Headlines

Iratta ( ఇరట్టా ) మలయాళం క్రైమ్ థ్రిల్లర్ (OTT) మూవీ రివ్యూ

Spread the love

క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు తీయడంలో మలయాళం దర్శకులు ఒక అడుగు ముందే ఉంటారు . అందులోనూ మూవీ స్టార్టింగ్ నుంచి క్లైమాక్స్ వరకు గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో ప్రేక్షకులను ఉత్సుకతతో చూసేలా చేయడంలో మలయాళ దర్శకులది వినూత్న శైలి .

థియేటర్ రిలీజ్ రోజుల్లో మలయాళం సినిమాలు స్థానికంగానే కలెక్షన్లు సంపాదించుకునేవి . కానీ ఓటీటీలు వచ్చిన తర్వాత మలయాళం సినిమాల మార్కెట్ పెరిగింది . ఇతర భాషా ప్రేక్షకులు కూడా ఓటీటీల్లో వెతుక్కుని మరీ మలయాళం సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీలు చూస్తున్నారు . ఇందుకు ప్రధాన కారణం గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే .. ఆశ్చర్యపరిచే ట్విస్టులు . మలయాళ క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్లో దర్శకులు ఈ రెండు ఫార్ములాలను ఖచ్చితంగా ఫాలో అవుతారు . అసలు క్లైమాక్స్ ట్విస్టుతోనే బాక్సాఫీస్ కలెక్షన్లు బద్దలుకొట్టిన మలయాళ మూవీలు కూడా ఉన్నాయి .

ఇరాట్ట మూవీ కూడా అటువంటిదే . 2023 లోనే కేరళ థియేటర్లలో రిలీజ్ అయి బాక్సాఫీస్ కలెక్షన్లు సాధించింది . తర్వాత ఓటిటిలో కూడా దూసుకుపోయి మంచి రేటింగును సొంతం చేసుకుంది . నెట్ ఫ్లిక్స్ లో తెలుగు డబ్బింగ్ వెర్షన్లో అందుబాటులో ఉండటంతో తెలుగు ప్రేక్షకులు మూవీని చూసి మంచి రేటింగ్ ఇచ్చారు . క్రైమ్ థ్రిల్లర్ జానర్ ఇష్టపడేవారికి ఈ మూవీ మంచి ఛాయిస్ . అందుకే ఇప్పటివరకు ఈ మూవీని చూడనివారికోసం ఈ రివ్యూ .

అన్నట్టు ఇరట్టా అంటే తెలుగులో ఇద్దరు అని అర్ధం . ఈ కథ మొత్తం కవలలైన ఇద్దరు అన్నదమ్ముల చుట్టూ తిరుగుతుంది కాబట్టి మలయాళంలో ఆ టైటిల్ పెట్టినట్టున్నారు .

ఇప్పుడు మూవీ ఎలాఉందో చూద్దాం .

కధేంటంటే ?

కేరళలోని వాగమాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ అధికారులు అటవీ శాఖ మంత్రిగారితో ఓ కార్యక్రమం ప్రారంభించటానికి ఏర్పాట్లు చేస్తూ ఉంటారు . అందుకే డిపార్ట్మెంట్ కు చెందిన ఉన్నతాధికారులు స్వయంగా అక్కడి ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ ఉంటారు. కార్యక్రమానికి మంత్రిగారు కూడా వస్తున్నారు కాబట్టి పెద్దఎత్తున మీడియా కూడా అక్కడికి చేరుకుంటుంది .

మరొపక్కన ఈ స్టేషన్ కు ఆనుకుని ఉన్న చిన్న గ్రౌండ్లో ఇద్దరు చిన్నపిల్లలు క్రికెట్ ఆడుకుంటూ ఉంటారు . ఈలోపు మంత్రిగారు బయలుదేరినట్టు సమాచారం రావడంతో పోలీస్ అధికారులు అలర్ట్ అవుతారు . సరిగ్గా అదే సమయంలో పోలీస్ స్టేషన్ లోపలినుంచి కాల్పుల శబ్దం వినిపించడంతో పోలీసులు ఉలిక్కిపడి లోపలికి పరిగెడతారు . లోపల గదిలో ఏఎస్సై వినోద్ ( జోజు జార్జ్ ) రక్తపు మడుగులో నేలమీద పడి ఉంటాడు . ఆ సమయంలో ఆ గదిలో ఏఎస్సై , హెడ్ కానిస్టేబుల్ , కానిస్టేబుల్ మొత్తం ముగ్గురు ఉంటారు .

ఊహించని ఈ పరిణామానికి కంగారుపడిన పోలీస్ అధికారులు ఆ ముగ్గురినీ అనుమానితులుగా భావించి ఇన్వెస్టిగేషన్ మొదలుపెడతారు . విచిత్రం ఏంటంటే ఆ ముగ్గురుకీ హత్య చేయబడిన వినోద్ తో వ్యక్తిగత గొడవలు ఉంటాయి . ఒక కేసు విషయంలో వినోద్ కి ఏఎస్సై కి గొడవలు అవుతాయి . తనకి తెలియకుండా తన కూతుర్ని బైక్ మీద ఎక్కించుకుని ఇంటిదగ్గర దింపాడని ఇంకో కానిస్టేబుల్ వినోద్ తో గొడవ పడతాడు . లాడ్జ్ లో వినోద్ తాగేసి ఒక అమ్మాయిని రేప్ చేయడంతో మూడో కానిస్టేబుల్ కూడా అతడితో గొడవ పడతాడు . ముగ్గురికీ వినోద్ తో గొడవలు ఉన్నాయి కానీ ఈ హత్య తాము చేయలేదని అంటారు .

దాంతో పోలీసులు వినోద్ కావాలా సోదరుడు డిఎస్పీ ప్రమోద్ ను ( జార్జ్ జోజ్ ) పిలిపిస్తారు. అప్పటికే భార్య తన కూతుర్ని తీసుకుని విడిగా వెళ్లిపోవడంతో ప్రమోద్ డిప్రెషన్ లో ఉంటాడు . ఈ సమయంలో అతడు తమ అన్నదమ్ముల గతాన్ని గుర్తుచేసుకుంటాడు . ప్రమోద్ పరిశీలనలో కూడా హంతకుడు ఎవరనేది తెలియదు . ఈ పరిస్థితుల్లో పోలీస్ ఉన్నతాధికారులు ప్రమోద్ మీద కూడా అనుమానపడటంతో , కిల్లర్ ఆచూకీ కనుక్కోవడానికి అతడు స్వయంగా ఇన్వెస్టిగేషన్ మొదలుపెడతాడు .

ప్రమోద్ ఇన్వెస్టిగేషన్లో ఏం తేలుతుంది ?
వినోద్ చనిపోవడానికి కారణం ఎవరు ?
చివరకు ప్రమోద్ ఈ హత్య కేసులో చిక్కుముడిని ఎలా విప్పుతాడు ? అనేది మిగిలిన కధనంలో తెలుస్తుంది .

ఎలా ఉంది ?

సాధారణంగా క్రైమ్ థ్రిల్లర్ జానర్ మూవీలనుంచి ప్రేక్షకులు ఏం కోరుకుంటారో ఆ ఎలిమెంట్స్ ఇందులో పుష్కలంగా ఉంటాయి . మూవీ స్టార్టింగులోనే తుపాకీ కాల్పులతో ఏఎస్సై మరణించడంతో ఏం జరిగిందో అనే క్యూరియాసిటీ ప్రేక్షకులకు కలుగుతుంది . ఆ వెంటనే ముగ్గురు పోలీసులను అనుమానితులుగా భావించి ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టడంతో ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది . ఆ ముగ్గురుకీ వినోద్ తో గొడవలు ఉంటాయి కానీ ఈ హత్య తాము చేయలేదని చెప్పడంతో ఉత్సుకత కలుగుతుంది . దర్శకుడు ఫస్టాఫ్ చాలా తెలివిగా ప్లాన్ చేసాడు . ముందు పోలీసుల మీద అనుమానం వచ్చేలా కథ అల్లుకున్నాడు . వినోద్ తో ఈ ముగ్గురికీ జరిగిన వేరువేరు అనుభవాలతో కిల్లర్ ఈ ముగ్గురిలో ఒకరు అయి ఉంటారని అనుకుంటాం . కానీ ప్రమోద్ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టి లాకప్ లో ఉన్న వ్యక్తి ఈ హత్య చేసి ఉండవచ్చని భావించి ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టడంతో కిల్లర్ అతడే అయ్యుంటాడని భావిస్తాం .

ఇలా ఫస్టాఫ్ లో ఒక మర్డర్ , కొందరు అనుమానితులు , పోలీసుల ఇన్వెస్టిగేషన్ పార్టులను దర్శకుడు గ్రిప్పింగ్ తో ప్రెజెంట్ చేసాడు . దాదాపు ఫస్టాఫ్ అంతా ఊపిరిసలపని ఇన్వెస్టిగేషన్ మోడ్ లో కధనం నడుస్తుంది .

ఇక సెకండాఫ్ వచ్చేసరికి వినోద్ ఫ్లాష్ బ్యాక్ రూపంలో మనకు కొన్ని సాగతీత సన్నివేశాలు తగులుకుంటాయి . అతడు మాలిని ( అంజలి ) వెంటపడటం , చిన్న లవ్ ట్రాక్ నడపడం , హీరోలా ఫీలయ్యి రేబాన్ కళ్ళజోడు పెట్టుకుని పాట పాడుకోవడం , మందు తాగడం , సిగరెట్ వెలిగించుకోవడం వంటి సన్నివేశాలతో మన సహనానికి పరీక్ష పెడతాడు . పోలీస్ స్టేషను , మర్డర్ కేస్ ఇన్వెస్టిగేషన్ కాసేపు గాల్లో కలిసిపోతాయి . అంటే వినోద్ గతాన్ని చూపించటానికి దర్శకుడు మాగ్జిమమ్ టైమ్ తీసుకున్నాడు . ఫస్టాఫ్ లో ఇన్వెస్టిగేషన్ పార్టును చకచకా నడిపిన దర్శకుడు సెకండాఫ్ లో మాత్రం స్లో నేరేషన్ తీసుకున్నాడు .

ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేయడానికి ప్రమోద్ స్వయంగా రంగంలోకి దిగడంతో కథలో మళ్ళీ ఉత్కంఠత పెరుగుతుంది . ఆఖరి ముప్పై నిమిషాల ట్విస్టులే సినిమాకి ఊపిరి పోశాయి . ఒకదానివెంబడి ఒకటిగా సాగిన ట్విస్టులతో దర్శకుడు ప్రేక్షకులను పరుగులు పెట్టించాడు . ఇక క్లైమాక్స్ ట్విస్ట్ అనేది ఎవరూ ఊహించనివిధంగా ఉండటం సినిమాకి హైలెట్ అవుతుంది .

కాకపోతే పోలీస్ అధికారులందరూ యూనిఫారంలతో ఉంటే డిఎస్పీ ప్రమోద్ మాత్రం లుంగీతో తిరుగుతూ ఉంటాడు . పైగా ఇతడు వస్తుంటే పై అధికారి ఎవరో మనకు తెలియక కన్ఫ్యూజ్ అవుతాం . అందరూ ఇతడికి శాల్యూట్ కొట్టేవాళ్లే కానీ ఇతడు ఎవరికీ శాల్యూట్ కొట్టడు . అతడు సెలవులో ఉన్నాడో , డ్యూటీలో ఉన్నాడో , లేకపోతే రిటైర్ అయ్యాడో తెలియక కన్ఫ్యూజ్ అవుతాం . ఒకవేళ డ్యూటీలో ఉన్నాడు అనుకుంటే కనీసం ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేసేటప్పుడైనా అతడు యూనిఫార్మ్ వేసుకుంటే బాగుండేది . మినిష్టర్ దగ్గరికి కూడా సివిల్ డ్రెస్ లోనే రావడం వంటి కొన్ని సన్నివేశాలు అతిగా ఉంటాయి .
ఇటువంటి కొన్ని చిన్నచిన్న లోపాలు మినహా కధనం గ్రిప్పింగ్ గానే సాగుతుంది .

ఎవరెలా చేసారు ?

ద్విపాత్రాభినయంలో జోజు జార్జ్ బాగానే చేసాడు . పాత్ర ప్రభావమో ఏంటో తెలీదు కానీ వినోద్ పాత్రలో జోజు జార్జ్ నటన ఓవర్ గా ఉంది . ఇక మన తెలుగు అమ్మాయి అంజలికి ప్రధాన పాత్ర దక్కింది కానీ మాటల్లేవు కాబట్టి చెప్పుకోవడానికి ఏమీ లేదు . అయినా హావభావాలను బాగానే ప్రదర్శించింది .

సాంకేతికత

జెక్స్ బిజోయ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాని నిలబెట్టింది . క్రైమ్ థ్రిల్లర్ సినిమాకి కావాల్సిన బీట్లు అన్నీ ఏరికోరి ప్రయోగించేసాడు .
విజయ్ అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది . ముఖ్యంగా తేయాకు తోటల వంటి కేరళ పచ్చదనాన్ని మరింత అందంగా చూపించాడు .
సినిమా మొత్తం దాదాపు పోలీస్ స్టేషన్ చుట్టూనే తిరుగుతుంది కాబట్టి బడ్జెట్ కూడా పెద్దగా అయ్యుండదు . అయినా నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి .

విశ్లేషణ

క్రైమ్ థ్రిల్లర్ జానర్ మూవీలు చాలామంది ఇష్టపడతారు . దానికి తోడు గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఉంటే ఆ కిక్కు వేరు . ఈ మూవీలో అటువంటి కిక్కు ఉంది . మధ్యలో వినోద్ ఫ్లాష్ బ్యాక్ పేరిట వచ్చే సన్నివేశాలు కొద్దిగా మనల్ని విసిగిస్తాయి కానీ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలు మాత్రం థ్రిల్ పంచుతాయి . స్టార్టింగ్ ఒక మర్డర్ తో స్టార్ట్ చేసి .. అందులో కొంతమంది అనుమానితులను చేర్చి మనల్ని డైవర్ట్ చేసి .. అసలు హంతకుడు ఎవరో తెలియక మనల్ని డైలమాలో పడేసి .. ఆఖరికి అది హత్య కాదు ఇంకోటి అని ట్విస్ట్ ఇచ్చి దర్శకుడు స్టోరీ లైన్ జాగ్రత్తగా పేర్చుకుంటూ వెళ్ళాడు .

క్లైమాక్స్ వరకు స్టోరీ మర్డర్ కోణంలోనే సాగుతుంది . మనం కూడా అలాగే అనుకుంటాం . కానీ ఆఖరి ముప్పై నిమిషాల్లో మన ఊహాగానాలను పటాపంచలు చేస్తూ దర్శకుడు ముగించిన విధానం ఆశ్చర్యం కలిగిస్తుంది . మన తెలుగు అమ్మాయి అంజలి కూడా ఒక లీడ్ రోల్ లో ప్లే చేసింది కానీ ఆమెకు డబ్బింగ్ తో పనిలేకుండా డైలాగులే పెట్టలేదు . ఫైనల్గా ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ ఓటిటిలో తెలుగు డబ్బింగ్ వెర్షన్లో కూడా అందుబాటులో ఉంది కాబట్టి లాంగ్వేజ్ ప్రాబ్లమ్ కూడా లేకుండా చూడొచ్చు .

నటీనటులు : జోజు జార్జ్ , అంజలి తదితరులు
సంగీతం : జెక్స్ బిజోయ్
సినిమాటోగ్రఫీ : విజయ్
దర్శకత్వం : రోహిత్ కృష్ణన్
విడుదల : నెట్ ఫ్లిక్స్ ఓటిటి
రేటింగ్ : 3 / 5


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!