మనోజ్ బాజ్ పాయ్ ప్రధాన పాత్రలో నటించిన గజబ్ రాత్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా (Gajab Raat movie) అక్టోబర్ 23 , 2026 నుంచి నెట్ ఫ్లిక్స్ ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతుంది. ఒరిజినల్ హిందీ వెర్షన్ తో పాటు తెలుగు డబ్బింగ్ కూడా అందుబాటులో ఉంది. ఈ సినిమాకి నీరజ్ పాండే నిర్మాతగా వ్యవహరించగా రితేష్ షా దర్శకత్వం వహించారు.
ఇప్పుడు గజబ్ రాత్ మూవీ ఎలా ఉందో చూద్దాం.
కధేంటంటే?
కథ మొత్తం ఒక్క రాత్రిలో జరిగిన సంఘటన చుట్టూ తిరుగుతుంది కాబట్టి సినిమాకి గజబ్ రాత్ అనే టైటిల్ యాప్ట్ అయ్యింది.
ఇక సినిమా స్టార్టింగ్ అర్ధరాత్రి పన్నెండు గంటలకు ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ లో ఉన్న ఓ విలాసవంతమైన హోటల్లో వ్యభిచారం జరుగుతుందనే సమాచారంతో ఇన్స్పెక్టర్ అజయ్ నిర్విత్ ( మనోజ్ బాజ్ పాయ్) ఆధ్వర్యంలో పోలీసులు రైడ్ చేయడంతో మొదలౌతుంది. హోటల్లో కొంతమంది విటులను..వేశ్యలను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని పోలీస్ వ్యాన్ ఎక్కిస్తారు. వాళ్లలో రోజీ అనే వేశ్య మీద కన్నేసిన ఇన్స్పెక్టర్ అజయ్ ఆమెను విడిచిపెట్టి ప్రైవేట్ గా తనని కలవమంటాడు.
సరిగ్గా ఇదే సమయంలో ఎవరో ఒక అమ్మాయిని కారులోనుంచి రోడ్డు మీదకు తోసేయడంతో ఆమె తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిందని.. వెంటనే వెళ్లి ఆమె సంగతి చూడమని పై అధికారుల నుంచి అజయ్ కి కాల్ వస్తుంది. దాంతో ఇన్స్పెక్టర్ అజయ్ స్పాట్ కి వెళ్ళి చూడగా అక్కడ ఒక అమ్మాయి తీవ్ర గాయాలతో కనిపించడంతో ఆమెను అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించి కేసు ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతాడు.

కానీ అజయ్ ఆ అమ్మాయిని ఆసుపత్రిలో చేర్చగానే పవన్ మధోంక అనే సిబిఐ ఆఫీసర్ వచ్చి ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేసే బాధ్యతను అధికారులు తనకు అప్పచెప్పారని.. కాబట్టి అతడ్ని వెళ్ళిపొమ్మని చెప్తాడు. సరిగ్గా అదే సమయంలో ఇంకో వ్యక్తి వచ్చి తాను NIA నుంచి వచ్చానని..ఈ కేసు తనకు అప్పచెప్పమని ఇన్స్పెక్టర్ అజయ్ తో అంటాడు.
అసలు గాయాలతో ఆసుపత్రిలో చేరిన ఆ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయి కోసం CBI..NIA అధికారులు ఎందుకు వెంటపడతారు? ఈ కేసుకీ.. ఢిల్లీ సీఎం సునీతా చౌధురికి ఉన్న కనెక్షన్ ఏంటి? చివరకు ఈ కేసు విషయంలో ఇన్స్పెక్టర్ అజయ్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడు? అనేది మిగిలిన కథ.
ఎలా ఉంది?
మనోజ్ బాజ్ పాయ్ సినిమా అనగానే ఆడియన్స్ లో ఒక ఒరకమైన క్రేజ్ ఉంది. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ ఆ క్రేజ్ కు కారణం. సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ మూవీల్లో మనోజ్ బాజ్ పాయ్ ఇప్పటికే తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సృష్టించుకున్నారు. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మూవీల్లో సీన్ లను పండించడంలో మనోజ్ బాజ్ పాయ్ దిట్ట. ఒక్కోసారి అతడి నటన చూస్తుంటే ఈయన నిజంగా డిపార్ట్మెంట్ మనిషేమో? అన్నంత అనుమానం కూడా వస్తుంది.
అలాంటి బ్రాండ్ ఇమేజ్ ఉండబట్టే మనోజ్ బాజ్ పాయ్ సినిమాలను వెతుక్కుని మరీ చూసే ఆడియన్స్ ఉన్నారు. ఇక గజబ్ రాత్ సినిమా నేరుగా నెట్ ఫ్లిక్స్ ఓటిటిలో స్ట్రీమింగ్ కి రావడం.. తెలుగు డబ్బింగ్ కూడా అందుబాటులో ఉండటంతో చాలామంది ప్రేక్షకుల వాచ్ లిస్టులో ఈ మూవీ చేరింది.
ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. మనోజ్ బాజ్ పాయ్ ఎంట్రీ అర్థరాత్రి ఢిల్లీలోని ఓ హోటల్ మీద రైడ్ చేయడంతో మొదలౌతుంది. ఇన్స్పెక్టర్ పాత్రలో మనోజ్ బాజ్ పాయ్ హడావుడి చూసి నేనేరా పోలీస్ సినిమాలో సాయి కుమార్ టైప్ నిజాయితీ ఆఫీసర్ అనుకుంటాం.. కానీ ఎప్పుడైతే అతడు ఒక వేశ్యను వదిలేసి ప్రైవేట్ గా కలవమంటాడో.. అప్పుడే ఈ క్యారక్టర్ గురించి మనకు అర్థమైపోతుంది.
ఈ సినిమాలో మనోజ్ బాజ్ పాయ్ హీరో కాదు.. ఒక కరప్టడ్ ఆఫీసర్ అని అర్థం కావడానికి మనకు ఎంతసేపో పట్టదు. సరే.. హీరో కాని హీరో క్యారక్టర్ అర్థమైపోయింది.. వాట్ నెక్స్ట్? కారులోనుంచి తోసేయబడిన ఆ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయి కోసం ఒకపక్క CBI ఆఫీసర్.. మరోపక్క NIA ఆఫీసర్ ఆసుపత్రికి ఎందుకు వస్తారు? మరోపక్క సామాజిక వేత్త నేహా (శ్రద్ధా దాస్) కూడా ఆ అమ్మాయి కోసం ఆసుపత్రికి ఎందుకు వస్తుంది? అసలు ఈ కేసులో ఢిల్లీ సీఎం ఎందుకు ఇన్వాల్వ్ అవుతుంది? ఇప్పుడు ఇన్స్పెక్టర్ అజయ్ ఏం చేస్తాడు? అనే ప్రశ్నలు మనకు ఎదురౌతాయి. ఇదంతా ఫస్టాఫ్ లో మనకు ఎదురయ్యే ప్రశ్నలు.. అప్పటికి అసలు స్టోరీ ఏంటో మనకు అర్థం కాదు.. ప్రశ్నలు ఎదురౌతాయి కానీ సమాధానాలు దొరకవు.
అయితే ఫస్టాఫ్ లో మన ప్రశ్నలకు సమాధానాలు దొరక్కపోయినా మొత్తానికి ఏదో జరిగే ఉంటుందనే క్యూరియాసిటి మాత్రం మనలో కలుగుతుంది. అదే మనల్ని సినిమాలో ఎంగేజ్ చేస్తుంది.
ఇంతవరకు బాగానే ఉంది.. ఇక అక్కడ్నుంచి దర్శకుడు నెక్స్ట్ పాయింటులోకి వెళ్ళాలి కదా? కానీ అలా వెళ్లలేదు.. ఆ హాస్పిటల్ చుట్టూనే కథను గింగిరాలు తిప్పాడు. ఇన్స్పెక్టర్ అజయ్ చీటికి మాటికి లోపలికి.. బయటికీ తిరుగుతుంటాడు.. బయట CBI..NIA ఆఫీసర్లు అటూఇటూ తిరుగుతుంటారు.. మధ్య మధ్యలో వాళ్ళకు ఢిల్లీ సీఎం ఫోన్లు చేస్తూ ఉంటుంది..లోపల లాబీలో నేహా కూర్చుంటుంది. ఎంతసేపూ కథనం ముందుకు సాగకుండా ఈ పాత్రల చుట్టూనే తిరుగుతుంది.
ఈ సాగతీత ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తుంది. ఈ సాగతీత ఫస్టాఫ్ ఎండింగ్ నుంచి సెకండాఫ్ బిగినింగ్ వరకు దిగ్విజయంగా కొనసాగి ప్రేక్షకులకు తలనొప్పి తెప్పిస్తుంది. మనోజ్ బాజ్ పాయ్ నుంచి ఆశించిన యాక్షన్ సీన్లు లేకపోగా అటు కామెడీకి తక్కువ.. ఇటు సీరియస్ కి ఎక్కువ అన్న తరహాలో మనోజ్ బాజ్ పాయ్ క్యారక్టర్ రన్ అవుతుంది.
ఇలా సెకండాఫ్ కూడా కొంత లాగిన తర్వాత దర్శకుడు కరుణించి మనోజ్ బాజ్ పాయ్ ని యాక్షన్ మోడ్ లోకి దింపాడు. ఎప్పుడైతే ఆ అమ్మాయి దగ్గర్నుంచి అతడికి చిప్ దొరుకుతుందో అప్పుడు అసలు స్టోరీ ఏంటో మనకు రివీల్ అవుతుంది. అయితే ఆ అమ్మాయి విషయంలో గంటన్నర స్టోరీ నడిపిన తర్వాత దర్శకుడు రివీల్ చేసిన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మనకు ఏమంత థ్రిల్ పంచదు.. ఎందుకంటే ఇలాంటి ట్విస్టులు ఇప్పటికే చాలా సినిమాల్లో చూసేసాం కాబట్టి కొత్తగా మనం ఆశ్చర్యపడటానికి ఏమీ లేదు.
ఇక లాజిక్కులు వెతుక్కుంటే ఈ సినిమాలో బోలెడు లోపాలు కనిపిస్తాయి. సీఎం లాంటి పవర్ఫుల్ వ్యక్తికి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న ఒక మామూలు కింది స్థాయి వ్యక్తిని ఎదుర్కోవడం ఏమంత కష్టమైన పని కాదు.. పైగా మనోజ్ బాజ్ పాయ్ నేనేరా పోలీస్ సాయి కుమార్ టైపులో పవర్ఫుల్ నిజాయితీ పోలీస్ ఆఫీసర్ కూడా కాదు..డిపార్ట్మెంట్లోలో అవినీతి పరుడిగా పేరున్న మాములు ఇన్స్పెక్టర్ మాత్రమే.. సీఎం..CBI..NIA తల్చుకుంటే ఇన్స్పెక్టర్ స్థాయి అధికారిని పక్కన పెట్టడం పెద్ద విషయమేమీ కాదు.
అయినా అందరూ అతడికి బేరాలు పెట్టడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది.. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ బేరాలకు ఒప్పుకున్న ఇన్స్పెక్టర్ అజయ్ క్లైమాక్సులో మంచివాడిగా మారిపోతాడు.. అతడు అలా మంచివాడిగా మారిపోవడానికి గల సరైన కారణాలను కూడా దర్శకుడు ప్రోజెక్ట్ చేయలేకపోయాడు. అందుకే క్లైమాక్స్ కూడా మనకు ఏమంత థ్రిల్ పంచదు.
ఓవరాల్ గా సస్పెన్స్ థ్రిల్లర్ జానర్లో దర్శకుడు రాసుకున్న కథ కొత్తదేమీ కాదు కానీ కనీసం కథనంలో అయినా కొత్తదనం చూపించి ఉంటే బాగుండేది.
ఎవరెలా చేశారు?
ఈ సినిమా మొత్తానికి వన్ మ్యాన్ ఆర్మీ మనోజ్ బాజ్ పాయ్. ఇదే కథని అతడు కాకుండా ఇంకెవరినైనా పెట్టి సినిమా తీసి ఉంటే ఎప్పుడో అస్సాం వెళ్ళిపోయేది. మనోజ్ బాజ్ పాయ్ కనిపించినంతసేపు అట్రాక్షన్ బాగా నడిచింది.
ఎప్పటిలానే ఈ సినిమాలో కూడా మనోజ్ బాజ్ పాయ్ తన సహజ నటనతో మెప్పించాడు.. కాకపోతే దర్శకుడు మనోజ్ పాత్రని సరిగా రాసుకోలేదు అనిపిస్తుంది. క్లైమాక్స్ వరకు ఆ పాత్రని అవినీతి పరుడిగా చూపించి హఠాత్తుగా యూ టర్న్ తీసుకుని మంచివాడిగా ప్రోజెక్ట్ చేయడం కన్విన్సింగ్ గా లేదు.
శ్రద్ధాదాస్ పాత్రకు పూర్తిస్థాయిలో స్కోప్ దక్కలేదు అనిపిస్తుంది. సీఎం పాత్రలో దివ్యా దత్తా మొదటినుంచి చివరివరకు సీరియస్ మోడ్ లోనే కనిపిస్తుంది.. వేరే ఎక్స్ప్రెషన్స్ ఏమీ ఉండవు.
సాంకేతికత
సంజయ్ అందించిన బిజిఎం ఈ సినిమాని ఒక మెట్టు పైన నిలిపింది.
అరవింద్ సింగ్ ఫోటోగ్రఫీ పర్లేదు.. సినిమా అంతా లిమిటెడ్ యూనిట్ లోనే చిత్రీకరించడంతో ఫోటోగ్రఫికి పెద్ద స్కోప్ లేకుండా పోయింది.
నిర్మాణ విలువలు కూడా పర్లేదు.
విశ్లేషణ
సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ మూవీలు ఇష్టపడేవారికి గజబ్ రాత్ మూవీ ఓ మాదిరిగా నచ్చుతుంది. సినిమాలో మనోజ్ బాజ్ పాయ్ ఉన్నాడు కదా అని ఫ్యామిలీ మ్యాన్ రేంజిలో ఊహించుకుంటే డిజప్పాయింట్ అవుతారు. ఎటువంటి ఎక్స్పెక్టేషన్లు పెట్టుకోకుండా సినిమా చూసేవాళ్ళకి పెద్దగా ఇబ్బంది ఉండదు.
వ్యవస్థలలో పాతుకుపోయిన అవినీతి గురించి దర్శకుడు ఈ సినిమాలో వేలెత్తి చూపించాడు. గజబ్ రాత్ మూవీ లో హీరో మొదలుకుని సీఎం వరకు అందరూ అవినీతిపరులే.
చివరలో మనోజ్ బాజ్ పాయ్ ఒక మాట అంటాడు. మొదట్లో పోలీసులు రైడ్ చేసినప్పుడు దొరికిన రోజీ అనే వేశ్య.. తనని విడిచిపెడితే అతడి పక్కన పడుకుంటానని ఆఫర్ ఇస్తుంది.. మనోజ్ బాజ్ పాయ్ పోలీసోడు కదా.. ఆమె మాటలు నమ్మడు.. ఆమె మొబైల్ నెంబర్ తీసుకుంటాడు.. తన నంబర్ నిజమో కాదో చెక్ చేసుకోవడానికి మిస్డ్ కాల్ చేస్తాడు.. తర్వాత ఆమె దగ్గర అడ్రస్ తీసుకుని..ఈ అడ్రస్ లో నువ్వు నిజంగా ఉంటున్నావా? లేదా తప్పించుకోవడానికి చెప్తున్నావా? అంటాడు. కావాలంటే నీకు లైవ్ లొకేషన్ పంపిస్తా.. చెక్ చేసుకో అంటుంది ఆ వేశ్య.
తర్వాత తన ఇన్వెస్టిగేషన్లో పడి ఆమె సంగతి మర్చిపోతాడు.. కానీ ఆ వేశ్య మాత్రం ఇన్స్పెక్టర్ కి ఇచ్చిన మాటను గుర్తు చేస్తూ పదేపదే ఫోన్లు చేస్తూ ఉంటుంది. అందుకే మనోజ్ బాజ్ పాయ్ చివర్లో ” ఇంతమంది అవినీతిపరులం ఉన్న ఈ సమాజంలో నువ్వొక్క దానివే నిజాయితీగా మాట మీద నిలబడ్డావ్..” అని ఆమెను మెచ్చుకుంటాడు. ఈ సన్నివేశం ద్వారా..నిజాయితీ అనేది హోదా బట్టి రాదు.. వ్యక్తిత్వాన్ని బట్టి వస్తుంది అని దర్శకుడు సింబాలిక్ గా చెప్పిన తీరు బాగుంది.
ప్రస్తుతం ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో తెలుగులో కూడా అందుబాటులో ఉంది కాబట్టి వన్ టైమ్ వాచ్ మూవీ కింద చూడాలనుకునేవారు ఓ లుక్కేయండి.
నటీనటులు: మనోజ్ బాజ్ పాయ్, శ్రద్ధా దాస్, దివ్య దత్తా తదితరులు.
సంగీతం : సంజయ్
సినిమాటోగ్రఫీ: అరవింద్ సింగ్
నిర్మాత: నీరజ్ పాండే
దర్శకత్వం: రితేష్ షా
ఓటిటి: నెట్ ఫ్లిక్స్
స్ట్రీమింగ్ డేట్: 23-10-2026
రేటింగ్: 2.5/5
