Premane Oorilo Movie Review (OTT): ప్రేమనే ఊరిలో మూవీ ఎలా ఉందంటే ?

Spread the love

నటుడు శ్రీరామ్ ప్రధాన పాత్రలో నటించిన ప్రేమనే ఊరిలో మూవీ ( premane oorilo movie) నవంబర్ 17, 2026 నుంచి ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో తెలుగు ఆడియోలో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. అంతకుముందు ప్రేమద ఊరలి అనే పేరుతో ఒరిజినల్ కన్నడ భాషలో థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా కన్నడ నాట రికార్డ్ స్థాయిలో వసూళ్లను సాధించింది. ఈ సినిమానే ప్రేమనే ఊరిలో పేరుతో సురేష్ కొండేటి తెలుగులో రిలీజ్ చేసారు.
ఇప్పుడు ప్రేమనే ఊరిలో సినిమా ఎలా ఉందో చూద్దాం.

కధేంటంటే ?

కథ మొత్తం కర్ణాటకలోని ఓ పల్లెటూరి నేపథ్యంలో సాగుతుంది. ఆ పల్లెలో ఎవరికే కష్టం వచ్చినా రైతు నాగన్న ((రంగనాయన రఘు ) ముందుకొచ్చి ఆదుకుంటుంటాడు . చిన్న పిల్లవాడి మాదిరి కల్మషం లేని మనిషి నాగన్న అని ఊళ్ళో అతడి గురించి చెప్పుకుంటారు.

భార్య చనిపోవడంతో కొడుకు సంతోష్ ను (శ్రీరామ్) అన్నీ తానే అయి పెంచుతాడు. సంతు అమ్మమ్మ అతడ్ని ఇంకో పెళ్ళి చేసుకోమని పోరినా భార్య మీద ప్రేమతో చేసుకోడు. అయితే పెరిగి పెద్దవాడు అయిన సంతుకు బాగా చదువుకున్న అమ్మాయితో పెళ్లి చేయాలని నాగన్న తలపోసి సంబంధాలు వెతుకుతుంటాడు.

మరోపక్క అదే ఉరికి చెందిన మరదలు వసంత సంతును ప్రేమిస్తుంది. కానీ సంతు మాత్రం సిటీలో ఉంటున్న రుక్మిణిని ప్రేమిస్తాడు.

ఈ పరిస్థితుల్లో నాగన్న ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు? సంతు పెళ్లి ఎవరితో జరిపిస్తాడు? సంతు పెళ్లి తర్వాత అతడి జీవితంలో ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయి? నాగన్న జీవితంలో జరిగిన చేదు అనుభవాలు ఏంటి? అనేది మిగిలిన కథ.

ఎలా ఉంది?

కర్ణాటకలో ఈ సినిమా రికార్డ్ స్థాయిలో వసూళ్లను సాధించిందని చిత్ర నిర్వాహకులు చెప్తున్నారు. ఓటిటిలో కూడా పాజిటివ్ రివ్యూలు బాగా వస్తున్నాయి. ఇందులో కొంతవరకు వాస్తవం ఉంది కానీ అలా అని భారీ అంచనాలు పెట్టుకుని ఈ సినిమా చూడకండి. కొద్దిగా డిజప్పాయింట్ అవుతారు. ఏ అంచనాలు లేకుండా చూసేవారికి నచ్చుతుంది.

అందమైన పల్లెటూరి నేపథ్యంలో ఓ తండ్రీ.. కొడుకుల బాండింగ్ చుట్టూ దర్శకుడు కథ అల్లుకుని కథనం నడిపించిన తీరు బాగుంది.. అయితే కథలో కొత్తదనం లేదు.. ఇంతకుముందు కొన్ని సినిమాల్లో చూసిందే. కాబట్టి ఈ సినిమాని కథ కన్నా కథనమే ముందుకు నడిపించింది.

చిన్నప్పట్నుంచీ కలిసిమెలిసి తిరిగి పెరిగిన కళ్ళ ముందు కనిపించే అమ్మాయిని (బావా ..మరదలు ) కాకుండా హీరోగారు వేరే అమ్మాయిని ప్రేమించడం.. దానికి మరదలు హార్ట్ అవడం.. తిరిగి క్లైమాక్సులో చిన్ననాటి ప్రేమికులు ఒకటి కావడం మనం కొన్ని సినిమాల్లో చూసే ఉంటాం. దానికే చిన్న చిన్న మార్పులు చేసి దర్శకుడు ఫ్యామిలీ ఎమోషన్స్ తో డ్రామా నడిపించారు.

కన్నడ ప్రేక్షకులకు ఈ సినిమా కనెక్ట్ కావడానికి బహుశా కట్టిపడేసే పల్లెటూరి అందాలను థియేటరిక్ ఎక్స్పీరియన్స్ ఫేస్ చేయడం ఒక కారణం అయి ఉండవచ్చు. ఇక తండ్రి.. కొడుకుల ఫ్యామిలీ బాండింగ్ తో నడిచే కథ కాబట్టి ఫ్యామిలీ ఆడియన్సుకు బాగా కనెక్ట్ అయి ఉంటుంది. ఫ్యామిలీ ఆడియన్సుకు సరిపడా ఎమోషనల్ డ్రామా ఈ సినిమాలో ఉంది.. అందులో సందేహమే లేదు.

ఇక సినిమా ఫస్టాఫ్ లో తల్లి లేని తన కొడుకుకి తానే తల్లి అయి నాగన్న పెంచడం.. భార్య జ్ఞాపకాలలో ఉండిపోవడం.. మళ్ళీ పెళ్ళి చేసుకోమన్నా వినకపోవడం.. ఊరి పిల్ల అయిన వసంతతో కలిసి చిన్న పిల్లాడిలా కొడుకుని ఆట పట్టించడం వంటి సన్నివేశాలతో కథనం సరదాగా సాగిపోతుంది.

తండ్రీ .. కొడుకులు స్నేహితుల్లా అల్లరి చేయడం.. తిరిగి కలిసిపోవడం.. వీళ్ళకి వసంత తోడవడం వంటి సన్నివేశాలతో ఆసక్తిగా వేగంగా సాగిపోతున్న కథనం సెకండాఫ్ లో ఒక్కసారిగా స్లో అవుతుంది. అప్పటిదాకా సరదాగా సాగిన కథనం సీరియస్ మోడ్ లోకి టర్న్ అవుతుంది.

సరదా స్థానంలో భావోద్వేగాల సంఘర్షణకు అవకాశం దక్కుతుంది. ముఖ్యంగా అనుకోని పరిస్థితుల్లో సంతోష్ పెళ్లి విషయంలో నాగన్న తీసుకున్న నిర్ణయం వల్ల ఆ కుటుంబంలో సంఘర్షణ పరిస్థితులు ఏర్పడతాయి. వసంత జీవితంలో అనూహ్య మార్పులు వస్తాయి. సంతు జీవితంలోకి రుక్మిణి రావడంతో నాగన్న కుటుంబంలో కూడా అనూహ్య మార్పులు వస్తాయి. దానికి తోడు కొడుకు పెళ్లి విషయంలో నాగన్న తీసుకున్న నిర్ణయానికి.. అతడి ఫ్లాష్ బ్యాక్ కు దర్శకుడు ముడిపెట్టిన విధానం కొంతవరకు కన్విన్సింగ్ గా ఉంటుంది. ఇక ప్రి క్లైమాక్స్ వరకు వచ్చేసరికి కథలో సంఘర్షణ పీక్ కు చేరుతుంది. క్లైమాక్స్ మొత్తం దర్శకుడు రెయిన్ బ్యాక్ డ్రాప్ లో ఫ్రేమ్ చేసిన తీరు బాగుంది. ముగింపు కూడా పెద్ద హడావుడి లేకుండా సింపుల్ గా ముగించారు.

ఫస్టాఫ్ ప్రారంభం.. ప్రి క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు వచ్చే సన్నివేశాలు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి. మధ్యలో వచ్చే కొన్ని సన్నివేశాలు మాత్రం సాగతీతలా అనిపించి కొంచం బోర్ కొట్టిస్తుంది.
నాగన్న..సంతు.. వసంతల మధ్య నడిచిన అల్లరి సరదాగా సాగుతూ కొంత ఎంగేజ్ చేస్తాయి. ఓవరాల్ గా సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది.

ఎవరెలా చేశారు?

ఈ సినిమా మొత్తాన్ని నాలుగే నాలుగు పాత్రలు ముందుకు నడిపించాయి. వారిలో మొదటివారు నాగన్న.. కల్మషం లేకుండా చిన్న పిల్లాడి మాదిరి కొడుకుతో సమానంగా అల్లరి చేయడం.. కొడుకు మీద పెంచుకున్న ప్రేమ.. తన సోదరి విషయంలో జరిగిన తప్పు జీవితంలో ఇంకెవరి విషయంలో కూడా జరగకూడదని మధన పడే పాత్రలో రంగనాయన రఘు ఒదిగిపోయారు.

ఇక సంతోష్ పాత్రలో శ్రీరామ్ నటన కూడా సెటిల్డ్ గా ఉంది.. ఎక్కడా అతి చేయకుండా పెర్ఫెక్ట్ గా నటించాడు.. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్ లో శ్రీరామ్ నటన బాగుంది.
వసంత పాత్ర చాలా జోష్ గా.. సరదాగా ఉండటంతో చాలామందికి కనెక్ట్ అవుతుంది. పల్లెటూరి పిల్లగా అమాయకత్వంతో కూడిన అల్లరి చేయడంలోనూ.. ప్రేమించిన వాడి కోసం కలలు కనే ప్రియురాలి పాత్రలోనూ రమిక శివు పెర్ఫెక్ట్ గా నటించింది.
రుక్మిణి పాత్ర బాగానే ఉంది కానీ కథలో మరింత స్కోప్ ఇవ్వాల్సింది.

సాంకేతికత

సునాద్ గౌతమ్ అందించిన సంగీతం బాగానే ఉంది.. ముఖ్యంగా సెకండాఫ్ లో సంతు.. రుక్మిణి ల మధ్య వచ్చే పాటలు బాగున్నాయి.
రాజ్ కాంత్ అందించిన ఫోటోగ్రఫికి కూడా పూర్తి మార్కులు పడతాయి. అందమైన పల్లె అందాలను తన కెమెరా పనితనంతో మరింత అందంగా చూపించారు. ఫస్టాఫ్ లో గుడి దగ్గరా.. సెకండాఫ్ లో పొలాల దగ్గర తీసిన ఫ్రేమ్స్ ఆహ్లాదకరంగా ఉంటాయి.
నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి.

విశ్లేషణ

కథ చదివారుగా.. కథ మీద పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి.. కథనమే ఈ సినిమాకు బలం..ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అవుతుంది. అంతేకాదు పల్లె అందాలను ఇష్టపడేవారికి.. ప్రకృతి ప్రేమికులకు కూడా నచ్చుతుంది.

ఇందులో అనవసరమైన ఫైటింగులు లేవు.. ఐటమ్ సాంగులు అసలే లేవు..తండ్రీ.. కొడుకుల బాండింగ్ నేపధ్యంలో లవ్ స్టోరీ రాసుకుని దర్శకుడు అందంగా తెరకెక్కించారు.
అమెజాన్ ప్రైమ్ లో తెలుగు ఆడియో లో కూడా అందుబాటులో ఉంది కాబట్టి ఓ లుక్కేయండి.

నటీనటులు : శ్రీరామ్ , రంగనాయన రఘు , రమిక శివు , తపస్విని తదితరులు
సంగీతం : సునాద్ గౌతమ్
సినిమాటోగ్రఫీ : రాజ్ కాంత్
నిర్మాతలు : మమతా దేవేంద్ర , కొండేటి సురేష్
దర్శకత్వం : మనోజ్ కుమార్
ఓటిటి : అమెజాన్ ప్రైమ్
స్ట్రీమింగ్ డేట్ : 17-11 -2026
రేటింగ్: 2.75/5


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *