జలయజ్ఞం, ఆరోగ్యశ్రీ , ఉచిత విద్యుత్ పథకాల సృష్టికర్త మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YS Rajasekhar Reddy) వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ ప్రత్యేక కథనం.
ఆ రోజు ఏం జరిగింది?
2009 , సెప్టెంబర్ 2 న సరిగ్గా ఇదే రోజు ఉదయం ఎప్పటిలానే సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన రోజువారీ కార్యక్రమాల కోసం సన్నద్ధం అవుతున్నారు. చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉందని ఆయన ప్రత్యేక కార్యదర్శి వివరాలు అందచేశారు. ఇందుకోసం హెలికాప్టర్ కూడా సిద్ధం చేశారు.

ప్రజలకు.. ప్రభుత్వానికి మధ్య వారధిలా పనిచేసేందుకు ఒక వేదిక అవసరం అని భావించి డాక్టర్ వైఎస్ ఈ రచ్చబండ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. నిజానికి అప్పట్లో ఈ కార్యక్రమం చక్కటి ప్రజాదరణ పొందింది. ప్రజలు నేరుగా సీఎం కు తమ సమస్యలు చెప్పుకునే అవకాశం రావడం, అదే కార్యక్రమంలో ప్రజల సమస్యల పరిష్కారానికి సీఎం అప్పటికప్పుడు ఆదేశాలు ఇవ్వడం వంటి అంశాలతో ఈ వేదిక జనాదరణ పొందింది.
అందుకే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ కార్యక్రమం మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆయన రెండోసారి సీఎం అయిన తర్వాత ప్రజలకు మరింత చేరువ అయ్యేందుకు ప్రత్యేకంగా ఈ కార్యక్రమం రూపొందించుకున్నారు.
హెలికాప్టర్ ప్రయాణం
చిత్తూరు జిల్లాలో జరిగే రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనడానికి సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో హెలికాప్టర్లో బయలుదేరారు. సరిగ్గా 9.35 గంటల ప్రాంతంలో ATC కి హెలికాప్టర్ తో సంబంధాలు తెగిపోయాయి. దాంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. హెలికాప్టర్ తో కమ్యూనికేషన్ వ్యవస్థ పునరుద్ధరించడానికి ప్రయత్నాలు చేశారు. కానీ వారి ప్రయత్నాలు ఫలించలేదు.
మరోపక్క సీఎం హెలికాప్టర్ మిస్ అయ్యిందనే వార్తలు బయటికి పొక్కడంతో ఆయన్ను అభిమానించే కార్యకర్తలు , నాయకులు, ప్రజల్లో ఆందోళనలు మొదలయ్యాయి.
ఏ నోట చూసినా వైఎస్ క్షేమంగా బయటపడాలనే ప్రార్థనలు కనిపిస్తున్నాయి. కొందరైతే ఉండబట్టలేక వైఎస్ హెలికాప్టర్ ప్రయాణించిన మార్గంలో ఆచూకీ కోసం కొండలు గుట్టలు వెతకడం మొదలుపెట్టారు. వీరిలో ఎమ్మెల్యేలు, మంత్రులు సైతం ఉన్నారు.
పావురాల గుట్టలో ప్రమాదం
అధికార వ్యవస్థలు ఒక రోజంతా గాలించిన తర్వాత నల్లమల అటవీ ప్రాంతంలో పావురాల గుట్టలో సీఎం హెలికాప్టర్ క్రాష్ అవడం గుర్తించారు. ఈ ప్రమాదంలో సీఎం తో పాటు ప్రయాణించిన ఐదుగురు అధికారులు కూడా శరీరాలు గుర్తుపట్టలేనంతగా చిద్రమై దుర్మరణం పాలయ్యారు. అంతే క్షణాల్లో ఈ వార్త దేశమంతా పాకింది. హెలికాప్టర్ ప్రమాదంలో సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించారన్న వార్త తెలిసి శోకసంద్రంలో మునిగిపోయారు. వైఎస్ మరణ వార్తను జీర్ణించుకోలేని షుమారు డెబ్బై మంది అభిమానులు గుండె ఆగి మరణించారు.

ప్రమాద కారణాలు
హెలికాప్టర్ ప్రమాదంపై అప్పట్లో అనుమానాలు కూడా వ్యక్తం అయ్యాయి. వైఎస్ ను రాజకీయంగా ఎదుర్కోలేక ఆయనను అంతమొందించడానికి ప్రత్యర్ధులు పన్నిన పన్నాగం అని అప్పట్లో పలువురు నాయకులు, కార్యకర్తలు ఆరోపణలు కూడా చేశారు. ప్రభుత్వం కూడా హెలికాప్టర్ ప్రమాదం మీద అత్యున్నత స్థాయి అధికారుల బృందంతో విచారణకు ఆదేశాలు జారీ చేసింది. నల్లమల అటవీ ప్రాంతంలో ఎదురైన విపరీతమైన పొగమంచు వల్ల హెలికాప్టర్ క్రాష్ అయ్యిందని అధికారులు ప్రాథమికంగా తేల్చారు.
వైఎస్ వ్యక్తిగత జీవితం
హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి వ్యక్తిగత జీవితం వైద్యునిగా ప్రారంభం అయ్యింది. సరైన వైద్య సౌకర్యాలు అందుబాటులో లేక పేదలు ఇబ్బందులు పడే పరిస్థితులు రాకూడదని వైఎస్ ఆలోచన. అందుకే ఆయన వైద్య విద్య పూర్తి చేసుకుని డాక్టర్ అయ్యారు. అప్పట్లో ఆయన ఆలోచనల్లో రాజకీయాల ఊసే లేదు. ఎంతసేపూ ఒక వైద్యుడిగా పేదవాళ్లకు ఎలాంటి సేవలు అందించగలను అని ఆలోచించేవారు. అందుకే 1972-73 లో జమ్మలమడుగు CSI ఆసుపత్రిలో వైద్యాధికారిగా జాయిన్ అయ్యారు.

నిజానికి స్వతహాగా శ్రీమంతుడు అయిన వైఎస్ ఉద్యోగంలో చేరాల్సిన అవసరం లేదు. సొంతంగా ఏదైనా వ్యాపారాలు చేయమని తండ్రి రాజారెడ్డి ప్రోత్సహించినా వైఎస్ వ్యాపారాల జోలికి పోలేదు. పేదవాడు వైద్యం అందుబాటులో లేక ఇబ్బందులు పడకూడదు అనే ఆలోచనలే ఆయన మదిలో నాటుకుపోయాయి.
కొడుకు ఆశయాలను గమనించిన తండ్రి రాజారెడ్డి చివరకు వైఎస్ దారిలోకి రాక తప్పలేదు. పులివెందులలో తన పేరుతో 70 పడకల ఆసుపత్రి కట్టించారు. దాంతో వైఎస్ ఉద్యోగం మానేసి సొంత ఆసుపత్రిలో వైద్య సేవలు అందించడం మొదలుపెట్టారు.
వైఎస్ రాజకీయ జీవితం
సొంత ఆసుపత్రిలో వైద్య సేవలు అందిస్తున్నా వైఎస్ లోని వైద్యుడు సంతృప్తి పడలేదు. ఏదో లోటు ఉంది. ఎక్కడో వెలితి ఉంది. ఈ 70 పడకల ఆసుపత్రితో ఎంతమందికి వైద్య సేవలు లభిస్తున్నాయి. రాష్ట్రంలో వైద్య సేవలు అందక ఇబ్బందులు పడుతున్న మిగిలిన పేదల సంగతి ఏంటి? అనే ఆలోచన ఆయన మెదడుని తొలిచింది. అటువంటి అంతర్మథనంలోనుంచి పుట్టిన ఆలోచనే రాజకీయ రంగ ప్రవేశం.
దాంతో 1978 లో తొలిసారి పులివెందుల శాసన సభ స్థానం నుంచి గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. అప్పుడు మొదలైన వైఎస్ రాజకీయ ప్రయాణం అప్రహతింగా సాగింది. వరుసగా ఆరు సార్లు ఎమ్మెల్యేగా, నాలుగుసార్లు ఎంపీగా ఎన్నిక అవడమే కాకుండా ముగ్గురు సీఎం ల క్యాబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు.

కానీ ఆయనలోని అసంతృప్తి మాత్రం అలాగే ఉండిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా పేదవాళ్లకు నాణ్యమైన వైద్యాన్ని అందించాలనే తన ఆలోచన అమలు కావాలంటే సీఎం కావడం మినహా మరో మార్గం లేదని ఆయన గమనించారు.
అందుకు 2004 లో జరగబోయే శాసన సభ ఎన్నికలను ఆయన టార్గెట్ చేసుకున్నారు. టార్గెట్ చేసుకుని ఊరుకోలేదు. మండే ఎండల్లో షుమారు 1450 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఈ యాత్రలో కాళ్లు బొబ్బలు ఎక్కాయి. శరీరం అలసిపోయింది. అయినా ఆయన వెనకడుగు వేయకుండా మొక్కవోని ధైర్యంతో ముందుకు దూసుకుపోయారు. రైతులు, పేదలు, విద్యార్ధుల కష్టాలు విన్నారు. సమస్యలు తెలుసుకున్నారు. పరిష్కారాలు ఆలోచించారు.

వైఎస్ స్వప్నం ఫలించిన వేళ
2004 ఎన్నికల్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిరకాల స్వప్నం ఫలించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మొదటి సంతకం విద్యుత్ పథకం ఫైలు మీద చేశారు. అంతటితో ఊరుకోలేదు. పేదవాడికి నాణ్యమైన వైద్యం అందుబాటులోకి తీసుకురావాలనే తన ఆశయం మీద దృష్టి పెట్టారు. ఫలితంగా ఆరోగ్య శ్రీ పథకం రూపు దిద్దుకుంది. వైఎస్ తెచ్చిన ఆరోగ్యశ్రీ పథకం రాష్ట్రంలో ఉన్న పేదలకు సంజీవిని అయ్యింది. అందుకే వారు ఇప్పటికీ వైఎస్ ను తమ గుండెల్లో పెట్టుకుంటారు. వైఎస్ తెచ్చిన పథకాల్లో 108 , 104 కూడా ముఖ్యమైనవి. ప్రమాదం జరిగిన నిమిషాల్లోనే కుయ్ కుయ్ మంటూ ప్రత్యక్షం అయ్యే అంబులెన్స్ సౌకర్యం.. ప్రజల వద్దకే వైద్యం అందించే 104 సంచార వైద్యశాలలు అవసరార్థులకు బాగా ఉపయోగపడ్డాయి. అలాగే వైఎస్ రూపొందించిన జలయజ్ఞం కార్యక్రమం కూడా ప్రజాదరణ పొందింది.

ముగింపు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. సీఎం గా వైఎస్ అందరికీ ఎంత కంఫర్ట్ అంటే ప్రతిపక్షానికి చెందిన ఎమ్మెల్యే కూడా నేరుగా సిఎం దగ్గరికి వెళ్లి తమ సమస్యలు చెప్పుకుని వెంటనే పనులు చేసుకునేవారు.
ఇదిలా ఉండగా రాజకీయాల్లో ఎదగడానికి తాను పడ్డ కష్టాలు, అవమానాలు వైఎస్ గుర్తుపెట్టుకున్నారేమో , అలాంటి అవమానాలు ఎవరూ పడకూడదని ఆయన ఎంతోమందిని నాయకులని చేశారు. పార్టీనే నమ్ముకుని కష్టాలు పడుతున్న కార్యకర్తలకు సముచిత స్థానం కల్పించి ఆర్ధిక స్వావలంబనకు తోడ్పడ్డారు.
ఇందుకు ఉదాహరణగా విజయవాడకు చెందిన మల్లాది విష్ణును చెప్పుకోవచ్చు. సాధారణ కార్యకర్త స్థాయిలో ఉన్న మల్లాది విష్ణుకు ఉడా ఛైర్మన్ పదవి కట్టబెట్టి రాజకీయంగా ఆయన ఎదగడానికి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మార్గం సుగమం చేశారు.
ఆయననే కాదు చాలామంది కార్యకర్తలను వైఎస్ ప్రోత్సహించి నాయకులను చేశారు. నేడు మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, నాయకులుగా చలామణిలో ఉన్న చాలామందికి ఆ పదవులు, ఆ స్థాయి వైఎస్ పెట్టిన రాజకీయ భిక్షే.
ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా మరోసారి నివాళులు !
