Harudu movie Review and Rating
నటీనటులు: వెంకట్, హెబ్బా పటేల్, ఆలీ , సుమన్ తదితరులు
సంగీతం: మణి జెన్నా
సినిమాటోగ్రఫీ: ఆనంద్ మరుకుర్తి
నిర్మాత: ప్రవీణ్
దర్శకత్వం: రాజ్ తళ్ళూరి
ఓటీటీ/ స్ట్రీమింగ్ : ఆహా
విడుదల : 28-08-2026
రేటింగ్: 1.5 /5
వెంకట్, హెబ్బా పటేల్ ప్రధాన పాత్రల్లో నటించిన హరుడు యాక్షన్ థ్రిల్లర్ మూవీ (Harudu Movie) ఆగస్టు 28, 2026 నుంచి ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ ఆహా లో స్ట్రీమింగ్ అవుతుంది. అంతకుముందు మే 15 న హరుడు మూవీ థియేటర్లలో రిలీజ్ అయ్యింది.
ఇక ఈ మూవీ జానర్ గురించి వెతికితే యాక్షన్ , థ్రిల్లర్,అడ్వంచరస్, లతోపాటు ఇంకో రెండు జానర్లు కూడా టైటిల్ కింద కనిపించాయి. అంటే సినిమాలో నవరసాలు ఉన్నాయని అర్థమన్నమాట. ఇన్ని రసాలు ఒకేసారి ఒలకబోసిన హరుడు మూవీ ఎలా ఉందో చూద్దాం. అన్నట్టు హరుడు అంటే హరించువాడు అని అర్ధం. ఇప్పుడు ఈ హరుడు ఎవర్ని హరించాడో చూద్దాం.
కథేంటంటే?
సినిమా ప్రారంభమే ఒక ఆక్సిడెంట్ తో మొదలౌతుంది. అది ఆక్సిడెంటా? మర్దరా? అనేది చివరికి తెలుస్తుంది. ఈలోపు అసలు కథ ఇలా మొదలౌతుంది.
బీటెక్ చదువుకున్న ముగ్గురు కుర్రాళ్ళు, ఇద్దరు అమ్మాయిలు ఉద్యోగాలు దొరక్క ఖాళీగా ఉంటారు. ఏదైనా బిజినెస్ చేసి లైఫ్ లో సెటిల్ అవ్వాలనుకుని బ్యాంక్ లోన్ కోసం కూడా ప్రయత్నిస్తారు. కానీ వాళ్ళకి లోన్ ఇవ్వడానికి ఏ బ్యాంకూ ముందుకురాదు. దాంతో ఖాళీగా ఉండటం దేనికని, బిజినెస్ చేయడానికి అవసరమైన సొమ్ము కోసం దొంగతనాలు చేయడం మొదలుపెడతారు.
మరోవైపు ప్రజలకే సమస్య వచ్చినా ఓల్డ్ సిటీ ఎమ్మెల్యే వరదరాజులు ( శ్రీహరి పైలా ) అండగా నిలబడుతుంటాడు. ఈ పరిస్థితుల్లో ముంబై నుంచి డీసీపీ శంకర్ (వెంకట్ ) ట్రాన్స్ఫర్ మీద హైదరాబాదుకు వస్తాడు. ఈయనకి డిపార్ట్మెంట్లో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అనే పేరుంటుంది.
డీసీపీ శంకర్ వచ్చిన తర్వాత ఆ ఐదుగురి జీవితాల్లో ఎలాంటి మార్పులు వస్తాయి? ఎమ్మెల్యే వరదరాజులు గతం ఏంటి? డీసీపీ శంకర్ ముంబైలో పనిచేసినప్పుడు ఏం జరిగింది? మొదట్లో జరిగిన కారు ఆక్సిడెంట్ ప్రమాదమా? మర్దరా? ఆ కారు ఆక్సిడెంట్ కీ హెబ్బా పటేల్ కి ఉన్న లింక్ ఏంటి? అనేది మిగిలిన కథ.
ఎలా ఉంది?
ఈ సినిమా ఎలా ఉందో చెప్పడం చాలా కష్టమైన ప్రక్రియ. అడుగడుగునా దర్శకత్వ వైఫల్యాలు ఎదురౌతూ మన సహనానికి పరీక్ష పెడుతుంది. అయినా సరే సినిమాలో ఎక్కడ బాగుందో, ఎక్కడ బాగోలేదో ఒకసారి చూద్దాం. మొదట్లో చెప్పిన ఐదు పాత్రల పరిచయంతో దర్శకుడు కథ మొదలెట్టారు. ఈ పాత్రలకు కూడా గొప్ప గొప్ప విలువలేమీ ఉండవు. ఒకరకంగా చెప్పాలంటే దర్శకుడు ఆ ఐదుగురి పాత్రలను సాదాసీదాగా డిజైన్ చేసుకున్నారు. కాబట్టి ఆ ఐదు పాత్రలతో మనం గట్టిగా కనెక్ట్ కాలేము.
కథ వాళ్ళని నడిపించింది కానీ కథను వాళ్ళు నడపలేకపోయారు. కథని తమ భుజాల మీద వేసుకుని నడిపించేంత బలమైన పాత్రలైతే కావు. బీటెక్ చదువుకుని షేర్ ఆటోల్లో తిరుగుతూ వాళ్ళు చేసే పనులు ఒక బలమైన ఇంపాక్ట్ ను ఇవ్వవు. ఆ ఐదుగురి ఎపిసోడ్లు ఏదో కాలక్షేపానికి, ఫస్టాఫ్ లో సాగతీతకు పనికొస్తుందే తప్ప సినిమాకి అదనపు మైలేజ్ ఏమీ ఇవ్వదు.
ఇక ఈ సినిమాలో మరో బలమైన వీక్ పాయింట్ ఏంటంటే ఈ ఐదుగురు దొంగతనాలు చేసినా, ఇంకో బలమైన క్యారెక్టర్ మర్డర్ల మీద మర్దర్లు చేసుకుంటూ పోయినా ముంభైనుంచి డీసీపీ శంకర్ వస్తే కానీ పోలీసులకు కూడా ఆ విషయం తెలీదు. అంతెందుకు సీఎం సుమన్ కి కూడా వరదరాజుల గురించి పూర్తిగా తెలీదు.
సీఎం అంటే గుర్తుకొచ్చింది. ఒక సన్నివేశంలో సీఎం కాన్వాయ్ వెళ్తుంటే వరదరాజులు ఎదురొచ్చి ధర్నా చేస్తాడు. ఇలాంటి సీన్లు ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్ చేసేటప్పుడు దర్శకుడు కనీస ప్రోటోకాల్ సంగతి మర్చిపోయినట్టున్నారు. కాన్వాయిలో ఉన్న సీఎం సెక్యూరిటీ అక్కడే తమ కార్ల దగ్గర ఆగిపోయి నిలబడటం , వేరేవైపునుంచి బెటాలియన్ పోలీసులతో డిసిపి శంకర్ ఎంటర్ అవడం సహజత్వానికి దూరంగా ఉండటంతో సీన్ పండలేదు.
ఇక ఏ సినిమాలో అయినా విలన్ క్యారక్టర్ హావభావాలు ఒకలా ఉంటాయి. అంటే అతడి ముఖంలో ఆ క్రూరత్వం కనిపించాలన్న మాట. ఆ ఎక్స్ప్రెషన్స్ చూడగానే వీడింత దుర్మార్గుడా అని మనం అనుకోవాలి. పళ్ళుపటపటా కొరుక్కోవాలి..అప్పుడే ఆ క్యారక్టరిజం పండుతుంది.
ఇప్పుడు అదే క్యారక్టర్ కాసేపు గుడ్ బాయ్ టైపులో మనకి కనిపించాలంటే ఏం చేయాలి? ఎక్స్ప్రెషన్స్ మార్చాలి. ముఖంలో సాధుత్వం కనిపించాలి. నోట్లో వేలుపెట్టినా కొరకలేని అమాయకత్వం ప్రదర్శించాలి. అప్పుడు ద్విముఖంలో ఏ ముఖం మంచిది.. ఏ ముఖం చెడ్డది అనేది మనకు తెలుస్తుంది.
ఈ సినిమాలో మిస్ అయ్యింది అదే. ఫస్టాప్ లో దర్శకుడు విలన్ని మంచోడు అని ప్రోజెక్ట్ చేసినప్పుడు అతడి ముఖంలో ఏ కోశానా మంచితనం కనిపించదు. పైగా క్రూరత్వం ఒకింత ఎక్కువగానే కనిపిస్తుంది. దాంతో సీనా ఎక్కడో తేడా కొడుతుంది అని ఆ పాత్ర గురించి మనం ముందే ఒక అంచనాకు వచ్చేసాం. కాబట్టి ప్రీ క్లైమాక్సులో ఆ క్యారక్టర్ అసలు స్వరూపం రివీల్ చేసినా మనకు థ్రిల్ అనిపించదు. అరె.. ఈ ట్విస్ట్ అదిరిందే? అన్న ఫీల్ మనకు రాదు.
ఇక హీరో క్యారక్టరైజేషన్ అనేది ఎంత బలంగా ఉంటే సినిమా అంత బలంగా ఉంటుంది. హీరో క్యారెక్టర్ని బలంగా రాసుకుంటే సరిపోదు. అంతే బలంగా స్క్రీన్ ప్రెజెన్స్ చేయాలి. అప్పుడే మనం ఆ హీరోకి కనెక్ట్ అవుతాం. కొంతమంది కొత్త హీరోలకు కూడా మనం కనెక్ట్ కావడానికి ఇదే బలమైన కారణం. ఈ సినిమాలో అది లోపించింది.
ఇందులో హీరో పోషించిన పాత్ర డీసీపీ. పైగా ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అని భారీ ఎలివేషన్స్ ఇచ్చారు. ఆ పాత్ర పోషించిన వెంకట్ కూడా సీనియర్ నటుడు . అలాంటప్పుడు ఆ క్యారెక్టర్ని చూడగానే మనకు పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ అనిపించాలి. కనిపించాలి కూడా . అంతేకానీ యూనిఫామ్ లో లేని హీరోని చూసి ఇతడు పోలీసా? రౌడీనా? అనే అనుమానం మనకి రాకూడదు. మన హీరోగారు యూనిఫామ్ లో ఉన్నా, సివిల్ డ్రెస్ లో ఉన్నా పై గుండీలు మూడు తీసేయడంతో ఎందుకో ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. ఈ సమస్య హీరో వెంకట్ పొరపాటు కాదు. అతడి పాత్రను అలా తీర్చిదిద్దిన దర్శకుడిది.
ఇక హీరోలు సిగరెట్ వెలిగించడమనేది ఒక కళ.. దమ్ములాగి వదలడం అనేది ఒక స్టైల్. కథల్లో కూడా హీరోలు సిగరెట్లు తాగే స్టైల్ మీద వర్ణనలు ఉంటాయి. సినిమాల్లో అయితే సిగరెట్ వెలిగించాలంటే ముందు తలైవా గుర్తుకొస్తాడు. సిగరెట్ వెలిగించడంలో రజనీ కాంత్ స్టైలే వేరు. ఇప్పటికీ ధూమపానం అలవాటు ఉన్నవాళ్ళు రజనీ స్టైల్ ను లైక్ చేస్తారు. అంతేకానీ చుట్ట దమ్ము లాగినట్టు హీరో సిగరెట్ దమ్ములాగితే సీన్ పండకపోగా దట్టమైన పొగ మాత్రమే కనిపిస్తుంది. హీరో సరిగా సిగరెట్ తాగకపోవడం కూడా పాయింటేనా? అనుకోకండి. అదో స్టైల్ అంతే. సినిమా చూసే ప్రేక్షకుడు హీరోతో పాటు ప్రతి క్యారక్టర్ని శ్రద్ధగా గమనిస్తాడు. హీరో నటనలో ఏ సీన్ బాగుందో? ఏ సీన్ బాగోలేదో? విశ్లేషించుకుంటాడు. ఇది కూడా అలాంటిదే. ఇక్కడా వెంకట్ చేత సరైన నటన రాబట్టుకోలేదు అనిపిస్తుంది.
ఇక ప్రేక్షకుల పరిశీలనా శక్తి ఎలా ఉంటుందంటే తెర మీద కనిపించే క్యారెక్టర్లతో పాటు వారి వెనుక కనిపించే బ్యాక్ డ్రాప్ ను కూడా సునిశితంగా పరిశీలిస్తాడు. ఈ సినిమాలో ఆ ఐదుగురు హెబ్బా పటేల్ ఫోటో పట్టుకుని ఈమె తెలుసా? అని జనాల్ని అడిగే సీన్ ఉంటుంది. ఆ ఫ్రేమ్ లో షూటింగ్ చూస్తున్న జనాలు నవ్వుకోవడం.. సెల్ఫీలు తీసుకోవడం కనిపిస్తుంది.
ఇంకో సన్నివేశంలో హీరో విలన్ గుండెల్లో రివాల్వర్ పెడతాడు. నిజానికి ఆ సీన్లో విలన్ ముఖంలో భయంతో కూడిన ఎక్స్ప్రెషన్స్ కనిపించాలి. కానీ అతడి ముఖంలో సన్నటి చిరునవ్వు కనిపిస్తుంది. బహుశా రివాల్వర్ ఆ విలన్ గుండెలను బదులు సైడ్ తగిలి కితకితలు వచ్చాయేమో? నిజానికి ఇవన్నీ చిన్నచిన్న దర్శకత్వ లోపాలే. కానీ ప్రేక్షకుడి దృష్టిలో మాత్రం ఇలాంటి పొరపాట్లు సినిమా మీద నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది.
ఇక కథ విషయానికి వస్తే కొత్తదనం ఏమీ అనిపించదు. దాదాపు ఇలాంటి కథలనే గతంలో చాలా సినిమాల్లో చూసేసాం. హీరో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ గానీ, విలన్ ట్విస్ట్ కానీ కొత్తగా అనిపించదు. కనీసం కథనం విషయంలో అయినా దర్శకుడు జాగ్రత్తలు పడి ఉంటే బాగుండేది. సినిమా చాలావరకు ప్రిడిక్టబుల్ గా ఉండటంతో మనల్ని గట్టిగా ఎంగేజ్ చేయదు. అందుకే క్లైమాక్స్ కూడా తేలిపోయినట్టు అనిపిస్తుంది.
రివ్యూ రాసేటప్పుడు సినిమాలోని లోటుపాట్లను విమర్శనాత్మకంగా రాయడం వెనుక అసలు ఉద్దేశ్యం భవిష్యత్తులో ఔత్సాహిక దర్శకులు ఇలాంటి పొరపాట్లు చేయకుండా ఉంటారని.
ఎవరెలా చేశారు?
డీసీపీ శంకర్ పాత్ర లో వెంకట్ నటన బాగానే ఉంది కానీ కొన్ని సన్నివేశాల్లో ఇంకా ఇంప్రూవ్ అయితే బాగుండేది అనిపిస్తుంది. గతంలో చాలా సినిమాల్లో వెంకట్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. కొద్ది విరామం తర్వాత ఆయన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసారు.
ఇక ఎమ్మెల్యే వరదరాజులు పాత్ర మంచితనానికి , క్రూరత్వానికి ఒకే రకమైన ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడంతో తేలిపోయింది.
బీటెక్ చదివిన ఐదుగురు నిరుద్యోగులు కొత్తవారు అయినప్పటికీ పర్లేదు అనిపించారు.
అందరికంటే హెబ్బా పటేల్ నటన సహజంగా ఉంది.
అలీ తన స్టైల్ కామెడీని పండించాడు.
సాంకేతికత
మణి జెన్నా అందించిన సంగీతం పర్లేదు.
ఆనంద్ మరుకుర్తి అందించిన సినిమాటోగ్రఫీ యావరేజ్ గా ఉంది.
నిర్మాణ విలువలు కూడా యావరేజ్ గా ఉన్నాయి.
విశ్లేషణ
ఈ సినిమా కోసం రాసుకున్న కథ కొత్తదేమీ కాదు. గతంలో ఇంచుమించు ఇలాంటి పాయింటుతోనే కొన్ని కథలు తెరకెక్కాయి. ఇక కథనం విషయానికి వస్తే దర్శకుడి తడబాటు అడుగడుగునా కనిపిస్తుంది.
ఆ ఐదుగురు స్నేహితుల ఎపిసోడ్లతో ఫస్టాప్ రొటీన్ ఫార్మాట్లో సాగుతుంది. ఈ ఎపిసోడ్లు కథ ప్రారంభానికి పనికి వస్తాయే కానీ మనల్ని ఎంగేజ్ చేయదు. డీసీపీ శంకర్, ఎమ్మెల్యే వరదరాజులు ఎపిసోడ్లు యాక్షన్ ఫార్మాట్లో రన్ అయి కొంతవరకు మనల్ని ఎంగేజ్ చేస్తాయి.
ఫస్టాప్ తో పోలిస్తే సెకండాఫ్ కొంత బెటర్ కానీ ఆశించిన స్థాయిలో అయితే ఉండదు. అందుకే మూవీ మీద పెద్దగా అంచనాలు పెట్టుకోకుండా వన్ టైమ్ వాచ్ కింద చూడాలనుకునేవాళ్లు ఓ లుక్కేయండి.
