ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసిపి ఘోరపరాజయానికి కారణాలు ఏంటి ?

Spread the love

ఏపీలో జరిగిన మున్సిపల్ ఎన్నికలలోనూ..ZPTC, MPTC ఎన్నికలలోనూ.. వైసీపీ ప్రతికూల ఫలితాలను పొందింది.. ఈ ఎన్నికల ఫలితాలను కూటమి సాధించిన అద్భుత విజయంగాను.. ఇక చంద్రబాబు.. పవన్ కళ్యాణ్ నాయకత్వాలకు ఎదురే లేదనీ.. జగన్ చాప్టర్ క్లోజ్ అనే అర్ధం వచ్చేలా వైసీపీ ఘోర పరాజయంగానూ ఎవరి మీడియాలలో వాళ్ళు విశ్లేషణలు చేశారు

సరే.. మీడియాల విశ్లేషణలు పక్కనబెడితే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ఓటమికి గల కారణాలను ఆ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కూడా ఆత్మ సాక్షిగా విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నిజానికి జగన్ మోహన్ రెడ్డి 2024 అసెంబ్లీ ఎన్నికల ఓటమినాడే ద్వితీయ శ్రేణి నాయకుల నివేదికలను పక్కనబెట్టి ఓటమికి గల కారణాలను స్వతంత్రంగా విశ్లేషించుకుని ఉంటే ఈ ఎన్నికల్లో కొంత మెరుగైన ఫలితాలు వచ్చేవేమో?

రాజకీయాల్లో గెలుపు.. ఓటములు సహజం.. అలా అని ఓటమిని లైట్ గా తీసుకుంటే భవిష్యత్తులో కూడా గెలుపుకు దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి.. ఇక్కడే నాయకత్వ ప్రతిభ అవసరం ఉంటుంది. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని గెలుపు బాటకు వ్యూహాలు రచించుకోవడంలోనే నాయకత్వ ప్రతిభ ఉంటుంది. 2019 లో జగన్ గెలుపుకీ..2024 లో ఆయన ఓటమికీ ఖచ్చితంగా కొన్ని ప్రత్యేక కారణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

2019 లో జగన్ గెలుపుకు కారణాలు ఏమిటి?

నిజానికి 2019 జగన్ సాధించిన విజయాన్ని సాధారణ గెలుపు ఖాతాలో వేయలేం..46 సంవత్సరాల యువకుడు 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబును ఓడించి ముఖ్యమంత్రి పీఠం అధిష్టించారు.. ఇది జగన్ సాధించిన గొప్ప విజయం.. సీఎం కుర్చీలో కూర్చోవడానికి ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి షుమారు నాలుగు దశాబ్దాలకు పైగా వేచి ఉండాల్సి వచ్చింది. కానీ జగన్ మోహన్ రెడ్డి సొంతంగా ప్రాంతీయ పార్టీ స్థాపించి ఏ పార్టీలతో పొత్తు లేకుండా సింగిల్ గా పోటీ చేసి దశాబ్దం లోపలే సీఎం కుర్చీలో కూర్చోగలిగారు.

ఈ విజయంలో జగన్ కృషి ఉంది.. కార్యకర్తల కష్టం ఉంది.. కుటుంబ సభ్యుల సహకారం ఉంది.. అప్పటికే ప్రజల్లో బలంగా పాతుకుపోయిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇమేజ్ ఉంది.

ఇక్కడ ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ కూడా చెప్పుకోవాలి . వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం మారిన రాజకీయ పరిస్థితుల్లో జగన్ కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చి సొంత పార్టీ పెట్టుకోవాల్సి వచ్చింది. మరోపక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అంశంలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం వల్ల ఏపీలో ఆ పార్టీ పూర్తి వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ పరిస్థితుల్లో జగన్ మోహన్ రెడ్డి వైఎస్సార్సీపీ జెండాతో ఏపీలో ఎన్నికలకు వెళ్లారు.. ఒక పక్కన సీబీఐ కేసులతో ఆయన షుమారు పద్దెనిమిది నెలలు జైల్లోనే ఉండటం.. అదే సమయంలో జగన్ తరపున ఆయన తల్లి విజయమ్మ.. చెల్లి షర్మిల వైఎస్సార్సీపీ జెండా భుజాన వేసుకుని పార్టీ కోసం ప్రజల్లో తిరిగారు. మరోపక్క పవన్ కళ్యాణ్ కూడా జనసేన జెండాతో ఏపీ ఎన్నికల రణరంగంలోకి దిగారు. అంతిమంగా ప్రజలు చంద్రబాబుకే (2014 ) పట్టం కట్టారు.

ప్రజలు బాబుకు పట్టం కట్టడానికి కూడా స్పష్టమైన కారణం ఉంది. విభజన చట్టం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన హక్కుల విషయంలో ఏపీ తరపున బలమైన వాయిస్ వినిపించగల నేతగా ప్రజలు బాబును నమ్మారు. పరిపాలనలో బాబుకున్న అనుభవాన్ని కూడా ప్రజలు బేరీజు వేసుకున్నారు. సొంత రాజధాని కూడా లేని ఏపీని అభివృద్ధి చేయాలంటే అనుభవం ఉన్న నేత అయితే బాగుంటుందని ఆలోచించి అక్కడి ప్రజలు చంద్రబాబుకు పట్టం కట్టారు.

కానీ బాబు ఐదేళ్ల పాలనా కాలంలో ఏపీ హక్కుల విషయంలో కేంద్రంతో పోరాడి కొత్తగా సాధించిన హామీలు ఏమీ లేవు.. ప్రత్యేక హోదా అంశం కానివ్వండి.. విభజన చట్టం హామీల అంశం కానివ్వండి.. చంద్రబాబు కేంద్రం నుంచి ఎటువంటి సానుకూల ప్రకటనలు రాబట్టలేకపోయారనే భావన ప్రజల్లో ఏర్పడింది. దానికి తోడు తన ఐదేళ్ల పాలనా కాలంలో బాబు రాజధాని విషయంలో తాత్కాలిక కట్టడాలు.. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు మినహా శాశ్వత ప్రాతిపదికన నిర్మాణాత్మకమైన అభివృద్ధిని చూపించలేకపోయారనే అసంతృప్తి ప్రజల్లో ఏర్పడింది.

ఈ పరిణామాలన్నీ 2019 లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కలిసి వచ్చాయి. దానికి తోడు జగన్ షుమారు మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి నేరుగా ప్రజలతో మమేకం అవడం ఆయన పార్టీకి కలిసి వచ్చిన మరో అంశం. అంతిమంగా జగన్ ఏపీ ముఖ్యమంత్రి పదవిని అధిష్టించారు.

ఇంతవరకు బాబు ఓటమికి.. జగన్ గెలుపుకు కొన్ని కారణాలు విశ్లేషించుకున్నాం కదా.. ఇప్పుడు 2024లో జగన్ ఓటమికి కారణాలు ఏంటో కూడా విశ్లేషించుకుందాం

జగన్ 2019-2024
మూడు రాజధానులు

ఏపీ రాజధాని అమరావతి విషయంలో తమ ఆకాంక్షలను జగన్ నెరవేరుస్తారని ప్రజలు భావించి ఆయనకు పట్టం కట్టారు. అప్పటికే ఆంధ్రప్రదేశ్ విభజించబడి ఐదేళ్లు పూర్తి అయ్యాయి.. అయినా ఏపీ రాజధాని పేరు అటు హైదరాబాదా? ఇటు అమరావతా? అని కూడా చెప్పుకోలేని సందిగ్ధంలో ప్రజలు ఉన్నారు.. విభజన చట్టంలో పదేళ్లు హైదరాబాదును ఉమ్మడి రాజధానిగా పరిగణించాలని పేర్కొన్నప్పటికీ ఏపీ ప్రజల ఆశలు అమరావతి శాశ్వత రాజధాని మీదే ఉంది.

కానీ ప్రజల ఆశల మీద నీళ్లు చల్లే విధంగా ప్రారంభంలోనే జగన్ మూడు రాజధానుల అంశాన్ని తలకెత్తుకున్నారు. అసలే తమ రాజధాని అమరావతా? హైదరాబాదా? అనే సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్న ప్రజలకు జగన్ మూడు రాజధానుల ప్రకటన అయోమయాన్ని కలిగించింది. మరి జగన్ ప్రతిపాదనల మేరకు మూడు రాజధానులు అయితే ఇప్పటివరకు తాత్కాలిక ప్రాతిపదికన వేల కోట్లు ఖర్చు పెట్టిన అమరావతి పరిస్థితి ఏంటి? ఖర్చు పెట్టిన సొమ్ములను ఎలా రికవరీ చేస్తారు? పోనీ అమరావతిని ఏదైనా ప్రత్యామ్నాయ వనరుగా గుర్తిస్తారా? లేకపోతే అమరావతి అనేదే మ్యాపులో కనిపించకుండా పోతుందా? ఒకపక్కన అమరావతికి ఖర్చు పెట్టిన కోట్లాది రూపాయల ప్రజాధనం సంగతి గాలికి వదిలేసి ఇప్పుడు మూడు రాజధానుల అంశం తలకెత్తుకుంటే మళ్ళీ కొత్తగా మొదటినుంచి ఖర్చు పెట్టాలి కదా? ఈ ఖర్చులకు నిధులు ఎక్కడి నుంచి వస్తాయి? పోనీ కేంద్రం నుంచి గట్టి హామీ ఏమన్నా ఉందా? ఇత్యాది ప్రశ్నలు ప్రజల మనసుల్లో మొదలయ్యాయి.

కానీ ఆ ప్రశ్నలకు జగన్ ప్రభుత్వం నుంచి సరైన సమాధానం రాలేదు. పోనీ జగన్ తన ఐదేళ్ల పాలనా కాలంలో మూడు రాజధానుల విషయంలో నిర్మాణాత్మకమైన కార్యాచరణ కానీ..అభివృద్ధిని కానీ ఏమన్నా చేసి చూపించారా? అంటే ఐదొందల కోట్లు ఖర్చు పెట్టి కట్టించిన రుషికొండ మినహా చెప్పుకోదగ్గ కంటికి కనిపించే కట్టడాలు ఏమీ లేవు. అమరావతిని వదిలేసి కొత్తగా మూడు రాజధానుల ప్రపోజల్ తెచ్చి జగన్ సాధించింది ఏమీ లేకపోగా గందరగోళ రాజధాని విషయంలో పరిస్థితులకు అవకాశం కల్పించారు. ఈ మధ్య మావిగన్ అనే కొత్త ప్రతిపాదన తెచ్చి మూడు రాజధానుల అంశాన్ని పక్కనబెట్టడంతో రాజధాని విషయంలో ఆయన పర్మనెంట్ స్టాండ్ ఏంటో జనాలకు అర్ధం కాలేదు.

కుటుంబ విభేదాలు

ఇంట గెలిచి రచ్చ గెలవమని పెద్దలు ఎప్పుడో సామెత చెప్పారు. మరీ ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్నవారికి ఈ సామెత వర్తిస్తుంది.. ఎందుకంటే వారు ప్రజా జీవితాల్లో ఉంటారు.. మహాకవి శ్రీ శ్రీ చెప్పినట్టు ప్రైవేటులో మీ ఇష్టం.. పబ్లిక్ లోకి వస్తే ఎన్నైనా అంటాం అన్నట్టు కుటుంబ విభేదాలు జగన్ ప్రతిష్టను మసకబారేలా చేశాయి.

ముఖ్యమంత్రి పదవి అధిష్టించిన తర్వాత జగన్ కుటుంబ వివాదాల్లో పీకల్లోతు మునిగిపోయారు. సొంత చెల్లెలే తన అన్న అవినీతి పరుడని.. రాజకీయాల్లో తమను కరివేపాకులా వాడుకుని వదిలేశారని.. ఆస్తి పంపకాల్లో కూడా అన్యాయం చేశారని రచ్చకెక్కింది. ఎప్పుడైతే కుటుంబ గొడవలు వీధుల్లోకి వచ్చాయో.. రాజకీయ ప్రత్యర్ధులతో పాటు ప్రజల దృష్టి కూడా ఆ కుటుంబం పైన పడింది.

చివరికి సొంత చెల్లి జగన్ రాజకీయ ప్రత్యర్ధి కాంగ్రెస్ పార్టీకి చీఫ్ గా బాధ్యతలు స్వీకరించి ఆయన మీదే ఆరోపణలు చేస్తే ఖచ్చితంగా ఆ ప్రభావం జగన్ మీద ఉంటుంది. కుటుంబ విభేదాలను నాలుగు గోడల మధ్యనే పరిష్కరించుకుని ఉంటే జగన్ ప్రతిష్టకు ఇలాంటి మచ్చ వచ్చి ఉండేది కాదు.

ఈ విషయంలో చంద్రబాబు సమయస్పూర్తిగా వ్యవహరించారు అనిపిస్తుంది. అంతటి ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా పార్టీని చీల్చినా ఆయన కొడుకులను.. ఇతర కుటుంబ సభ్యులను తనవైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయ్యారు. హరికృష్ణ లాంటి వాడే తండ్రికి వ్యతిరేకంగా చంద్రబాబు పంచన చేరారు. ఇక బాలకృష్ణతో వియ్యమందుకుని మరింత దృఢమైన బంధుత్వం ఏర్పరుచుకున్నారు. చంద్రబాబు నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల నుంచి ఎటువంటి వ్యతిరేకతలు రాకుండా జాగ్రత్తలు పడ్డారు.. అంతో కొంతో తన తమ్ముడు రామ్మూర్తి నాయుడితోనే చంద్రబాబు ఇబ్బంది పడ్డారు.

బాబాయ్ కేసు

బాబాయ్ వివేకా హత్య కేసు కూడా జగన్ ను రాజకీయంగా ఇబ్బంది పెట్టే అంశమే.. టీడీపీ మీద అయితే కక్ష సాధింపు కేసు అని డిఫెన్స్ చేసుకోవచ్చు.. కానీ సొంత బాబాయ్ కూతురే ఈ హత్యలో అనుమానాలు వ్యక్తం చేస్తుండేసరికి సహజంగా ప్రజల ఆలోచనా సరళి మారుతుంది. వివేకా హత్య కేసు విషయంలో కూడా జగన్ తన బాబాయ్ కూతురితో మాట్లాడి ఆమె అనుమానాలను నివృత్తి చేసి ఉంటే బాగుండేది.

దూషణల పర్వం

రాజకీయ నాయకుల సంగతి ఎలా ఉన్నా ప్రజలు హుందాతో కూడిన రాజకీయాలనే కోరుకుంటారు. కానీ ఎప్పుడైతే నాయకులు విధానపరమైన నిర్ణయాల మీద కాకుండా వ్యక్తిగత దూషణలకు దిగుతారో వారు ప్రజల దృష్టిలో పలుచన అయిపోతారు. మంత్రి స్థాయిలో ఉండి కొడాలి నాని.. ఎమ్మెల్యే పదవిలో ఉండి వల్లభనేని వంశీ చంద్రబాబును వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ చేసిన దూషణలు రాయటానికి కూడా వీళ్లేనంతగా మారిపోయాయి.

ఎంతకాదన్నా చంద్రబాబు సీనియర్ నాయకుడు.. ఉమ్మడి ఏపీకి కానివ్వండి.. విభజిత రాష్ట్రానికి కానివ్వండి మెజార్టీ ప్రజల మద్దతుతో ముఖ్యమంత్రిగా ఎన్నిక కాబడ్డారు..అలాంటి సీనియర్ నాయకుడి విషయంలో వైసీపీ నాయకులు వాడిన భాష అసభ్యకరంగా మారడంతో ప్రజల్లో ఒకరకమైన ఏహ్యా భావన కలిగింది.. ఆఖరికి చంద్రబాబు తట్టుకోలేక భోరున ఏడవడంతో ప్రజల్లో ఆయన మీద సింపతీ ఏర్పడింది.

పార్టీ అధినేతగా జగన్ ఇటువంటి వ్యక్తిగత దూషణలకు అడ్డుకట్ట వేయాల్సింది.. కానీ ఆయన నుంచి అటువంటి ప్రకటనలు రాకపోవడంతో వీరి వాఖ్యలకు జగన్ పరోక్ష మద్దతు ఉందనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్లింది. అది జగన్ నాయకత్వ శైలి మీద నెగిటివ్ ప్రభావం చూపించింది. ఏం? టీడీపీ నాయకులు ఇంతకన్నా ఎక్కువ దూషించలేదా? అనకండి.. ఖచ్చితంగా దూషించారు.. జగన్ భార్య భారతిని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ కొంతమంది టీడీపీ నేతలు కూడా దూషించారు.. అందులో సందేహమే లేదు.. ఎన్నికలలో టీడీపీకి ఆ దూషణల ఫలితం కనిపించింది. అందుకే రెండోసారి ముఖ్యమంత్రి పదవి అధిష్టించిన చంద్రబాబు తమ పార్టీ కార్యకర్తలకు..నాయకులకు.. వ్యక్తిగత దూషణల విషయంలో మీడియా సాక్షిగా బహిరంగంగానే కఠినమైన హెచ్చరికలు చేశారు.

సంక్షేమమా ? అభివృద్ధి మంత్రమా?

ఈ రెండిటిలో జగన్ సంక్షేమ పథకాలనే ఎక్కువగా నమ్ముకున్నారు. అందుకే ఆయన తన పదవీ కాలంలో సంక్షేమ పథకాల మీదే ఎక్కువగా ఫోకస్ పెట్టారు.. బటన్ నొక్కగానే లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు పడేలా ఏర్పాట్లు చేశారు.. నిజంగా జగన్ సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి బలంగా వెళ్ళాయి.. నెల తిరిగేసరికి డబ్బులు తమ ఖాతాల్లో పడుతుండేసరికి లబ్ధిదారుల సంతోషాలకు పగ్గాలు లేవు.. ఇంటిలిజెన్స్ నివేదికలు కూడా అదే విషయాన్ని చెప్పాయి.

కానీ ఇక్కడ జగన్ ఒక చిన్న విషయాన్ని మర్చిపోయారు.. సంక్షేమ పథకాల వల్ల తమ ఓటు బ్యాంక్ ఎంతవరకు పెరుగుతుందనేది ఆయన ఖచ్చితంగా అంచనా వేయలేకపోయారు.. అంచనా వేసి ఉంటే ఆయన ఆలోచనా తీరు ఇంకో రకంగా ఉండేదేమో? ఎందుకంటే ఓటమి తర్వాత జగన్ మీడియాతో మాట్లాడుతూ అక్కచెల్లెళ్ళు.. అవ్వాతాతలు తనకు ఎందుకు ఓటెయ్యలేదో అని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ కేవలం సంక్షేమ పథకాలు మాత్రమే గెలుపు మంత్రంగా పనిచేయవనే వాస్తవాన్ని ఆయన గమనించలేకపోయారు. గతంలో చంద్రబాబు కూడా పసుపు కుంకుమ అనీ ఇంకా కొన్ని సంక్షేమ పథకాలను నమ్ముకుని ఓడిపోయారు.

ఇక జగన్ చేపట్టిన పథకాల్లో నాడు – నేడు కార్యక్రమం.. రోగులకు అంబులెన్స్ సేవలు వంటి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నా సరైన ప్రచారం చేసుకోలేకపోవడంతో పూర్తిస్థాయిలో ప్రజల్లోకి వెళ్లలేదు.

చంద్రబాబు అరెస్ట్

జగన్ చేసిన అతి పెద్ద పొరపాటు సరిగ్గా ఎన్నికల ముందు చంద్రబాబును అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం.. ప్రతికూల అవకాశాలను కూడా తనకు అనుకూలంగా నేర్చుకోవడంలో బాబు దిట్ట.. ఈ అవకాశాన్ని బాబు చక్కగా వినియోగించుకున్నారు.. జైలు బయటే టీడీపీతో పొత్తుకు పవన్ కళ్యాణ్ ప్రకటన చేయడం ఆయనకు పూర్తిగా కలిసొచ్చిన అంశం. 53 రోజుల తన జైలు జీవితం నుంచి ఆయన ప్రజల సానుభూతిని పూర్తిస్థాయిలో పొందగలిగారు.

అప్పటిదాకా ఇంటికే పరిమితం అయిన బాబు భార్య భువనేశ్వరి ఇంటింటికీ తిరిగి తన భర్తను జైల్లో పెట్టడం మీద ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకేముంది? అటు మహిళా ఓటర్లలోనూ.. ఇటు సాధారణ ఓటర్లలోను బాబు పట్ల సానుభూతి వచ్చేసింది.. ఆ సానుభూతి 2024 ఎన్నికల్లో ఓట్ల రూపంలో బయటపడింది.

ఇక్కడ తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి చేసిన తెలివైన పని గురించి చెప్పుకోవాలి.. ఫోన్ ట్యాపింగ్ కేసులో.. కార్ రేసింగ్ కేసులో కేటీఆర్ మీద.. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి కేసులో కేసీఆర్.. హరీష్ రావుల మీద కేసులు నడుస్తున్నా ఇప్పటివరకు వాళ్ళ అరెస్టుల జోలికి రేవంత్ రెడ్డి పోలేదు.. అరెస్ట్ చేస్తే ఏమౌతుంది? జైలు నుంచి బయటికి వచ్చి సీఎం కుర్చీలో కూర్చుంటారు..అంతేగా అని ఆయన పార్టీ నాయకులతో చమత్కారంగా అన్నట్టు కూడా కొన్ని ఆఫ్ లైఫ్ వార్తలు బయటికి వచ్చాయి.

జగన్ 2.0

సరే..2024 ఎన్నికల్లో జగన్ ఓడిపోయారు.. తన అక్కచెల్లులు..అవ్వా తాతలు తనకు ఎందుకు ఓటెయ్యలేదో అని బాధపడిన ఆయన తర్వాత కాలంలో తన ఓటమికి కారణాలను విశ్లేషించుకున్నారో లేదో తెలీదు కానీ ఆయన ఆలోచనా తీరులో కొంత మార్పు అయితే కనిపించింది. దానిలో భాగమే జగన్ 2.0 కార్యాచరణ ప్రణాళిక.

కార్యకర్తలకు తనకు గ్యాప్ పెరిగిందనే విషయం ఆయన గుర్తించారు. అందుకే కార్యకర్తలను నేరుగా కలవాలని నిర్ణయించుకున్నారు. ఇది మంచి ఆలోచన.. ఏ పార్టీకైనా అందరికన్నా ముందుండి జెండా భుజాన మోసి గెలిపించేది కార్యకర్తలే.. జగన్ సీఎం గా ఉన్న కాలంలో కార్యకర్తల సంగతి అటుంచి ద్వితీయ శ్రేణి నాయకులకు కూడా ఆయన అందుబాటులో ఉండరనే అపప్రధ ఉండేది..

చాలావరకు విజయ్ సాయి రెడ్డి ద్వారానో.. సజ్జల రామకృష్ణా రెడ్డి ద్వారానో వ్యవహారాలు జరిగిపోయేవి.. జగన్ కోటలో రాజు వలె మరీ ముఖ్యులకు మినహా ఎవరికీ అపాయింట్మెంట్ ఇవ్వరని ఆయన పార్టీ ఎమ్మెల్యేలే గొణుక్కున్నారు. ఈ అంశం కూడా జగన్ దృష్టికి వచ్చినట్టు ఉంది.. కార్యకర్తలకు అందుబాటులోకి వస్తున్నారు.

ఇక వ్యక్తిగత దూషణల విషయంలో కొడాలి నాని.. వల్లభనేని వంశీ వంటి నాయకులు ప్రస్తుతం తాత్కాలిక మౌనం పాటించారు కాబట్టి గతంలో కంటే కొంత మెరుగు కానీ పూర్తిస్థాయిలో అదుపు కాలేదు. అంబటి రాంబాబు వంటి సీనియర్ నాయకుడు చేసే వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి.. ఆయనకు తోడు మరో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ రెచ్చగొట్టే వాఖ్యలు కూడా వైసీపీ పార్టీ ప్రతిష్టకు హాని చేసేవే కానీ ప్రయోజనం అయితే లేదు.. ఇక రప్పా రప్పా అనే సినిమా డైలాగులు థియేటర్లో పేలుతాయేమో కానీ రాజకీయాల్లో జనాలు హర్షించరు.. అంతిమంగా ప్రజలు కోరుకునేది ఒకటే.. హుందాతో కూడిన రాజకీయాలు. ఈ విషయంలో జగన్ తన పార్టీ నాయకులకు ఉద్బోధ చెయ్యాల్సిన అవసరం ఉంది.

మారిన ఓట్ల శాతం

2024 లో ఓడిపోయినప్పుడు జగన్ ఒక మాటన్నారు.. ఓడిపోయినా తమకు 40 శాతం ఓట్ బ్యాంక్ ఉందనీ.. ఈసారి ఎన్నికల్లో మరింత పుంజుకుంటామని ఆత్మ విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే రెండేళ్ల వ్యవధానం తర్వాత తాజాగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ఓట్ల శాతం 40 నుంచి 35 కి పడిపోయింది.. ఇది గమనించవలసిన విషయం.. ప్రతిపక్ష స్థానంలో తమ పార్టీ పని తీరు పట్ల ఓటర్లు జారీ చేసిన ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక.. దీన్నిబట్టి 2024 ఓటమి తర్వాత నుంచి ఇప్పటివరకు తన తప్పొప్పులను సమీక్షించుకుని అటువంటి పొరపాట్లు పునరావృతం కాకుండా జాగ్రత్త పడమని జగన్ కు ఓటర్లు స్పృష్టమైన సంకేతాలు ఇచ్చారు.

ప్రస్తుతం వచ్చిన 35 ఓట్ల శాతం మీద కూడా కొంతమంది వైసీపీ నాయకులు కూటమి పార్టీలకు విడివిడిగా వచ్చిన ఓట్ల శాతంతో పోల్చుకుని విశ్లేషణలు చేస్తున్నారు. కానీ 2024 లో కూడా ఇదే కూటమితో తలపడినప్పుడు వైసిపికి వచ్చిన ఓట్ల శాతం 40 అని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటికైనా మించిపోయింది లేదు..రాజకీయాల్లో గెలుపోటములు సహజం .. తమ పార్టీ తీసుకునే విధానపరమైన నిర్ణయాలలో ఎక్కడ పొరపాట్లు జరుగుతున్నాయో జగన్ గుర్తించి సరిదిద్దుకుంటే చాలు 2029 ఎన్నికల్లో ఫలితాలు సానుకూలంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *