విజయ్ సేతుపతి.. లిజోమోల్ జోస్ ప్రధాన పాత్రల్లో నటించిన బత్తా సినిమా (Baththa Movie) ఈరోజు నుంచి (29-10-2026) నుంచి నెట్ ఫ్లిక్స్ ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతుంది. అక్టోబర్ 1 న తమిళ్ లో రిలీజ్ అయిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం ఓటిటిలో కూడా ఆడియన్స్ వాచ్ లిస్టులో ఈ సినిమా చేరింది.
ఇప్పుడు బత్తా మూవీ ఎలా ఉందో చూద్దాం.
కధేంటంటే?
1996 లో తమిళనాడులోని ఓ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో కథ మొదలౌతుంది. బత్తా (విజయ్ సేతుపతి) ఆ విలేజ్ లో గ్యాంగ్ స్టర్ లా వ్యవహరిస్తుంటాడు. తన మాటకు ఎవరైనా అడ్డు వస్తే కొట్టి మాట్లాడుతాడు. బత్తా రౌడీయిజం సంగతి తెలిసిన గ్రామస్తులు అతడి మాటలకు అణిగిమణిగి ఉంటారు.
బత్తా రౌడీయిజం ఎంతలా పాకిపోయిందంటే స్కూల్ పిల్లలు అతడ్ని చూడాలంటేనే భయపడిపోయేంత..అలా భయపడినవాళ్ళలో మూడో తరగతి చదువుతున్న శబరి (సాయి పృధ్వీరాజ్) కూడా ఒకడు. బత్తా రౌడీయిజం ప్రత్యక్షంగా చూసిన శబరి అతడి పేరు తలుచుకుంటేనే వణికిపోతుంటాడు. మరోపక్క బత్తా కి ఊర్లో కూడా శత్రువులు పెరిగిపోతారు. జ్యోతి అనే వ్యక్తిని కొట్టడంతో అతడు బత్తా మీద కక్ష పెట్టుకుంటాడు.

ఇదిలా ఉండగా స్కూల్ ఎగ్జామ్స్ లో శబరి పరీక్ష రాయకుండా బొమ్మతో ఆడుకుంటున్నాడని గమనించిన టీచర్ అతడి దగ్గర్నుంచి ఆ బొమ్మను లాక్కుని తన రూమ్ లో ఉన్న అల్మరాలో పెడుతుంది. ఆ తర్వాత స్కూలుకు రెండు వారాలు సెలవులు రావడంతో అందరూ ఊర్లకు వెళ్లిపోతారు.
కానీ శబరికి ఆ బొమ్మ అంటే ప్రాణం.. అందుకే ఇంట్లో ఎవరికీ చెప్పకుండా రహస్యంగా స్కూలుకి వెళ్ళి అల్మరాలో దాచిపెట్టిన తన బొమ్మను తీసుకుని బయటికి వస్తూ అన్ని తలుపులకు లాక్ వేసేస్తాడు. అయితే అదే సమయంలో స్కూల్ వాష్ రూమ్ లో ఉన్న బత్తా లోపలే ఇరుక్కుపోతాడు. బత్తా లోపలే ఉన్నాడని తెలుసుకున్న శబరి భయంతో వాష్ రూమ్ తలుపు గడియ తీయకుండానే పారిపోతాడు.
అసలు ఆ సమయంలో బత్తా స్కూలుకు ఎందుకు వచ్చాడు? లోపల బత్తా ఉన్నాడని తెలిసి భయంతో పారిపోయిన శబరి ఏం చేశాడు? సడెన్గా బత్తా కనిపించకుండా మాయం అవడంతో అతడి భార్య.. అనుచరులు ఏం చేశారు? ఈ కేసును దర్యాప్తు చేయడానికి రంగంలోకి దిగిన పోలీసులు చివరికి ఏం తేలుస్తారు? అనేది మిగిలిన కథ.
ఎలా ఉంది?
విజయ్ సేతుపతి సినిమా అనగానే మూవీ చూడాలనే ఇంట్రెస్ట్ ఆడియన్స్ లో క్రియేట్ అవుతుంది. ఆయన నటనలో సినిమా సినిమాకి ఒక డిఫరెంట్ స్టైల్ ఉంటుంది.. ఒక డిఫరెంట్ మ్యానరిజం ఉంటుంది. అది నెగిటివ్ షేడ్ క్యారెక్టర్ అయినా సరే.. పాజిటివ్ షేడ్ క్యారెక్టర్ అయినా సరే తనకిచ్చిన పాత్రలో ఒదిగిపోతాడు.
అయితే ఈ సినిమా టాక్ తెచ్చుకోవడంలో విజయ్ సేతుపతితో పాటు సాయి పృధ్వీరాజ్ అనే ఎనిమిదేళ్ల కుర్రాడి పాత్ర కూడా ఉంది. ఈ సినిమాలో శబరి పాత్ర ఆ పిల్లోడే పోషించాడు. కొన్ని సన్నివేశాల్లో అయితే ఈ పిల్లవాడు విజయ్ సేతుపతితో కూడా పోటీ పడ్డాడు.
ఇక సినిమా విషయానికి వస్తే విజయ్ సేతుపతి ఒక చిన్న గ్యాంగ్ స్టర్ కాబట్టి రొటీన్ ఫార్మాట్లో ఒక ఫైటింగ్ సీన్ తోనే ఎంట్రీ ఇస్తాడు. ఫస్టాఫ్ లో విజయ్ సేతుపతి క్యారెక్టర్ గురించి ఎస్టాబ్లిష్ చేయడానికి దర్శకుడు ఎక్కువ టైమ్ తీసుకున్నాడు. అతడు ఎంత రౌడీ అయినా భార్య అన్నా.. కూతురన్నా ప్రాణం. తన రౌడీయిజం వల్ల ఫ్యామిలీ లైఫ్ లో ఎలాంటి డిస్ట్రబెన్సులు ఎదురవుతున్నాయి? అనే పాయింటులో కథనం నడుస్తుంది.
మరోపక్క మూడో తరగతి చదువుతున్న శబరి ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్.. అతడి భయాలు అనే పాయింట్ల ఆధారంగా సమాంతర కథనం నడుస్తుంది. ఇదంతా రొటీన్ కమర్షియల్ సినిమాల ఫార్మాట్లోనే సాగుతుంది కాబట్టి మనల్ని పెద్దగా ఎంగేజ్ చేయదు.
ఈ ఇద్దరి పాత్రల పరిచయాలు అయిపోయిన తర్వాత దర్శకుడు మెల్లిగా అసలు స్టోరీలోకి వెళ్ళాడు. ఎప్పుడైతే విజయ్ సేతుపతి స్కూల్ వాష్ రూమ్ లో బందీ అయిపోతాడో అప్పట్నుంచి కథనం ఆడియన్స్ ని ఎంగేజ్ చేస్తుంది. బత్తాని విడిపించలేక.. అలా అని వదిలి పెట్టలేక శబరి పడే స్ట్రగుల్ ఆకట్టుకుంటుంది. బాత్ రూమ్ గడియా తీస్తే బత్తా తనని చంపేస్తాడేమో అన్న భయం ఒకవైపు.. అలా అని గడియ తీయకపోతే తిండి తిప్పలు లేక బత్తా ఏమైపోతాడో అన్న మానసిక సంఘర్షణలో శబరి నలిగిపోయే సీన్లు బాగా పండాయి. ఈ సీన్లలోనే ఆ పిల్లోడి (సాయి పృధ్వీరాజ్) నటనకు పూర్తి మార్కులు పడతాయి.
ఇక అక్కడ్నుంచి కథనంలో వేగం తగ్గి నెమ్మదిస్తుంది.. పదే పదే ఆ పిల్లవాడి సంఘర్షణ రిపీట్ అవుతుండటంతో కొంత ల్యాగ్ ఫీల్ వస్తుంది. లాజికల్ గా కూడా కొన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరకవు. అంత చిన్న ఊర్లో గ్యాంగ్ స్టర్ గా పేరుబడిన బత్తా మాయం అయితే పోలీసులు ఏం చేశారనే విషయాల జోలికి దర్శకుడు పోలేదు. పోలీసుల కన్నా బత్తా అనుచరులే అతడి కోసం ఎక్కువ వెతుకుతారు.. ఎక్కువ ఇన్వెస్టిగేషన్ చేస్తారు.
ఇక ఫస్టాఫ్ ఎండింగ్ వరకు అసలు విజయ్ సేతుపతి ఆ టైమ్ లో స్కూలు కు ఎందుకు వెళ్లాడనేది ప్రశ్నగానే ఉండిపోతుంది. దీంతో బత్తా స్కూల్ కి వెళ్ళడం వెనుక ఏదో మిస్టరీ ఉండే ఉంటుందని మనం అనుకుని సెకండాఫ్ లోకి వెళ్తాం. సరే.. సెకండాఫ్ లో విజయ్ సేతుపతి బయటికి రావడంతో కథ అయిపోయిందనుకుంటాం.. నిజానికి అక్కడితో అసలు కథ అయిపోయినట్టే.. కానీ దర్శకుడు అక్కడ్నుంచి ఇంకో గంట కథనాన్ని నడిపాడు.
బత్తా తన కూతురి ఫంక్షన్ కోసం కార్డులు వేయించి ఇంటింటికీ తిరగడం.. శబరిని కూడా వెంట పెట్టుకుని తిరగడం.. శబరి తండ్రి గొడవలో వేలు పెట్టడం వంటి సన్నివేశాలు కథనాన్ని సాగతీయడానికి పనికొచ్చాయి. అప్పటికి కూడా ఆడియన్స్ మదిలో ఉన్న అసలు విజయ్ సేతుపతి ఆ టైమ్ లో స్కూలుకు ఎందుకు వెళ్ళాడు అనే ప్రశ్నకు సమాధానం రాలేదు.
క్లైమాక్స్ వరకు విజయ్ సేతుపతి తను ఆ టైమ్ లో స్కూలుకు ఎందుకు వెళ్ళింది చెప్తాడు. విజయ్ సేతుపతి చెప్పిన ఫ్లాష్ బ్యాక్ స్టోరీ థ్రిల్ పంచకపోగా గాలి మొత్తం తీసేసినట్టు అయ్యింది. ఈ విషయం చెప్పడానికి క్లైమాక్స్ దాకా ఆగాలా? అని అనుకుంటాం కూడా. విజయ్ సేతుపతి స్కూల్ కు ఎందుకు వెళ్ళాడు అనే సస్పెన్స్ గుట్టును విప్పటానికి ఆడియన్స్ మరింత ఎగ్జైట్ అయ్యే విధంగా దర్శకుడు ప్లాట్ రాసుకుంటే బాగుండేది. ఇంతకీ విజయ్ సేతుపతి చెప్పిన ఫ్లాష్ బ్యాక్ ఏంటంటారా? ఇక్కడ చెబితే స్పాయిలర్ అవుతుంది కాబట్టి ఓటిటిలో చూడండి. మీకే అర్థమౌతుంది.
ఎవరెలా చేశారు?
ఈ సినిమాకి మెయిన్ పిల్లర్స్ ఒకరు విజయ్ సేతుపతి అయితే రెండోవాడు మాత్రం ఎనిమిదేళ్ళ సాయి పృధ్వీరాజ్ అవుతాడు. విజయ్ సేతుపతి నటన గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.. అందులో ఇలాంటి పాత్రలు చేయడం అతడికి కొట్టిన పిండే.. కాకపోతే విజయ్ సేతుపతి గడ్డం తోనే బాగున్నాడు. దాదాపు సెకండాఫ్ అంతా గడ్డం లేకుండా కనిపిస్తాడు.
ఇక శబరి పాత్ర పోషించిన సాయి పృధ్వీరాజ్ వయసులో చిన్న పిల్లవాడు అయినా నటనలో పెద్దవాళ్ళతో పోటీ పడ్డాడు. ముఖ్యంగా పొలం గట్టు మీద విజయ్ సేతుపతి పక్కన కూర్చుని జరిగిందంతా గుక్కపట్టి ఏడుస్తూ చెప్పిన సీన్లో కంట తడిపెట్టించాడు.
లిజోమోల్ జోస్ నటనకు పూర్తిస్థాయిలో స్కోప్ దక్కలేదు.. అయినా కనిపించినంతలో ఆమె నటన బాగానే ఉంది.
సాంకేతికత
సాయి అభ్యంకర్ అందించిన సంగీతం బాగానే ఉంది.
సెల్వకుమార్ ఫోటోగ్రఫీ కూడా బాగానే ఉంది.
నిర్మాణ విలువలు కూడా పర్లేదు.
విశ్లేషణ
ఈ సినిమా తమిళనాడులో మంచి కలెక్షన్లు రాబట్టుకుంది. విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంది. అయితే ఇదే సినిమా డిజిటల్ ప్లాట్ ఫామ్ లో తెలుగు ఆడియోలో కూడా అందుబాటులోకి రావడంతో ఆడియన్స్ తమ వాచ్ లిస్టులో ఈ సినిమాని చేర్చుకుంటున్నారు.
సినిమా మొత్తం విజయ్ సేతుపతి.. ఆ పిల్లవాడి చుట్టూనే తిరుగుతుంది. అయితే ఈ సినిమాకి సాయి పృధ్వీరాజ్ అనే ఈ పిల్లవాడు స్పెషల్ ఎట్రాక్షన్ అవుతాడు. కొన్ని సీన్లలో అతడి భయాన్ని చూస్తే జాలేస్తుంది.. కొన్ని సీన్లలో అతడి తెలివితేటలు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. కొన్ని సీన్లలో అతడి అమాయకపు ఫేస్ చూస్తే పాపం పసివాడు అనిపిస్తుంది.
ఓవరాల్ ఈ సినిమా ఫస్టాఫ్ కొంతభాగం ఎంగేజ్ చేస్తే.. సెకండాఫ్ కొంత భాగం ఎంగేజ్ చేస్తుంది.. మధ్యలో వచ్చే కొన్ని సాగతీత సన్నివేశాలు బోర్ కొట్టిస్తాయి. దానికి తోడు తెలుగు డబ్బింగ్ అయినా కూడా ఎక్కువగా తమిళ్ నేటివిటీ కనిపిస్తూ ఉంటుంది.
ఈ సినిమా చూడాలనుకునేవారు నెట్ ఫ్లిక్స్ లో తెలుగులో కూడా అందుబాటులో ఉంది కాబట్టి ఓ లుక్కేయండి.
నటీనటులు: విజయ్ సేతుపతి, లిజోమోల్ జోస్, సాయి పృధ్వీరాజ్ తదితరులు
సంగీతం: సాయి అభ్యంకర్
సినిమాటోగ్రఫీ: సెల్వకుమార్
దర్శకత్వం: బాలాజీ తరణీధరన్
ఓటిటి: నెట్ ఫ్లిక్స్
స్ట్రీమింగ్ డేట్: 29 -10 -2026
రేటింగ్: 2.75/5
