Headlines

కోల్డ్ కేస్ (cold case) క్రైమ్ , హర్రర్ మూవీ (OTT) రివ్యూ

Spread the love

2021 లోనే మలయాళంలో రిలీజ్ అయిన కోల్డ్ కేస్ క్రైమ్ , హర్రర్ మలయాళం మూవీ అమెజాన్ ప్రైమ్ ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతూ మంచి రేటింగ్ సాధించింది . సాధారణంగా సస్పెన్స్ , క్రైమ్ , హర్రర్ , థ్రిల్లర్ జానర్ మూవీలకు ప్రత్యేకంగా కొంత ఆడియన్స్ బేస్ ఉంటుంది . అందులోను మలయాళం మూవీలకు ఇంకొంచం ఎక్కువమంది ఆడియన్స్ ఉంటారు . ఎందుకంటే పైన చెప్పిన జానర్లలో ఎక్కువ సినిమాలు మలయాళం వారివే ఉంటాయి . అందుకే ఈ జానర్ ఇష్టపడేవారు ప్రత్యేకంగా ఓటిటి ల్లో వెతుక్కుని మరీ చూస్తున్నారు . అందుకే ఇప్పటికీ ఈ మూవీ చూడనివారికోసం ఈ రివ్యూ .

ఈ సినిమా ప్రత్యేకత ఏంటంటే క్రైమ్ స్టోరీని , హర్రర్ స్టోరీని మిక్స్ చేసి చివరివరకు దర్శకుడు సమాంతరంగా నడిపించాడు . అంటే ఒకరకంగా కధలో సైన్స్ కు , శాస్త్రీయతకు ప్రాధాన్యత ఇస్తూనే రెండు వెర్షన్లను చూపించాడు . తాంత్రిక శక్తులను మూఢ నమ్మకాలను నమ్మని పోలీస్ ఆఫీసర్ ఒకవైపు , తాంత్రిక శక్తులను నమ్మకపోయినప్పటికీ అనుకోకుండా నమ్మే పరిస్థితుల మధ్య ఇరుక్కుపోయిన ఓ జర్నలిస్ట్ .. ఇద్దరూ ఒకే హత్యకేసు గురించి పరిశోధనలు చేస్తున్న సమయంలో చిత్రమైన అనుభవాలను ఎదుర్కుంటారు .

అందుకే దర్శకుడు క్లైమాక్స్ సన్నివేశంలో కూడా స్పృష్టత ఇవ్వకుండా సైన్స్ , ముద్ర నమ్మకాలలో ఏది నిజమో మీరే తేల్చుకోండి అన్నట్టుగా ప్రేక్షకుల ఆలోచనకే ముగింపు వదిలేసాడు .
ఇప్పుడు కోల్డ్ కేస్ మూవీ ఎలా ఉందో చూద్దాం .

కధేంటంటే ?

సినిమా ప్రారంభమే దర్శకుడు మూఢ నమ్మకాల గురించి టచ్ చేస్తాడు . జీవించి ఉన్న వ్యక్తులలో ఆత్మలు జొరబడి తాము చేయాల్సిన పనులు చేస్తాయని సింబాలిక్ గా చూపిస్తాడు . ఉదాహరణకు ఒక బాలుడి శరీరంలో ఆత్మ జొరబడి అతడి తండ్రిని చంపినవారెవరో తనకు తెలుసని చెప్తుంది . అయితే ఈ మూఢ నమ్మకాలకు ఎటువంటి శాస్త్రీయత లేదని , వీటి ఆధారంగా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయలేరని ఒక అనలిస్ట్ ద్వారా చెప్పిస్తారు .

ఇదిలా ఉండగా అసలు కథ ఒక జాలరి చెరువులోని చేపల కోసం వల విసిరినప్పుడు అతడి వలలో ఒక పుర్రె చిక్కుతుంది . దాంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. ఎవరో హత్య చేసి పుర్రెను చెరువులో పడేసి పోయారని భావిస్తారు . ఈ కేసును ఏసిపి సత్యజిత్ ( పృథ్విరాజ్ సుకుమారన్ ) కు అప్పగిస్తారు .

ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టిన ఏసిపి సత్యజిత్ ఆ పుర్రెకు ఊడిపోకుండా మిగిలిపోయిన దంతం కోణంలో పరిశోధన మొదలుపెడతాడు . ఫోరెన్సిక్ ల్యాబ్ లో ఆ పుర్రె ముప్పై సంవత్సరాల యువతిదిగా గుర్తిస్తారు . దాంతో కేరళలో మిస్సింగ్ అయిన యువతుల జాబితా తెప్పించి చూస్తే వారిలో ఫైనల్ గా 37 మంది మిస్సింగ్ కేసులు తేల్తాయి .

మరోపక్క భర్తతో విడిపోయి కూతురితో కలిసి జీవిస్తున్న మిర్రర్ మీడియా జర్నలిస్ట్ పద్మజ కూడా ఈ కేసును సొంతంగా ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెడుతుంది . అయితే ఆమె కూతురుతో కలిసి ఒక అద్దె ఇంట్లో దిగిన తర్వాత ఆమెకు విచిత్రమైన అనుభవాలు ఎదురౌతాయి . హఠాత్తుగా ఒక కుక్క ఇంట్లోకి జొరబడి అరవడం , రాత్రి పూట గదిలో మంచం కిందికి నీళ్లు చేరుకోవడం , ఫ్రిడ్జ్ లోనుంచి వింత శబ్దాలు రావడం వంటి సంఘటనలతో ఆమె సముద్రం ఒడ్డున నివసిస్తున్న తాంత్రిక పూజల గురించి అవగాహన ఉన్న ఒక కళ్లులేని మహిళను సహాయం అడుగుతుంది .

ఆమె పద్మజ ఇంటికి వచ్చి పరిశీలించిన తర్వాత ఇంట్లో ఒక ఆత్మ తిరుగుతుందని గుర్తిస్తుంది . తనకున్న విద్యతో ఆ ఆత్మ పేరు ఈవా మరియా అని తేలుస్తుంది . మరోపక్క ఏసిపి సత్యజిత్ ఇన్వెస్టిగేషన్లో కూడా హతురాలు ఈవా మరియా అని తేలుతుంది . అయితే అతడికి లభించిన ఆధారాల ప్రకారం ఈవా మరియా బతికే ఉండొచ్చని పోలీసులు భావిస్తారు .

ఇంతకీ ఈ ఈవా మరియా ఎవరు ?
కిల్లర్ ఆమెను ఎందుకు హత్య చేసారు ?
అసలు కిల్లర్ ఎవరు ? అనేది మిగిలిన కధనంలో తెలుస్తుంది .

ఎలా ఉంది ?

సాధారణంగా క్రైమ్ థ్రిల్లర్ మూవీల్లో స్టోరీ లైన్ అంతా నేరం – శిక్ష అనే సింపుల్ పాయింట్ ఆధారంగా నడుస్తుంది . కానీ కోల్డ్ కేస్ స్టోరీ లైన్ వేరు . కధలో ఒక పోలీస్ ఆఫీసర్ ద్వారా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ నడిపిస్తూనే , మరోపక్క ఒక జర్నలిస్ట్ ద్వారా తాంత్రిక శక్తులు , దయ్యాలు , ఆత్మల గురించి టచ్ చేయడంతో ఒకే టికెట్ మీద రెండు సినిమాలు చూసిన ఫీలింగ్ వస్తుంది . అయితే ఈ రెండూ కధలో భాగంగా సమాంతరంగా నడిపించడంతో మనకు కధనంలో వేరు , వేరు ట్రాకులు విడిపోయినట్టు అనిపించదు . ఈ విషయంలో దర్శకుడు చాలా తెలివిగా హ్యాండిల్ చేసాడు .

ఫస్టాఫ్ లో పుర్రె దొరకడం , కేసును ఏసిపి సత్యజిత్ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టడం , అదే సమయంలో జర్నలిస్ట్ పద్మజ కూడా ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టడం , అద్దె ఇంట్లో ఆమెకు విచిత్రమైన అనుభవాలు ఎదురవ్వడం వంటి సన్నివేశాలతో సాగిపోతుంది . అయితే మలయాళం సినిమాల్లో ఉండే స్లో నేరేషన్ ఇందులో కూడా ఉంది . కథతో సంబంధం లేకుండా జర్నలిస్ట్ విడాకుల గోల ఇరికించి ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టారు . అలా అని ఆ జర్నలిస్ట్ ఫ్లాష్ బ్యాక్ రివీల్ చేయరు . ఆమె కూతుర్ని తీసుకుని విడిగా ఉండటం , ఆమె అమ్మమ్మ మనవరాలి కోసం వెంటబడటం , విడాకుల కోసం జర్నలిస్ట్ ఆ లాయర్ చుట్టూ తిరగడంతోనే ఫస్టాఫ్ అంతా గడిచిపోతుంది . ఇందులో చాలావరకు సాగతీత సన్నివేశాలే ఉంటాయి . అసలు పుర్రె గోల పక్కనపడిపోతుంది .

ఇక సెకండాఫ్ లోనే కథ మెల్లిగా ట్రాక్ లో పడుతుంది . ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఏసిపి సత్యజిత్ మోటార్ బైక్ మీద పోలీస్ తో పాటూ మనల్నీ అసలు కథలోకి తీసుకెళ్తాడు . ఈవా మరియా ఫ్లాష్ బ్యాక్ తెలుసుకోవడంతో హత్యకేసులో లీడ్ దొరుకుతుంది . ఎప్పుడైతే ఈవా మరియా ఫ్లాష్ బ్యాక్ రివీల్ అవుతుందో స్టోరీ ప్లాట్ మనకు కొంత అర్ధమవుతుంది . హతురాలు ఎవరో తెలిసిపోయింది కానీ కిల్లర్ ఎవరో తెలీదు . మలయాళం సినిమాల్లో విచిత్రం అదే . చివరివరకు ట్విస్టులతో కథను నడిపించి క్లైమాక్సులోనే కిల్లర్ ఎవరనేది రివీల్ చేస్తారు .

చివరికి క్లైమాక్సులో కిల్లర్ ఎవరనేది రివీల్ చేసినా అది మనకు థ్రిల్ పంచదు . ఎందుకంటే షుమారు రెండుగంటలసేపు కథను ఆ పుర్రె చుట్టూ తిప్పి ఆఖరి పదినిమిషాల్లో కిల్లర్ ను రివీల్ చేసినతర్వాత మనకు కొత్తగా అనిపించదు . ఇలాంటి క్లైమాక్సులు గతంలో చాలా చూసాం కదా అన్న ఫీలింగ్ వస్తుంది . దానికి తోడు ఎంత ఫైనాన్సియల్ క్రైసిస్ అయినా బాధ్యత కలిగిన పొజిషన్లో ఉన్న వ్యక్తి అంత క్రూరంగా హత్య చేయడం లాజికల్ గా అంతగా సింక్ అవదు .

ఓవరాల్ గా పోలీసులతో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ నడిపించిన తీరు మాత్రం మనకు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది .

ఎవరెలా చేసారు ?

ఏసిపి సత్యజిత్ పాత్రలో పృథ్విరాజ్ సుకుమారన్ మెప్పించాడు . కానీ చాలా ఫ్రేముల్లో అతడు స్మూత్ గా కనిపిస్తాడు . కొన్ని సన్నివేశాల్లో పోలీస్ ఆఫీసర్ కు ఉండాల్సిన బాడీ లాంగ్వేజ్ మిస్ అయినట్టు అనిపిస్తుంది .

ఇక జర్నలిస్ట్ మేధా పద్మజ పాత్ర పోషించిన అదితి బాలన్ తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది . పైగా ఈ సినిమాలో పృథ్విరాజ్ సుకుమారన్ కు ఎంత స్కోప్ ఉందో ,ఈమె పాత్రకు కూడా అంతే స్కోప్ ఉంది .
మిగిలినవాళ్లు తమ పాత్రల పరిధిమేరకు బాగానే చేసారు .

సాంకేతికత

ప్రకాష్ అందించిన సంగీతం పర్లేదు . కాకపోతే క్రైమ్ , హర్రర్ సినిమాలకు పడాల్సిన మంచి బీట్లు పడలేదు .
గిరీష్ గంగాధరన్ అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది . కొన్ని సన్నివేశాల్లో కేరళ సహజ అందాలను చక్కగా చూపించారు .
నిర్మాణ విలువలు పర్లేదు .

విశ్లేషణ

ముందే చెప్పినట్టు క్రైమ్ , హర్రర్ జానర్ ఇష్టపడేవాళ్ళకు ఈ సినిమా నచ్చుతుంది . కాకపోతే రెండు జానర్లను సమాంతరంగా నడిపించడంతో ఒకే టికెట్ మీద రెండు సినిమాలు చూసిన అనుభూతి వస్తుంది . ఫస్టాఫ్ లో సాగతీత సన్నివేశాలను , స్లో నేరేషన్ ను భరించి ముందుకెళ్తే సెకండాఫ్ మీకు కొంత థ్రిల్ పంచుతుంది .

ఈ మూవీలో దర్శకుడు ఫస్టాఫ్ లో హర్రర్ ఎలిమెంట్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే , సెకండాఫ్ లో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు . కాకపోతే రెండు ట్రాక్ లలో మనకు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ పార్ట్ ఎక్కువగా నచ్చుతుంది . హర్రర్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు పెద్దగా భయపెట్టకపోగా కధనాన్ని సాగతీసినట్టు అనిపిస్తాయి . షుమారు రెండు గంటలు సస్పెన్స్ డ్రామా నడిపి చివరికి హత్య డబ్బు కోసం చేసినట్టు చూపించటంతో పెద్ద థ్రిల్ ఇవ్వదు . అంతకన్నా బలమైన కారణాన్ని చూపించి ఉంటే బాగుండేది . ఇప్పటికే డబ్బులకోసం , ఆస్తుల కోసం చేసిన చాలా హత్యలను గతంలో చాలా సినిమాల్లో చూసేసాం . కాబట్టి కొత్తదనం అనిపించదు .

ఓవరాల్ గా సస్పెన్స్ క్రైమ్ హర్రర్ జానర్ మూవీలు ఇష్టపడేవారు వన్ టైం వాచ్ కింద ఈ సినిమా చూడొచ్చు . అశ్లీల సన్నివేశాలు , మితిమీరిన వయొలెన్స్ లేదు కాబట్టి ఇంట్లోనే ఫ్యామిలీతో అమెజాన్ ప్రైమ్ ఓటిటి లో చూడొచ్చు . కాకపోతే మూవీ ఒరిజినల్ మలయాళం వెర్షన్లో తెలుగు సబ్ టైటిల్స్ తో చూడాలి .

నటీనటులు : పృథ్విరాజ్ సుకుమారన్ , అదితి బాలన్ తదితరులు
సంగీతం : ప్రకాష్
సినిమాటోగ్రఫీ : గిరీష్ గంగాధరన్
దర్శకత్వం : తను బాలక్
విడుదల : అమెజాన్ ప్రైమ్ ఓటిటి
రేటింగ్ : 2.5 / 5


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!