Daayra Movie Review (OTT) – హైదరాబాదులో జరిగిన ఎన్కౌంటర్ నేపథ్యంలో సాగే కథ !

Spread the love

పృధ్వీరాజ్ సుకుమారన్.. కరీనా కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన దాయ్ రా సినిమా (Daayra Movie) 13 -11 -2026 నుంచి ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఒరిజినల్ హిందీ మూవీని ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో చూడాల్సి ఉంటుంది.

దాయ్ రా సినిమాను వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు. ఆ మధ్య హైదరాబాదులో జరిగిన నలుగురు రేప్ కేసు నిందితుల ఎన్కౌంటర్ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ఓ ఆర్ ఆర్ టోల్ ప్లాజా వద్ద నలుగురు ట్రక్ డ్రైవర్లు 21 సంవత్సరాల యువతిని రేప్ చేసి దారుణంగా తగలబెట్టి చంపిన సంగతి అప్పట్లో సంచలనం సృష్టించింది.

ఆ తర్వాత పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.. నిందితులకు కఠిన శిక్ష విధించాలని సోషల్ మీడియా వేదికగా ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేశారు. ఇది జరిగిన గంటల్లోనే పోలీసుల ఎన్కౌంటర్లో నలుగురు నిందితులు మరణించినట్టు మీడియాలో వార్తలు వచ్చాయి.

విషయం తెలుసుకున్న ప్రజలు అదే సోషల్ మీడియా వేదికగా అప్పటి హైదరాబాద్ పోలీస్ అధికారి సజ్జనార్ కు బ్రహ్మ రథం పట్టారు.. ఈ ఎన్కౌంటర్ కేసులో హ్యూమన్ రైట్స్ కమిషన్ వారు పోలీసులకు నోటీసులు కూడా ఇచ్చారు. ఇది జరిగిన కథ

ఇప్పుడు దాయ్ రా సినిమా ఎలా ఉందో చూద్దాం.

కధేంటంటే ?

రేప్ కేసులో నలుగురు నిందితులను ఎన్కౌంటర్ చేసినందుకు ప్రజలు డీసీపీ రామన్ కు (పృధ్వీరాజ్ సుకుమారన్) బ్రహ్మరథం పట్టడంతో సినిమా మొదలౌతుంది.

పోలీసులు నిందితుల పట్ల కఠినంగా వ్యవహరించి సత్వర న్యాయం అందించారని ప్రజలు మెచ్చుకుంటారు.

మరోపక్క ఎన్కౌంటర్ విషయంలో హ్యూమన్ రైట్స్ కమిషన్ పోలీసులకు నోటీసులు ఇచ్చి డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ రిపోర్ట్ ఇవ్వమని కోరడంతో డీసీపీ అజూ (కరీనా కపూర్) ను ఎంక్వైరీ ఆఫీసర్ గా వేస్తారు.

టోల్ ప్లాజా రేప్ కేసు నిందితుల విషయంలో డీసీపీ రామన్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడు? ఎన్కౌంటర్ కేసులో అజూ ఇన్వెస్టిగేషన్ ఎలా సాగుతుంది? చట్టం తన పని తాను చేస్తుంది అనే విషయంలో ఇద్దరు పోలీస్ ఆఫీసర్ల ఆలోచనలు ఎలా ఉంటాయి? అనేది మిగిలిన కథ.

ఎలా ఉంది?

కథ మనకు తెలిసిందే కాబట్టి కొత్తగా ఏమీ అనిపించదు.. కాకపోతే వాస్తవ సంఘటనల ఆధారంగా దర్శకుడు కథ అల్లుకుని తెరకెక్కించాడు కాబట్టి ఏమన్నా సినిమాటిక్ లిబర్టీ తీసుకుని క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ను ట్విస్టులతో మలుపులు తిప్పారా? అంటే అదీ లేదు.

సాధ్యమైనంతవరకు జరిగిన సంఘటనలను ఉన్నది ఉన్నట్టుగా చూపించటానికి దర్శకుడు ప్రయత్నించాడు. దర్శకుడి ప్రయత్నంలో ఎటువంటి లోపం లేదు. కథను మొదటినుంచి చివరివరకు ఒక టెంపోలో నడిపారు. కాకపోతే కథ మనకు తెలిసిందే కాబట్టి కథనం ప్రిడిక్టబుల్ గా సాగుతుంది. అందుచేత నెక్స్ట్ ఏంటి? అనే క్యూరియాసిటీ మనకు కలగదు. సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఏమీ లేకపోవడంతో కథనం స్లోగా సాగుతున్న ఫీలింగ్ వస్తుంది.

ఫస్టాఫ్ లో టోల్ ప్లాజా దగ్గర ఎవరో ఒక యువతి తగలబడి ఉండటం.. డీసీపీ రామన్ ఆధ్వర్యంలో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయడం.. నలుగురు నిందితులను అరెస్ట్ చేయడం.. మరోపక్క అదే సమయంలో డీసీపీ అజూ ఎన్కౌంటర్ కేసును ఇన్వెస్టిగేషన్ చేయడం వంటి సన్నివేశాలు మనల్ని కొంతవరకు ఎంగేజ్ చేస్తాయి.

ఇక సెకండాఫ్ లో ఇన్స్పెక్టర్ కరథ్ ఎపిసోడ్లో కొన్ని సాగతీత సన్నివేశాలు ఎదురై కొంత బోర్ కొట్టేస్తుంది. తిరిగి ప్రీ క్లైమాక్స్ నుంచి కథనం వేగం పుంజుకుంటుంది.. ఒకవైపు నలుగురు నిందితులనుంచి పోలీసులు కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకోవడం..సమాంతరంగా డీసీపీ అజూ చేసే ఇన్వెస్టిగేషన్ ద్వారా ఎన్కౌంటర్ కేసుల్లో పోలీస్ ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయో దర్శకుడు కళ్ళకు కట్టినట్టు చూపించారు.

ఇక క్లైమాక్స్ ముందే ఊహించినట్టు ఉంది కాబట్టి పెద్దగా థ్రిల్ ఏమీ పంచదు. ఓవరాల్ గా ఎన్కౌంటర్ కేసుల్లో పోలీసులు ఎలాంటి ఇబ్బందులు పడతారు అనే కోణాన్ని కూడా దర్శకుడు టచ్ చేశారు.

ఎవరెలా చేశారు?

ఈ సినిమాని రెండే రెండు క్యారెక్టర్లు లీడ్ చేశాయి. వారిలో డీసీపీ రామన్ గా నటించిన మలయాళ నటుడు పృధ్వీరాజ్ సుకుమారన్ ఒకరు. అతడికి ఇలాంటి పోలీస్ పాత్రలు కొట్టిన పిండే.. పోలీస్ అధికారి పాత్రకు తగ్గట్టుగానే పృధ్వీరాజ్ బాడీ లాంగ్వేజ్ కూడా ఉంది.
ఇక కరీనా కపూర్ కూడా బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. మొదటినుంచి చివరివరకు సెటిల్డ్ గా నటించింది.
మిగిలినవాళ్ళు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.

సాంకేతికత

అమిత్ త్రివేది అందించిన సంగీతం బాగానే ఉంది.
సౌరభ్ గోస్వామి ఫోటోగ్రఫీ పనితీరు కూడా బాగానే ఉంది.
నిర్మాణ విలువలు కూడా పర్లేదు.

విశ్లేషణ

క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ జానర్లో మూవీలు ఇష్టపడేవారికి ఈ సినిమా నచ్చుతుంది. కాకపోతే తెలిసిన కథే కావడంతో మనకు కొత్తదనం కనిపించదు. స్టోరీ మొత్తం ప్రిడిక్టబుల్ గా సాగడం ఈ సినిమాకు మైనస్ పాయింట్ అవుతుంది.

ఎన్కౌంటర్ నేపథ్యంలో పోలీసులు డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ ఎలా ఫేస్ చేయాలి? నిందితులను శిక్షించే క్రమంలో ఒక్కోసారి తమ ఉద్యోగాలను ఎలా కోల్పోవాల్సి ఉంటుంది? ఇలాంటి కేసుల్లో పోలీస్ ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయి అనేది వివరంగా చూపించారు. అదే సమయంలో పోలీసులు చట్టాన్ని తమ చేతిలోకి తీసుకోకూడదు అనే పాయింటును కూడా దర్శకుడు సమాంతరంగా చూపించారు.

పృథ్విరాజ్ సుకుమారన్ కోణంలో ముగింపు ఎలా ఉంటుందో మనకి ముందే తెలుసు కాబట్టి పెద్దగా క్యూరియాసిటీ కలుగచేయదు. కానీ కరీనా కపూర్ కోణంలో దర్శకుడు ఏదో కొత్త విషయం చెప్పబోతున్నాడని కొంత ఆసక్తిగా చూస్తాం. తీరా ముగింపుకు వచ్చేసరికి దర్శకుడు కరీనా కపూర్ ను పక్కనపెట్టేసి నిర్ణయాన్ని ప్రేక్షకులకే వదిలిపెట్టడం డిజప్పాయింట్ చేస్తుంది. చట్టం విషయంలో ఆమె ద్వారా ఏదో మెసేజ్ ఇద్దామని దర్శకుడు ప్రయత్నించాడు కానీ వర్కౌట్ కాలేదు.

ప్రస్తుతానికి నెట్ ఫ్లిక్స్ లో హిందీ ఒరిజినల్ సినిమాని ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో చూడాల్సి ఉంటుంది.

నటీనటులు : పృధ్వీరాజ్ సుకుమారన్, కరీనా కపూర్ తదితరులు
సంగీతం: అమిత్ త్రివేది
సినిమాటోగ్రఫీ: సౌరభ్ గోస్వామి
నిర్మాత: వినీత్ జైన్
దర్శకత్వం: మేఘన గుల్జార్
ఓటిటి: నెట్ ఫ్లిక్స్
స్ట్రీమింగ్ డేట్: 13-11-2026
రేటింగ్: 2.5/5


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *