KJQ Movie Review – కేజెక్యూ మూవీ రివ్యూ!

Spread the love

30-08-2026 , KJQ Movie review

నటీనటులు: దీక్షిత్ శెట్టి, శశి ఓదెల, యుక్తి తరేజా, మురళీధర్ గౌడ్, పృథ్వీ తదితరులు
సంగీతం: పూర్ణచంద్ర తేజస్వి
సినిమాటోగ్రఫీ: నాగేష్ బనోల్
నిర్మాత: సుధాకర చెరుకూరి
దర్శకత్వం: కెకె
స్ట్రీమింగ్ / ఓటిటి : అమెజాన్ ప్రైమ్
విడుదల : 28-08-2026
రేటింగ్: 2/5

దీక్షిత్ శెట్టి, శశి ఓదెలలు ప్రధాన పాత్రల్లో నటించిన కేజెక్యూ మూవీ (KJQ Movie) ఈ నెల 28 నుంచి (ఆగస్టు 28, 2026) ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఆగస్టు 7 న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా కేవలం మూడు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేయడం విశేషం. కేజెక్యూ మూవీకి కింగ్ – జాకీ – క్వీన్ అనే ట్యాగ్ లైన్ ఇచ్చారు.

ఇదిలా ఉండగా విడుదలకు ముందే ఈ చిత్ర దర్శకుడు కెకె అనారోగ్యంతో కన్నుమూయడంతో నిర్మాతతో పాటు ఇతర సాంకేతిక సిబ్బంది పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి మూవీని రిలీజ్ చేశారు.

విడుదలకు ముందే విషాదం మూటగట్టుకున్న ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకోలేకపోవడం ఇంకో విషాదం. ఇప్పుడు కేజెక్యూ మూవీ ఎలా ఉందో చూద్దాం.

కథేంటంటే?

ఇద్దరు ప్రేమికులు ఓ రెస్టారెంట్లో కూర్చుని మాట్లాడుకుంటుండగా హఠాత్తుగా ఒక వ్యక్తి ఎంటర్ అయి ప్రేమికుడిని తుపాకీతో కాల్చడంతో మూవీ మొదలౌతుంది.

కట్ చేస్తే,

ఎవరూ లేని అనాథ పిల్లవాడు పార్ధాని ( దీక్షిత్ శెట్టి) చిచ్చా (మురళీధర్ గౌడ్) అనే లోకల్ దాదా చేరదీస్తాడు. పెరిగి పెద్దయిన పార్ధాకు హైదరాబాద్ డాన్ కమల్ దాస్ కూతురితో పెళ్ళి జరిపించి కమల్ దాస్ స్థానంలో పార్ధాని హైదరాబాద్ డాన్ ని చేస్తాడు.

డాన్ గా ఎదిగిన పార్ధాకు జాకీ (శశి ఓదెల) అనే ప్రాణ స్నేహితుడు తోడవుతాడు. పార్ధ చేసే ప్రతి దందాలో జాకీ పాల్గొని ముందుండి నడిపిస్తుంటాడు.

ఓసారి చిచ్చా పుట్టినరోజు సందర్భంగా తన డెన్ లో సినీ హీరోయిన్ భార్గవి చేత డాన్స్ ప్రోగ్రామ్ ఏర్పాటుచేద్దామని భావించి ఆమెను తీసుకురమ్మని తన మనుషులను పంపిస్తాడు పార్ధ.

భార్గవి కలిసిన తర్వాత ఇద్దరికీ మాటామాటా పెరుగుతుంది. అహంకారం తలకెత్తిన పార్ధ ఎలాగైనా ఆమెను తన సొంతం చేసుకోవాలని మోజు పడతాడు. ఈ విషయం తెలుసుకున్న పార్ధ భార్య తన భర్త ప్రవర్తనలో మార్పు తీసుకురావాలని జాకీ సాయం కోరుతుంది.

స్నేహితుడి కాపురం నిలబెట్టడానికి జాకీ ఏం చేస్తాడు?
పార్ధ తో విభేదించిన భార్గవి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది?
ఈ ఇద్దరి స్నేహితుల జీవితాల్లోకి హీరోయిన్ భార్గవి ప్రవేశించిన తర్వాత ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి? అనేది మిగిలిన కథ.

ఎలా ఉంది?

బాగా ఓ నాలుగు దశాబ్దాలు వెనక్కి వెళ్తే సినిమాలో అనవసరం అనుకున్న సన్నివేశాలను దర్శకులు, ఎడిటర్లు కలిసి కత్తెరతో ఆ మేరకు ఫిలిం కట్ చేసేవాళ్ళు.(టెక్నికల్ గా ఎలా కట్ చేసేవారో తెలీదు కానీ సరదాగా కత్తెర అనే పదం వాడబడింది) ఇలా కట్ అయిన ఫిలిం ముక్కలను చాలామంది స్ట్రీట్ వెండర్స్ తమదగ్గరున్న బొమ్మ ప్రొజెక్టర్ లో వాడుకునేవాళ్ళు.

ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అప్పట్లో సాంకేతికత అందుబాటులో లేక అనవసరమైన బిట్లను తొలగించడానికి బోలెడు ఫిలిమ్ వేస్ట్ అయ్యేది. కానీ ఇప్పుడలా కాదు.. కెమెరా ముందు నటిస్తున్న నటుల హావభావాలను , వారి కనుగుడ్లలో కనిపించే ఫోకస్ లైట్లతో సహా మానిటర్ లో చెక్ చేసుకోవచ్చు. సీన్ పండలేదనిపిస్తే అతి తక్కువ ఖర్చుతో రీ షూట్ చేసుకోవచ్చు.

దర్శకుడు ప్రేక్షకుడి స్థానంలో కూర్చుని మానిటర్లో ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటే సన్నివేశాలు ఎలా వస్తున్నాయో తెలుసుకోవడంతో పాటు కథ ఏ దారిలో వెళ్తుందో కూడా తెలుస్తుంది. ఈ చిత్ర దర్శకుడు ఆ విషయంలో పెద్దగా శ్రద్ధ పెట్టలేదనిపిస్తుంది.(అందుకు బహుశా ఆయన అనారోగ్యం కూడా ఒక కారణం అయి ఉండొచ్చు)

రాజు.. మంత్రి మధ్యలో రాణి అనే కాన్సెప్టులో ఆయన కథ రాసుకున్నారనిపిస్తుంది. ఈ పాయింట్ బాగానే ఉంది.

ఇద్దరు ప్రాణ స్నేహితుల జీవితాల్లోకి ఒక రాణి ప్రవేశిస్తే ఎలాంటి పరిణామాలు ఎదురౌతాయి అనే పాయింటులో ఆయన కథ రాసుకుని దానికి మాఫియా నేపథ్యాన్ని జోడించారు. ఈ పాయింటూ బాగుంది. కానీ బాగున్న పాయింటును అంతే జాగ్రత్తగా తెరకెక్కించకపోతే బాగోకుండా పోతుంది. ఈ సినిమాలో జరిగింది అదే.

పైగా ఒక సినిమా చూస్తున్నప్పుడు మనకు ఇంకో సినిమా గుర్తుకు రాకూడదు. అలా గుర్తొచ్చిందంటే అది పూర్తిగా దర్శకత్వ వైఫల్యమే అవుతుంది. ఈ సినిమా చూస్తున్నప్పుడు ఆ ముచ్చటా అయ్యింది.

సింగిల్ పాయింట్ ఎజెండాతో స్టోరీ రాసుకున్న దర్శకుడు కథనంలో మాత్రం బోలెడు పాయింట్లు యాడ్ చేసుకుంటూపోయారు. దాంతో ఏ పాయింట్ ఎక్కడ ఎండ్ అవుతుందో తెలియక ప్రేక్షకులు తికమక పడతారు. ఈ సినిమాలో అలాంటి తికమకలు కొన్ని ఉన్నాయి.

ప్రతి సినిమాకి పాత్రల నిర్మాణం అనేది చాలా ముఖ్యమైన ప్రక్రియ. క్యారెక్టరైజేషన్ పెర్ఫెక్ట్ గా లేకపోతే ఆ పాత్ర బలం గాల్లో కలిసిపోతుంది. ఈ సినిమా కోసం కొన్ని బలమైన పాత్రలను రాసుకున్న దర్శకుడు వెండితెర మీద మాత్రం ఆ పాత్రలను బలహీనం చేసేశారు. బలంగా కనిపించిన ప్రతిపాత్రను దర్శకుడే స్వయంగా లైనుగా ముగించుకుంటూ రావడం ప్రేక్షకులకు మింగుడుపడని విషయం.

ఈ మధ్య ప్రేక్షకులు ప్రతి సినిమాలో లాజిక్కులను బాగానే వెతుకుతున్నారు. అందులో ఎలాంటి తప్పు లేదు. ప్రేక్షకుడి పనే అది. కానీ లాజిక్కులతో మాకు సంబంధం లేదనేది కొంతమంది దర్శకుల వాదన. ఈ సంగతి అలా ఉంచితే ఈ సినిమాలో పోలీసులు కరివేపాకు అన్నమాట. అసలు దర్శకుడు వాళ్ళ జోలికే పోలేదు. లాజిక్కులు వెతికేవాళ్లకు ఇది నచ్చదు.

డాన్ లు కొట్టుకుంటారు..తిట్టుకుంటారు… కాల్చుకుంటారు.. అంతే.. వాళ్ళ పనే అది అన్న టైపులో వన్ సైడెడ్ గా నెరేట్ చేసుకుంటూ వెళ్లిపోయారు.

కమల్ దాస్ లాంటి అంతపెద్ద డాన్ ఒక గల్లీ దాదా చెప్పగానే పార్ధ కి తన కూతుర్ని ఇచ్చి పెళ్లిచేయడం జస్టిఫికేషన్ గా అనిపించదు.

ఇక ఆ జాకీ బాధేంటో చాలావరకు అర్థం కాదు. ప్రేమ అంటాడు.. ఫెయిల్యూర్ అంటాడు..అంతకుముందు అలీజాతో, తర్వాత భార్గవితో.. ఇలా కనపడిన అందరితో ప్రేమలు అంటూ తిరగడంతోనే ఆ క్యారెక్టర్ పుణ్యకాలం గడిచిపోతుంది. చివరికి ఆ పాత్ర ఏం సాధించిందో ఎవరికీ అర్ధం కాదు.

ఇక పార్ధ పాత్ర అహంలో మునిగి తేలుతూ ఉంటుంది కాబట్టి అతన్నించి ఆ అహాన్ని దూరం చేస్తే సరిపోయేది.. దానికి విరుద్ధంగా దర్శకుడు ఆ పాత్రకు ఇచ్చిన ముగింపు ఎవరికీ నచ్చదు.

ఈ రెండు క్యారెక్టర్ల మధ్య ఓ క్వీన్ ను దింపిన దర్శకుడు ఆ పరంగా కథలో ఎమోషన్లను , సంఘర్షణలను సరిగా పండించలేకపోయారు. పైగా ఆ సినిమా హీరోయిన్ కి ఓ రొటీన్ ఫ్లాష్ బ్యాక్ ఒకటి తగిలించి ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టారు. ఇలాంటి హీరోయిన్ల ఫ్లాష్ బ్యాక్ లతో ఇప్పటికే కొన్ని వందల సినిమాలు చూసేసి ఉంటాం. ఆమె ఎపిసోడ్ మొత్తం సాగతీత కు బాగా పనికొచ్చింది.

పోనీ ఆ హీరోయిన్ తో ఇంత డ్రామా నడిపిన దర్శకుడు క్లైమాక్స్ వరకు వచ్చేసరికి ఏ పాత్రకూ న్యాయం చేయలేక తడబడి సరైన ముగింపు ఇవ్వలేకపోయారనిపిస్తుంది.
దానికితోడు సెకండాఫ్ నుంచి కథనం ప్రిడిక్టబుల్ గా సాగడంతో ప్రేక్షకులను ఎంగేజ్ చేయలేకపోయింది.

కథలో సంఘర్షణలు ఉన్నాయి.. ఎమోషన్స్ ఉన్నాయి.. కానీ ఇవేమీ ప్రేక్షకులకు కనెక్ట్ కాలేకపోయాయి. అదే ఈ సినిమాలో ట్రాజెడీ. ఓవరాల్ గా కత్తి చేతబట్టుకుని తిరిగినవాడు అదే కత్తికి బలవుతాడు అనే సామెతతో ఈ సినిమా ముగింపుకు దర్శకుడు కొత్త అర్థం చెప్పారు.

ఎవరెలా చేశారు?

ఈ సినిమాలో పార్ధ పాత్ర పోషించిన దీక్షిత్ శెట్టి గతంలో గర్ల్ ఫ్రెండ్ సినిమాలో కూడా చక్కటి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అలాగే ఈ సినిమాలో కూడా అతడు తనకిచ్చిన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్ లో అతడి హావభావాలు బాగున్నాయి.

ఇక జాకీ పాత్ర పోషించిన శశి ఓదెల దర్శకుడు శ్రీకాంత్ ఓదెలకు సోదరుడు అవుతారు. కొత్త నటుడు అయినప్పటికీ చాలా ఈజ్ తోనే నటించాడు.

హీరోయిన్ భార్గవి పాత్ర పోషించిన యుక్తి తరేజా నటన కూడా బాగానే ఉంది.
చిచ్చా పాత్రలో మురళీధర్ గౌడ్ నటన బాగుంది. చాలా సహజంగా నటించారు.

సాంకేతికత

పూర్ణచంద్ర తేజస్వి అందించిన సంగీతం పర్లేదు.
నాగేష్ బనోల్ అందించిన సినిమాటోగ్రఫీ యావరేజ్ గా ఉంది.
నిర్మాణ విలువలు పర్లేదు.

విశ్లేషణ

ఇద్దరు ప్రాణ స్నేహితులు.. మాఫియా నేపథ్యం.. మధ్యలో వారి జీవితాల్లో ప్రవేశించిన ఒక మహిళ చుట్టూ కథ తిరుగుతుంది. వాళ్ళతోనే కథ ముగిసిపోతుంది కూడా.

కథ సంగతి ఎలా ఉన్నా కథనం విషయంలో దర్శకుడు చాలాచోట్ల తడబడ్డాడు. మొదట తను రాసుకున్న లైనుకి, చివరకు ఇచ్చిన సందేశానికి పొంతన ఉండదు. కథనం మన ఊహలకు అనుగుణంగానే ఉండటంతో కొత్తదనం లోపించి ఎంగేజ్ చేయదు.

దళపతి రేంజులో రాసుకున్న కథ వెండితెర మీదకు వచ్చేసరికి కింగ్ క్వీన్ జోకర్ ల మధ్య నడిచిన మూడు ముక్కలాట మాదిరి అయిపోయింది. ఓవరాల్ గా ఫస్టాఫ్ లో కొంత , సెకండాఫ్ లో కొంతభాగం కొంతవరకు ఎంగేజ్ చేస్తాయి. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాని వన్ టైమ్ వాచ్ మూవీ కింద చూడొచ్చు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *