కాళిదాస్ 2 ( అమెజాన్ ప్రైమ్ ) మూవీ రివ్యూ – అదిరిపోయే క్లైమాక్స్ ట్విస్ట్

Spread the love

భరత్ హీరోగా 2019 లో థియేటర్ రిలీజ్ అయిన కాళిదాస్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ హిట్ కొట్టింది . ఈ సినిమాకి సెంథిల్ దర్శకత్వం వహించాడు . కాళిదాస్ మూవీ మంచి వసూళ్లను రాబట్టడంలో దర్శకుడు సెంథిల్ దానికి సీక్వెల్ కూడా ప్లాన్ చేసి 2026 ఏప్రిల్ మూడవతేదీన కాళిదాస్ 2 విడుదల చేసాడు . మొదటిభాగం మాదిరే సీక్వెల్ కూడా హిట్ టాక్ తెచ్చుకుంది .

దాంతో ఈ నెల 12 అమెజాన్ ప్రైమ్ లో తెలుగు డబ్బింగ్ వెర్షన్లో స్ట్రీమింగ్ కి వచ్చింది .
ఓటిటిలో కూడా కాళిదాస్ 2 మంచి రేటింగ్ సాధించి దూసుకుపోతుంది . గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో పాటు ఊహించని ట్విస్టులు ఈ మూవీ రేటింగ్ కి కారణాలు . సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ జానర్లో ప్రేక్షకులు ఊహించని ట్విస్టులు కోరుకుంటారు . తరువాతి సన్నివేశంలో ఏం జరుగుతుందా ఉత్కంఠతతో ఎదురుచూసేలా మూవీ ఉండాలి . సాధారణంగా క్రైమ్ థ్రిల్లర్ జానర్ మూవీల కధలన్నీ అన్నీ నేరపరిశోధన ఆధారంగా ఉంటాయి . అన్ని కధల్లో నేరం ముందే జరుగుతుంది కానీ నేరస్తుడు మాత్రం క్లైమాక్సులోనే రివీల్ అవుతాడు . ఈలోపు రకరకాల అనుమానితుల చుట్టూ కథ నడపాలి . అప్పుడే సస్పెన్స్ డ్రామా పండుతుంది .

కాళిదాస్ 2 మూవీ ఆ కోవలోకే వస్తుంది . ఇప్పుడు మూవీ ఎలా ఉందో చూద్దాం .

కధేంటంటే ?

ఏడు సంవత్సరాల క్రితం ఒక కేసుకు సంబంధించి కోర్టులో లాయర్ నటరాజ్ ( ప్రకాష్ రాజ్) వాదనలు వినిపించటంతో మూవీ మొదలౌతుంది .

కట్ చేస్తే ,

షుమారు 500 ఫ్లాట్లు ఉన్న ఓ గేటెడ్ కమ్యూనిటీలో మూడున్నరేళ్ల పాప మిస్ అయినట్టు పోలీసులకు కంప్లైంట్ వస్తుంది . ఈ కేసును పరిశోధించటానికి ఇన్స్పెక్టర్ కాళిదాసు ( భరత్) గేటెడ్ కమ్యూనిటీ అపార్టుమెంటుకు వెళ్తాడు . డిసెంబర్ 31 అర్ధరాత్రి కావడంతో గేటెడ్ కమ్యూనిటీలో ఈవెంట్ ఏర్పాటుచేస్తారు . అందరూ ఈవెంట్ సెలెబ్రేషన్లో ఉన్న సమయంలో మిత్ర అనే పాప మిస్ అయినట్టు తెలుస్తుంది . పాప కోసం పోలీసులు .. అపార్ట్మెంట్ సెక్రెటరీ రూప ( సంగీత మాధవన్ నాయర్ ) సాయంతో అక్కడ గాలించినా దొరకదు . చివరకు ఒకచోట కుక్కపిల్లను చంపిపడేయడం గమనిస్తారు . ఆ వెంటనే అపార్ట్మెంట్ సమీపంలోనే సూట్ కేసులో పాప శవం దొరుకుతుంది .

ఈ ఇన్వెస్టిగేషన్లోనే ఇన్స్పెక్టర్ కాళిదాసు పాపకు కుక్కపిల్లలు అంటే ఇష్టమని తెలుసుకుంటాడు . ఆ కోణంలో అతడు దర్యాప్తు చేయడంతో అదే అపార్టుమెంటులో ఉండే స్టీపెన్ అనే యువకుడు కుక్కపిల్లను పెంచుకుంటున్నట్టు తెలుసుకుంటాడు . పాప అతడితో వెళ్లినట్టు రూప చెప్పడంతో పోలీసులు స్టీపెన్ మీద అనుమానపడతారు . అందులో స్టీపెన్ మీద అప్పటికే రేప్ కేసుతో పాటు మర్డర్ కేసు కూడా ఉండటంతో పాపను అతడే హత్య చేసి ఉంటాడని భావిస్తారు . ఈలోపు అదే అపార్ట్మెంట్ స్విమ్మింగ్ పూల్ లో పడి ఇంకో అమ్మాయి కూడా చనిపోవడంతో ఏసిపి వైష్ణవి ( భవాని శ్రీ ) కూడా రంగంలోకి దిగుతుంది .

ఏసిపి వైష్ణవి స్టీపెన్ మీద అనుమానంతో అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకుని విచారణ మొదలుపెడుతుంది . సరిగ్గా అదే సమయంలో సీనియర్ లాయర్ నటరాజ్ వచ్చి స్టీపెన్ తన జూనియర్ లాయరని .. అతడికి ఈ క్రైమ్ కి సంబంధం లేదని .. ఏమన్నా ఎవిడెన్సులు ఉంటే చూపాలని ఏసిపితో వాదనకు దిగుతాడు . అతడ్ని వదిలేయడానికి ఏసిపి ఒప్పుకోకపోవడంతో లాయర్ నటరాజ్ పై అధికారులతో ఆమెకు ఫోన్ చేయించి స్టీపెన్ ను విడుదల చేసి తీసుకుపోతాడు . దాంతో స్టీపెన్ ఈ హత్య చేసాడని ఆధారాలు సంపాదించేందుకు ఏసిపి ప్రయత్నాలు మొదలుపెడుతుంది .

ఇంతకీ పాపను హత్య చేసింది ఎవరు ?
స్టీపెన్ కు , పాప హత్యకు సంబంధం ఏంటి ?
కిల్లర్ ను పట్టుకోవడానికి ఏసిపి వైష్ణవి , ఇన్స్పెక్టర్ భరత్ చేసిన ప్రయత్నాలు ఫలిస్తాయా ? అనేది మిగిలిన కధనంలో తెలుస్తుంది .

ఎలా ఉంది ?

క్రైమ్ థ్రిల్లర్ జానర్ మూవీల్లో ఏం ఉండాలి ? సస్పెన్స్ ఉండాలి . నేరం జరిగిందని తెలుసు .. బాధితులు ఎవరో తెలుసు .. కానీ నేరస్తుడు ఎవరో తెలీదు .. పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టినప్పుడు చాలామంది అనుమానితుల్లా కనిపిస్తారు . ఎంతోమంది నిరపరాధుల మీద అనుమానపడే పరిస్థితులు వస్తాయి . కానీ వీరిలో అసలు నేరస్తుడు ఎవరో గుర్తించడం ఎలా ? నేరస్తులను పట్టుకుని న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టాలంటే సాలిడ్ ఎవిడెన్సులు కావాలి కదా? .. అందుకే నేరపరిశోధనలో ఎవిడెన్సులు అనేది కీలకం .. ఎవిడెన్సులు లేనిదే ఏమీ చేయలేని పరిస్థితి ఉంటుంది . అదే గ్రౌండ్స్ లో లాయర్ నటరాజ్ స్టీపెన్ ను పోలీసులనుంచి విడిపించుకుని వెళ్లడం వాస్తవ పరిస్థితిని అద్దం పడుతుంది .

గేటెడ్ కమ్యూనిటీలో జరిగిన పాప మర్డర్ కేసును దర్శకుడు చాలా తెలివిగా నడిపించాడు . పోలీసులు స్టీపెన్ మీద అనుమానపడినప్పుడు మనం కూడా అతడి మీదే అనుమానపడతాం . దానికి తగ్గట్టుగా అతడి ప్రవర్తన కూడా అలాగే ఉంటుంది . దాదాపు ఫస్టాఫ్ అంతా స్టీపెన్ చుట్టూనే తిరుగుతుంది . ఏసిపి కూడా స్టీపెనే పాపను మర్డర్ చేసి ఉంటాడని కన్ఫర్మ్ అయిపోయి అతడ్ని పట్టుకోవడానికి ఎవిడెన్సుల కోసం వెతుకుతూ ఉంటుంది . కానీ ఇన్స్పెక్టర్ భరత్ మాత్రం ఈ హత్య స్టీపెన్ చేసి ఉండడని భావించడంతో అసలు హంతకుడు ఎవరనే క్యూరియాసిటీ ప్రేక్షకులలో కలుగుతుంది .

ఇక సెకండాఫ్ నుంచి పోలీసులు డాక్టర్ ప్రసన్న మీద అనుమానపడటంతో కథ మలుపు తిరుగుతుంది. దానికి తగ్గట్టుగా డాక్టర్ ప్రసన్న న్యూ ఇయర్ వేడుకల్లో ముఖానికి మాస్క్ వేసుకుని ఉండటంతో అతడే హంతకుడు అయి ఉంటాడని భావిస్తాం .

ఇలా ఫస్టాఫ్ లో పాప హత్యకేసుతో ప్రారంభమైన మర్డర్ మిస్టరీ రకరకాల అనుమానితుల చుట్టూ తిరుగుతూ ఉత్కంఠతను పెంచుతుంది . సెకండాఫ్ లో ఒకటొకటిగా చిక్కుముడులను విప్పుతూ క్లైమాక్సులో దర్శకుడు అసలైన ట్విస్ట్ ఇచ్చి ముగిస్తాడు . ఈ సినిమాకి బలం క్లైమాక్స్ ట్విస్టులే .

ఓవరాల్ గా ఈ మూవీలో ఫస్టాఫ్ స్లోగా నడుస్తుంది . దానికి తోడు అనవసరమైన సాగతీత సన్నివేశాలు కొన్ని బోర్ కొట్టిస్తాయి . సెకండాఫ్ మాత్రం కధనం చకచకా పరుగులు పెడుతుంది . ఈ మూవీ కోసం దర్శకుడు కొంత సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నట్టున్నాడు . అంత పెద్ద గేటెడ్ కమ్యూనిటీలో 32 సిసి కెమెరాలే ఉండటం హంతకుడు దొరక్కుండా ఉండటానికి దర్శకుడు అల్లిన ప్లాట్ మాదిరి ఉంది . ఈ రోజుల్లో పోలీసులు ఇన్వెస్టిగేషన్లో సాంకేతికతను బాగా ఉపయోగిస్తున్నారు . కానీ పాప హత్య కేసులో పోలీసులు సాంకేతికతను ఉపయోగించినట్టు ఎక్కడా ఉండదు .

ఎవరెలా చేసారు ?

కాళిదాస్ పాత్రలో భరత్ బాగానే చేసాడు . ఇక ఆ ఏసిపి వైష్ణవి క్యారక్టర్ అనవసరంగా ఇరికించినట్టున్నారు . ఆమె పాత్ర వల్ల ఉపయోగం ఏంటో తెలీదు . ఈ పాత్రలో భవాని శ్రీ నటన పర్లేదు .

ఇక ఇందులో మనకు తెలిసిన నటులు ఇద్దరు ఉన్నారు . వారిలో లాయర్ నటరాజ్ పాత్ర పోషించిన ప్రకాష్ రాజ్ ఒకరు కాగా , పోలీస్ కమిషనర్ పాత్ర పోషించిన రాజా రవీంద్ర మరొకరు . ఈ ఇద్దరికీ సినిమాలో ఫుల్ లెన్త్ రోల్ లేదు .. అయినా కనిపించినంతలో బాగానే చేసారు .

వీరి తర్వాత అపార్ట్మెంట్ సెక్రటరీ రూప పాత్ర పోషించిన సంగీత మాధవన్ నాయర్ క్యారక్టర్ కీలకం .. ఈమెకు మంచి స్కోప్ ఉన్న పాత్ర దక్కింది . పాత్రకు తగ్గట్టుగా చక్కటి పెర్ఫార్మన్స్ ప్రదర్శించింది .
మిగిలినవాళ్లు తమ పాత్రల పరిధిమేరకు బాగానే చేసారు .

సాంకేతికత

శ్యామ్ సీఎస్ అందించిన సంగీతం బావుంది .
సురేష్ బాల అందించిన సినిమాటోగ్రఫీ కూడా బాగానే ఉంది .. నిర్మాణ విలువలు పర్లేదు .

విశ్లేషణ

మీరు క్రైమ్ థ్రిల్లర్ జానర్ మూవీలు ఇష్టపడతారా ? అయితే ఓ లుక్కేయండి . మీరు ఆశించిన గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే .. ట్విస్టులు ఉంటాయి . పాప మర్డర్ కేసుతో మొదలైన పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఆద్యంతం క్రైమ్ థ్రిల్లర్ మోడ్ లో సాగుతుంది . స్టీపెన్ , డాక్టర్ ప్రసన్న.. ఇలా కొంతమంది మీద అనుమానం వచ్చేలా మొదట్లో కధనం నడిపి క్లైమాక్సులో అసలు నేరస్తులను రివీల్ చేసిన విధానం బాగుంది .

కాకపోతే ఫస్టాఫ్ లో కొన్ని సాగతీత సన్నివేశాలు బోర్ కొట్టిస్తాయి . అది కాస్త భరించి సెకండాఫ్ లోకి వెళ్తే కధనం పరుగులు పెట్టి ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది . అన్నిటికన్నా ముఖ్యమైనది ఈ క్లైమాక్స్ చాలామంది ఊహించి ఉండరు . అదే ఈ సినిమాకి ప్లస్ అవుతుంది . దాదాపు సినిమా అంతా ఆ అపార్ట్మెంట్ చుట్టూనే తిరుగుతుంది . అక్కడక్కడే కొన్ని పాత్రల చుట్టూ కథ నడిపి అనుమానం వచ్చేలా చేసి చివరికి క్లైమాక్స్ ట్విస్టుతో ముగించిన విధానం థ్రిల్ పంచుతుంది .

అమెజాన్ ప్రైమ్ లో తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా అందుబాటులో ఉంది కాబట్టి సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ ఇష్టపడేవాళ్లు చూడొచ్చు .

నటీనటులు : భరత్ , సంగీత మాధవన్ నాయర్ , భవాని శ్రీ , ప్రకాష్ రాజ్ , రాజారవీంద్ర తదితరులు
సంగీతం : శ్యామ్ సీఎస్
సినిమాటోగ్రఫీ : సురేష్ బాల
నిర్మాత : యోగేశ్వరన్
దర్శకత్వం : సెంథిల్
విడుదల : అమెజాన్ ప్రైమ్
రేటింగ్ : 2.75 / 5


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!