Headlines

Bad Boy Karthik (OTT) మూవీ రివ్యూ – నాగసౌర్య బ్యాడ్ బాయ్ కార్తీక్ మూవీ ఎలా ఉంది ?

Spread the love

నాగసౌర్య కెరీర్లో పెద్ద హిట్లు పడకపోవడానికి సరైన కధలు పడకపోవడమే ప్రధాన కారణం . అతడు కధల విషయంలో శ్రద్ద తీసుకుంటాడో ? లేకపోతే అసలు కథతో సంబంధం లేకుండా సినిమాలు ఒప్పుకుంటాడో ? లేకపోతే అతడిముందుకు సరైన కధలు రావేమో తెలీదు కానీ నాగసౌర్య సినిమాల్లో కధల లోపం బలంగా కనిపిస్తుంది .

నిజానికి నాగసౌర్య ఫ్యామిలీ ఆడియన్స్ మెచ్చే చక్కటి హీరో . చలో సినిమాలో చక్కటి పెర్ఫార్మన్స్ ప్రదర్శించాడు . సమంత నటించిన ఓ బేబీ సినిమాలో కూడా మంచి రోల్ ప్లే చేసి ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గర అయ్యాడు . కానీ అతడి బ్యాడ్ లక్ ఏంటంటే అతడి కెరీర్లో ఇప్పటివరకు పూర్తిస్థాయిలో సరైన కథాబలం ఉన్న సినిమా పడలేదు . ఇప్పుడు అతడి సినిమాల జాబితాలో బ్యాడ్ బాయ్ కార్తీక్ కూడా చేరింది కానీ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది .

ఏప్రిల్ 17 న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా నెలతిరక్కుండానే అమెజాన్ ప్రైమ్ ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చింది. ఈ సినిమాకి థియేటర్లలో ఆశించిన స్పందన రాలేదు . ఇప్పుడు ఓటిటిలో రేటింగ్ ఎలా ఉందో చూద్దాం .

కధేంటంటే ?

వైజాగ్ లో కస్తూరి ( శ్రీదేవి విజయ్ కుమార్ ) న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తుంటుంది . ఆమె భర్త అజయ్ బిజినెస్ మ్యాన్ . కస్తూరి తమ్ముడే సినిమాలో కథానాయకుడు కార్తీక్ ( నాగసౌర్య ) . ఈ కార్తీక్ కి తన అక్క అంటే ప్రాణం . తల్లితండ్రులు చిన్నప్పుడే మరణించడంతో కస్తూరి తానే తమ్ముడికి అమ్మానాన్న అవుతుంది .అందుకే కార్తీక్ కి అక్క అంటే ప్రేమ . అయితే కస్తూరికి తన తమ్ముడు విదేశాల్లో మంచి జాబ్ లో సెటిల్ అవ్వాలని కోరిక . అందుకోసం అతడ్ని పోరుతూ ఉంటుంది .

ఇదిలా ఉండగా ఏసిపి సాయి ( సాయికుమార్ ) కూతురు మహాలక్ష్మిని కార్తీక్ ప్రేమిస్తాడు . అతడి ప్రేమ వ్యవహారం నడుస్తున్న సమయంలోనే ఏసిపి సాయికి కదిరి డిఎస్పీ గా ట్రాన్స్ఫర్ అవుతుంది . ఇదే సమయంలో తన అక్కకు గోవిందప్ప నుంచి ప్రాణహాని ఉందని కార్తీక్ గమనిస్తాడు . ఈ గోవిందప్ప కదిరికి చెందిన ఫ్యాక్షనిస్ట్ . అతడికి లోకల్ గా వరదారెడ్డితో గొడవలు ఉంటాయి . ఒకప్పుడు ఈ గోవిందప్ప , వరదారెడ్డిలు కదిరిలో రైతుల భూములను దౌర్జన్యంగా ఆక్రమించుకుంటారు . తమకు అడ్డువచ్చిన ఎమ్ఆర్వోతో పాటు అతడి భార్యను కూడా చంపేస్తారు .

తర్వాత వరదారెడ్డి , గోవిందప్పలు రాజకీయంగా విడిపోతారు . కదిరి ఎమ్మెల్యే సీటుకు ఇద్దరూ పోటీ పడతారు . దాంతో టికెట్ తమకే దక్కాలని ఇద్దరూ అవతలివాడ్ని చంపాలని ప్లాన్ వేసుకుంటారు . తన అక్కకు గోవిందప్ప నుంచి ప్రాణహాని ఉందని తెలుసుకున్న కార్తీక్ కూడా గోవిందప్పను అడ్డుకోవాలని ప్లాన్ వేసుకుని కదిరికి చేరుకుంటాడు . ఈ పరిస్థితుల్లో గోవిందప్ప హత్యకు గురి అవుతాడు .

కార్తీక్ అక్క కస్తూరిని చంపాలని గోవిందప్ప ఎందుకు ప్లాన్ వేస్తాడు ?
ఈలోపల గోవిందప్పను ఎవరు హత్య చేస్తారు ?
గోవిందప్ప హత్యతో రాజకీయంగా ఇబ్బందులు పడిన వరదారెడ్డి చివరికి ఏం చేస్తాడు ? అనేది మిగిలిన కధనంలో తెలుస్తుంది .

ఎలా ఉంది ?

సినిమా ప్రారంభమే కామెడీ పీసుతో ప్రారంభించాలని దర్శకులవారు నిర్ణయించుకున్నట్టున్నారు . లాయర్ కస్తూరి తన క్లయింట్స్ తరపున వాదించడం , మధ్యలో బ్రహ్మాజీ దూసుకొచ్చి ఇంట్లో ప్రసాదం ఇచ్చి వచ్చానని జడ్జికి చెప్పడం , ప్రసాదం ముట్టడంతో జడ్జి కస్తూరి కేసును కొట్టివేయడం అనే సీరియస్ సన్నివేశాల్ని దిగ్విజయంగా కామెడీ చేసేస్తాడు . అంతటితో ఆగకుండా నాగసౌర్య బ్రహ్మాజీ డెన్ లోకి ఎంటర్ అయి ఇంకో కామెడీ పీస్ విసరడంతో కథ మొదలౌతుంది . స్థూలంగా తన అక్క కోసం తమ్ముడు రంగంలోకి దిగుతాడు అని సందేశం ఇచ్చినట్టు మనం అర్ధం చేసుకోవాలి .

సరే ఎలాగోలా అర్ధం చేసుకుని తర్వాత సన్నివేశంలోకి వెళ్తే మనకు ఎక్కడలేని పాత జ్ఞాపకాలు ఏవో గుర్తుకొస్తాయి . కూరగాయలు కొనడానికి అక్కాతమ్ముళ్ళు మార్కెట్ కి వెళ్ళినప్పుడు అక్కను చంపటానికి గోవిందప్ప మనుషులు వస్తారు . వాళ్ళు కస్తూరిని చంపడానికి కత్తులు తీసుకుని పరిగెత్తుకుంటూ రావడం , ఆఖరి క్షణంలో అక్కకి తెలీకుండా తమ్ముడు వాళ్ళ ముక్కు మీద గుద్దితే రక్తం కక్కుకుంటూ కింద పడిపోవడం , ఇదేమీ తెలీనట్టు అక్క ముందుకు వెళ్లడం చూస్తే మనకళ్లముందు కొన్ని పాత రీళ్లు గిర్రున తిరుగుతాయి .

ఎంసీఏ సినిమాలో నాని మరిది .. భూమిక అతడి వదిన ..నాని ఉద్యోగం ,సద్యోగం లేకుండా ఖాళీగా ఉంటాడు . ఆర్టీఓలో పనిచేసే వదినకు కడప ట్రాన్స్ఫర్ అవుతుంది . అక్కడ వదినను చంపాలని శివశక్తి ట్రావెల్స్ బస్ ఓనర్ ప్రయత్నిస్తూ ఉంటాడు . వదినకు తోడుగా కడప చేరుకున్న నాని ఈ విషయం తెలుసుకుంటాడు . వదినకు తెలీకుండా నాని వాళ్ళ మూతిమీద , ముక్కుమీద గుద్ది కింద పడేస్తాడు .

ఇప్పుడు ఈ కధలో కొన్ని పోలికలు చూద్దాం .. నాగసౌర్యది తమ్ముడి పాత్ర .. శ్రీదేవి విజయ్ కుమార్ ది అక్కపాత్ర .. నాగసౌర్య ఉద్యోగం , సద్యోగం లేకుండా ఖాళీగా ఉంటాడు . అక్కకి విలన్ నుంచి ప్రాణహాని ఉంది అని తెలుసుకుని కదిరి చేరుకుంటాడు . అక్కడ అక్కకు తెలీకుండా నాగసౌర్య వాళ్ళ మూతిమీద , ముక్కుమీద గుద్ది కిందపడేస్తుంటాడు .

సరే ఇంతవరకు ఎలాగోలా సర్దుకుపోదాం .. ఇప్పుడు సీన్ లోకి రైతులు వస్తారు . వాళ్ళ భూములను విలన్లు లాక్కుంటారు . ఇక్కడ మళ్ళీ మనకళ్లముందు కొన్ని పాత సినిమాల రీళ్లు గిర్రున తిరుగుతాయి . మహేష్ బాబు సినిమాలో రైతులు గుర్తుకొస్తారు . అందులో రాజేంద్రప్రసాద్ ఖచ్చితంగా గుర్తుకొస్తాడు .. ఎందుకంటే ఆ రైతు గెటప్ అచ్చంగా ఇందులో నరేష్ వేసినట్టే ఉంటుంది . రైతుల భూములు విలన్లు లాక్కోవడం , పొలోమంటూ రైతులందరూ వెళ్లి హీరోతో మొరపెట్టుకోవడం , హీరో పిడికిలి బిగించి విలన్ని రక్తం కారేలా చావగొట్టి రైతుల భూములు ఇప్పించడం ఎన్ని సినిమాల్లో చూసినా అదంతా మర్చిపోయి కొత్తగా చూడటం మనం అలవాటు చేసుకోవాలి . ఎందుకంటే ఈ మధ్య కొందరు దర్శకులు ప్రేక్షకులకు సినిమాలు చూడటం రావట్లేదని ఆడి పోసుకుంటున్నారు .

సరే ఈ మెలికనీ ఎలాగోలా సర్దుకుపోయి ఇంకాస్త ముందుకెళ్లి చూద్దాం . నేనేరా పోలీస్ అని సాయికుమార్ డైలాగ్ చెబితే థియేటర్లు ఈలలతో మారుమోగిపోయేది . అలాంటి సాయికుమార్ క్యారక్టర్ ను పోలీసుకు ఎక్కువ .. హోమ్ గార్డుకు తక్కువ అన్నట్టుగా డిజైన్ చేసారు . నిజంగా ఈ సినిమాలో సాయికుమార్ క్యారక్టర్ చూస్తే విలవిలలాడక మానరు . అసలుకు సాయికుమార్ ను కూడా కామెడీ పీసుగా వాడుకోవాలని డైరెక్టర్ చేసిన ఆలోచనకు , ధైర్యానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే . కాకపోతే ఇకపై సాయికుమార్ నేనేరా పోలీస్ అని అరవడానికి లేకుండా ఈ సినిమాలో పాత్ర గుర్తుకొస్తుంది .

ఓవరాల్ గా సీసా కొత్తదే , లేబుల్ కూడా కొత్తదే .. కానీ అందులో నింపిన సారాయి మాత్రం పాతదే . పాత రొటీన్ కమర్షియల్ కధలకు చిన్నచిన్న మార్పులు చేసి కామెడీ పేరుతో ప్రేక్షకులని నవ్విద్దామని విశ్వ ప్రయత్నం చేసిన దర్శకుడి ప్రయోగం బెడిసికొట్టింది .

ఎవరెలా చేసారు ?

బ్యాడ్ బాయ్ కార్తీక్ పాత్రలో నాగసౌర్య నిజంగానే బ్యాడ్ బాయ్ లా ఉన్నాడు . నటన పరంగా నాగసౌర్య కష్టపడ్డాడు కానీ ఫలితం రాలేదు . బేబీ సినిమాలో నాగసౌర్య చాలా గ్లామర్ గా కనిపిస్తాడు . కానీ ఎందుకో తెలీదు కానీ ఇందులో మాత్రం ముఖం పీక్కుపోయినట్టుగా కనిపిస్తుంది . ఈ విషయంలో నాగసౌర్య ఫిట్నెస్ మీద కూడా కొంచం శ్రద్ద పెడితే బాగుంటుంది .

ఇక మహాలక్ష్మి పాత్రలో విధి యాదవ్ నటన బాగానే ఉంది కానీ సినిమాలో ఆమె పాత్రకు పెద్దగా స్కోప్ లేదు . హీరో పక్కన డాన్సులు వేయడానికి సరిపోయింది .

ఇక నేనేరా పోలీస్ సాయికుమార్ పరిస్థితి చూస్తే జాలిపడటం మినహా మరేమీ చేయలేము . ఇందులో కూడా సాయికుమార్ నటనలో వంక పెట్టడానికి ఏమీ లేదు .. కానీ ఆయన పాత్రను డిజైన్ చేసిన విధానం బాగోలేదు .

శ్రీదేవి విజయకుమార్ , అజయ్ ల నటన బాగుంది .
బ్రహ్మాజీ , పృథ్వికుమార్ లతో సరైన కామెడీ పండించలేకపోయారు .

ఇక వెన్నెల కిశోర్ వెంటనే తన కామెడీ టైమింగ్ మార్చుకోవాల్సిన అవసరం ఉంది . అదే శైలిని చూసి చూసీ మొనాటని వచ్చేస్తుంది . ఇందులో కూడా సిద్దప్ప క్యారక్టర్ ద్వారా చేసిన అతి ఎక్కువగా కనిపిస్తుంది .
సముద్రఖని ఎప్పటిలానే సహజంగా నటించాడు . మైమ్ గోపి నటన కూడా బాగానే ఉంది .

సాంకేతికత

హ్యారిస్ జయరాజ్ కి మ్యూజిక్ డైరెక్టర్ గా మంచి పేరు ఉంది . కానీ ఎందుకో ఈ సినిమాలో ఆయన మార్క్ మ్యూజిక్ మిస్ అయ్యింది .
రసూల్ సినిమాటోగ్రఫీ బాగానే ఉంది .
నిర్మాణవిలువలు పర్లేదు

విశ్లేషణ

ఒకే టికెట్ మీద రకరకాల సినిమాలు చూసిన ఫీలింగ్ కలగడం ప్రేక్షకుల అదృష్టమో ? దురదృష్టమో ? తెలీదు కానీ ఈ సినిమా చూస్తున్నప్పుడు కొన్నిచోట్ల అలాంటి ఫీలింగ్ వస్తుంది . రాసుకున్న కథ పాత ఫార్మాట్ ప్రకారం ఉన్నప్పటికీ కనీసం కధనంలో అన్నా కొత్తదనం చూపించి ఉండాల్సింది . అసలే కథాబలం లోపంతో ప్రేక్షకులు అసహనంగా ఉంటే , దానికి తోడు వీక్ కధనంతో సినిమాని ఇంకో మెట్టు కిందికి దించారు .

ఫస్టాఫ్ లో సాయికుమార్ , నాగసూర్యలతో కామెడీ చేయిద్దామని ప్రయత్నించి అనవసరమైన సాగతీత సన్నివేశాలు జొప్పించడంతో ఏం చెయ్యలేని పరిస్థితి వస్తుంది . సెకండాఫ్ మాత్రం అసలు కథలోకి వెళ్లినట్టు అనిపిస్తుంది . వరదారెడ్డి , గోవిందప్పల గొడవలు , రైతుల ఇస్స్యూలు , కస్తూరి ఫ్లాష్ బ్యాక్ వంటి సన్నివేశాలతో కధనం చకచకా పరుగులు పెడుతుంది . చాలా సీరియస్ గా సాగిపోతున్న కధనంలోకి వెన్నెల కిశోర్ సిద్దప్ప క్యారక్టర్ తీసుకొచ్చి నీళ్లు చల్లారు . ఫస్టాఫ్ లో సాయికుమార్ కామెడీ ,సెకండాఫ్ లో వెన్నెల కిశోర్ కామెడీలు సినిమా మీద దెబ్బేసాయి .

ఇంతాచేసి ముగింపు అసంపూర్ణంగా వదిలేసినట్టు అనిపిస్తుంది . హీరో అనుకున్న ప్రకారం వరదారెడ్డిని లీగల్ గా చంపలేదు . చట్టాన్ని గౌరవించే లాయర్ కస్తూరి చట్టాన్ని తనచేతిలోకి తీసుకోవడం అతిపెద్ద కొసమెరుపు .

పాత సినిమాల్లో సన్నివేశాలు గుర్తుతెచ్చుకోకుండా వన్ టైం వాచ్ మూవీ కింద చూడటానికి ఇష్టపడేవాళ్లు అమెజాన్ ప్రైమ్ ఓటిటి లో చూడొచ్చు .

నటీనటులు : నాగసౌర్య , విధి యాదవ్ , సాయికుమార్ , శ్రీదేవి విజయ్ కుమార్ , అజయ్ తదితరులు
సంగీతం : హ్యారిస్ జయరాజ్
సినిమాటోగ్రఫీ : రసూల్
దర్శకత్వం : రమేష్ దేశిన
విడుదల : అమెజాన్ ప్రైమ్
రేటింగ్ : 2 / 5


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!