ధనుష్ నటించిన సస్పెన్స్ మూవీ కర తమిళనాడులో థియేటర్ రిలీజ్ అయి బాక్సాఫీస్ కలెక్షన్లు సాధించింది . ఈ రోజు నుంచి ( మే 28 నుంచి ) నెట్ ఫ్లిక్స్ ఓటిటిలోకి తెలుగు డబ్బింగ్ వెర్షన్లో స్ట్రీమింగ్ కి వచ్చింది . ఓటిటి ప్లాట్ ఫార్మ్ లో కూడా కర మంచి రేటింగ్ సాధించింది .
తమిళంలో కొన్ని బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు చేసి తక్కువ సినీ కెరీర్ సమయంలోనే సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు హీరో ధనుష్ . తమిళంలోనే కాదు తెలుగులో కూడా ఇతడు చక్కటి అభిమానులను సంపాదించుకున్నాడు . కుబేర సినిమాలో బిచ్చగాడి పాత్రలో ధనుష్ నటనను తెలుగు ప్రేక్షకులు మర్చిపోలేరు . ఆ మూవీలో కొన్ని సన్నివేశాలు చూస్తే ధనుష్ ను మర్చిపోయి నిజంగా బిచ్చగాడేమో అనుకుంటాం . తమిళంలో మంచి స్టార్ డమ్ ఉన్నప్పటికీ కుబేరలో బిచ్చగాడి పాత్రకోసం ధనుష్ డంప్ యార్డులో దుర్గంధాన్ని భరిస్తూ గంటలతరబడి షూటింగులో పాల్గొన్నాడు . అతడెంత డెడికేటెడ్ గా నటిస్తాడో కుబేర మూవీ చూస్తే ఎవరికైనా అర్ధమౌతుంది .
ఇప్పుడు కర మూవీ ఎలా ఉందో చూద్దాం .
కధేంటంటే ?
కథ ప్రారంభమే 1990 లలో కరస్వామి ( ధనుష్ ) ఎమ్మెల్యే ఇంట్లో దొంగతనం చేయడానికి ప్రయత్నించడంతో ప్రారంభం అవుతుంది . ఆ ఇంట్లో దొంగతనం చేయడానికి అతడి మిత్రుడు మురుగేషన్ కూడా వస్తాడు . అంటే తోడుదొంగలు అన్నమాట . దాంతో ఈ మూవీలో హీరో దొంగ అని అనుకుంటాం . కానీ ఆ ఇంటి తాళం పగలగొట్టేముందు కరస్వామి చెప్పిన మాటలబట్టి మారిన దొంగ అనుకోవాల్సి వస్తుంది .
ఎందుకంటే తాళం పగలగొట్టేముందు కరస్వామి తన స్నేహితుడిని ఉద్దేశించి ఇది నీకు మొదటి దొంగతనం .. నాకు చివరి దొంగతనం కాబట్టి నువ్వే తాళం పగలగొట్టు అని అతడికే పని అప్పచెబుతాడు . ఇద్దరూ ఇంట్లో జొరబడి దొంగతనం చేసి డబ్బులు ,బంగారం మూటకట్టుకునే సమయంలో ఎమ్మెల్యే తిరిగిరావడంతో భయపడి మురుగేషన్ కరస్వామిని ఒక్కడినే వదిలేసి పారిపోతాడు . దాంతో పోలీసులు కరస్వామిని అరెస్ట్ చేసి లాకప్పులో పెడతారు .
అయితే ఈ కేసును పరిశోధించే బాధ్యత తనకు అప్పగించవల్సిందిగా డిఎస్పీ భరతన్ (సూరజ్ వెంజరమూడు ) పై అధికారులను ప్రాధేయపడి ఒప్పిస్తాడు . రిటైర్మెంట్ కు దగ్గరగా ఉండటంతో ఈ కేసులో లేనిపోనివి క్రియేట్ చేసి ఏదైనా సెన్సేషన్ చేసి పోలీస్ రికార్డులు బద్దలుకొట్టాలనేది డిఎస్పీ ఆలోచన .
ఈ విషయం తెలుసుకున్న కరస్వామి లాకప్ నుంచి పారిపోయి ప్రేమించి పెళ్లాడిన మల్లి ( మమితా బైజు ) తో కలిసి ఒక హోటల్లో సప్లయర్ గా పనిచేస్తూ ఉంటాడు . అదే సమయంలో సొంతంగా హోటల్ పెట్టుకోవాలని ప్లాన్ చేసి లోన్ కోసం బ్యాంక్ మేనేజర్ ను కలుస్తాడు . ష్యురీటీ ఉంటేనే లోన్ ఇస్తానని బ్యాంక్ మేనేజర్ చెప్పడంతో ఎనిమిది ఎకరాల పొలం కాగితాల కోసం చాన్నాళ్ళతర్వాత విలేజ్ లో ఉన్న తండ్రి కందస్వామిని ( కేఎస్ రవికుమార్ ) ను కలుస్తాడు .
కానీ అక్కడ అతడికి ఒక కొత్త విషయం తెలుస్తుంది . అనుకోని పరిస్థితుల్లో కరస్వామి తిరిగి దొంగతనాలు చేయాల్సివస్తుంది . దొంగతనం చేయడానికి పంచవన్ యూనియన్ బ్యాంకును ఎంచుకుంటాడు . మరోపక్క డీఎస్పీ భరతన్ ఇతడ్ని వెతుక్కుంటూ బయలుదేరుతాడు .
విలేజ్ కి వెళ్లి తండ్రిని కలిసిన కరస్వామికి ఏం తెలుస్తుంది ?
కరస్వామి దొంగతనం చేయడానికి పంచవన్ యూనియన్ బ్యాంకునే ఎందుకు ఎంచుకుంటాడు ?
చివరికి డిఎస్పీ భరతన్ కరస్వామిని పట్టుకుంటాడా ? అనేది మిగిలిన కధనంలో తెలుస్తుంది .
ఎలా ఉంది ?
చిన్నప్పుడు రాబిన్ హుడ్ కధలు చదువుకున్నాం కదా ? ఉన్నవాళ్లను కొల్లగొట్టి లేనివాళ్లకు పంచిపెట్టడం రాబిన్ హుడ్ క్యారక్టర్ నైజం . నిజానికి ఇలాంటి కధాంశంతో గతంలో చాలా సినిమాలు వచ్చాయి . ఆ పాయింటునే దర్శకుడు చిన్నచిన్న మార్పులతో ఇళ్లల్లో దొంగతనాలు చేసే ఒక చిన్నదొంగని చివరికి రాబిన్ హుడ్ లా మార్చేస్తాడు .
సరే అది ఓకే కానీ బ్యాంక్ లోన్లు తీసుకున్న రైతుల తరపున హీరో పోరాడి న్యాయం చేసే ప్లాట్ ఆల్రెడీ మహేష్ బాబు సినిమాలో చూసేసాం . ఇందులో కూడా రైతులు బ్యాంకులో లోన్లు తీసుకోవడం , వడ్డీలు కట్టలేక చేతులు ఎత్తేయడం , హీరో రంగంలోకి దిగి దొంగతనం చేసి మరీ వాళ్ళ అప్పులను తీర్చడం అనే కాన్సెప్ట్ సరిగా పొసగదు . లోన్లు ఎగ్గొట్టిన రైతుల మీద బ్యాంకులు లీగల్ గా వెళ్తే , హీరో మాత్రం అదే బ్యాంకులో దొంగతనాలు చేసి రైతుల లోన్లు తీర్చడం అనే కాన్సెప్ట్ లోనే కథ పట్టుతప్పింది .
ఫస్టాఫ్ లో కరస్వామి దొంగతనం చేసి పోలీసులకు దొరికిపోవడం , మళ్ళీ అక్కడ్నుంచి పారిపోయి ప్రేమించిన ప్రియురాలిని పెళ్లిచేసుకుని ఒక హోటల్లో సప్లయర్ గా పనిలో చేరడం , భార్యని కష్టపెట్టకుండా ఉండటం కోసం సొంతంగా హోటల్ పెట్టుకునే ఆలోచన చేయడం వంటి సన్నివేశాలు ఉంటాయి .
ఎప్పుడైతే కరస్వామి విలేజ్ లో ఉన్న తండ్రిని కలుస్తాడో అప్పట్నుంచి కధలో సంఘర్షణ మొదలౌతుంది . తండ్రి కూడా ట్రాక్టర్ కొనడం కోసం పొలం కాగితాలు తాకట్టు పెట్టి బ్యాంకులో లోన్ తీసుకున్నాడని తెలియడంతో కథ బ్యాంకుల చుట్టూ తిరుగుతుంది . పనిలోపనిగా బ్యాంకులు రైతులకు లోన్లు ఇచ్చి ఏ విధంగా పీడిస్తాయో చెప్పడంతో పాటు బ్యాంకింగ్ లోపాల మీద దర్శకుడు దృష్టి పెట్టాడు .
ఇక సెకండాఫ్ అంతా బ్యాంక్ చుట్టూ , కరస్వామి దొంగతనాల చుట్టూ తిరుగుతుంది . మధ్యలో డిఎస్పీ భరతన్ చేసే హడావుడి ఎలాగూ ఉంటుంది . స్టోరీని పూర్తి క్రైమ్ మోడ్ లో రన్ చేయకుండా దర్శకుడు సెకండాఫ్ లో తండ్రీ కొడుకుల ఎమోషనల్ బాండింగ్ చుట్టూ తిప్పడంతో కథ ఫ్యామిలీ ఆడియన్స్ కు కనెక్ట్ అవుతుంది .
అనుకోని పరిస్థితుల్లో తండ్రి మరణించడంతో ఆయన ఆఖరి కోరిక తీర్చడానికి ధనుష్ తిరిగి దొంగగా మారే పరిస్థితులను కన్విన్సింగ్ గా మలిచారు . ఎప్పుడైతే ధనుష్ తిరిగి దొంగగా మారి దొంగతనాలు చేయడం మొదలుపెడతాడో అప్పుడు కధనం మళ్ళీ క్రైమ్ మోడ్ లోకి టర్న్ అవుతుంది . ఈ మధ్యలో డీఎస్పీ భరతన్ ఇతడ్ని పట్టుకోవడానికి ప్లాన్ వేయడాలు , బ్యాంక్ రీజినల్ మేనేజర్ ( జయరాం ) కరస్వామిని కలిసి తన బ్యాంకులో దొంగతనాలు చేయమని ప్రోత్సహించడం , మేనమామ , స్నేహితుడితో కలిసి కరస్వామి దొంగతనాలకు ప్లాన్ చేయడం వంటి సన్నివేశాలతో కధనం చకచకా పరుగులు పెడుతుంది .
కానీ ఇంతాచేసి దర్శకుడు సినిమాని ముగించడంలో తడబడ్డాడు . రైతులు అప్పులు చేసి తీర్చకపోతే బ్యాంకులో దొంగతనం చేసి వాళ్ళ అప్పులు తీర్చడం అనేది దర్శకుడు ఏ లాజిక్ ప్రకారం తీసాడో అర్ధం కాదు . కుబేరలో ప్రభుత్వాలను మోసం చేసిన ఘరానా మోసగాళ్ల నుంచి డబ్బులు దొంగతనం చేసి సాటి బిచ్చగాళ్లకు పంచాలని బిచ్చగాడు ధనుష్ అనుకుంటాడు . ఇందులో కొంత జస్టిఫికేషన్ ఉంది . కానీ బ్యాంకులో దొంగతనం చేసి ఆ డబ్బులతో రైతుల అప్పులు తీర్చడం ఏ రకంగా జస్టిఫికేషన్ అవుతుందో దర్శకుడు సరిగా వివరించలేకపోయాడు .
ఆ డిఎస్పీ హడావుడి దేనికో ఎవరికి అర్ధం కాదు . మాటిమాటికి సిగరెట్ వెలిగించుకోవడం మినహా ఆ పాత్ర ఉపయోగం పెద్దగా కనిపించదు . ఇతడికన్నా ఆ బ్యాంక్ రీజినల్ మేనేజర్ పాత్ర బాగా డిజైన్ చేసారు .
ఇటువంటి కొన్ని లోపాలను పక్కనబెడితే కర మూవీ ఒక ఫ్లోలో సాగిపోతుంది . మధ్యమధ్యలో వచ్చిన కొన్ని సాగతీత సన్నివేశాలు మినహా సినిమా పెద్దగా బోర్ కొట్టదు .
ఎవరెలా చేసారు ?
ధనుష్ నటనలో గొప్పతనం ఏంటంటే సహజత్వం ఉంటుంది . ఎక్కడా మేకప్ హడావుడి ఉండదు . పాత్ర స్వభావాన్ని బట్టి డీ గ్లామర్ రోల్ లో కూడా ఒదిగిపోతాడు . ఈ మూవీలో కూడా ఎక్కడా మనకు ధనుష్ కనిపించడు . కేవలం కరస్వామి మాత్రమే కనిపిస్తాడు . ఇళ్లల్లో చిల్లర దొంగతనాలు చేసే ఒక చిన్న దొంగ కనిపిస్తాడు . ఏదో ఒక హోటల్ పెట్టుకుని కష్టపడి సంపాదించి భార్యని సంతోషపెట్టాలనుకునే సామాన్యుడు కనిపిస్తాడు .
ఇక హీరోయిన్ మమిత బైజు పాత్రకు పెద్దగా స్కోప్ లేదు . నిజానికి కరస్వామి ఆమె కోసమే జీవితంలో చక్కగా సెటిల్ అవ్వాలని అనుకుంటాడు . ఆ పాత్రని ఇంకొంచం స్కోప్ ఉండేవిధంగా తీర్చిదిద్ది ఉంటే బాగుండేది . అయినా పాత్ర పరిధిమేరకు ఆమె నటన బాగుంది .
ఇక ఈ సినిమాలో చెప్పుకోదగ్గ మరో ముఖ్యపాత్ర కందస్వామి . ధనుష్ తండ్రిగా కేఎస్ రవికుమార్ చక్కటి పెర్ఫార్మన్స్ ప్రదర్శించాడు . సూరజ్ వెంజరమూడి నటన పర్లేదు . బ్యాంక్ రీజినల్ మేనేజర్ పాత్రలో జయరాం నటన బాగుంది .
సాంకేతికత
జీవీ ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం బాగానే ఉంది . ముఖ్యంగా బ్యాంక్ రాబరీ సన్నివేశాల్లో ఉత్కంఠతను పెంచే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు .
ఈశ్వర్ అందించిన సినిమాటోగ్రఫీ కూడా బాగుంది .
నిర్మాణవిలువలు కూడా బాగానే ఉన్నాయి .
విశ్లేషణ
కథ పూర్తిగా క్రైమ్ థ్రిల్లర్ మోడ్ లో కొనసాగుతూనే ఎమోషనల్ సెంటిమెంట్ బాండింగ్ లో ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా కనెక్ట్ అవుతుంది . ధనుష్ దొంగతనాలు చేయడం , డీఎస్పీ భరతన్ ఇన్వెస్టిగేషన్ చేయడం వంటి సన్నివేశాలు మనకు సస్పెన్స్ థ్రిల్లింగ్ పంచుతాయి.
విలేజ్ నేపథ్యం , రైతులు , తండ్రి కొడుకుల బాండింగ్ వంటి సన్నివేశాలు మనల్ని టచ్ చేస్తాయి . తండ్రికి అంత్యక్రియలు చేసే విషయంలో ధనుష్ పడే ఆవేదన కంట తడి పెట్టిస్తుంది . తండ్రి ఆఖరి కోరిక తీర్చడం కోసం తప్పనిపరిస్థితుల్లో అతడు తిరిగి దొంగతనాలు చేయాల్సిరావడం కన్విన్సింగ్ గానే చూపించిన దర్శకుడు.. హీరో దొంగతనాలు చేసి మరీ రైతుల అప్పులు తీర్చడం అనే విషయంలో సరైన జస్టిఫికేషన్ చూపించలేక తడబడ్డాడు . నిజానికి ఆ లాజిక్ మనకు కూడా వెంటనే డైజెస్ట్ కాదు . ఈ ఒక్క పాయింట్ స్టోరీని వీక్ చేస్తుంది .
ఓవరాల్ గా ఈ సినిమాకి ధనుష్ వన్ మ్యాన్ ఆర్మీ అవుతాడు . మొత్తం సినిమాని తన భుజాల మీద వేసుకుని నడిపించాడు . నెట్ ఫ్లిక్స్ ఓటిటి లో తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా అందుబాటులో ఉంది కాబట్టి సస్పెన్స్ జానర్ ఇష్టపడేవారు ఈ మూవీని చూడొచ్చు .
నటీనటులు ; ధనుష్ , మమిత బైజు , సూరజ్ వెంజరమూడు , కేఎస్ రవికుమార్ , జయరాం తదితరులు
సంగీతం : జీవీ ప్రకాష్ కుమార్
సినిమాటోగ్రఫీ : ఈశ్వర్
దర్శకత్వం : విగ్నేష్ రాజా
విడుదల : నెట్ ఫ్లిక్స్ ఓటిటి
రేటింగ్ : 3 / 5
