నిన్న జగిత్యాలలో బిఆర్ఎస్ నిర్వహించిన సభలో కేసీఆర్ ప్రసంగాన్ని టీవీలలో చూసిన తర్వాత నేను పరిశీలించిన కొన్ని అంశాలను ఒకసారి విశ్లేషణ చేసుకుందాం.
తెలంగాణాలో బిఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత కొంతకాలం రాజకీయ వైరాగ్యం పాటించిన కేసీఆర్ లో మొదటిసారిగా ఈ సభ ద్వారా కొన్ని మార్పులు స్పృష్టంగా కనిపించాయి.
ఈ ఆర్టికల్ ను పార్టీ విషయంలో కేసీఆర్ లో కొత్తగా కనిపిస్తున్న మార్పుల కోణంలో మాత్రమే చదువుకోగలరు.
రాజకీయనాయకులందరూ గొప్ప వక్తలు కాలేరు
కానీ చక్కటి వక్త మాత్రం గొప్ప రాజకీయ ‘ నాయకుడు ‘ అవుతాడు
ఒక వ్యక్తి మాట్లాడుతుంటే లక్షలాదిమంది జనం చెవులప్పగించి శ్రద్ధగా వింటున్నారంటే అది ఆ వక్త గొప్ప తనమే
కేసీఆర్ ఆ కోవలోకే వస్తారు.
కొందరి ఉపన్యాసాలు ఎంతసేపు కొనసాగినా వినబుద్ధి అవుతుంది
మరికొంతమంది ఉపన్యాసాలు ప్రారంభిస్తున్నారంటే భయమైతది
వక్త అసలు విషయం వదిలేసి ఏదేదో విషయాలు మాట్లాడటం శ్రోతల భయానికి అసలు కారణం.
చెప్పదలచుకున్న విషయాన్ని సూటిగా స్పృష్టంగా చెప్తూనే వినే శ్రోతలకు బోర్ కొట్టకుండా మధ్యమధ్యలో పిట్ట కథలను జోడించడం, స్థానిక అంశాలను ప్రస్తావించడం వంటి ఉపన్యాస ఫార్ములాలు ఫాలో అవడంలో కేసీఆర్ దిట్ట.
అందులో తెలంగాణా యాసను ఒడిసిపట్టుకుని మాట్లాడటంలో మిగిలిన రాజకీయ నాయకులకంటే కేసీఆర్ ముందుంటారు
కేసీఆర్ మ్యాజిక్ ఆయన ఉపన్యాసాలే.
చాలామంది మహామహులకు సాధ్యం కాని ప్రత్యేక తెలంగాణా కేసీఆర్ నాయకత్వంలో మాత్రమే సాధ్యం అయ్యిందంటే అందుకు ఆయన ఉపన్యాసాలు, పోరాట వ్యూహమే కారణాలు.
మీరు గమనించారా ?
కోవిడ్ టైమ్ లో చాలామంది జనం ఆయన ప్రెస్ మీట్ కోసం ఎదురు చూసే వాళ్ళు.
ఎందుకంటే వ్యక్తిగా కేసీఆర్ మాటల్లో కుటుంబ పెద్ద పలకరింపు ఉంటుంది.
ముఖ్యమంత్రిగా ఆయన మాటల్లో భరోసా ఉంటుంది.
ఇప్పుడీ ఉపోద్ఘాతం ఏంటి అనుకుంటున్నారా ?
నిరుడు తెలంగాణ శాసన సభకు జరిగిన ఎన్నికల్లో బిఆర్ఎస్ ఓడిపోయి రేవంత్ సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన తర్వాత రాజకీయ వైరాగ్యంతో కేసీఆర్ క్రియాశీలక రాజకీయాలను చాలావరకు తగ్గించుకుని దాదాపు ఫామ్ హౌస్ కే పరిమితం అయిన సంగతి అందరికీ తెలిసిందే.
సుదీర్ఘ విరామం తర్వాత కేసీఆర్ జగిత్యాల సభ ద్వారా జనంలోకి వచ్చారు.
సభకు ముందు ఏం జరిగింది?
జగిత్యాల సభ జీవన్ రెడ్డి అధికారికంగా బిఆర్ఎస్ లో చేరటానికి ఏర్పాటు చేసింది.
నిజానికి స్థానికంగా ఈ సభ ఏర్పాట్లను జీవన్ రెడ్డే చేసుకోవాలి.
కానీ ఈ సభ నిర్వహణ కోసం జీవన్ రెడ్డి కన్నా బిఆర్ఎస్ నేతలే ఎక్కువగా కష్టపడ్డారు.
(గతంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు ఆయన స్వయంగా ఖర్చు పెట్టుకుని ఖమ్మంలో భారీ బహిరంగ సభను నిర్వహించారు)
జగిత్యాలలో సభ ఏర్పాట్ల కోసం కేటీఆర్, హరీష్ రావు, పల్లా రాజేశ్వర రెడ్డి లాంటి నేతలు రంగంలోకి దిగారు.
ముఖ్యంగా పల్లా రాజేశ్వర రెడ్డి అయితే సభ నిర్వహణ ఏర్పాట్లు ఆసాంతం దగ్గరుండి చూసుకున్నారు.
దీన్ని బట్టి జీవన్ రెడ్డి రాకను బిఆర్ఎస్ పార్టీ ఎంత సీరియస్ గా తీసుకుందో అర్థమౌతుంది.
కేసీఆర్ ఆలోచనా ధోరణిలో మార్పు?
తుంటి ఆపరేషన్ అయిన తర్వాత కేసీఆర్ దాదాపు ఎర్రవల్లి లోని ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యారు.
అసెంబ్లీ లో హజరీ , వైద్య పరీక్షలు , సిట్ ఎంక్వైరీ సందర్భాలలో మినహా ఆక్టివ్ గా బయటకు వచ్చింది లేదు.
సిట్ ఎంక్వైరీ సమయంలో ఫామ్ హౌస్ నుంచి నంది నగర్ లోని తన స్వగృహానికి వచ్చినా మీడియాతో కానీ, కార్యకర్తలతో కానీ మాట్లాడకుండానే ఆయన రాత్రికి రాత్రి ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి వెళ్ళిపోయారు.
బిఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత పార్టీ కార్యక్రమాలను పూర్తిస్థాయిలో కేటీఆర్ నడిపించుకుంటూ వస్తున్నారు.
ఎంతమంది కార్యకర్తలు, నాయకులు అడిగినా కేసీఆర్ కాలు కదపలేదు.
మళ్ళీ ఇన్నాళ్ళకు జీవన్ రెడ్డి రాకతో ఆయన ఆక్టివ్ అయ్యారు.
జీవన్ రెడ్డిని తన ఇంటికి పిలిపించుకుని భోజనం పెట్టి రాజకీయ సమాలోచనలు చేశారు.
ఈ పరిణామాలతో బిఆర్ఎస్ నేతలే ఆశ్చర్యపోయారు.
తన కన్నబిడ్డ కవిత విషయంలో కూడా మెట్టు దిగని కేసీఆర్ జీవన్ రెడ్డి విషయంలో ఏకంగా నాలుగు మెట్లు దిగి ఆయన్ని ఆలింగనం చేసుకుని దగ్గరకు తీయడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచింది.
నిజానికి జీవన్ రెడ్డి కి జగిత్యాలలో ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటాడనే పేరు ఉన్నా ఆయన రాష్ట్ర స్థాయి నాయకుడు అయితే మాత్రం కాదు.
పార్టీలో ఈటెల రాజేందర్ వంటి సీనియర్ నేతను సైతం లెక్కచేయక బయటికి పంపిన కేసీఆర్ జీవన్ రెడ్డి లాంటి స్థానిక నేత విషయంలో మాత్రం ఎందుకు తగ్గారు? అనే ప్రశ్నలు వస్తున్నాయి.
ఇందుకు ముఖ్యమైన కారణం ఒకటే కనిపిస్తుంది.
కేసీఆర్ తగ్గారు
ఇలా తగ్గడం రాజకీయాల్లో తప్పేమీ కాదు.
ఎప్పుడు తగ్గాలో , ఎక్కడ నెగ్గాలో తెలిసినవాడే నాయకుడు అవుతాడు
సరిగ్గా కేసీఆర్ ఇప్పుడు అదే పని చేస్తున్నారు.
గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంత్రులు సైతం ఆయన్ను కలవాలంటే పరిమితులు ఉండేవి.
పార్టీలో సీనియర్ నేతలు సైతం కేసీఆర్ దరిదాపుల్లోకి వెళ్లగలిగేవారు కాదు.
ఈటెల రాజేందర్, కేశవ రావు వంటి సీనియర్ నేతలకు కూడా కేసీఆర్ ఆలింగనాలు దక్కిన సందర్భాలు అరుదు
అసలు లేకపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
కేసీఆర్ లోని ఈ ధోరణికే ప్రతిపక్షాలు అహంకారం అనే పేరు పెట్టాయి.
సరే పేరు ఏదైనా కానివ్వండి,
పార్టీలో, ప్రభుత్వంలో కేసీఆర్ మాత్రమే సుప్రీమ్, పార్టీలో నంబర్ వన్ నంబర్ టూ కూడా ఆయనే అనీ, మిగిలిన నాయకులు నామ్ కే వాస్తే అన్న సంగతి మాత్రం వాస్తవము.
అలాంటి కేసీఆర్ ద్వితీయ శ్రేణి నాయకుల పట్ల మరీ ముఖ్యంగా జీవన్ రెడ్డి విషయంలో కనిపిస్తే చాలు ఆలింగనాలతో సర్ప్రైజ్ చేస్తున్నారు.
ఫామ్ హౌస్ లో, జగిత్యాల హెలిపాడ్ వద్ద, బహిరంగ సభ తర్వాత జీవన్ రెడ్డి వరుసగా కేసీఆర్ ఆలింగనాలకు నోచుకున్నాడు.
ఇది గతానికి, ఇప్పటికీ కేసీఆర్ లో కనిపించిన స్పృష్టమైన మార్పు
కేసీఆర్ రాక
కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి జగిత్యాలకు హెలికాప్టర్ లో వచ్చారు.
ఆయనతో పాటు తెలంగాణా కవి , రచయిత దేశపతి శ్రీనివాస్, జోగినిపల్లి సంతోష్ కుమార్ లు వచ్చారు.
హెలికాప్టర్ దిగిన కేసీఆర్ కు పాదాభివందనాలు చేయడానికి నాయకులు పోటీ పడ్డారు.
అందరికీ అభివాదం చేసిన కేసీఆర్ జీవన్ రెడ్డి దగ్గరికి వచ్చి ఆయన్ని ఆలింగనం చేసుకుని కారులో సభకు బయలుదేరారు.
జగిత్యాల సభ
సభకు చేరుకున్న కేసీఆర్ అప్పటికే వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికీ అభివాదం చేస్తూ జీవన్ రెడ్డికి తమ పార్టీ నేతలను పరిచయం చేశారు.
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం జీవన్ రెడ్డికి ప్రత్యేకంగా ఆయన్ని పరిచయం చేశారు.
కేసీఆర్ స్పీచ్
మొదటిసారిగా కేసీఆర్ లో టిఆర్ఎస్ టైమ్ లో కనిపించిన జోష్ కనిపించింది.
సభకు వచ్చిన జనాల్ని చూస్తూ చాలా హుషారుగా నవ్వుతూ చేతులు ఊపారు.
అనంతరం స్థానిక కవి అలిశెట్టి ప్రభాకర్ రాసిన ఒక కవితను చదువుతూ కేసీఆర్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు.
భయపడేవాడు చీకట్లో చెట్టును చూసినా అరణ్యమని భయపడతాడు.. గుండె ధైర్యం ఉన్నోడు మాత్రం అక్కడ చెట్టును మాత్రమే చూస్తాడు అని ప్రభాకర్ రాసిన కవితను కేసీఆర్ చదవడంతో సభ ప్రాంగణం నినాదాలతో దద్దరిల్లిపోయింది.
జనాలు ఆపకుండా సీఎం సీఎం అని నినాదాలు చేస్తుండటంతో కేసీఆర్ తన ప్రసంగాన్ని ఆపి ” ఉండవయ్యా బాబూ.. వచ్చేది ఎలాగూ మన ప్రభుత్వమే.. మనం ఇంత దూరం వచ్చింది మన సమస్యల గురించి మాట్లాడుకోవడానికే కదా? స్లోగన్లు ఇస్తే పనైతదా? “అని సభికులను చూస్తూ నవ్వుతూ ప్రశ్నించి తన ప్రసంగాన్ని కొనసాగించారు
“జీవనన్న నేను నలభై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాం.. పార్టీలు వేరైనా మంచి స్నేహితులం.. జగిత్యాలలో ఎవరికి ఏ అవసరం ఉన్నా జీవన్ రెడ్డి గారు నిలబడతరు.. ఒకసారి నేను ముఖ్యమంత్రిగా కర్నూలు వచ్చినప్పుడు జీవన్ రెడ్డి గారు స్థానిక సమస్య గురించి నన్ను కలిశారు..అప్పటికప్పుడు ఆయన చెప్పిన పని చేయమని కలెక్టర్ గారికి ఆర్డర్ ఇచ్చిన.. అలా జీవన్ రెడ్డి గారు స్థానిక సమస్యల గురించి అవసరమైతే ప్రభుత్వాలతో కొట్లాడి మరీ సాధిస్తరు.. ఎమ్మెల్యేగా , ఎమ్మెల్సీగా , మంత్రిగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది.. అలాంటి మంచి మనిషి బిఆర్ఎస్ లోకి రావడం చాలా సంతోషం.. ఆయన నా దగ్గరికి వచ్చినప్పుడు మనిద్దరం పార్టీకోసం ఎట్ల పనిచేయాలంటే అన్నదమ్ముల లెక్క చేయాలే అని చెప్పిన.. ప్రజల జీవితాలు చక్కగ అవడానికి జగిత్యాల నీ వంతు, తెలంగాణా నా వంతు గా కలిసి పని చేద్దం అని చెప్పిన,
అందుకే జీవన్ రెడ్డి గారికి తక్షణమే పార్టీ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పచెపుతున్న
బిఆర్ఎస్ అధికారంలోకి వచ్చినంక ఆయనకు బ్రహ్మాండమైన పదవి ఇచ్చి గౌరవించుకుంటమ్ అని మాటిస్తున్న.
ఇక రాష్ట్రానికి పట్టిన దరిద్రం గురించి నేను ఆనాడే హెచ్చరించిన
అవేమీ పట్టించుకోకుండా కాంగ్రెసోళ్ల ఉల్టాపల్టా మాటలు నమ్మి ఆళ్లకు అధికారం అప్పగించి ఇప్పుడు బతుకులు ఆగమాగమైపోయి అసలు విషయం తెలుసుకున్నరు.
రైతు బంధుకు రామ్ రామ్ అన్నరు
దళిత బంధుకు జై భీమ్ అన్నరు
ఎవరికైనా పైసలు పడుతున్నయా?
మేము ఉన్నప్పుడు అన్నీ చక్కగా తయానికి టింగ్ టింగ్ అంటూ పైసలు వేసినమ్ కదా?
మరి వీళ్ళకు ఏమి రోగమైతది?
ఏం చెయ్యాల ?
చెప్పన్నా ఏం చెయ్యాల ?
నేను చెప్పన ?
దంచాల
కొట్లాడి దంచాలన్న.
సమైక్య రాష్ట్రంలో తెలంగాణా గురించి మాట్లాడటానికి లేక భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి.
కరెంట్ ఛార్జీలు పెంచినరు.
అడిగితే బషీర్ బాగ్ దగ్గర కాల్చి చంపినరు.
తెలంగాణా ప్రజల బతుకులు బాగు పడాలే అని నేను జెండా పట్టిన.
మహామహుల వల్ల కాలేదు.. ఈ బక్జపల్చనోడి వల్ల ఏమౌతుంది అని ఎగతాళి చేశారు.
ఏమైంది?
కొట్లాడి తెలంగాణా తెచ్చుకున్నమా ? లేదా?
పదేళ్లు మన బతుకుల్ని బాగు చేసుకున్నమా ? లేదా?
మళ్ళీ ఇప్పుడు ఈ కాంగ్రెసోళ్ళు వచ్చి మొత్తం నాశనం చేశారు
కేసీఆర్ చావాలని పిల్లి శాపాలు పెడుతున్నరు
మీ పిల్లి శాపాలకు కేసీఆర్ చస్తడా?
శ్వాస ఉన్నంతవరకు పని చేస్తూనే ఉంటడు.
కేసీఆర్ పేదలకు మూడు లక్షల ఇళ్లు కట్టిస్తే మీరు మాత్రం మూసీ పేరుతో ఇళ్ళు కూలగొడుతున్నరు.
హైదరాబాదులో హైడ్రా అంట..నిజామాబాదులో నిడ్రా అంట.. జగిత్యాలలో జడ్రా తెస్తరు.. మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే హైడ్రాని ఎత్తి చెరువులో పడేసే మొదటి ఫైల్ మీద సంతకం పెడ్త.
ఇదీ కేసీఆర్ ప్రసంగంలో ముఖ్యాంశాలు
ముగింపు
కేసీఆర్ ప్రసంగం ఆసాంతం తన ప్రభుత్వ హయాంలో చేసిన పనులు, ప్రస్తుత ప్రభుత్వంలో జరుగుతున్న పనులకు కంపారిజన్ చేస్తూ సాగింది.
ఆయన ప్రసంగంలో వ్యక్తిగతంగా రేవంత్ ను నేరుగా టార్గెట్ చేసింది చాలా తక్కువ
ఒకట్రెండు సందర్భాలలో ఇన్ డైరెక్ట్ గా చురకలు అంటించారు.
కేసీఆర్ ప్రసంగంలో ఎక్కువ భాగం ప్రస్తుత ప్రభుత్వ పని తీరును విమర్శిస్తూ సాగింది.. తను మాట్లాడాల్సిన పాయింట్లను బాగా కసరత్తు చేసుకున్నట్టున్నారు.
చెప్పదలచుకున్న విషయాలను సూటిగా స్పృష్టంగా ఎటువంటి తడబాటులు లేకుండా చెప్పారు.
అయితే టిఆర్ఎస్ ను బిఆర్ఎస్ జాతీయ పార్టీగా మార్చిన కేసీఆర్ తన ఆలోచన విషయంలో ఒక అడుగు వెనక్కి తగ్గినట్టుగా కనిపిస్తుంది.
ఎప్పుడైతే పార్టీ పేరులో తెలంగాణాను తీసి పక్కన పడేసారో అప్పుడే ప్రజలు తెలంగాణా నుంచి తనని పక్కన పడేశారని ఆయనకు ఇప్పుడు అర్థమైనట్టుంది.
అందుకే జాతీయ రాజకీయాల గురించి కానీ, ప్రస్తుతం జరుగుతున్న బెంగాల్, తమిళనాడు ఎన్నికల గురించి కానీ ఒక్క మాట మాట్లాడలేదు.
గతంలో ఇదే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో బీజేపీకి ప్రత్యామ్నాయంగా బిఆర్ఎస్ పార్టీ పేరుతో తమిళనాడులో డీఎంకే పార్టీ నేతలతోనూ, బెంగాల్ లో మమతా బెనర్జీ వంటి నేతలతోనూ మంతనాలు జరిపిన విషయం అందరికీ తెలిసిందే.
కానీ ఈ సభలో మాత్రం ఆయన జాతీయ రాజకీయాల ఊసెత్తలేదు.
ఎంతసేపూ ఒకటికి పదిసార్లు గతంలో మాదిరి తెలంగాణా పేరును జపించారు.
దీన్నిబట్టి తిరిగి సెంటిమెంట్ అస్త్రాన్ని ఆయన బయటికి తీయబోతున్నారని అర్థమౌతుంది.
ఈమధ్య కేటీఆర్ కూడా తమ పార్టీ పేరును తిరిగి టీఆర్ఎస్ గా మార్చే ఆలోచన పరిశీలిస్తున్నామని చెప్పడం కేసీఆర్ ప్రసంగ ధోరణిలో మార్పును సూచిస్తుంది.
ఇదిలా ఉండగా ఈ సభ కేసీఆర్ లో జోష్ నింపింది అనటానికి త్వరలో తెలంగాణ భవన్ లో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయం తీసుకోవడమే ఉదాహరణ.
చూద్దాం.. కేసీఆర్ మళ్ళీ ఆక్టివ్ పాలిటిక్స్ లోకి దిగితే తెలంగాణా రాజకీయాలు ఎలాంటి మలుపులు తీసుకుంటాయో వేచిచూద్దాం!

బావుంది విశ్లేషణ