మేము ఫేమస్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న సుమంత్ ప్రభాస్ హీరోగా నటించిన ఇంకో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది . ఈ మూవీలో సుమంత్ ప్రభాస్ సరసన హీరోయిన్ గా నిధి ప్రదీప్ నటించింది . మే 8 న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా నెలతిరక్కుండానే అమెజాన్ ప్రైమ్ ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చింది .
గోదారి గట్టుపైన అనే టైటిల్ చూడగానే ఇదేదో లవ్ స్టోరీ అనే విషయం చాలామందికి అర్ధమయ్యే ఉంటుంది . గోదావరి జిల్లాల అందాలను , గోదావరి యాసను , గోదావరి మర్యాదలను , వెటకారాలను , కితకితలను ఇష్టపడనివారు ఎవరుంటారు ? అందుకే ప్రచార చిత్రాలతోనే ఈ మూవీ టైటిల్ కొంతమంది ప్రేక్షకుల నోళ్ళలో నానింది .
మరి ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా మూవీ ఉందో ? లేదో ? ఇప్పుడు చూద్దాం .
కధేంటంటే ?
గోదావరి జిల్లా రేలంగికి చెందిన రాజు ( సుమంత్ ప్రభాస్ ) టెన్త్ వరకు చదువుకుని ఆటో నడుపుకుంటూ కుటుంబానికి ఆధారంగా ఉంటాడు . స్నేహితులతో ఆడుతూపాడుతూ పనిచేస్తూ విలేజ్ లో అందరి తలలో నాలుకలా ఉంటూ మంచిపేరు తెచ్చుకుంటాడు .
అయితే తన చెల్లెలుతో కలిసి ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకుంటున్న మాయ ( నిధి ప్రదీప్ ) ను రాజు ప్రేమిస్తాడు . మాయ కూడా రాజులోని నిజాయితీ గుణం నచ్చి అతడిని ప్రేమిస్తుంది . కానీ తర్వాత తమ మతాలు వేరని తెలుసుకుని భయపడి రాజుకి దూరం అవుతుంది . అయితే రాజు తల్లితండ్రులది కూడా మతాంతర వివాహం అయినా చక్కగా ఎవరి మతాలను వాళ్ళు గౌరవించుకుంటూ కలిసిమెలిసి ఉంటున్నారని , ప్రేమకు కులాలు , మతాలు అడ్డుగోడలు కావని తెలుసుకుని తిరిగి రాజుకు దగ్గరవుతుంది .
మరోపక్క కూతురు మాయ అంటే శ్యాంబాబుకు ( జగపతిబాబు ) ప్రాణం . శ్యాంబాబు ఒక ఫ్యాక్టరీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ ఉంటాడు . ఇంజనీరింగ్ చదివిన తన కూతురికి ప్రభుత్వ ఉద్యోగం చేసుకునే ఉన్నత విద్యావంతుడికి ఇచ్చి పెళ్లి చెయ్యాలని శ్యాంబాబు ఆలోచిస్తూ ఉంటాడు . ఈ పరిస్థితుల్లో శ్యాంబాబుకి తన కూతురు మాయ ప్రేమ గురించి తెలుస్తుంది .
రాజుతో శ్యాంబాబు ఏం మాట్లాడుతాడు ?
శ్యాంబాబు మాటలు విన్న రాజు ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడు ?
చివరికి రాజు , మాయల పెళ్ళికి శ్యాంబాబు ఒప్పుకుంటాడా ? అనేది మిగిలిన కధనంలో తెలుస్తుంది .
ఎలా ఉంది ?
అనగనగా ఓ తండ్రికి తన గారాల కూతురు అంటే ప్రాణం . చిన్నప్పట్నుంచి తనకేది కావాలంటే అది ఏర్పాటు చేసేవాడు . ప్రాణంలా చూసుకునే తండ్రి తన ఇష్టాలను తెలుసుకుని అన్నీ అందచేసినప్పటికీ పెళ్లి విషయంలో ఆమె ఇష్టాలను పట్టించుకోడు . బలవంతంగా తన ఇష్టప్రకారమే కూతురి పెళ్లి చేయాలని అనుకుంటాడు . కానీ కూతురు తండ్రికి తెలియకుండా వేరే కులంవాడినో , వేరే మతం వాడినో ప్రేమిస్తుంది . ఈ ప్రేమ ఆ తండ్రికి ఇష్టం ఉండదు . కూతురు ప్రేమించిన వ్యక్తిని బెదిరించి వాళ్ళ ప్రేమను విడగొడతాడు . అంతేకాదు కూతురికి వేరేవాడితో పెళ్లి చేయడానికి ఏర్పాట్లు కూడా చేస్తాడు.
ఇదిలాఉండగా ఓరోజు ఆ తండ్రిమీద పాతపగలతో కొంతమంది గుండాలు అటాక్ చేస్తారు . సరిగ్గా అదే సమయానికి కూతుర్ని ప్రేమించిన వ్యక్తి వచ్చి గుండాల మూతి , ముక్కు పగలగొట్టి ప్రియురాలి తండ్రిని రక్షిస్తాడు . అప్పుడు ఆ తండ్రిలో పరివర్తన మొదలౌతుంది . తన కూతురు ప్రేమించింది జీరోని కాదు పెద్ద హీరోని అని తెలుసుకుని ఆనంద బాష్పాలు కారుస్తాడు . ఇదేసమయంలో కొన్ని సైడ్ క్యారెక్టర్లు కాబోయే అల్లుడి గురించి ఆ తండ్రి దగ్గర భారీ ఎలివేషన్లు ఇస్తారు . దాంతో ఆ తండ్రి కాబోయే అల్లుడి గడ్డం పట్టుకుని ‘ బాబూ ! మా అమ్మాయి మెడలో తాళికట్టు ‘ అని కన్నీటితో వేడుకుంటాడు . దాంతో సదరు హీరోగారు జేబులోనుంచి తాళి తీసి హీరోయిన్ మెడలో వేస్తాడు . చివరకు శుభం కార్డు పడుతుంది .
విన్నారుగా , ఇలాంటి కథలతో ఇప్పటికి ఎన్ని సినిమాలు చూసి ఉంటారు . గోదారి గట్టుపైన సినిమా కూడా ఆ తానులోని ముక్కే . కధలో కొత్తదనం లేదు .. కధనంలో కొత్తదనం లేదు . కొత్త సీసాలో పాత సారాయి టైప్ అన్నమాట . ప్రేమ కథలంటే తండ్రికి కూతురు అంటే ప్రాణం .. ఆ కూతురు కులాంతర , మతాంతర వ్యక్తితో ప్రేమలో పడటం , మధ్యలో విడిపోవడం , చివరికి కలుసుకోవడం అనే మూస ఫార్ములాలకి దర్శకులు ఫిక్స్ అయిపోయినట్టున్నారు . రాజు.. మాయల ప్రేమ కధలో కొత్తదనం ఏది ? ఇంకా పురాతన కాలంనాటి మూస కధలను ఎన్నాళ్ళు భరిస్తారు ప్రేక్షకులు?
మూస కథ .. మూస కధనం అనే విషయాలను కాసేపు మర్చిపోయి సినిమా గురించి చెప్పుకుందాం . మూవీ స్టార్టింగ్ లోనే ఆటో పోటీలు పెట్టి గోదావరోళ్ల సరదాలను సరదాగా చూపించిన విధానం బాగుంది . గోదావరి యాసను , గోదావరి అందాలను చిత్రీకరించిన విధానం కూడా బాగుంది . ముఖ్యంగా తామర కొలను దగ్గర సీనరీ ఆహ్లాదకరంగా ఉంది . హీరోయిన్ దీపం పురుగులతో ఆడుకునే సన్నివేశం ప్లెజెంట్ గా ఉంటుంది .
దర్శకుడు లవ్ స్టోరీని తెరకెక్కించేటప్పుడే ఇందులో సందేశం కూడా ఉండేలా ప్లాన్ చేసుకున్నట్టున్నాడు. అందుకే హీరో తల్లితండ్రుల పాత్రల ద్వారా మతాంతర వివాహాల గురించి చక్కటి మెసేజ్ ఇచ్చాడు .
ఇక ఫస్టాఫ్ లో హీరో , హీరోయిన్ల లవ్ ట్రాక్ లో కొన్ని సాగతీత సన్నివేశాలు ఉంటాయి . తామర కొలను దగ్గర హీరోని దగ్గరకు తీసుకున్న హీరోయిన్ ఏదో మెరుపు మెరవడంతో అంతలోనే ఏదో గుర్తొచ్చి హీరోకి దూరంగా వెళ్ళిపోతుంది . అదేమంటే మూడ్ స్వింగ్ అంటుంది . ఇలాంటి సన్నివేశాలతో ఒక్కోసారి ప్రేక్షకుల మూడ్ కూడా స్వింగ్ అవుతుంది .
దానికి తోడు హీరో పక్కన సైడ్ క్యారక్టర్ వేషం కట్టిన కమెడియన్ సుదర్శన్ కామెడీ పంచులకు నవ్వాలో .. ఏడవాలో తెలీదు . కనిపించిన ప్రతి అమ్మాయికి అతడు ప్రపోజ్ చేయడం , వాళ్ళు తిట్టడం .. ఇదే ట్రెండ్ చివరివరకు నడుస్తుంది . ఇక్కడ కామెడీ ట్రాక్ కొద్దిగా ఓవర్ అయ్యింది .
ఇక సెకండాఫ్ లో సినిమాలో రొటీన్ స్టోరీ నడుస్తుంది . హీరోయిన్ తండ్రి ప్లాన్ వల్ల ప్రేమికులు విడిపోవడం , చివరికి కలుసుకోవడం గతంలో చాలా సినిమాల్లో చూసేసాం . అయితే జగపతిబాబు షరా మాములుగా తనదైన శైలిలో నటించి మెప్పించడం మూవీకి ప్లస్ అవుతుంది . ఓవరాల్ గా కథ విషయం , కధనం విషయం గురించి పెద్దగా పట్టించుకోకుండా మూవీ చూస్తే కాసేపు సరదాగా అలా గోదారి చుట్టివచ్చినట్టు ఉంటుంది .
ఎవరెలా చేసారు ?
ఎవరెలా చేసారంటే ముఖ్యంగా ముగ్గురి గురించి చెప్పుకోవాలి . రాజు పాత్రలో సుమంత్ ప్రభాస్ చాలా ఈజ్ తో నటించాడు . అచ్చమైన గోదావరి కుర్రాడిలా సహజంగా కనిపించాడు. అతడి డైలాగ్ డెలివరీ , బాడీ లాంగ్వేజ్ , ఎక్స్ప్రెషన్స్ కూడా బావున్నాయి .
ఇక మాయ పాత్రలో నటించిన నిధి ప్రతాప్ నటన కూడా బాగుంది . పల్లెటూరి పిల్ల పాత్రలో హావభావాలు బాగానే పలికించింది .
జగపతిబాబు గురించి కొత్తగా చెప్పుకునేదేముంది ? షరా మాములుగా తన మార్క్ నటన చూపించాడు . జగపతిబాబు నటన సినిమా అంతా ఒకలా ఉంటుంది.. క్లైమాక్సులో ఇంకా బాగుంటుంది . చాన్నాళ్లకు అలనాటి హీరోయిన్ లైలకు కూడా జగపతిబాబు సరసన రోల్ దక్కింది కానీ ఆమె పాత్రకు పెద్దగా స్కోప్ ఉండదు .
మిగిలినవాళ్లు కూడా తమ పాత్రల పరిధిమేరకు బాగానే నటించారు .
సాంకేతికత
గోదారి గట్టుపైన సినిమాకి సంగీతం , సినిమాటోగ్రఫీలు ప్రాణం పోసాయి . పాటలు బాగున్నాయి . గోదావరి అందాలను టచ్ చేస్తూ సాగిన సినిమాటోగ్రఫీ పనితనం బాగుంది . నిర్మాణ విలువలు కూడా బాగానే ఉన్నాయి .
విశ్లేషణ
ఈ మూవీ గోదావరి జిల్లాల నేపథ్యంలో సాగే ఒక ప్రేమ కథ . ఎక్కువగా అంచనాలు పెట్టుకోకుండా సరదాగా చూస్తే పర్లేదు అనిపిస్తుంది . కథ , కధనం రెండూ మూసధోరణిలో ఉండటం మూవీకి మైనస్ . అయినా ఇంట్లోనే ఫ్యామిలీతో కలిసి ఓటిటిలో చూడాలనుకునేవారు అమెజాన్ ప్రైమ్ లో ఓ లుక్ వేయవచ్చు .
నటీనటులు : సుమంత్ ప్రభాస్ , నిధి ప్రతాప్ , జగపతిబాబు ,రాజీవ్ కనకాల తదితరులు
సంగీతం : నాగవంశీ కృష్ణ
నిర్మాత : అభినవ్ రావు
దర్శకత్వం : సుభాష్ చంద్ర
విడుదల : అమెజాన్ ప్రైమ్ ఓటిటి
రేటింగ్ : 2.5 / 5
