Headlines

Oru Durooha Saahacharyathil మలయాళం సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ (OTT) రివ్యూ

Spread the love

ఏప్రిల్ 15 న థియేటర్లలో రిలీజ్ అయిన Oru Durooha Saahacharyathil మలయాళం సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ మిక్సెడ్ రెస్పాన్స్ తెచ్చుకుని ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చింది . ఈ మూవీలో మలయాళ నటుడు కుంచకో బోబన్ నటించాడు . కుంచకో బోబన్ మలయాళంలో చక్కటి నటుడిగా తనను తాను ఎప్పుడో ప్రూవ్ చేసుకున్నాడు . కాకపోతే ఈ సీరియస్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీలో కుంచకో కామెడీ రోల్ ప్లే చేసి ప్రేక్షకులను నవ్వించటానికి ప్రయత్నించాడు .

నిజానికి దర్శకుడు మిస్టీరియస్ పరిస్థితుల ప్రభావం అనే పాయింట్ ఆధారంగా స్టోరీ లైన్ అల్లుకున్నాడు . మాములు మనిషిని కూడా పరిస్థితుల ప్రభావం టెర్రరిస్టుగా మారుస్తాయి అనే పాయింట్ ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నించాడు . అయితే కధనం మొత్తాన్ని సీరియస్ లైన్లో నడిపించకుండా కామెడీ ట్రాక్ కూడా జొప్పించడంతో రెండు జానర్లు సమాంతరంగా నడిపించినట్టు అయ్యింది .

ఇప్పుడు మూవీ ఎలా ఉందో చూద్దాం .

కధేంటంటే ?

మలయాళం సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాల్లో దర్శకులు ఫాలో అయ్యే ఎంట్రీ క్రైమ్ సన్నివేశంతోనే ఈ సినిమా కూడా మొదలౌతుంది . చందాల కోసం ఓ రిసార్ట్ దగ్గరికి మావోయిస్టులు వచ్చారనే సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకొని కాల్పులు జరుపుతారు . ఈ కాల్పులలో నలుగురు మావోయిస్టులు చనిపోగా ఒకరు తప్పించుకుని పోతారు .

కట్ చేస్తే ,

సేతు ( కుంచకో బోబన్ ) కేరళలోని వయనాడ్ లో ఓ ఆరోగ్యకేంద్రంలో పనిచేస్తూ ఉంటాడు . చాలా పిరికివాడు .. భయస్తుడు .. తన భయానికి కారణం తెలుసుకోవడానికి సైక్రియాట్రిస్టును కూడా కలుస్తాడు . క్రైమ్ మూవీస్ , క్రైమ్ వార్తలు చూడటం మానేస్తే ఆ భయాలు ఆటోమేటిగ్గా పోతాయని సైక్రియాట్రిస్టు సలహా ఇస్తాడు . అనారోగ్యంతో గతాన్ని మర్చిపోయి మంచాన పడిన తన అన్న మధుకు ( దిలీష్ పోతన్ ) కూడా సేతు సేవలు చేస్తుంటాడు . సేతుకి అన్న అంటే ప్రాణం . కానీ ఆ అన్న మాత్రం గతంలోనే ఉండిపోయి చనిపోయిన తన అంకుల్ మార్కోస్ ఇంకా బతికే ఉన్నాడని ఊహించుకుంటూ మాట్లాడుతుంటాడు .

ఈ పరిస్థితుల్లో అనుకోకుండా ఓ అపరిచితుడు సేతు ఇంట్లో జొరబడతాడు . కాలికి గాయం ఉండటంతో పాటు చేతిలో పిస్టల్ కూడా ఉండటంతో ఆ అపరిచితుడ్ని చూసి సేతు అతడు మావోయిస్టు అయ్యుంటాడని అనుమానిస్తాడు . అతడు తన పేరు రాజేంద్రప్రసాద్ ( సాజిన్ గోపు ) అని మాత్రమే చెప్పి తన వివరాలు ఏమీ చెప్పడు . కానీ అతడి కాలికి గాయం అవడంతో సేతు జాలిపడి తన ఇంట్లో ఆశ్రయం ఇస్తాడు . అతడు వచ్చినదగ్గర్నుంచి సేతు జీవితంలో అనూహ్య మార్పులు ఏర్పడతాయి .

అనుకోని పరిస్థితుల్లో ఇంటి ఎదురుగా ఉండే నంబియార్ చనిపోవడం , కాల్పుల్లో తప్పించుకున్న మావోయిస్టు కోసం పోలీసులు వెతకడం ప్రారంభించడంతో సేతు చిక్కుల్లో పడతాడు . వరుసకు కజిన్ అయిన పోలీస్ ఆఫీసర్ ఆర్మియాస్ ( చిదంబరం ) సేతు ఇంట్లో మావోయిస్టు ఉన్నాడని అనుమానపడతాడు . ఆ అనుమానంతోనే అతడు సేతు ఇంటికి వెళ్తాడు . కానీ అనుమానాస్పద స్థితిలో సేతు అన్న మధు మరణిస్తాడు .


అన్న మరణంతో సేతు ఏం చేస్తాడు ?
మధు మరణానికి కారకులు ఎవరు ?
సేతు ఇంట్లో దాక్కున్న రాజేంద్రప్రసాద్ ఎవరు ? అతడు నిజంగా మావోయిస్తేనా ? అనేది మిగిలిన కధనంలో తెలుస్తుంది .

ఎలా ఉంది ?

ఈ సినిమాలో దర్శకుడు కామెడీ జానర్ , సైకలాజికల్ థ్రిల్లర్ జానర్ లను రెండు భాగాలుగా విడగొట్టి ప్రెజెంట్ చేసాడు . ఫస్టాఫ్ లో సేతు భయాలు , గతాన్ని మర్చిపోయి మార్కోస్ , మార్కోస్ అంటూ అన్న చేసే హడావుడి , సేతు అన్న మధు అరుపులకు తాను ఎక్కడ దొరికిపోతానో అని రాజేంద్రప్రసాద్ కంగారు పడే సన్నివేశాలను హ్యూమరస్ గా చూపించారు. సేతు అన్న మధు కమల్ హాసన్ హార్డ్ కోర్ అభిమాని కావడం , టీవీలో కమల్ హాసన్ సినిమాలు వస్తే ఫుల్ వాల్యూమ్ పెట్టుకుని చూడటం , అన్న సంతోషం కోసం సేతు కూడా మార్కోస్ చనిపోయిన విషయం దాచిపెట్టి ఒక్కోసారి తానే మార్కోస్ మాదిరి నటించడం వంటి సన్నివేశాలతో ఫస్టాఫ్ సరదాగా సాగిపోతుంది .

ఇక సెకండాఫ్ లో మాత్రం స్టోరీ సైకలాజికల్ థ్రిల్లర్ మోడ్ లోకి టర్న్ తీసుకుంటుంది. మధు గతాన్ని మర్చిపోవడం వెనుక కల కారణాలను , తన ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ను , సేతు .. రాజేంద్రప్రసాద్ తో చెప్తూ రివీల్ చేస్తాడు . ఇక రాజేంద్రప్రసాద్ ఫ్లాష్ బ్యాక్ కూడా తెలిసిన తర్వాత అతడి క్యారక్టర్ ఏంటో మనకు తెలుస్తుంది .

తన అన్న మధు మరణించిన సన్నివేశంలో కుంచకో బోబన్ ఏడుస్తూ రైఫిల్ ను భుజాన వేసుకుని మార్కోస్ మాదిరి నటిస్తూ చేసే అభినయం అద్భుతంగా ఉంది . ఈ సన్నివేశంలో అతడి నటన వసంత కోకిల మూవీలో క్లైమాక్స్ సన్నివేశంలో కమల్ హాసన్ చేసిన అభినయాన్ని పోలి ఉంటుంది . సినిమాకి ఈ సన్నివేశమే హైలెట్ అవుతుంది .

అన్న మరణంతో సేతులో వచ్చిన మార్పులను క్లైమాక్సులో పర్ఫెక్ట్ గా డిజైన్ చేసారు . అప్పటిదాకా టీవీ క్రైమ్ వార్తలు చూస్తేనే భయపడే సేతు టీవీ వార్తల హెడ్ లైన్స్ లోకి వచ్చే విధంగా కొత్త మైండ్ సెట్ తో కనిపిస్తాడు . పరిస్థితుల ప్రభావం అతడిలోని భయాలను పోగొట్టి పోరాడేవిధంగా తీర్చి దిద్దుతాయి . రొటీన్ క్లైమాక్స్ సన్నివేశమే అయినా ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్ చేసిన విధానం బాగుంది .

కాకపోతే ఫస్టాఫ్ లో కొన్ని సాగతీత సన్నివేశాలు మనల్ని విసిగిస్తాయి . జాఫర్ క్యారక్టర్ ఎందుకు పెట్టారో అర్ధం కాదు . సరిహద్దుల్లో కాపలా కాసే సైనికుడి మాదిరి సేతు ఇంటి ఎదురుగా నంబియార్ చెక్ పోస్ట్ వేసుకుని రైఫిల్ తో కాపలా కాయడం ఎబ్బెట్టుగా ఉంటుంది. ఫస్టాఫ్ లో సేతు లవ్ ట్రాక్ నడుస్తుంది . సెకండాఫ్ గాల్లో కలుస్తుంది . ఆ లవ్ ట్రాక్ కు ఓ ముగింపు ఇవ్వకుండానే వదిలేసారు .
ఓవరాల్ గా ఫస్టాఫ్ కొంత సాగతీత ఉంటుంది .. సెకండాఫ్ అసలు కధనం నడుస్తుంది .

ఎవరెలా చేసారు ?

ఈ సినిమాలో కుంచకో బోబన్ , దిలీష్ పోతన్ పోటీపడి నటించారు . సేతు పాత్రలో భయాలను ప్రదర్శించడంలోనూ , అమాయకత్వం , మంచితనం ప్రదర్శించడంలోనూ కుంచకో బోబన్ పూర్తి న్యాయం చేసాడు . ముఖ్యంగా అతడి అన్న మధు మరణించిన సన్నివేశంలో కుంచకో బోబన్ ప్రదర్శించిన హావభావాలు బాగున్నాయి

ఇక మధు పాత్రలో హెలుషినేషన్ ప్రభావంతో మార్కోస్ , మార్కోస్ అంటూ అరవడం , కమల్ హాసన్ సినిమాలు చూస్తూ రన్నింగ్ కామెంట్రీ చేయడం , రాజేంద్రప్రసాద్ ను విసుక్కోవడం వంటి సన్నివేశాలతో దిలీష్ పోతన్ చక్కటి పెర్ఫార్మన్స్ చూపించాడు .
వీళ్ళ తర్వాత చెప్పుకోదగ్గ పాత్ర పోలీస్ ఆఫీసర్ మారియస్ ది . ఆ పాత్రలో చిదంబరం నటన బాగుంది .

సాంకేతికత

డాన్ విన్సెంట్ అందించిన సంగీతం బాగుంది .
అర్జున్ సేతు అందించిన సినిమాటోగ్రఫీ కూడా పర్లేదు .
నిర్మాణ విలువలు ఒక మాదిరిగా ఉన్నాయి .

విశ్లేషణ

సైకలాజికల్ థ్రిల్లర్ మూవీలు ఇష్టపడేవారు ఓ లుక్ వేయొచ్చు . ఫస్టాఫ్ మేజర్ షేర్ కామెడీ పోర్షన్ ఆక్యుపై చేసినా తెలుగు ప్రేక్షకులకు ఎంతవరకు ఎక్కుతుందో తెలీదు . ఎందుకంటే సస్పెన్స్ , థ్రిల్లర్ జానర్ ఉన్నంత ఎఫెక్టీవ్ గా మలయాళం కామెడీ జానర్ మూవీలు ఉండవు . ఒకవేళ ఉన్నా తెలుగు నేటివిటీ ఉండదు కాబట్టి మనకు అంతగా కనెక్ట్ కాదు . ఇక సెకండాఫ్ పోర్షన్ సైకలాజికల్ థ్రిల్లర్ మోడ్ లోకి టర్న్ అవుతుంది కాబట్టి మూవీ మీద కొంత ఇంట్రెస్ట్ బిల్డప్ అవుతుంది . కధలో కొత్తదనం లేకపోయినా కధనం తో నడిపించి దర్శకుడు మూవీని పర్లేదు అనిపించాడు . సినిమా మావోయిస్టుల ఎన్కౌంటర్ తో మొదలుపెట్టడంతో ఇదేదో నక్సల్స్ స్టోరీ అనుకుంటాం . కానీ అనుకోని పరిస్థితుల్లో నిరపరాధులు కూడా పోలీస్ ట్రాప్ లో ఎలా చిక్కుకుంటారో అన్న కోణంలో కధనం సాగుతుంది . కొన్ని సన్నివేశాలు తెలుగులో భానుచందర్ నటించిన నిరీక్షణ సినిమాని గుర్తుచేస్తుంది . రాజకీయాల్లో భాగంగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ను , ప్రతిపక్ష నాయకుడిని చూపించడం బాగుంది కానీ సినిమా రిలీజ్ అయ్యేసరికి వారి స్థానాలు అటూఇటూ అయ్యాయి . ఇంట్లోనే ఓటిటిలో చూడాలనుకుంటే వన్ టైం వాచ్ కింద ఈ మూవీని ప్రయత్నించవచ్చు . కాకపోతే ఈ మూవీని నెట్ ఫ్లిక్స్ ఓటిటిలో మలయాళం వెర్షన్లో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో చూడాలి .

నటీనటులు : కుంచకో బోబన్ , దిలీష్ పోతన్ తదితరులు
సంగీతం : డాన్ విన్సెంట్
సినిమాటోగ్రఫీ : అర్జున్ సేతు
నిర్మాత : కుంచకో బోబన్ , లిస్టిన్ స్టీపెన్
దర్శకత్వం : రతీష్ బాలకృష్ణన్ పోడ్వాల్
విడుదల : నెట్ ఫ్లిక్స్ ఓటిటి
రేటింగ్ : 2.5 / 5


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!