వంగవీటి రాధా (Vangaveeti Radhakrishna ) గెలుపుతో విజయవాడ మేయర్ స్థానానికి జరిగిన ఎన్నికల ఉత్కంఠతకు తెర పడింది. అయితే అందరూ ముందుగానే ఊహించారు కాబట్టి రాధా గెలుపు ఎవరినీ ఆశ్చర్యపరచలేదు.. కాకపోతే రాధా కు వచ్చిన మెజారిటీనే అభిమానులను ఆశ్చర్యపరిచింది.. ఆయనకు రెండు నుంచి మూడు లక్షల మెజారిటీ వస్తుందని వాళ్ళు అంచనా వేశారు.. కానీ అందుకు భిన్నంగా 1,30,872 ఓట్ల మెజారిటీతో ఫలితాలు రావడంతో ఆయన అభిమానులు నిరుత్సాహ పడ్డారు. అయితే రాధా మెజారిటీ ఎందుకు తగ్గింది అనే విషయంలో విశ్లేషణ చేసుకుంటే కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

విజయవాడ మేయర్ ఎన్నికలు – ఒక విశ్లేషణ
ఒక సెగ్మెంట్ ఓటర్ల నిర్లిప్తత
విజయవాడ మేయర్ స్థానం పరిధిలో మొత్తం షుమారు ఎనిమిది లక్షల పదకొండు వేల ఓట్లు ఉండగా వారిలో కేవలం నాలుగు లక్షల చిలుకు ఓట్లు మాత్రమే పోలయ్యాయి.. మిగిలిన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు.. మొత్తం ఓటింగ్ 65 నుంచి 75 శాతం వరకు పోల్ అయి ఉంటే ఆ ప్రభావం వంగవీటి రాధా మెజారిటీ మీద కూడా ఉండేది. కానీ మొత్తం పోలైన ఓట్ల శాతం 55 లోపలే ఉంది. మాములుగా విజయవాడ రాజకీయ చైతన్యానికి పెట్టింది పేరు ..అలాంటి విజయవాడలో పోలింగ్ శాతం తక్కువ అవడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచింది. మేయర్ పదవికి పోటీ పడుతున్న అభ్యర్థులు ప్రశాంతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించుకోవడం చూసిన సదరు ఓటర్లు పోలింగ్ రోజు ఎందుకు బయటికి రాలేకపోయారో ఎవరికీ అర్ధం కాలేదు.
కుల రాజకీయాలు వర్కౌట్ కాలేదా?
ఎప్పుడైతే జనసేన నుంచి వంగవీటి రాధా అభ్యర్థిత్వం ఖరారు చేశారో ఆ క్షణానే విజయవాడలో మరోసారి కుల రాజకీయాలు చేయాలని కొందరు పెద్దలు ప్రయత్నించారు. అయితే అనుకోని పరిస్థితుల్లో మాజీ పోలీస్ ఇంటిలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వర రావు ఇండిపెండెంట్ అభ్యర్థిగా తెర మీదకి రావడంతో క్యాస్ట్ పాలిటిక్స్ చేద్దామనుకునేవారికి అవకాశం దొరికినట్టు అయ్యింది. ఏబీ వెంకటేశ్వర రావు సామాజిక వర్గం వారికి ఆ అవకాశం కల్పించింది. దాంతో ఎప్పుడో జరిగిపోయిన పాత గాయాలను తిరిగి రేపటానికి కొందరు ప్రయత్నాలు చేశారు. వంగవీటి రాధాకృష్ణ.. ఏబీ వెంకటేశ్వర రావుల మధ్య జరుగుతున్న రాజకీయ పరమైన పోటీని ఇరు సామాజిక వర్గాల పోటీగా చిత్రీకరించడానికి అదే పెద్దమనుషులు సోషల్ మీడియా వేదికగా పావులు కదిపారు.
ఫలించని ప్రయత్నాలు?
అయితే వంగవీటి రాధాకృష్ణ.. ఏబీ వెంకటేశ్వర రావులు తమ ప్రచారాల్లో వ్యక్తిగత విమర్శల జోలికి పోకుండా హుందాగా వ్యవహరించడంతో కొంతమందికి గొంతులో పచ్చి వెలక్కాయ పడింది. ఏబీ వెంకటేశ్వరరావు అయితే వంగవీటి రాధాకృష్ణ ను తాను వ్యక్తిగతంగా విమర్శించనని మీడియా సాక్షిగా ప్రకటన కూడా చేశారు. అంతేకాదు ప్రచారంలో ఎదురుపడిన ఇరువురు ఒకరినొకరు హగ్ చేసుకుని హుందాగా వ్యవహరించారు. ఈ ఒక్క సంఘటనతో విజయవాడలో పార్టీల ప్రచార పంథానే మారిపోయింది. ఇంత చక్కగా ఇంతటి ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగడం విజయవాడ ప్రజలను ఆకర్షించింది.
ఇదిలా ఉండగా వంగవీటి రాధాకృష్ణ కు పోటీగా దేవినేని అవినాష్ ను రంగంలోకి దించాలని కొంతమంది నాయకులు ప్రయత్నాలు చేశారు. కానీ దేవినేని అవినాష్ సమయస్పూర్తిగా వ్యవహరించి మేయర్ పదవి మీద తనకు ఆసక్తి లేదని బరిలోకి దిగకుండా తప్పుకున్నారు. అవినాష్ వెనుకడుగు వేయటానికి కారణాలు ఏవైనా ఆయన తీసుకున్న నిర్ణయంలో పరిణితి ఉందని విజయవాడ వాసులు భావిస్తున్నారు. చిన్నవాళ్ళు అయినా కూడా వంగవీటి రాధా.. దేవినేని అవినాష్ లు వర్గ , కుల రాజకీయాల జోలికి పోకుండా హుందాగా వ్యవహరించి విజయవాడ ప్రశాంతతకు భంగం కలిగించకుండా ఎవరి రాజకీయ మార్గాల్లో వాళ్ళు వెళ్ళడం మంచి పరిణామం.
క్రాస్ ఓటింగ్
ఏబీ వెంకటేశ్వరరావు వినూత్న పంథాలో తన ప్రచార కార్యక్రమాలు చేపట్టడంతో ఒక దశలో పోటీ ఆయనకు వంగవీటి రాధాకు మాత్రమే ఉంటుందని అందరూ భావించారు. ఈ క్రమంలో వైసీపీ అభ్యర్థి రాయన భాగ్యలక్ష్మి మూడో స్థానానికి పరిమితం అవుతారని రకరకాల విశ్లేషణలతో సోషల్ మీడియా హోరెత్తిపోయింది.
అందుకు అనుగుణంగానే ఏబీ వెంకటేశ్వరరావు సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేయడంలో దూసుకుపోయారు. అయితే ఆయన్ను అడ్డం పెట్టుకుని కుల రాజకీయాలు చేద్దామనుకున్నవారి ప్రయత్నాలు ఫలించలేదని ఎన్నికల ఫలితాలు నిరూపించాయి.
మరోపక్క వంగవీటి రాధాకృష్ణ కు అన్ని పార్టీలలో అభిమానులు ఉన్నారు. వీళ్ళకి పార్టీలతో సంబంధం లేదు.. వంగవీటి అనే పేరే ముఖ్యం.. రాధా ఏ పార్టీలో ఉన్నా సరే వ్యక్తిగతంగా ఆయనకే ఓటేస్తారు. కూటమిలో ఉన్న అన్ని పార్టీలలో రాధా కు అభిమానులు ఉన్నారు.. వీరు కాకుండా విపక్ష వైసీపీలో కూడా రాధాకు అభిమానులు ఉన్నారు. అందుకే కొన్ని వార్డులలో కార్పొరేటర్ స్థానానికి వైసీపీ అభ్యర్థికి ఓటేసిన వాళ్లే మేయర్ స్థానానికి మాత్రం వైసీపీకి కాకుండా రాధాకు వేసారు.
రాధా మెజారిటీని ఖచ్చితంగా అంచనా వేసిన మేనమామ
వంగవీటి రాధా మూడు లక్షల ఓట్ల మెజారిటీతో గెలుస్తారని ఆయన అభిమానులు ఢంకా బజాయించి మరీ చెప్పారు. చివరికి రత్నకుమారి కూడా తన కొడుకు భారీ మెజారిటీతో గెలుస్తారని ఇంటర్వ్యూలలో చెప్పారు. కానీ ఒకేఒక వ్యక్తి మాత్రం రాధా విషయంలో ఖచ్చితమైన అంచనాలు చెప్పారు.. అదీ పోలింగుకు రెండు రోజుల ముందే.. ఆయనే వంగవీటి రాధాకృష్ణ మేనమామ చెన్నుపాటి శ్రీనివాస్.
ఓ యూ ట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ వంగవీటి రాధాకృష్ణ కు లక్షా యాభై వేల వరకు మెజారిటీ రావచ్చని అంచనా వేశారు.. అంతేకాదు విజయవాడలో ఉన్న 86 స్థానాలకు గానూ షుమారు 75 స్థానాల్లో కూటమికి మెజారిటీ వస్తుందని కూడా అంచనా వేశారు.. మిగిలిన 11 స్థానాల్లో రెబెల్ అభ్యర్ధులు ఉండటంతో ఫలితాలు ఎలా ఉంటాయో ఖచ్చితంగా చెప్పలేనని ఆయన అన్నారు. ఇంచుమించుగా చెన్నుపాటి శ్రీను అంచనాలకు తగినట్టుగానే ఫలితాలు రావడం రాజకీయ వర్గాలను ఆశ్చర్య పరిచింది. మొత్తం 86 స్థానాల్లో వంగవీటి రాధా కు 79 స్థానాల్లో మెజార్టీ ఓట్లు పోలయ్యాయి.
రాధా మేయర్ స్థానానికి ఎందుకు పోటీ పడ్డారు?
రాజకీయ వర్గాల్లో కానీ.. రాధా అభిమానుల్లో కానీ ఆయన ఏరికోరి మేయర్ పదవికే ఎందుకు పోటీ చేస్తున్నారు? అని ఒక సందేహం ఉంది. షుమారు పన్నెండేళ్ళు రాజకీయ విరామం తర్వాత ప్రత్యక్ష ఎన్నికలతో రీ ఎంట్రీ ఇస్తున్న వంగవీటి రాధాకృష్ణ ను మంత్రిగా చూడాలని ఉందని.. కానీ ఆయన విజయవాడ వరకే పరిమితం అయ్యేలా మేయర్ పదవికి పోటీ పడటం తమకు అసంతృప్తిని కలిగించిందని మొదట్లో కొంతమంది అభిమానులు వాపోయారు కూడా.
కానీ ఏరికోరి రాధా మేయర్ బరిలోకి దిగడం వెనుక ఒక ప్రత్యేకమైన కారణం ఉంది.. ఆ కారణాన్ని కూడా రాధా తన అనుచరులతో పంచుకున్నారు.. పేదలకు ఇళ్ల పట్టాలు అందచేయడం అనేది తన తండ్రి వంగవీటి మోహన రంగా ఆశయమని.. ఆ ఆశయ సాధనలోనే పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని గతంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్ష చేసిన సంగతి గుర్తు తెచ్చుకున్నారు.. అందుకే ఆయన ఆశయాలను సాధించడానికి .. విజయవాడను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడానికి మేయర్ పదవి ద్వారా శాయశక్తులా కృషి చేస్తానని ఆయన చెప్తున్నారు.
ముగింపు
రాజకీయ విరామం తీసుకుని ఇన్నేళ్లు ఓపిగ్గా ఎదురుచూసిన వంగవీటి రాధాకృష్ణకు విజయవాడ నగర ప్రథమ పౌరుడి హోదా దక్కింది. ఈ పదవి ద్వారా రాధా విజయవాడ అభివృద్ధికి తగిన ప్రణాళికలు రూపొందించుకుని పని చేస్తే ఆయన పేరు చరిత్రలో నిలిచిపోతుంది. ఇక రాజకీయంగా.. వ్యక్తిగతంగా వంగవీటి రాధాకృష్ణ మరింత ఎదగడానికి మేయర్ పదవి నాంది అవుతుంది.
ఏపీ రాజకీయ రాజధాని విజయవాడలో మరోసారి వంగవీటి పట్టును నిలబెట్టుకునేందుకు మార్గం సుగమం అయ్యింది. ఇన్నాళ్లు స్తబ్దుగా ఉన్న రాధా రాజకీయ ప్రత్యర్థులు తాజా పరిణామాలను ఏ విధంగా తీసుకుంటారో చూడాలి. అతి చిన్న వయసులోనే ఎమ్మెల్యే పదవిని అధిష్టించిన వంగవీటి రాధా అనతికాలంలోనే విజయవాడ ప్రధమ పౌరుడి స్థాయికి ఎదగడం పట్ల ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు . ఏది ఏమైనా మేయర్ గా వంగవీటి రాధాకృష్ణ గెలుపు విజయవాడ రాజకీయాలను ఖచ్చితంగా మలుపు తిప్పుతాయి.
