నేపాల్ విలయం ప్రపంచానికే ఒక హెచ్చరిక !

Spread the love

31-08-2026 , గత బుధవారం నేపాల్ – టిబెట్ సరిహద్దుల్లో ముంచుకొచ్చిన వరద ముప్పులో చిక్కుకుని ఎంతమంది గల్లంతు అయ్యారో.. ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో అధికారికంగా ఇంతవరకు ఖచ్చితమైన లెక్క తేలలేదు. వెతుకుతున్న కొద్దీ శవాలు బయటపడుతున్నాయి. గల్లంతైన వాళ్లలో కొంతమంది దొరికారు. మరికొంతమంది అడ్రస్ లేరు. అనధికార లెక్కల ప్రకారం ఈ ప్రళయంలో షుమారు 600 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ఇంకో 2,500 మంది వరకు గల్లంతు అయ్యారు.

ఒకపక్కన అక్కడ సైన్యం రేయింబవళ్ళు కష్టపడుతూ సహాయక చర్యలు ముమ్మరంగా చేస్తుంటే మరోపక్క పర్యావరణ నిపుణులు ప్రమాదం ముగియలేదు.. అసలు ప్రమాదం ముందుంది అని హెచ్చరిస్తున్నారు.
ఈ హెచ్చరికలు ఒక్క నేపాల్ కే పరిమితం కాదు. భారత్, చైనాలతో సహా ప్రపంచ దేశాలకు వర్తిస్తుంది అని చెప్తున్నారు.

చుక్క వర్షం కూడా లేకుండా వరదలా? ఎలా?

సాధారణంగా భారీ వర్షాల కారణంగా ముంచుకొచ్చిన వరదలు అనే వార్తలు చిన్నప్పట్నుంచీ మనం చూస్తునే ఉన్నాం. కానీ చుక్క వాన చినుకు కూడా కురవకుండా వరదలు ముంచుకురావడం ఎప్పుడైనా చూసామా? ఎక్కడైనా విన్నామా? అది కూడా అట్లాంటి ఇట్లాంటి వరద కాదు.. మహా ప్రళయంతో ఉప్పెనలా దూసుకొచ్చిన వరద.. ఇలాంటి విపత్తు ఇంతకుముందు చూడకపోతే, వినకపోతే అలాంటి వార్త ఇదే మొదటిది అవుతుంది. ప్రపంచ పర్యావరణ వేత్తలనే ఆశ్చర్యపరిచిన పెను విపత్తు ఇది.

నేపాల్ లో ఏం జరిగింది?

ఉత్తర నేపాల్ సరిహద్దు గ్రామాల నుంచి బోల్ కోశి నది, త్రిశూలి నదులు ప్రవహిస్తూ ఉంటాయి. లిండే నది అనేది మంచు సరస్సులతో కూడిన ఒక ట్యాంక్ లాంటిది. కరిగిన మంచు నీటి సరస్సులుగా మారుతుంది. ఆ నీరు బయటికి పోకుండా చుట్టూ రక్షణ గోడల మాదిరి మంచు గడ్డలు, కొండరాళ్ళు అడ్డుగా ఉంటాయి.

కానీ పొరపాటున ఆ రక్షణ గోడలు బ్రేక్ అయితే ఒక్కసారిగా లక్షల గ్యాలన్ల నీరు మంచు గడ్డలను తోసుకుంటూ పల్లంలోకి జారుతాయి. బక్కెట్ కి చిల్లు పడనంతవరకే నీళ్లు దాంట్లో ఉంటాయి.. చిల్లు పడిందా? అందులోని నీళ్లు తన దారి తాను చూసుకుంటుంది. కరిగిన హిమనీనదంలో జరిగింది అదే.

మంచు పెళ్ళలను నెట్టుకుంటూ ఆ నీరు దిగువన ప్రవహిస్తున్న ఆ రెండు నదుల్లోకి చేరింది. నీరు ఒక్కటే చేరితే కథ ఇంకోలా ఉండేది. కానీ నీటితో పాటు రాళ్ళు, మంచు గడ్డలు కూడా తోసుకుంటూ వచ్చి నదుల్లో పడ్డాయి. దానితో నదిలో నీరు పాకడానికి ఆటంకాలు ఏర్పడ్డాయి. దాంతో దాని మార్గం అస్తవ్యస్తం అయిపోయింది. తన మార్గాన్ని ఆక్రమించి అడ్డొచ్చిన గ్రామాలను, ఇళ్ళను ఈడ్చుకుంటూ ముందుకెళ్లిపోయింది. ఇక్కడే ప్రాణ నష్టం జరిగింది. బఫర్ జోన్ నియమాలను పూర్తిగా పక్కనపెట్టి నదుల ఒడ్డుని ఆక్రమించుకుని శాశ్వత నివాసాలు ఏర్పాటు చేసుకున్న గ్రామస్తులే ఎక్కువగా ప్రకృతి ప్రళయానికి బలయ్యారు.

ప్రకృతి ఒక నియమం ప్రకారం తమ పనులు తాము చేసుకుంటూ పోతుంది. అది కూడా మానవాళి క్షేమం కోరే పనిచేసుకుంటూ పోతుంది. వాటి పనికి ఎవరూ అడ్డు రానంత వరకు..వాటి దారికి ఎవరూ అడ్డం రానంత వరకు ప్రకృతిని మించిన మంచి ఈ భూ ప్రపంచంలోనే లేదు. వాటి మెకానిజమే వేరు.

నేపాల్ వరదలకు ప్రకృతిని తప్పు పట్టాల్సిన అవసరం ఎంతమాత్రం లేదు. ఏవన్నా తప్పు పట్టాల్సి ఉంటే మానవ తప్పిదాలనే వేలెత్తి చూపించాలి. ఓజోన్ పొర చిల్లు పడుతుందని.. ఎల్నినో ప్రభావాలని ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడటానికి రకరకాల కారణాలనైతే కనుక్కున్నాం కానీ ఆ కారణాలకు పరిష్కార మార్గాలు మాత్రం వెతకము.. వెతికినా ఆచరించము. ఇలాంటి ఉపద్రవాలు వచ్చినప్పుడు మాత్రం గ్లేసియర్ బరస్ట్ వంటి కొత్త పదాలను కనిపెడతాం.

ఇప్పుడు ఈ గ్లేసియర్ లేక్ అవుట్ బరస్ట్ ఫ్లడ్ గురించి తెలుసుకుందాం. గ్లేసియర్ బరస్ట్ గురించి సింపుల్గా చెప్పుకోవాలంటే ట్యాంక్ పగిలిపోవడం. చాలాకాలం క్రితం విజయవాడలో ఓ మున్సిపల్ వాటర్ ట్యాంక్ కూలిపోవడంతో దాంట్లో నిలవ ఉన్న నీరు ఒకేసారి చుట్టుపక్కల ఇళ్లను ముంచెత్తింది. అదృష్టవశాత్తూ ప్రాణ నష్టం అయితే జరగలేదు. ఒక చిన్న వాటర్ ట్యాంక్ కూలితేనే అప్పట్లో పత్రికల్లో పతాక శీర్షికల్లో వార్తలు రాసారు. అలాంటిది ఏకంగా వందలమంది ప్రాణాలను బలిగొన్న ఈ ప్రళయం గురించి ఎంత చర్చ జరగాలి? ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి? భవిష్యత్తులో ఇలాంటి నష్టాలు జరక్కుండా ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకోవాలి?

నేపాల్ వరదలు – మానవాళికి ఒక గుణపాఠం కావాలి

ఈ హెచ్చరిక కేవలం నేపాల్ కే పరిమితం కాదు.. భారత్ కూడా ఆలోచించాల్సిన సమయం వచ్చింది. తాజాగా పర్యావరణవేత్తలు భారత్ భూ భాగంలో హిమాలయాల చుట్టూ 200 వరకు హిమనీనదాలు ఉన్నట్టు గుర్తించారు. ఒకవేళ నేపాల్ లో జరిగినట్టు ఇక్కడ కూడా మంచు కరిగిపోయి నీటి సరస్సులు ఒక్కసారిగా తన్నుకుంటూ బయటికి వస్తే చుట్టుపక్కల ఉన్న కొన్ని రాష్ట్రాల్లో ఉన్న గ్రామాలకు భారీ నష్టం జరిగే అవకాశం ఉందని వారు హెచ్చరించారు.

భారత్ ఔదార్యం

నేపాల్ వరదల్లో చిక్కుకుని నష్టపోయిన వారికి ఉదారంగా సాయం చేయడానికి భారత ప్రభుత్వం ముందుకొచ్చింది. టన్నులకొద్దీ ఆహార సామాగ్రి , అత్యవసర మందులు ఇప్పటికే నేపాల్ ప్రభుత్వానికి అందించింది. భారత్ అందించిన సత్వర సాయానికి నేపాల్ మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పాటు సోషల్ మీడియాలో కూడా కృతజ్ఞతలు వ్యక్తం అవుతున్నాయి.

తెలంగాణాలో హైడ్రా చర్యలు భవిష్యత్తులో మంచి ఫలితాలు ఇస్తాయి.

నేపాల్ వరద ముప్పు గురించి టీవీల్లో చూస్తున్నప్పుడు హైద్రాబాదులో హైడ్రా తీసుకున్న కొన్ని చర్యల ఫలితాలు కనిపించాయి. నేపాల్ ఘటనకు , హైడ్రాకు లింక్ ఏంటనుకోకండి. ప్రతి మంచి ప్రయత్నం ఒక అడుగుతోనే మొదలౌతుంది. హైడ్రా ఏర్పాటు విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని పార్టీలకతీతంగా అభినందించాల్సి ఉంటుంది. ఎందుకంటే విశ్వనగరంగా పేరొందిన హైద్రాబాదులో గట్టిగా వర్షాలు కురిస్తే నగరం పరిస్థితి ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. అలాగే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన హరితహారం ప్రాజెక్టు కూడా పర్యావరణ పరిరక్షణకు ఎంతగానో తోడ్పడింది.

అందుకే వర్షాభావ పరిస్థితులను తట్టుకునేందుకు , నీటి నిల్వల సామర్థ్యం పెంచుకునేందుకు కొన్ని దశాబ్దాల క్రితమే హైదరాబాద్ చుట్టుపక్కల షుమారు మూడువేల చిన్నాచితకా చెరువులను అప్పటి పాలకులు నిర్మించారు. కాలక్రమంలో ఐస్ కరిగినట్టు కరిగిపోయి చాలా చెరువులు మాయం అయిపోయి కబ్జాదారుల చేతిలో పడి కాంక్రీట్ బిల్డింగులు లేచాయి. అంతిమంగా ప్రకృతి సహజసిద్ధమైన నీటి నిల్వల ప్రక్రియకు అంతరాయం ఏర్పడింది. కబ్జాదారులు చెరువులతో పాటు నాలాలు కూడా ఆక్రమించడంతో నీటి ప్రవాహాలకు అంతరాయం ఏర్పడి వరద రూపంలో ఇళ్లల్లోకి చేరుతున్నాయి. వరదల సంగతి అలా ఉంచితే చెరువు గట్టుల మీద నివాసాలు ఉండటం ప్రాణాలకు ప్రమాదాన్ని కొనితెచ్చుకోవడమే అని పర్యావరణ శాస్త్రవేత్తలు కూడా హెచ్చరిస్తున్నారు.

ఈ క్రమంలో హైడ్రా అక్రమ నిర్మాణాలు కూల్చడం అనేది వివాదాస్పదం అయ్యింది. ఈ కూల్చివేతల విషయంలో హైడ్రా తీసుకుంటున్న చర్యలు సక్రమమా? అక్రమమా? అనేది న్యాయస్థానాలు ఎలాగూ తెలుస్తాయి. కానీ ఇటీవల హైద్రాబాదు బోడుప్పల్ లో ఉన్న నల్లచెరువు చూసాను. గతంలో కలుపుమొక్కలతో నిస్తారంగా ఉన్న నల్లచెరువు ఇప్పుడు నీటితో కళకళలాడుతుంది. ఇదేరకమైన స్పూర్తితో ఒక్క హైద్రాబాదులోనే కాకుండా తెలంగాణా వ్యాప్తంగా చెరువులకు పూర్వకళ తీసుకొస్తే సహజ నీటి వనరులతో రాష్ట్రం కళకళలాడుతుంది అనడంలో సందేహం లేదు. పనిలో పనిగా నాలాల ఆక్రమణలు కూడా గుర్తించి తగిన చర్యలు తీసుకుంటే వరద ముప్పులనుంచి హైద్రాబాదు నగరం చాలావరకు బయటపడుతుంది.

ముగింపు

కాబట్టి ప్రకృతి ప్రళయానికి ప్రాంతీయ బేధాలు ఉండవు. తమ దారికి అడ్డురానంత వరకు, పర్యావరణానికి హాని జరగనంత వరకు తమ పని తాము చేసుకుంటూ పోతాయి. ఈ సంఘటనతో అయినా మేలుకుని ప్రపంచ దేశాలు పర్యావరణ పరిరక్షణ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మనదేశానికి వచ్చేసరికి కేంద్రం , రాష్ట్రాలతో సమన్వయం చేసుకుని పర్యావరణ పరిరక్షణ మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. దానికి తోడు ప్రభుత్వాల మీదనే నెపం నెట్టేసి పర్యావరణ సమతుల్యానికి అడ్డుపడే పనులు చేయడం ప్రజలు కూడా మానుకోవాలి. చెట్లు నరికి తయారుచేసిన కాగితం మీద వృక్షో రక్షతి రక్షితః అని కొటేషన్లు రాయడం వల్ల ఉపయోగం ఉండదు కదా? ప్రజల దృక్పధంలో కూడా మార్పులు రావాలి. ప్రపంచ పర్యావరణ పరిరక్షణకు నేను సైతం అని ప్రతి ఒక్కరూ నడుం బిగించినప్పుడే ప్రకృతి కూడా మనల్ని చల్లని చూపు చూస్తుంది.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *