వెంకటేష్, శ్రీనిధిశెట్టి జంటగా నటించిన ఆదర్శ కుటుంబం – ఏకే 47 (Aadarsha Kutumbam Movie ) ఈరోజు (30-10-2026) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ అయ్యింది. టైటిల్ చూడగానే ఇదేదో ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ అనుకుంటాం.. కానీ ఏకే 47 అనే ట్యాగ్ లైన్ చూస్తే మాత్రం ఈ సినిమాలో క్రైమ్ ఎలిమెంట్ కూడా ఉందని అర్థమౌతుంది. త్రివిక్రమ్ దర్శకత్వం అంటేనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ అని చాలా మంది ఊహించగలరు.. కానీ ఆయన మూవీ టైటిల్ పక్కన ఏకే 47 అనే ట్యాగ్ లైన్ ఎందుకు తగిలించినట్టు? ఈ ప్రశ్నకు సమాధానం ఈ సినిమా చూసినవాళ్లకు తెలుస్తుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో కొత్త కోణాన్ని ఈ సినిమా ఆవిష్కరిస్తుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం.
కధేంటంటే?
బీహార్ కు చెందిన భయంకరమైన బందిపోటు దొంగల ముఠా కోరేగావ్ లోని ఓ ఫామ్ హౌస్ లో జొరబడి అడ్డొచ్చిన వాళ్ళని కాల్చేస్తూ ఇంట్లోని నగదును.. నగలను దొంగతనం చేయడంతో సినిమా మొదలౌతుంది.
కట్ చేస్తే,
చిట్టిబాబు (వెంకటేష్) ఆదర్శ కుటుంబం ప్రత్యక్షం అవుతుంది. చిట్టిబాబుకు భార్య స్వర్ణ, కొడుకు సర్వ .. కూతురు సంపూర్ణ లతో కలిసి మధ్యతరగతి లైఫ్ లీడ్ చేస్తుంటాడు. భార్య చేసిన అప్పులు ఎలా తీర్చాలి? అనారోగ్యంతో ఉన్న కొడుక్కి ట్రీట్మెంట్ ఎలా చేయించాలి? కూతురికి పెళ్లి ఎలా చెయ్యాలి? అనే సమస్యలతో చిట్టిబాబు సతమతం అవుతుంటాడు.

ఈ పరిస్థితుల్లో అనుకోకుండా చిట్టిబాబుకి వందకోట్ల లాటరీ తగులుతుంది. దాంతో తమ కష్టాలన్నీ తీరిపోతాయని చిట్టిబాబు ఫ్యామిలీ సంతోషపడుతుంది. కానీ ఉన్న కష్టాలు తీరకపోగా వాళ్లకు కొత్త కష్టాలు వచ్చి పడతాయి. చిట్టిబాబుకి వంద కోట్ల లాటరీ తగిలిందని బీహార్ బందిపోటు దొంగలకు తెలియడంతో వాళ్ళ కన్ను చిట్టిబాబు మీద పడుతుంది.
చిట్టిబాబు ఫ్యామిలీని చంపి ఆ వందకోట్లు కాజేయాలని బీహార్ బందిపోటు దొంగల ముఠా వేసిన ప్లాన్ ఫలిస్తుందా? తమ జోలికి వచ్చిన బందిపోటు దొంగల ముఠాను చిట్టిబాబు ఫ్యామిలీ ఏ విధంగా ఎదుర్కుంటుంది? బందిపోటు దొంగలను పట్టుకోవడానికి ఒకవైపు ఎస్పీ దామోదర నాయుడు( నారా రోహిత్).. ఇంకోవైపు డీఎస్పీ బృహస్పతి(రావు రమేష్ ) ఎలాంటి ప్లాన్లు వేస్తారు? అసలు చిట్టిబాబు గతం ఏంటి? అనేది మిగిలిన కథ.
ఎలా ఉంది?
సినిమా స్టార్టింగ్ లోనే భయంకరమైన దోపిడీ సీన్ తో మొదలౌతుంది. ఫామ్ హౌస్ లో దొంగతనానికి వెళ్లిన బీహార్ బందిపోటు దొంగల ముఠా అడ్డొచ్చిన వాడ్ని అడ్డంగా నరుకుతూ దోపిడీ చేస్తారు. ఈ సీన్ చూస్తే ఈ సినిమాకి త్రివిక్రమ్ దర్శకత్వం వహించారా? లేకపోతే బోయపాటి దర్శకత్వం వహించారా? అన్న అనుమానం కూడా వస్తుంది.. అసలు మనం వచ్చింది ఆదర్శ కుటుంబం సినిమాకేనా? అనే డౌట్ కూడా వస్తుంది.
కట్ చేస్తే.. వెంకటేష్ ఆదర్శ కుటుంబం కనిపించగానే టైటిల్ పక్కన ఏకే 47 అనే ట్యాగ్ లైన్ ను త్రివిక్రమ్ ఎందుకు పెట్టాడో మనకు అర్థమౌతుంది. ఇప్పటిదాకా త్రివిక్రమ్ తీసిన సినిమాలు వేరు.. ఆదర్శ కుటుంబం వేరు.. డార్క్ కామెడీకి క్రైమ్ ఎలిమెంట్ కూడా కలిపి త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త ప్రయోగం చేశారు.
త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్.. డార్క్ కామెడీ.. భావోద్వేగాల సంఘర్షణలు మాత్రమే అనుకునేవాళ్లకి ఈ సినిమా ద్వారా త్రివిక్రమ్ కూడా బోయపాటి స్టైల్లో వయోలెన్స్ చూపించగలడు అని నిరూపించుకున్నాడు. ఆయన దర్శకత్వంలో ఇదో కొత్త కోణం.
అయితే గమ్మత్తు ఏంటంటే చక్కటి హాస్యాన్ని పండించడంలో ఎక్స్పర్ట్ అయిన త్రివిక్రమ్ ఈ సినిమాలో కామెడీ ట్రాక్ లో కొంచం తడబడి వయోలెన్స్ సీన్లనే బాగా హ్యాండిల్ చేశారు.
ఇక కామెడీ ట్రాక్ విషయానికి వస్తే సత్య ఎంట్రీ సీన్ మరీ ఓవర్ అయిపోయింది. మెయిన్ డోర్ తీయగానే సత్య స్పైడర్ మ్యాన్ మాదిరి గాల్లో తేలుకుంటూ బ్యాక్ డోర్ అవతల పడిన సీన్ మితిమీరిన కామెడీకి పరాకాష్ట. అసలు ఈ సీన్ తీసింది త్రివిక్రమ్ శ్రీనివాసేనా అనే డౌట్ కూడా వస్తుంది.
ఎందుకంటే త్రివిక్రమ్ సినిమాల్లో కామెడీ ట్రాక్ చాలా హెల్తీగా సునిశితంగా ఉంటుంది. ఒక చిన్న డైలాగ్ తోనో.. ఒక చిన్న సీన్ ద్వారానో చక్కగా నవ్వించే దర్శకత్వ ప్రతిభ ఆయనకు ఉంది. కానీ మరీ ఇలా గ్రాఫిక్ వర్క్ తో ప్రేక్షకులను నవ్వించే ప్రయత్నం ఆయన చేస్తారని ఎవరూ ఊహించరు. ఆ సీన్ మినహా మిగిలిన సన్నివేశాల్లో సత్య కామెడీ కొంత వర్కౌట్ అయ్యింది.
ఇక వెంకటేష్ కామెడీ టైమింగును వాడుకోవడంలో అనిల్ రావిపూడి పండిపోయాడు. సరిగా వాడుకోవాలే కానీ వెంకటేష్ ఒక్కడు చాలు మనల్ని కడుపుబ్బ నవ్వించడానికి.. కానీ ఈ సినిమాలో వెంకటేష్ కామెడీ టైమింగును వాడుకోవడంలో త్రివిక్రమ్ తడబడినట్టు అనిపిస్తుంది. వెంకటేష్ మార్క్ పంచ్ డైలాగులు.. హావభావాలు కొరవడ్డాయి. ఒకట్రెండు డైలాగులు ఉన్నా కృతకంగా ఉన్నాయి. భోజనాల దగ్గర వెంకటేష్ కవితలు చదవడం.. నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో ప్రకాష్ రాజ్ కవితలు చదివిన సీన్లను గుర్తు చేస్తుంది. పైగా తన ఇంటిపేరును తొట్టి.. తొట్టి అని పలుకుతూ వెంకటేష్ చేసిన హడావుడి కూడా అంతగా నప్పదు. ఇక కామెడీ ట్రాక్ కోసం బ్రహ్మాజీని కూడా వాడుకుంటే బాగుండేది. అలాగే రఘుబాబును కూడా.
ఇక క్రైమ్ ఎలిమెంట్స్ విషయానికి వస్తే సీన్లను త్రివిక్రమ్ బాగానే హ్యాండిల్ చేశాడనిపిస్తుంది. ఓపెనింగ్ సీన్లోనే రాబరీ సీన్ పెట్టి మంచి ఉత్సుకతను కలిగించారు. దానికి తోడు తమన్ ఇచ్చిన బిజిఎం సీన్ కు మరింత హైప్ తీసుకొచ్చింది. ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ లో వచ్చే ఫైట్ సీన్.. బిజిఎం నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి కానీ ఈ మధ్య విడుదలైన తమిళ హీరో అర్జున్ నటించిన బ్లాస్ట్ సినిమాని గుర్తుకుతెస్తుంది.
ఎస్పీ దామోదర నాయుడు పాత్రలో నారా రోహిత్ ను తీసుకోవడం పెర్ఫెక్ట్ ఛాయిస్.. కానీ ఆయన నుంచి పెర్ఫెక్ట్ పెర్ఫార్మెన్స్ రాబట్టుకోవడంలో దర్శకుడు ఫెయిల్. నిజానికి ఇలాంటి పాత్రలు చేయడంలో నారా రోహిత్ దిట్ట..శమంతకమణి సినిమా చూసిన వాళ్లకు ఆ విషయం అర్థమౌతుంది.
అలాగే బృహస్పతి పాత్రకు రావు రమేష్ ను సెలెక్ట్ చేసుకోవడం కూడా పెర్ఫెక్ట్.. అయితే నారా రోహిత్ తో పోలిస్తే దర్శకుడు రావు రమేష్ ను కొంతవరకు బాగానే వాడుకున్నారు అనిపిస్తుంది.. ముఖ్యంగా మ్యానరిజంలో కానీ.. డైలాగ్ డెలివరీలో కానీ వెనుకటి రావు రమేష్ కనిపిస్తారు.
ఇక మన ఇళ్లల్లో పిల్లలని ముద్దు పేర్లతో పిలుచుకోవడం అలవాటే.. కానీ పెళ్ళాం కూడా మొగుడ్ని నాన్నా అని పిలవడం కొత్తగా అనిపిస్తుంది.
ఇక త్రివిక్రమ్ సినిమాలు ప్రాస డైలాగులకు ఫేమస్..ఈ విషయంలో నిరాశ ఎదురౌతుంది. ఆయన మార్క్ కట్టిపడేసే డైలాగులు తక్కువనే చెప్పాలి.. పైగా వెంకటేష్ బిజినెస్ మ్యాన్ల గురించి మాట్లాడుతూ అంబానీ అంటే ఆవు అరిచినట్టు.. టాటా అంటే బైబై చెప్పినట్టు అని కామెడీగా డైలాగ్ చెప్పడంలో త్రివిక్రమ్ మార్క్ కనిపించదు.
ఇక లాజిక్కుల సంగతి మాట్లాడుకుందాం.. ఈ సినిమాలో లాజిక్కులను వెతక్కపోవడమే మంచిది. బందిపోటు దొంగలు చిట్టిబాబు ఇంటికి వస్తారని తెలుసు.. బందిపోటు దొంగలు తిరిగే వ్యాన్ తెలుసు.. బందిపోటు దొంగల ముఖాలు తెలుసు.. అయినా ఎస్పీ దామోదర నాయుడు ఆఫీసులో కూర్చుని సీసీ కెమెరాలు చూస్తాడే కానీ బయటికి కదలడు. అలాగే డీఎస్పీ బృహస్పతి (రావు రమేష్) సొంత ఇన్వెస్టిగేషన్ కూడా అతికినట్టు ఉండదు.
లాటరీ ఆఫీసులో కనిపించిన బ్రహ్మాజీ పోలీస్ అని వెంకటేష్ కి అంతకుముందే తెలుసు కదా? మరి ఎలా నమ్మాడు ? లాటరీ తగిలిందని తెలియగానే రఘుబాబు ఇరవై కోట్ల విల్లాను చిట్టిబాబుకు అప్పచెప్పడం కూడా అంత కన్విన్సింగ్ గా అనిపించదు.
ఇక సెకండాఫ్ అంతా స్టోరీ ప్రిడిక్టబుల్ గా సాగుతుండటంతో మనల్ని అంతగా ఎంగేజ్ చేయదు. క్లైమాక్స్ కూడా రొటీన్ కమర్షియల్ ఫార్మాట్లోనే ముగించారు. ఓవరాల్ గా ఈ సినిమాలో సత్య కామెడీ కొంచం.. యాక్షన్ ఎలిమెంట్స్ కొంచం.. వెంకటేష్ ఆదర్శ కుటుంబం చేసిన అల్లరి కొంచం సినిమాకి ప్లస్ అవుతాయి.
ఎవరెలా చేశారు?
చక్కటి కామెడీ టైమింగుకి పెట్టింది పేరు వెంకటేష్.. ఎప్పటిలానే తన సహజ శైలిలో నటించి మనల్ని నవ్వించాడు. అయితే అనిల్ రావిపూడి..వెంకటేష్ కాంబోలో వచ్చిన సినిమాలను చూసిన కళ్ళతోనే ఈ సినిమా కూడా చూస్తే మనకు అంత తుత్తి అనిపించదు.
ఇక వెంకటేష్ సరసన నటించిన శ్రీనిధి శెట్టి కూడా బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఇక ఈ ఆదర్శ కుటుంబం లో వెంకటేష్ కొడుకు.. కూతురుల నటన పర్లేదు.
నారా రోహిత్.. బ్రహ్మాజీల నుంచి దర్శకుడు పూర్తిస్థాయిలో నటనను రాబట్టుకోలేకపోయారు. రావు రమేష్ నటన బాగుంది. సత్య కామెడీ కూడా బాగానే ఉంది కానీ అన్ని సినిమాల్లో ఆయన నటన ఒకేరకంగా ఉండటంతో మోనాటనీ వస్తుంది. రఘుబాబు నటన పర్లేదు.
సాంకేతికత
తమన్ అందించిన బిజిఎం ఈ సినిమాకి బాగా వర్కౌట్ అయ్యింది. ఆ మాత్రం బిజిఎం లేకపోతే క్రైమ్ సీన్లు తేలిపోయేవి.
ఇక రవి కె చంద్రన్ అందించిన సినిమాటోగ్రఫీ కూడా బాగానే ఉంది.
నిర్మాణ విలువలు కూడా బాగానే ఉన్నాయి.
విశ్లేషణ
త్రివిక్రమ్ సినిమాల మీద ఆడియన్స్ లో కొన్ని ప్రత్యేకమైన అంచనాలు ఉంటాయి. ప్రాస డైలాగులు.. పంచ్ డైలాగులు..ఆలోచింపచేసే డైలాగులు.. ఇలా త్రివిక్రమ్ రైటింగ్ స్టైల్ మీద ప్రేక్షకులు చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు. ఈ సినిమా విషయంలో అటువంటి ఎక్స్పెక్టేషన్స్ పక్కనబెట్టి చూడండి.. డిజప్పాయింట్ కారు.
ఇక త్రివిక్రమ్ సినిమాల్లో మేకింగ్ స్టైల్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. హీరో తరపునో.. హీరోయిన్ తరపునో ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో స్టోరీ రాసుకోవడం.. దానికి హీరో.. హీరోయిన్ల లవ్ ట్రాక్ కు కలుపుతూ కథనాన్ని నడిపించడం.. మధ్య మధ్యలో ప్రాస డైలాగులు వదలడం త్రివిక్రమ్ స్టైల్ దర్శకత్వం.. ఆయన సినిమాల్లో వయోలెన్స్ మోతాదు చాలా తక్కువగా ఉంటుంది.. కొన్ని సినిమాల్లో అసలు ఉండదు.
కానీ ఆదర్శ కుటుంబం సినిమాతో త్రివిక్రమ్ శ్రీనివాస్ మేకింగ్ స్టైల్ మారింది. ఇకపై ఈయన బోయపాటి తరహాలో యాక్షన్ జానర్లో కూడా మూవీలు తీయగలరని అర్థమౌతుంది. ఈయనకు ఇదే మొదటి ప్రయోగం కాబట్టి కొన్ని సీన్లలో అక్కడక్కడా తడబడ్డారు.. అయినా పర్లేదు.. ఆయన ప్రయత్నాన్ని అభినందించవచ్చు.
ఇక ఈ సినిమా విషయానికి వస్తే మాల్ లో జరిగిన ఫైట్ సీన్ల వంటి అనవసరమైన సాగతీత సన్నివేశాలు ట్రిమ్ చేసి స్టోరీ లైన్లో ముందుకు వెళ్లి ఉంటే ఇంకా బాగుండేది. ఇంకో విషయం ఆదర్శ కుటుంబం అనే టైటిల్ స్టోరీకి యాప్ట్ గా లేదు.. ఏకే 47 అనే ట్యాగ్ లైన్ కొంచం నయం.. ఇంటి నంబర్ కి సరిపోయింది.
నటీనటులు: వెంకటేష్, శ్రీనిధి శెట్టి, నారా రోహిత్, సత్య, రఘుబాబు, బ్రహ్మాజీ, రావు రమేష్, తదితరులు
సంగీతం: తమన్
సినిమాటోగ్రఫీ: రవి కె చంద్రన్
నిర్మాత: రాధాకృష్ణ
దర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్
రేటింగ్: 2.5/5
