పృధ్వీరాజ్ సుకుమారన్ ఐ నోబడీ (I Nobody Movie Review) క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ (OTT) రివ్యూ!

Spread the love

మలయాళ నటుడు పృధ్వీరాజ్ సుకుమారన్ నటించిన ఐ నోబడీ (I Nobody Movie) క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఈ నెల 25 నుంచి ( ఆగస్ట్ 25, 2026) ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. జూలై 9 న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ తెలుగులో విడుదల చేశారు.

పృధ్వీరాజ్ సుకుమారన్ మలయాళ నటుడు అయినప్పటికీ సలార్ వంటి పాన్ ఇండియా సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడు అయ్యాడు. ఈయన నటించిన మలయాళం క్రైమ్ సినిమాలు చాలావరకు బాక్సాఫీస్ హిట్ కొట్టాయి. ఇక ఈ సినిమా విషయానికి వస్తే టైటిల్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. దానికి తోడు బ్యాంక్ రాబరీ చుట్టూ దర్శకుడు స్టోరీని అల్లుకుని క్రైమ్ థ్రిల్లర్ జానర్లో తెరకెక్కించడంతో బజ్ క్రియేట్ చేసింది.

ఇప్పుడు ఐ నోబడీ మూవీ ఎలా ఉందో చూద్దాం.

కథేంటంటే?

ప్రభుత్వ ఉద్యోగం చేసే రాజీవన్ ( పృధ్వీరాజ్ సుకుమారన్) భార్య మీరా ( పార్వతి తిరువోతు) ఇద్దరు కూతుళ్ళతో లైఫ్ లీడ్ చేస్తుంటాడు. కానీ అతడి వైవాహిక జీవితంలో కొన్ని అసంతృప్తులను ఎదుర్కుంటుంటాడు.

ఇదిలా ఉండగా ఓ రోజు ముగ్గురు దొంగలు బ్యాంకులో జొరబడి 17 కోట్లు దొంగతనం చేస్తారు. ఆ టైములో బ్యాంకులోనే ఉన్న రాజీవన్ ను అడ్డుపెట్టుకుని ఆ ముగ్గురు దొంగలు పోలీసులకు దొరక్కుండా వ్యానులో తప్పించుకుని పారిపోతారు. దారిలో తాము కిడ్నాప్ చేసిన రాజీవన్ ను నడిరోడ్డు మీదనే వదిలేసి పారిపోతారు.

అయితే దారిలో వాళ్ళ కారుకు ఆక్సిడెంట్ అయి ముగ్గురు దొంగలు చనిపోతారు. పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఆ 17 కోట్లు మాయం అయ్యాయని గమనిస్తారు. దాంతో రాజీవన్ ఆ సొమ్మును ఎక్కడో దాచి ఉంటాడని అందరూ అనుమానిస్తారు.

ముగ్గురు దొంగలు కలిసి దోపిడీ చేసిన ఆ 17 కోట్లు ఏమయ్యాయి?
ఆ సొమ్ము మాయమవడంలో రాజీవన్ పాత్ర ఏంటి?
ఒకవేళ నిజంగానే రాజీవన్ ఆ సొమ్మును ఎక్కడైనా దాచిపెట్టాడా?
బ్యాంక్ రాబరీ జరిగినప్పటినుంచి రాజీవన్ జీవితంలో ఎటువంటి మార్పులు వచ్చాయి?
చివరకు పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఏం తేలుతుంది? అనేది మిగిలిన కథ.

ఎలా ఉంది?

మలయాళం క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు చాలావరకు ఒక సస్పెన్స్ ఎలిమెంట్ తో ప్రారంభం అవుతాయి. (ఇప్పుడు ఇదే మూవీని తెలుగులో కూడా విడుదల చేశారు). అలాగే ఐ నోబడీ మూవీ కూడా ఒక ఒక బ్యాంక్ రాబరీ తో మొదలెట్టి దర్శకుడు ఇంట్రెస్టింగ్ ఓపెనింగ్ ఇచ్చాడు.

ముసుగులు వేసుకున్న ముగ్గురు దొంగలు బ్యాంక్ రాబరీ చేయడం, పోలీసుల నుంచి తప్పించుకోవడానికి రాజీవన్ కళ్ళకు గంతలు కట్టి హైవే మీద వదిలేయడం, రాబరీ అయిన 17 కోట్లు మాయం అవడంతో పోలీసులు రాజీవన్ మీద అనుమానంతో కస్టడీ లోకి తీసుకోవడం వంటి సన్నివేశాలతో దర్శకుడు నేరుగా కథలోకి వెళ్ళిపోయాడు.

ఇప్పుడు సినిమాలో నటించిన పోలీసులు, మీడియాతో పాటు సినిమా చూస్తున్న ప్రేక్షకుల ముందు కూడా ఒక ప్రశ్న ఉంటుంది. ఆ 17 కోట్లు ఏమైపోయాయి? ఆ సొమ్మును రాజీవన్ దొంగల నుంచి కొట్టేసి ఎక్కడైనా దాచాడా? లేకపోతే ఆ సొమ్ము గురించి నిజంగానే రాజీవన్ కు ఏమీ తెలీదా? ఒకవేళ రాజీవన్ కు ఏమీ తెలియకపోతే అసలు ఆ సొమ్ము ఏమైపోయింది? అనే ప్రశ్నల చుట్టూ కథ అల్లుకుని దర్శకుడు ఫస్టాఫ్ లో గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే నడిపాడు.

ఆ 17 కోట్ల మాయం విషయంలో రాజీవన్ పాత్రను కూడా దర్శకుడు వెంటనే రివీల్ చేయలేదు. స్లోగా కథనాన్ని నడుపుకుంటూ పోయాడు. ఆ సొమ్ము ఎక్కడ ఉండొచ్చో ఊహిస్తూ రాజీవన్ తన కళ్లకుగంతలు కట్టుకుని ఇన్స్పెక్టర్ తో కలిసి కారులో వెళ్లే సన్నివేశం బాగుంటుంది.

సెకండాఫ్ లో ఎప్పుడైతే దర్శకుడు ఆ సీక్రెట్ ను రివీల్ చేస్తాడో యంగేజింగ్ తగ్గిపోతుంది. ఇక అక్కడ్నుంచి రాజీవన్ ఫ్యామిలీ గొడవలు, పోలీసుల ఇంటరాగేషన్, సస్పెండ్ అయిన ఎస్సై, అతడి బామ్మర్దుల హంగామా , రాజీవన్ కూతురి కిడ్నాప్ డ్రామాలు కథలో డెప్త్ ను పెంచకపోగా సాగతీతలా అనిపిస్తుంది.

ఆ 17 కోట్లు రాజీవన్ దగ్గరే ఉన్నాయేమో అనే అనుమానంతో రోడ్ల మీద జనం అతడి వెంటపడటం, ఈ క్రమంలో వచ్చే ఛేజింగులు , ఫైటింగులు ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తాయి. ఈ మధ్యలో వచ్చే భార్యా భర్తల గొడవలు కూడా విసిగిస్తాయి. ఈ సినిమాలో తరచూ మనకు రాజీవన్ భార్యా పిల్లలు కనపడుతుంటారు కానీ కథ మాత్రం రాజీవన్ చుట్టూనే తిరుగుతుంది.

కొన్ని సన్నివేశాల్లో లాజిక్కులు కూడా మిస్ అవుతాయి. రాజీవన్ పెద్ద గేటెడ్ కమ్యూనిటీ లో ఉంటాడు. కానీ ఆ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంటుకు సెక్యూరిటీ గార్డ్ కూడా ఉండడు. రాజీవన్ కోసం కిరాయి వ్యక్తులు వచ్చారని తెలిసి జాకబ్ అనే వ్యక్తి పెద్ద కర్ర తీసుకుని గేటు ముందు కూర్చుంటాడు. ఇలాంటి కొన్ని సన్నివేశాలు లాజికల్ గా సింక్ కావు.

అలాగే రాజీవన్ కోట్ల రూపాయల సొమ్మును బస్తాల్లో వేసుకుని అపార్ట్మెంట్ సెల్లార్ వరకు ఈడ్చుకుంటూ వెళ్ళినా చూసే నాధుడు ఉండడు. సీసీ కెమెరాలు అసలే ఉండవు. పైగా ఇదంతా ఓ బయటి వ్యక్తి చూడటం కన్విన్సింగ్ గా అనిపించదు. ఇంకో సీన్ లో జాకబ్ అనే వ్యక్తి చుట్టూ పోలీసులు ఉండగానే కోట్ల రూపాయలు ఉన్న బస్తాలను గార్బేజ్ ట్రాలీలో తీసుకుపోతుంటే అక్కడున్న ఒక పోలీస్ నామమాత్రంగా చెక్ చేయడం , ఆ బస్తాలను జాకబ్ గేటుబయటనే కారు డిక్కిలోకి సర్దటం సినిమాటిక్ లిబర్టీ అనుకోవాలి. పోలీసుల ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ కూడా ఇంట్రెస్టింగ్ గా అనిపించదు.

చివరికి ప్రీ క్లైమాక్స్ వరకు వచ్చేసరికి కథనం కాస్త గాడిలో పడింది అనుకుంటాం కానీ క్లైమాక్స్ ఎపిసోడ్ లో కొంత కన్ఫ్యూజన్ అవుతాం. ఓవరాల్ గా ఫస్టాఫ్ పండినంతగా యాక్షన్ థ్రిల్లర్ డ్రామా సెకండాఫ్ లో కనిపించదు.

కాకపోతే ఒక సాధారణ ప్రభుత్వ ఉద్యోగి చేతిలో ఊహించని సొమ్ము పడితే పర్యవసానాలు ఎలా ఉంటాయి అనే ఒక మెసేజ్ దర్శకుడు కధలో భాగంగా అంతర్లీనంగా జొప్పించిన తీరు బాగుంది. ఇలాంటి సందర్భాల్లో సమాజం ఎలా రియాక్ట్ అవుతుందనేది ఒక ఇన్స్పెక్టర్ పాత్ర ద్వారా చెప్పించారు. చిన్నప్పుడు చదువుకున్నకప్ప కథ చెప్తూ బలహీనులను బలవంతులు ఏ విధంగా ఆక్రమించుకుంటారు అని సందర్భోచితంగా చెప్పిన విధానం బాగుంది.

ఎవరెలా చేశారు?

రాజీవన్ పాత్రలో పృధ్వీరాజ్ సుకుమారన్ నటన బాగానే ఉంది కానీ మూవీ మొదలైన దగ్గర్నుంచి చివరివరకు ఒకే రకమైన ఎక్స్ప్రెషన్స్ ఇచ్చుకుంటూ వెళ్ళాడు.

దానికి తోడు మొదట్లో చాలాసేపు ఒంటికన్నుతో కనిపించడంతో ఈ సినిమాలో అదే అతడి ఒరిజినల్ గేటప్పేమేమో అనుకుంటాం. ఓ ఇరవై నిమిషాల స్టోరీ తర్వాత అతడి రెండో కన్ను కూడా తెరవడంతో చూస్తున్న ఆ ఒంటికన్ను అవతారం చూడలేక చూస్తున్న ప్రేక్షకుల కళ్ళు కూడా తెరిపిన పడతాయి.

ఈయన భార్య మీరా పాత్ర పోషించిన పార్వతి తిరువోతు పరిస్థితి కూడా అంతే. మొదట్నుంచి చివరివరకు సీరియస్ ముఖమే.

ఇక ఇరుముడి సినిమాలో రవితేజ కూతురిగా నటించిన బేబీ నక్షత్ర ఈ సినిమాలో పృధ్వీరాజ్ సుకుమారన్ కూతురిగా నటించింది. ఈ పార్వతితో పాటు ఈ అమ్మాయి పాత్రకి కూడా సరైన స్కోప్ దక్కలేదు.

సాంకేతికత

జేక్స్ బిజోయ్ అందించిన సంగీతం బాగానే ఉంది.
దినేష్ పురుషోత్తమన్ ఫోటోగ్రఫీ పర్లేదు
నిర్మాణ విలువలు కూడా పర్లేదు.

విశ్లేషణ

క్రైమ్ థ్రిల్లర్ జానర్ మూవీలు ఇష్టపడేవారికి ఈ మూవీ నచ్చుతుంది. కాకపోతే ఫస్టాఫ్ ఎంగేజ్ చేసినంతగా సెకండాఫ్ ఈ సినిమా ఎంగేజ్ చేయదు.

ఫస్టాఫ్ లో బ్యాంక్ రాబరీ చుట్టూ నడిచిన కథనం కొంతమేరకు థ్రిల్ పంచితే సెకండాఫ్ లో వచ్చే సినిమా కష్టాల ఎపిసోడ్లు చాలావరకు విసిగిస్తాయి.
ఐ నోబడీ మూవీ జియో హాట్ స్టార్ లో తెలుగులో కూడా అందుబాటులో ఉంది కాబట్టి వన్ టైమ్ వాచ్ మూవీ కింద ఓ లుక్కేయండి.

నటీనటులు: పృధ్వీరాజ్ సుకుమారన్, పార్వతి తిరువోతు, బేబీ నక్షత్ర తదితరులు
సంగీతం: జేక్స్ బిజోయ్
సినిమాటోగ్రఫీ: దినేష్ పురుషోత్తమన్
నిర్మాత: సుప్రియా మీనన్
దర్శకత్వం: నిషమ్ బషీర్
విడుదల: జియో హాట్ స్టార్ (25-08-2026)
రేటింగ్: 2.5 / 5


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!