Sub – Inspector Yugandhar Movie (OTT) – ఆది నటించిన సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందంటే?

Spread the love

ఆది సాయికుమార్ హీరోగా నటించిన సబ్ ఇన్స్పెక్టర్ యుగంధర్ ( Sub Inspecror Yugandhar) సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ అక్టోబర్ 30 , 2026 నుంచి ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. అంతకుముందు అక్టోబర్ 2 న థియేటర్లో రిలీజ్ అయిన ఈ సినిమా నెగిటివ్ రెస్పాన్స్ తెచ్చుకున్నా ఓటిటీలో మాత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా సస్పెన్స్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ జానర్ మూవీల్లో నటిస్తూ ఆది యాక్షన్ హీరోగా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు.

ఇప్పుడు సబ్ ఇన్స్పెక్టర్ యుగంధర్ మూవీ ఎలా ఉందో చూద్దాం.

కధేంటంటే?

భగవద్గీతలోని శ్లోకాన్ని కోట్ చేస్తూ ప్రముఖ నవలా రచయిత.. ఈ సినిమాలో డాక్టర్ సోమ సుందరం పాత్ర పోషించిన యండమూరి వీరేంద్ర నాథ్ తన మనవడికి చెప్పే డైలాగుతో సినిమా మొదలౌతుంది.

దేవుడు ఎక్కడో ఉండడు.. సేవ చేసే ప్రతి ఒక్కరిలో ఉంటాడు అని ఆయన తన మనవడికి చెప్తున్న సమయంలోనే తన భర్త ఆరోగ్యం క్షీణించిందని.. ఎలాగైనా ఆయనను కాపాడమని ఒక మహిళ వేడుకోవడంతో డాక్టర్ సోమసుందరం వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్లి అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న ఆ మహిళ భర్తకు మూలికలతో కూడిన సిరప్ ఇవ్వడంతో ఆయన కోలుకుంటాడు. దాంతో తమ పాలిట దేవుడిలాంటి వారు అని ఆ మహిళ డాక్టర్ సోమసుందరం కాళ్లు మొక్కుతుంది.

ఈ సంఘటన అతడి మనవడు గుణ సుందరం మనసులో బలంగా నాటుకుపోతుంది. తాను కూడా పెద్దయ్యాక తాత లా డాక్టర్ అయి రోగులకు సేవ చేస్తూ దేవుడిని అనిపించుకోవాలని అనుకుంటాడు. అయితే అదే సమయంలో ఊహించనివిధంగా యాక్సిడెంట్ జరిగి డాక్టర్ సోమసుందరం మరణిస్తాడు.. తాత శవం చూసిన గుణ సుందరం షాక్ తో ఫోబియా బారిన పడతాడు.

మరోపక్క సబ్ ఇన్స్పెక్టర్ యుగంధర్ (ఆది సాయికుమార్) కూడా చిన్నప్పుడు జరిగిన ఒక సంఘటనలో తన తండ్రి మరణానికి తానే కారకుడిని అనే అపరాధ భావనతో ఒక రకమైన ఫోబియాలో ఇరుక్కుపోతాడు.

ఈ పరిస్థితుల్లో ఒక యాక్సిడెంట్లో అనుమానాస్పదంగా మరణించిన ఐఏఎస్ ఆఫీసర్ కేసు సబ్ ఇన్స్పెక్టర్ యుగంధర్ ముందుకు వస్తుంది. కానీ ఈ కేసులో యుగంధర్ నిర్లక్ష్యంగా వ్యవహరించి ఐఏఎస్ ఆఫీసర్ డెడ్ బాడీని క్రిమినల్స్ కు అప్పగించాడనే ఆరోపణతో పోలీస్ కమిషనర్ (శివకృష్ణ ) అతడ్ని సస్పెండ్ చేస్తూ ఎలాగైనా 24 గంటల్లో ఆ ఐఏఎస్ ఆఫీసర్ బాడీని ట్రేస్ చేసి తీసుకురమ్మని వార్నింగ్ ఇస్తాడు. దాంతో క్రిమినల్స్ చేతికి చిక్కిన ఐఏఎస్ ఆఫీసర్ బాడీని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి సబ్ ఇన్స్పెక్టర్ యుగంధర్ బయలుదేరతాడు.

అసలు యాక్సిడెంట్లో చనిపోయిన ఐఏఎస్ ఆఫీసర్ ఎవరు? మారు పేర్లతో క్రిమినల్స్ ఆ ఐఏఎస్ ఆఫీసర్ బాడీని ఎందుకు తీసుకెళ్లారు? కొంతమంది వీఐపీలు సడెన్గా హార్ట్ ఎటాక్ తో హాస్పిటల్లో చేరడం వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? ఈ కేసుకీ.. గుణ సుందరానికి ఉన్న లింక్ ఏంటి? చివరికి ఇన్స్పెక్టర్ యుగంధర్ ఈ కేసును ఎలా చేధిస్తాడు? అనేది మిగిలిన కథ.

ఎలా ఉంది?

ఈ మధ్య కాలంలో ప్రముఖ నటుడు సాయికుమార్ కొడుకు ఆది సాయికుమార్ క్రైమ్ థ్రిల్లర్ మూవీల్లో నటిస్తూ యాక్షన్ హీరోగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు.

ప్రముఖ నవలా రచయిత యండమూరి వీరేంద్ర నాథ్ తో దర్శకుడు ప్లాన్ చేసిన ఓపెనింగ్ సీన్ మంచి పాజిటివ్ గా ..సందేశాత్మకంగా బాగుంది. యండమూరి వీరేంద్ర నాథ్ కనిపించింది కాసేపే అయినా చక్కటి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇకముందు ఆయన క్యారక్టర్ ఆర్టిస్టుగా మరిన్ని సినిమాలు చేయడానికి ఈ సినిమా నాంది అవుతుంది.

ఇక సినిమా విషయానికి వస్తే సైకలాజికల్ డిజార్డర్ నేపథ్యంలో దర్శకుడు సబ్ ఇన్స్పెక్టర్ యుగంధర్ సినిమాకి కథ అల్లుకుని తెరకెక్కించారు. అయితే గతంలో కూడా సైకలాజికల్ డిజార్డర్ నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి. అయితేనేమి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కి మొదలు.. చివర అంటూ ఏమీ ఉండదు కదా? అందుకే ఈ ప్లాట్ లో ఎన్ని కథలైనా రాసుకోవచ్చు.. ఒక దర్శకుడు హీరోకి ఆడవాళ్లంటే పడదనే సైకలాజికల్ డిజార్డర్ నేపథ్యంలో కథ రాసుకున్నాడు అనుకోండి.. ఇంకో దర్శకుడు హీరోకి మగవాళ్ళను చూస్తే ఎలర్జీ అనే సైకలాజికల్ డిజార్డర్ సృష్టించి కథ రాసుకుంటారు.. దీనికి ఎవరికీ అర్ధం కాని మెడికల్ భాషలో పేర్లు పెడితే సరి.

సరే.. ఈ సినిమా కథకి కూడా సైకలాజికల్ డిజార్డర్ మెయిన్ ప్లాట్ అని చెప్పుకున్నాం కదా? సాధారణంగా చాలా సినిమాల్లో విలన్లకు ఫోబియా ఉంటుంది.. కానీ ఈ సినిమాలో విలన్ కీ.. హీరోకి కూడా సైకలాజికల్ ఫోబియాలు ఉంటాయి.. వీళ్ళిద్దరికీ తోడు దర్శకుడు ఇంకో పిల్లోడికి కూడా ఫోబియా అంటించేసారు.

ఈ ముగ్గురి ఫోబియాలలో విలన్ ఫోబియానే ప్రేక్షకులను కాస్త ఎంగేజ్ చేస్తుంది. ఇక ఆది సాయికుమార్ తో పాటు ఐఏఎస్ ఆఫీసర్ కొడుక్కి వచ్చిన ఫోబియాలు కొద్దిగా విసిగిస్తాయి. ఆది సాయికుమార్ ను ఫోబియా నుంచి బయటపడేయాలని ప్రయత్నించి హీరోయిన్ కూడా విసిగిపోయి వదిలేస్తుంది. ఆ ఫోబియా అంతమందిని విసిగిస్తుంది అన్నమాట.

ఇక చాన్నాళ్లకు నటుడు శివకృష్ణ పోలీస్ కమిషనర్ పాత్రలో కనిపించారు కదా అని ఉత్సాహంతో చూస్తే ఆయన పాత్రను దర్శకుడు సరిగా డిజైన్ చేయకపోవడంతో చివరికి నిరుత్సాహం వస్తుంది.

ఆది సాయికుమార్.. పోలీస్ కమిషనర్ శివకృష్ణ ల మధ్య జరిగిన ఎపిసోడ్లు గిల్లికజ్జాల మాదిరి అనిపించి తేలిపోతాయి.. ఎందుకో ఆ సన్నివేశాల్లో ఉండాల్సిన్నంత సీరియస్నెస్ లేదు అనిపిస్తుంది. లాజికల్ గా కూడా ఒక కమిషనర్ స్థాయి అధికారికీ.. సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారికి సన్నివేశాలు సింక్ కావు.

ఫస్టాఫ్ లో ఐఏఎస్ ఆఫీసర్ డెడ్ బాడీని క్రిమినల్స్ ఎత్తుకెళ్లిపోవడం.. ఆ డెడ్ బాడీను వెతికి పట్టుకోవడం కోసం ఇన్స్పెక్టర్ యుగంధర్ రంగంలోకి దిగడం.. ఈ క్రమంలో వచ్చే యాక్షన్ సన్నివేశాలు థ్రిల్ పంచుతాయి. అదే ఫ్లోలో కథనం ముందుకు సాగి ఉంటే బాగుండేది. కానీ ఈ మధ్యలో వచ్చే కొన్ని సాగతీత సన్నివేశాలు విసిగిస్తాయి. తిరిగి ప్రీ క్లైమాక్స్ నుంచి కథనం పుంజుకుంటుంది.

ఇక జెస్సీ పాత్ర ద్వారా గుణ సుందరం ప్లాన్ ఏంటో తెలిసిన తర్వాత కథనం అంతా ప్రిడిక్టబుల్ గా సాగుతుంది. దానికి తగ్గట్టుగానే క్లైమాక్స్ కూడా ఉంటుంది. ఇక ఈ సినిమాలో హీరో పాత్ర తర్వాత విలన్ పాత్రకు కూడా అంతే స్కోప్ ఉంటుంది. కానీ గుణ సుందరం పాత్రకు ఉన్న స్కోప్ కి తగ్గట్టుగా నటుడి పెర్ఫార్మెన్స్ లేదు. అపరిచితుడు మాదిరి ముఖం మీద పడే జుట్టు మినహా నటనతో ఆయన భయపెట్టింది పెద్దగా ఏమీ లేదు.

ఇక ఈ సినిమాలో వయోలెన్స్ గురించి చెప్పుకోవాలంటే ప్రేక్షకులకు దర్శకుడు బిగ్ రిలీఫ్ ఇచ్చాడనే చెప్పుకోవాలి. ఈ మధ్య వస్తున్న క్రైమ్ థ్రిల్లర్ సినిమాలలోలా సొరకాయల మాదిరి సగానికి కోసేయడాలు లేవు.. టీఎంసీల లెక్కన ఎరుపు రంగును పారించడాలు లేవు. ఈ విషయంలో దర్శకుడు చాలా మొహమాటపడ్డారు.. ఎంతలా అంటే ఒక సీన్లో గుణ సుందరం ఒక డెడ్ బాడీని కోసెయ్యాలి.. అలా కోసేస్తే గాల్లో ఎక్కడ ఎరుపు రంగు చిందుతుందో అనే భయంతో విలన్ చేత గాల్లోనే కత్తిని తిప్పించారు. ఇదీ ఒకందుకు మంచిదే.. మితిమీరిన హింస చూపించి జనాల్ని హింస పెట్టే బదులు సాధ్యమైనంతవరకు మినిమమైజ్ చేసేసారు.

ఇక లవ్ ట్రాక్ విషయాన్ని దర్శకుడు లైట్ తీసుకున్నారు. హీరో.. హీరోయిన్ల మధ్య డ్యూయెట్లులేవు.. రొమాన్స్ లేదు.. మధ్యలో పంటికింద రాయిలా తగులుకునే ఐటెం సాంగులు కూడా లేవు. అలాగే సీరియస్ టోన్ లో సాగే కథనాన్ని చెడగొట్టేలా తగులుకునే కామెడీ జోలికి కూడా దర్శకుడు పోలేదు. సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ జానర్ లో తాను కథ ఎలా రాసుకున్నారో అలానే తెర మీదకు ఎక్కించారు. ఇదీ ఒకరకంగా మంచిదే అయ్యింది.. ఎందుకంటే కథనం మొదటినుంచి చివరివరకు ఒకే టెంపోలో సాగింది.

సీనియర్ నటులు ఏదో ఒక సీన్లో కనిపించి తన బ్రాండ్ వాల్యూతో కొడుకులను కూడా ప్రమోట్ చేసుకునే సంప్రదాయం అనాదిగా సినిమాల్లో ఉంటూ వస్తూనే ఉంది కదా? ఈ సినిమాలో కూడా సాయి కుమార్ క్లైమాక్సులో కనిపించి ప్రేక్షకుల చేత విజిల్స్ వేయించుకున్నారు. ఇన్నేళ్లు అయినా సాయికుమార్ లో గ్రేస్ తగ్గలేదు అని క్లైమాక్స్ సీన్ చూస్తే అర్థమౌతుంది.

ఎవరెలా చేశారు?

సాయి కుమార్ ఫ్యామిలీలో మిగిలిన వాళ్ళు క్యారక్టర్ ఆర్టిస్టులుగా సెటిల్ అవ్వగా..ఆది సాయికుమార్ మాత్రం యాక్షన్ హీరోగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇలాంటి పాత్రలకు ఆది అయితే సరిగా సరిపోతాడు అనే పేరు వస్తే చాలు కదా నటుడిగా ఒక మెట్టు పైకి ఎదగటానికి.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర ( మేఘ లేఖ ) అనేది నామ మాత్రమే..ఈ సినిమాలో హీరోయిన్ హీరోతో మాట్లాడుతూ.. నేను నీ గర్ల్ ఫ్రెండ్ గా చెప్పట్లేదు.. ఒక సైక్రియాట్రిస్ట్ గా చెప్తున్నా అంటుంది. అక్కడితో ఆ పాత్ర స్కోప్ ఏంటో మనకి అర్థమైపోతుంది.

ఇక ఈ సినిమాలో విలన్ గుణ సుందరం పాత్రకు చాలా స్కోప్ ఉంది. కానీ పాత్రకు తగ్గట్టు ఆయన నటన లేదు. చాలా సన్నివేశాల్లో పేలవంగా అనిపిస్తుంది.

ఇక అలనాటి నటులు శివకృష్ణ .. జయలలితలు కనిపించింది కాసేపే అయినా బాగానే చేశారు.

సాంకేతికత

మార్కస్ అందించిన సంగీతం బాగానే ఉంది
రవీంద్రనాథ్ అందించిన ఫోటోగ్రఫీ పర్లేదు
నిర్మాణ విలువలు కూడా పర్లేదు

విశ్లేషణ

సైకలాజిక్ క్రైమ్ థ్రిల్లర్ జానర్ మూవీలు ఇష్టపడేవారికి ఇన్స్పెక్టర్ యుగంధర్ సినిమా యావరేజ్ అనిపిస్తుంది. ముందునుంచీ కథనాన్ని ఒకే ఫ్లోలో నడిపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యారు. కాకపోతే సినిమాలో వరుసపెట్టి ముగ్గురికి ఫోబియాలు ఉండటంతో ఎవరి ఫోబియా ఏంటో అర్థం కాక కొంత గందరగోళం ఏర్పడుతుంది.

బహుశా కథను కేవలం క్రైమ్ థ్రిల్లర్ జానర్లో రాసుకుంటే రొటీన్ అయిపోతుందేమో అనే అనుమానంతో దర్శకుడు వాటికి సైకలాజికల్ ఫోబియలు కూడా తగిలించారేమో అన్న అనుమానం ఆడియన్స్ కు కూడా వస్తుంది.

ఇక గుణ సుందరం ఫోబియా అయితే బాగానే డిజైన్ చేశారు కానీ ఆ ఫోబియాలో అతడు వేసిన ప్లాన్ లో కొత్తదనం ఏమీ లేదు. ఈ పేస్ మేకర్ల గోల ఇదివరకు ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. క్రైమ్ థ్రిల్లర్ జానర్ మూవీలు ఇష్టపడేవారు వన్ టైమ్ వాచ్ మూవీ కింద ఓ లుక్కేయండి.

నటీనటులు: ఆది సాయికుమార్ , మేఘ లేఖ , కాదంబరి కిరణ్ కుమార్ , శివకృష్ణ , జయలలిత తదితరులు
సంగీతం: మార్కస్
సినిమాటోగ్రఫీ: రవీంద్రనాథ్
నిర్మాత: ప్రదీప్ జూలూరు
దర్శకత్వం: రాఘవేంద్ర కటారి
ఓటిటి: నెట్ ఫ్లిక్స్
విడుదల: 30 -10 -2026
రేటింగ్: 2.5/5


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *