తమిళ నటుడు భాగ్యరాజా ప్రధాన పాత్రలో చివరిసారిగా నటించిన డార్క్ హార్రర్ థ్రిల్లర్ మూవీ (Dark Movie) జులై 3, 2026 లో థియేటర్లలో రిలీజ్ అయ్యింది. ఆగస్టు 21, 2026 నుంచి ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. భాగ్యరాజా తో పాటు అజయ్ కార్తీక్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకి గణేష్ బాబు నిర్మాతగా వ్యవహరించగా కళ్యాణ్ కె జగన్ దర్శకత్వం వహించారు. అయితే ప్రస్తుతం ఈ సినిమా ప్రైమ్ లో తమిళ్ వెర్షన్లో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో అందుబాటులో ఉంది.
ఇప్పుడు డార్క్ మూవీ ఎలా ఉందో చూద్దాం.
కథేంటంటే?
ఒక ఇంట్లో జరిగిన ముగ్గురు స్నేహితుల అనుమానాస్పద మరణంతో సినిమా మొదలౌతుంది.
ముగ్గురిలో ఒకడు మిగిలిన ఇద్దరినీ చంపి తాను కూడా మంట పెట్టుకుని చనిపోతాడు.
కట్ చేస్తే,
విఘ్నేష్ (అజయ్ కార్తీక్) తన ప్రాజెక్ట్ వర్క్ కోసం తల్లిని విడిచిపెట్టి సిటీకి వస్తాడు. తన ప్రాజెక్ట్ వర్క్ పూర్తయ్యేవరకు మూడు నెలలు ఎక్కడైనా అద్దె ఇంట్లో దిగాలనుకుని ఇళ్లకోసం వెతుకుతాడు. కానీ బాచిలర్ అనీ, నాన్ వెజిటేరియన్ అనీ రకరకాల కారణాలతో హౌస్ ఓనర్లు అతడికి తమ ఇల్లు అద్దెకు ఇవ్వడానికి ఒప్పుకోరు.
ఆఖరికి కరుణాకరన్ (భాగ్యరాజా) మాత్రం కేవలం మూడు వేల అద్దెకే తన ఇంటి పై పోర్షన్ అద్దెకు ఇవ్వడానికి ఒప్పుకుంటాడు. కాకపోతే గతంలో అదే పోర్షన్లో ముగ్గురు వ్యక్తులు చనిపోవడంతో దయ్యాలు తిరుగుతున్నాయనే అనుమానంతో ఎవరూ అద్దెకు దిగడం లేదని, కాబట్టి అందుకు ఇష్టమైతేనే ఇంట్లో దిగమంటాడు. అద్దె తక్కువ కావడంతో విఘ్నేష్ వెంటనే ఒప్పుకుని అడ్వాన్స్ కూడా ఇస్తాడు.
కానీ ఆ పోర్షన్లో దిగినప్పటినుంచి విఘ్నేష్ కు విచిత్రమైన అనుభవాలు ఎదురౌతాయి. ఆ పోర్షన్లో దయ్యాలు తిరుగుతున్నాయనే అనుమానంతో మానసికంగా కుంగిపోతుంటాడు. కొంతకాలానికి అదే ఇంట్లో బెడ్ మీద విఘ్నేష్ (అజయ్ కార్తీక్) , సోఫా మీద ఇంటి ఓనర్ కరుణాకరన్ (భాగ్యరాజా) లు అనుమానాస్పదంగా మరణిస్తారు.
ఈ కేసులో ఏసిపి బాలచందర్ (నట్టి నటరాజ్) ఇన్వెస్టిగేషన్ మొదలుపెడతాడు. అయితే గుండె చీలిపోయి చనిపోయాడనుకున్న విఘ్నేష్ ఒక్కసారిగా లేచి ఏసిపి బాలచందర్ ను చూసి గెట్ ఔట్ అంటూ పెద్దగా అరిచి కిందపడిపోతాడు. ఈ పరిణామంతో ఏసిపి షాక్ అవుతాడు.
చనిపోయాడనుకున్న విఘ్నేష్ ఏసీపీని చూసి ఎందుకలా అరుస్తాడు?
ఆ ఇంట్లో గతంలో చనిపోయిన ముగ్గురికీ ఈ కేసుకీ లింక్ ఏంటి?
చివరకు ఏసిపి బాలచందర్ ఇన్వెస్టిగేషన్లో ఏం తేలుతుంది? అనేది మిగిలిన కథ.
ఎలా ఉంది?
మలయాళం సినిమాల మాదిరే దర్శకుడు ఈ మూవీకి కూడా థ్రిల్లింగ్ ఓపెనింగ్ ఇచ్చాడు. ఒక ఇంట్లో ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా మరణించడం, ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో తనకెదురైన అనుభవాలను ఏసిపి బాలచందర్ రీ కలెక్ట్ చేసుకోవడం వంటి సన్నివేశాలతో దర్శకుడు మంచి క్రైమ్ థ్రిల్లర్ జానర్లో మూవీని మొదలుపెట్టిన తీరు ఆకట్టుకుంటుంది.
ఎప్పుడైతే విఘ్నేష్ ..కరుణాకరన్ ఇంటి పై పోర్షన్లో అద్దెకు దిగుతాడో అప్పట్నుంచి కథనం హార్రర్ ఎలిమెంట్ వైపు టర్న్ అవుతుంది. నిజానికి ఇక్కడినుంచే మనకు థ్రిల్లింగ్ ఫీల్ వస్తుంది. గతంలో హత్యకు వాడిన ఒక నాన్ స్టిక్ పాన్ వంటింట్లో తరచుగా కింద పడిపోవడం, బుక్ రాక్ లోనుంచి ఒక బుక్ కిందపడిపోవడం , కనెక్షన్ లేకపోయినా టీవీ ఆన్ అందులోనుంచి పాట ప్లే అవడం వంటి సన్నివేశాలు ఎంగేజ్ చేస్తాయి.
అయితే ఈ సన్నివేశాలు మొదటిసారి చూసినప్పుడు మాత్రమే మనం థ్రిల్ అవుతాం. దర్శకుడు చేసిన పొరపాటు ఏంటంటే పదేపదే అదే నాన్ స్టిక్ పాన్ అండ్ ఆ బుక్ ను చూపించి మనల్ని భయపెట్టాలని అనుకోవడం.. అలా రెండుమూడు సార్లు సేమ్ సీన్ రిపీట్ చేయడంతో భయం సంగతి అలా ఉంచితే విసుగు వస్తుంది.
కొత్తదనంతో ముందుకెళ్ళకుండా ఎంతసేపూ ఆ నాన్ స్టిక్ పాన్, బుక్, టీవీలను చూపించడంతో కథ అక్కడక్కడే తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. అయితే దర్శకుడు చేసిన ఇంకో మంచి పని కూడా ఉంది. హార్రర్ సినిమా కాబట్టి ఇంతింత పొడుగు గోళ్ళు, తెల్ల కనుగుడ్లు వేసుకున్న ఆడ దెయ్యాలను దింపకుండా ఇంతటితో సరిపుచ్చటం రిలీఫ్ ఇస్తుంది. ఎందుకంటే ఆ దయ్యాలను ఇప్పటికే చాలా సినిమాల్లో చూసీ చూసి జనాలకు బొత్తిగా భయం కూడా లేకుండా పోయింది. అందుకే దర్శకుడు విఠలాచార్య కాలం నాటి దయ్యాల జోలికి పోలేదు. కాకపోతే మనల్ని అంతోఇంతో భయపెట్టాలని ఒక కుక్క బొమ్మని విఘ్నేష్ గుండెల మీద పెట్టి దర్శకుడు గట్టి ప్రయత్నం అయితే చేశాడు.
సరే, ఆ పోర్షన్లో దిగిన విఘ్నేష్ దయ్యాలను ఎక్స్పీరియన్స్ అవుతాడు.. బాగానే ఉంది.. మరి ఖాళీ చేసి వెళ్ళిపోవచ్చుగా? వెళ్ళడు.. పైగా భయమైతే ఖాళీ చేసి వెళ్ళిపొమ్మని ఇంటి ఓనర్ చెప్పినా ఖాళీ చేయడు. అర్జున్ రెడ్డి దేవరకొండ విజయ్ మాదిరి సిగరెట్ల మీద సిగరెట్లు తాగుతూ ఆలోచిస్తుంటాడు.
మధ్యలో అతడి తల్లి వస్తుంది.. ఆమె కూడా ఆ పోర్షన్లో నాన్ స్టిక్ పాన్, బుక్కు, టీవీ చూసి మాయం అవుతుంది. ఆమె ఎటుపోయిందో కూడా మనకు తెల్వదు. ఇక్కడ దయ్యాల సంగతి అలా ఉంచితే విఘ్నేష్ గోలేంటో మనకు అర్థం కాదు. మధ్యలో కమెడియన్ వీటివి గణేష్ ఎపిసోడ్, విఘ్నేష్ ఆఫీస్ ఎపిసోడ్లు లాంటివి తగిలించి బండిని మరికొంత ముందుకు లాగినట్టు అనిపిస్తుంది. ఈ సీన్లను సాగతీత కోసం దర్శకుడు సినిమాటిక్ లిబర్టీతో వాడుకున్నాడని తర్వాత మనకు అర్థమవుతుంది.
ఇక క్లైమాక్స్ వరకు వచ్చేసరికి దర్శకుడు అప్పటిదాకా మూసిన గుప్పిట తెరిచి సస్పెన్స్ ఎలిమెంట్ రివీల్ చేస్తాడు. ఇది బాగానే ఉంది కానీ కొద్దిగా కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది. భాగ్యరాజా ఎలా చనిపోయాడు? చనిపోయిన విఘ్నేష్ ఎలా లేచి కూర్చున్నాడు? హాస్పిటల్లో విఘ్నేష్ ఏసిపి బాలచందర్ పీక ఎందుకు పట్టుకున్నాడు? లాంటి కొన్ని ప్రశ్నలకు క్లారిటీ మిస్ అయ్యింది. బహుశా లాంగ్వేజ్ ప్రాబ్లం అయ్యుంటుంది. ఓవరాల్ గా ఈ సినిమా ఫస్టాఫ్ కొంతభాగం.. సెకండాఫ్ మరికొంత భాగం మనల్ని ఎంగేజ్ చేస్తుంది.
ఎవరెలా చేశారు?
ఎవరెలా చేశారంటే ఈ మూవీలో ప్రధానంగా ఇద్దరి గురించే చెప్పుకోవాలి. వారిలో మొదటివారు భాగ్యరాజా.. ఈయన నటన గురించి కొత్తగా చెప్పుకోవడానికి ఏమీ లేదు.. చక్కటి నటుడు.. తమిళులకే కాదు డార్లింగ్ డార్లింగ్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో కూడా చక్కటి స్థానం సంపాదించుకున్నారు. భాగ్య రాజా నటన చాలా సహజంగా ఉంటుంది. తుదిశ్వాస విడిచే ముందు ఇదే ఆయన నటించిన ఆఖరి సినిమా.
విఘ్నేష్ పాత్రలో నటించిన అజయ్ కార్తీక్ ను చూస్తున్నప్పుడు అర్జున్ రెడ్డి విజయ్ దేవరకొండ గుర్తొస్తాడు. హార్రర్ సినిమాలకు హావభావాలతో ఎక్కువగా పని ఉంటుంది. ఇతడు తన ముఖంలో ఆ హావభావాలను బాగా పలికించాడు. ఏసిపి బాలచందర్ పాత్రలో నట్టి నటరాజ్ నటన బాగానే ఉంది.
సాంకేతికత
మను రమేషన్ అందించిన సంగీతం బాగానే ఉంది. కాకపోతే హార్రర్ జానర్ మూవీకి తగ్గట్టుగా కొన్ని డ్రమ్ములు పలకలేదు.
రవిశక్తి అందించిన సినిమాటోగ్రఫీ పర్లేదు.
నిర్మాణ విలువలు కూడా పర్లేదు.
విశ్లేషణ
ఒక ఇంటి మేడ మీద పోర్షన్లో జరిగిన హత్యల చుట్టూ కథను అల్లుకుని దర్శకుడు డార్క్ మూవీని తెరకెక్కించారు. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మోడ్ లో కథనాన్ని మొదలెట్టి మెల్లిగా హార్రర్ ఎలిమెంట్ వైపు దర్శకుడు కథనాన్ని టర్న్ చేసిన తీరు బాగానే ఉంది.
అయితే మొదలూ.. తుది వదిలేస్తే మధ్యలో వచ్చే కొన్ని సాగతీత సన్నివేశాలు మన సహనాన్ని పరీక్షిస్తాయి. ఓవరాల్ గా ఈ మూవీ ప్రారంభం బాగుంది.. ఎండింగ్ బాగుంది.. మధ్యలో మాత్రం మిథ్య అనుకోవడమే.
అమెజాన్ ప్రైమ్ లో తమిళ్ వెర్షన్లో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో చూడగలిగేవాళ్లు వన్ టైమ్ వాచ్ మూవీ కింద ఓ లుక్కేయండి.
నటీనటులు: అజయ్ కార్తీక్, భాగ్య రాజా, నట్టి నటరాజ్, వీటివి గణేష్ తదితరులు
సంగీతం: మను రమేషన్
సినిమాటోగ్రఫీ: రవిశక్తి
నిర్మాత: గణేష్ బాబు
దర్శకత్వం: కళ్యాణ్ కె జగన్
విడుదల: అమెజాన్ ప్రైమ్ (21-08-2026)
రేటింగ్: 2.5/5
