాల్పడ్డాడని మీడియా సమావేశంలో బయటపెట్టింది . అయితే ఆమె ఆరోపణలను కేటీఆర్ సహా బిఆర్ఎస్ నాయకులు ఖండించడంతో పాటు కేసీఆర్ హరీష్ రావును ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి పిలిపించుకుని మాట్లాడటంతో పార్టీలో తన స్థానం పట్ల కవితకు పూర్తి క్లారిటీ వచ్చింది.
అప్పుడు కవిత ఏం చేసింది?
ఎప్పుడైతే తన తండ్రి కూడా అన్నకు, బావకు వంత పాడుతున్నాడని అర్థమైందో అప్పుడే ఇక బిఆర్ఎస్ పార్టీలో తనను పక్కన పడేశారని కవితకు అర్థమైంది .
అందుకే రాష్ట్రంలో సరికొత్త రాజకీయ ప్రత్యామ్నాయాన్ని సృష్టించాలని ఆమె ఆలోచన చేసింది . ఆ ఆలోచనతోనే బీసీ నినాదాన్ని ఆమె తలకెత్తుకున్నారు. తమ సమస్యలపై కవిత పోరాడగలరనే నమ్మకంతో బీసీ సంఘాలు కూడా ఆమెకు అండగా నిలబడ్డాయి . తన సొంత సంస్థ అయిన జాగృతి ద్వారా వెనుకబడిన వర్గాల హక్కుల కోసం పోరాడాలని ప్రయత్నాలు చేశారు . అప్పటికి ఆమె సొంత పార్టీ ఆలోచన చేయలేదు .
తెలంగాణా ఉద్యమ సమయంలో తెలంగాణా జాగృతి సంస్థ ద్వారా పోరాటం చేసిన మాదిరే వెనకబడిన వర్గాలను దగ్గరికి తీసుకుని పోరాటం చేద్దామని అనుకున్నారు .
ఈ పరిణామాల నేపధ్యంలో బిఆర్ఎస్ పార్టీ నుంచి కవితను సస్పెండ్ చేయడంతో ముసుగులో గుద్దులాటకు తెర పడింది. కవిత తన రాజకీయ భవిష్యత్తు గురించి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది .
షుమారు పది నెలల తర్వాత కవిత TRS పేరుతో తన సొంత రాజకీయ పార్టీ ఆవిర్భావ ప్రకటన చేసింది.
TRS ఆవిర్భావ సదస్సులో కవిత ఏం మాట్లాడింది?
పార్టీ ఆవిర్భావ సదస్సులో కవిత షుమారు యాభై నిమిషాలకు పైన ప్రసంగించింది . ఆమె ప్రసంగం కాంగ్రెస్, బీజేపీ బిఆర్ఎస్ పార్టీలను టార్గెట్ చేస్తూ కొనసాగింది . అందులో వ్యక్తిగతంగా కేసీఆర్ ను విమర్శించడానికే కవిత ఎక్కువ సమయం తీసుకుంది.
కవిత ప్రసంగం క్లుప్తంగా,
ప్రత్యేక తెలంగాణా సాధన కోసం ఎందరో ఉద్యమకారులు తమ ప్రాణాలను ఫణంగా పెట్టారు . మన ఆడబిడ్డలం అందరం కలిసి తెలంగాణా జాగృతి సంస్థ తరపున వీధుల్లోకి వచ్చి పోరాటాలు చేశాం. తెలంగాణా ఉద్యమ సమయంలో నా రక్తం , చెమట , కష్టం ధారపోసి పోరాటాలు చేసా..అంతిమంగా కేసీఆర్ గారు మడమ తిప్పని పోరాటం చేసి ప్రత్యేక తెలంగాణా సాధించారు.
కానీ అధికారం వచ్చిన తర్వాత కేసీఆర్ లో మమకారం పోయింది. తెలంగాణా కోసం పోరాటం చేసిన కేసీఆర్..ఇప్పుడు మనముందు ఉన్న కేసీఆర్ ఒకరు కారు.. ఈ కేసీఆర్ మారిన మనిషి.. మర మనిషి.. మన మనిషి కాదు. ఈ మాటలు ఎంతో బాధతో చెప్తున్నా.
గతంలో చేనేత కార్మికులు ఆకలి చావులు చస్తే కేసీఆర్ జోలె పట్టి వాళ్లను ఆదుకున్నాడు. సింగరేణిలో కార్మికుడు చనిపోతే పోయి పరమర్శించాడు . కానీ ఇప్పుడున్న కేసీఆర్ ఆ కేసీఆర్ కాదు. హైడ్రా కూల్చివేతలతో ఇల్లు కోల్పోయిన వాళ్ళు అన్నా మమ్మల్ని కాపాడు అంటే ఉలకడు. పోలీసుల దౌర్జన్యాలకు ఆడబిడ్డ గర్భం పోయి అన్నా కాపాడు అంటే పలకడు . అదేమంటే నన్ను అధికారం నుంచి తప్పించి ప్రజలు తప్పు చేశారు. అంచేత నేను బయటికి రాను అని ఫామ్ హౌస్ లోనే పండుకోవడం సరైన పనేనా? ఇందుకోసమా కొట్లాడి ప్రత్యేక తెలంగాణా తెచ్చుకుంది?
అవినీతి జరిగితే కన్నకొడుకు అయినా, కూతురు అయినా తీసి పక్కన పెడ్త అన్నడు. చివరికి ఏం చేశారు? కాళేశ్వరంలో అవినీతి జరిగిందని నేను బయటపెట్టినందుకు నన్ను తీసి పక్కన పడేసిండు. ఇది న్యాయమేనా?
లక్షా ఎనభై తొమ్మిది వేల కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది అనేది ముమ్మాటికి నిజం. ఈ అవినీతి సొమ్ముతో కేసీఆర్ చుట్టూ ఉన్న పందికొక్కులు తిని బలిసాయి.
లక్షల కోట్లతో నిర్మించిన పాలమూరు, కాళేశ్వరం ప్రాజెక్టుల వల్ల ఎన్ని ఎకరాలకు నీళ్లు అందాయి. వీళ్లకు ఎంత కమిషన్లు అందాయి?
అందుకే అంటున్నా కేసీఆర్ మారిన మనిషి, మర మనిషి.. మన మనిషి కాదు . పెద్ద సార్ ఫామ్ హౌస్ లో ఉంటరు.. చిన్న సారు సీఎం కావాలే.. ఇదే కదా వారి అజెండా.
ఇక బీజేపీ గురించి చెప్పాలంటే ఆ పార్టీ సామాజిక న్యాయానికి వ్యతిరేకం. తెలంగాణా సమస్యల మీద ఢిల్లీలో కోట్లాడటమ్ ఈ బానిస ఎంపీలకు చేతకాదు . తలకాయ లేని ఒక బానిస ఎంపీ తెలంగాణా విభజనను ఇండియా, పాకిస్తాన్ విభజనతో పోలుస్తడు. ఇదేమన్నా మతి ఉన్న మాటలేనా? అందుకే ఈ బానిస ఎంపీలకు చెప్తున్నా మతి లేని మాటలు కట్టిపెట్టి తెలంగాణాకు రావాల్సిన విభజిత హామీల గురించి మీ ఢిల్లీ నాయకులతో కొట్లాడి సాధించండి.
ఇక కాంగ్రెస్ గురించి చెప్పాలంటే ప్రస్తుతం రాష్ట్రం ఒక నియంత మరియు కర్కోటకుడి చేతిలో పడింది. ఈ కర్కోటకుడికి పేదల కష్టాలు పట్టవు. ఎంతసేపూ పడగొట్టుడు, కూలగొట్టుడే వచ్చు . అంతకన్నా మంచిగ పాలనచేయడం అతడికి చేతకాదు .
ఇక బిఆర్ఎస్ పార్టీ గురించి చెప్పుకోవడానికి కూడా ఏమీ లేదు. ఎప్పుడైతే పార్టీ పేరులో తెలంగాణా ఆత్మని తీసి పక్కనపడేసారో అప్పుడే ఆ పార్టీ కథ ముగిసింది. అందుకే మా పార్టీ పేరులో తెలంగాణా ఆత్మని నింపి తెలంగాణా రాష్ట్ర సేన పేరుతో మీ ముందుకు వచ్చా.
మన అందరం కలలు కన్న తెలంగాణాను స్థాపించడానికి పాంచజన్యం పేరుతో ఐదు హామీలు ఇస్తున్నా.
అందులో మొదటిది పేద మధ్య తరగతి వారి పిల్లలకు ప్రభుత్వ బడులతో పాటు కార్పొరేట్ పాఠశాలల్లో కూడా రూపాయి ఖర్చు లేకుండా ఉచిత విద్యను అందచేస్తాం.
అలాగే పేద మధ్య తరగతి ప్రజలకు ప్రభుత్వ హాస్పిటల్స్ తో పాటు కార్పొరేట్ హాస్పిటల్స్ లో కూడా ఉచిత వైద్యం అందిస్తాం.
ఇక మూడోది రైతులు.. రైతుల కోసం అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్లు ఓపెన్ చేసి వారి సమస్యలను అక్కడికక్కడే పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటాం.
నాలుగోది ఉపాధి హామీ పథకం..మా ప్రభుత్వం వస్తే నాలుగు లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం . తెలంగాణా ఉద్యమ కారులకు నామినేటెడ్ పదవులు ఇస్తాం.
ఐదో అంశం సామాజిక న్యాయం. మా పాలనలో సామాజిక న్యాయానికి పెద్ద పీట వేస్తాం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతో పాటు ఆర్ధికంగా వెనుకబడిన అన్ని వర్గాలకు సమ న్యాయం చేస్తాం. ముఖ్యంగా మైనారిటీలకు కూడా తగు ప్రాధాన్యం ఇస్తాం అంటూ సభకు వచ్చిన ముస్లిం మైనారిటీ ప్రజలను ఉద్దేశించి హిందీలో మాట్లాడారు.
చివరగా సభికులతో జై తెలంగాణా, జై టీఆర్ఎస్ అని నినాదాలు చేయించారు.
విశ్లేషణ:
తెలంగాణా ఉద్యమ సమయంలో తెలంగాణా జాగృతి సంస్థ ద్వారా కవిత చేసిన పోరాటాలను ఎవరూ మర్చిపోలేరు. నిజానికి ఉద్యమ పోరాటంలో కేటీఆర్ కన్నా కవితే ఎక్కువ కష్టపడ్డారు. అప్పటికి అమెరికాలో ఉద్యోగం చేసుకుంటున్న కేటీఆర్ తర్వాత ఉద్యమంలో కలిసిన సంగతి తెలిసిందే.
తెలంగాణా సాంస్కృతిక వికాసానికి జాగృతి సంస్థ ద్వారా కవిత చేసిన సేవల గురించి చెప్పుకోవాలంటే బతుకమ్మ పండుగ ఒకటి చాలు.
జాగృతి సంస్థ ద్వారా కవిత తెలంగాణలోని మారుమూల పల్లెలలో , పట్టణాలలో, ఆఖరికి ఇంటింటికి బతుకమ్మ పండుగ వేడుకలు చేసుకునేలా ప్రోత్సహించారు .
ప్రత్యేక తెలంగాణా సాధన కోసం కేసీఆర్ పోరాటం చేస్తే, తెలంగాణా సాంస్కృతిక వికాస పునరుజ్జీవనానికి కవిత కృషి చేసింది.
అయితే అధికారం దక్కిన తర్వాత కవితకు పార్టీలో అడుగడుగునా చేదు అనుభవాలు ఎదురయ్యాయి.
పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ కేటీఆర్, హరీష్ రావుల తర్వాతనే ఈమెకు స్థానం దక్కింది. కేటీఆర్, హరీష్ రావులకు మంత్రి పదవులు దక్కగా ఈమె ఎమ్మెల్సీ గా సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
చివరికి కవిత పరిస్థితి ఎలా తయారయ్యింది అంటే కేసీఆర్ కూతురుగా కన్నా పార్టీలో మిగిలిన నాయకులతో సమానంగా ఆమె స్థాయి కూడా పరిమితం కాబడింది.
పైగా హరీష్ రావు, జోగినపల్లి సంతోష్ కుమార్ లతో పోలిస్తే కవిత భర్తకు నేరుగా దక్కిన పదవులేవీ లేవు.
ఈ పరిణామాలు సహజంగా ఆమెకు మింగుడుపడలేదు.
పార్టీలో రోజురోజుకీ తన స్థాయి తగ్గిపోతుందని ఆమె గ్రహించారు . మొదట్లో కేసీఆర్ చుట్టూ చేరిన కేటీఆర్ , హరీష్ రావు , సంతోష్ కుమార్ ల వల్లనే ఆయన తనను దూరం పెడుతున్నారని భావించింది . కానీ ఎప్పుడైతే కేసీఆర్ నుంచి కూడా వ్యతిరేక సంకేతాలు వచ్చాయో అప్పుడే పార్టీలో తన స్థాయి, స్థానం ఏంటో ఆమెకు అర్థమైంది.
ఈ పరిణామాలు చివరకు కవిత సొంత పార్టీ పెట్టేదాకా దారితీశాయి.
కవిత పార్టీ భవిష్యత్తు ఏంటి?
కవిత పార్టీ భవిష్యత్తు గురించి చెప్పుకోవాలంటే ఇక్కడ వైఎస్ షర్మిల ఉదంతం గురించి కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి.
ఆమె కూడా అన్న మీద అలిగి తెలంగాణాలో సొంత పార్టీ పెట్టుకుంది. ఆమె పార్టీ ఆవిర్భావానికి కూడా కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు. పార్టీని బలోపేతం చేసుకోవడానికి తెలంగాణలో పాదయాత్రలు కూడా చేశారు. ఎన్నికల్లో ఖర్చు పెట్టడానికి షర్మిల దగ్గర నిధుల సమస్య కూడా లేదు.
అయినా అర్థంతరంగా షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో కలిపేసి ఏపీ వెళ్లి పీసీసీ ప్రెసిడెంట్ గా స్థిరపడిపోయింది .
ఎందువలన? అంటే ?
స్పేస్ లేదు
ఎస్.. తెలంగాణలో ఇప్పటికే కాంగ్రెస్ , బీజేపీ , బిఆర్ఎస్ పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి .బిఆర్ఎస్ పాలన మీద విసుగెత్తిన ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. ఒకవేళ కాంగ్రెస్ పాలన మీద కూడా ప్రజలు విసుగెత్తితే ప్రత్యామ్నాయంగా , బీజేపీని కానీ , తిరిగి బిఆర్ఎస్ ను కానీ భావిస్తారు. కానీ కొత్త పార్టీకి స్పేస్ ఇవ్వలేరు. అదీ కాకుండా తెలంగాణా ఉద్యమ సమయంలో అయిపు లేని మనిషి కొత్తగా ఇప్పుడొచ్చి కోట్లు గుమ్మరించినా అధికారంలోకి రావడం కల్ల . ఫీల్డ్ వర్క్ లో ఈ విషయాలు గ్రహించింది కాబట్టే షర్మిల అర్థంతరంగా దుకాణం కట్టేసింది.
ఇప్పుడు చూడండి.. కవిత విషయంలోనూ, షర్మిల విషయంలోనూ బోలెడు సారూప్యాలు కనిపిస్తాయి.
కాకపోతే ఇద్దరిలో ఒకటే తేడా ఉంది.
కవిత ముందునుంచీ తెలంగాణా ఉద్యమంలో ఉంది. ప్రజలను ఆకట్టుకునేలా ఉపన్యాసాలు ఇవ్వగలిగే వాగ్ధాటి ఉంది. ఆమె స్థాపించిన జాగృతి సంస్థకు నేటికీ సుశిక్షితులైన కార్యకర్తలు ఉన్నారు.
ఈ అంశాలన్నీ షర్మిలతో పోలిస్తే కవితకు ఉన్న అడ్వాంటేజులు.
అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అధికారం దక్కడానికి కేవలం ఆ సంస్థ బ్యాక్ గ్రౌండ్, ఆమె పోరాట అనుభవం మాత్రమే సరిపోదు.
అదేకాకుండా ఆచరణ సాధ్యం కాని ఆమె పాంచజన్యం హామీలను ప్రజలు ఎంతవరకు విశ్వసిస్తారో చెప్పలేం.
అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే , కేసీఆర్ , కవితల నాయకత్వం గురించి ఆప్షన్స్ తీసుకుంటే క్యాడర్ కానీ, ప్రజలు కానీ కేసీఆర్ వైపే మొగ్గు చూపుతారు. అలాంటి పరిస్థితి వస్తే కవిత స్థానం ఇంకా వెనక్కి జరుగుతుంది.
అంతిమంగా కేసీఆర్ ను ఎదుర్కొని రాజకీయంగా కవిత నెగ్గుకు రావడం చాలా కష్టం.
పదేళ్లు నేనే సీఎం అంటూ స్ట్రాటజీ ప్రకారం గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్న రేవంత్ ను.. తెలంగాణలో ఈసారి ఎలాగైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని రకరకాల వ్యూహాలతో సిద్ధంగా ఉన్న బీజేపీని ..తిరిగి అధికారం దక్కించుకోవడానికి రంగంలోకి దిగిన కేసీఆర్ లను తొక్కుకుంటూ వెళ్లి కవిత అధికారం దక్కించుకోవాలంటే ఏవో అద్భుతాలు జరగాలి!
