సూర్య హీరోగా నటించిన సీన్ యాక్షన్ థ్రిల్లర్ క్రైమ్ సినిమా నవంబర్ 6 , 2026 న వరల్డ్ వైడ్ థియేటర్లలో రిలీజ్ అయ్యింది. సూర్యకి తమిళనాటతో పాటు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. గతంలో సూర్య పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన సింగం రికార్డు స్థాయిలో కలెక్షన్లు రాబట్టింది.
తిరిగి సీన్ సినిమాలో సూర్య పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించడం.. ఈ సినిమాకి తనే స్వయంగా నిర్మాతగా వ్యవహరించడంతో తమిళ సినీ ఇండస్ట్రీలో అంచనాలు పెరిగాయి. అనుకున్నట్టుగానే సీన్ సినిమా తమిళంలో పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే తెలుగులో ఈ సినిమా ఎలాంటి టాక్ తెచ్చుకుందో ఇప్పుడు చూద్దాం.
కధేంటంటే?
ఒక క్రిమినల్ గ్యాంగ్ తాము హత్య చేసిన వ్యక్తి డెడ్ బాడీని గుట్టు చప్పుడు కాకుండా సమాధులలో పాతి పెట్టడానికి భోరున కురుస్తున్న వర్షంలో బరియల్ గ్రౌండ్లోకి ఎంటర్ అవడంతో సినిమా మొదలౌతుంది.
అయితే వీళ్లు ఈ పనిలో ఉండగానే అక్కడ అనుమానాస్పదంగా ఒక వ్యక్తి కనిపించడంతో కట్టేసి చంపేద్దాం అనుకుంటారు. కానీ ఆ వ్యక్తి తన పేరు ఈశ్వర అనీ.. సరదాగా కిరాయి హత్యలు చేయడం తన హాబీ అని చెప్పి కిల్లర్ గ్యాంగును ఆశ్చర్యపరుస్తాడు.
కట్ చేస్తే ,
ప్రేమ్ రాజ్ ( సూర్య) క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్ గా పనిచేస్తూ ఉంటాడు. ప్రేమ్ రాజ్ పేరు చెప్తే కరడుగట్టిన కిల్లర్స్ కూడా వణికిపోతారు. ఎలాంటి కేసునైనా ప్రేమ్ రాజ్ ఛేదించగలడని డిపార్ట్మెంట్లో పేరుంటుంది.
అయితే గతంలో ప్రేమ్ రాజ్ విక్టర్ ( టోవినో థామస్) అనే సీరియల్ కిల్లర్ ను అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తాడు. విక్టర్ జైలుకు వెళ్ళడంతో అందరూ ఆ కేసు గురించి మర్చిపోతారు. కానీ చాన్నాళ్ల తర్వాత గతంలో జరిగిన హత్యల మాదిరే వరుస మర్డర్లు జరుగుతుండటంతో క్రైమ్ బ్రాంచ్ చీఫ్ ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేసే బాధ్యత ను ప్రేమ్ రాజ్ కు అప్పచెబుతాడు.

ఇంతకీ ఈ సీరియల్ కిల్లర్ ఎవరు? జైల్లో ఉన్న విక్టర్ ఈ హత్యలు చేయిస్తున్నాడా? లేకపోతే ఇంకెవరైనా కొత్త సీరియల్ కిల్లర్ చేస్తున్నాడా? ఈశ్వరకు.. ఈ హత్యలకు ఉన్న లింక్ ఏంటి?కేసును ఇన్వెస్టిగేట్ చేయడానికి రంగంలోకి దిగిన ప్రేమ్ రాజ్ చివరికి కిల్లర్ ఎవరో కనిపెడతాడా? అనేది మిగిలిన కథ.
ఎలా ఉంది?
సీన్ సినిమా గురించి వచ్చిన పాజిటివ్ రివ్యూలు.. టాక్ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఒక సినిమా గురించి విశ్లేషణ చేసేటప్పుడు ప్రేక్షకుడి స్థానంలో కూర్చుని రాస్తే సినిమాలోని లోటుపాట్లు కళ్లముందు కనిపిస్తాయి. ఏదో ఒక సీన్ బాగుంటేనో.. ఏదో ఒక డైలాగ్ బాగుంటేనో.. ఏదో ఒక చోట బిజిఎం బాగుంటేనో సినిమా మొత్తం బాగున్నట్టు కాదు. ఆ సన్నివేశాలు మాత్రమే బాగున్నట్టు లెక్క.. దాన్ని జనరలైజ్ చేసి సినిమా బాగుందని విశ్లేషణ చేయలేం.
సినిమాలో ఏం బాగుందో చెప్పడంతో పాటు ఏం బాలేదో కూడా చెప్తేనే విశ్లేషణకు న్యాయం జరుగుతుంది. ఆపైన సినిమా భవిష్యత్తును ప్రేక్షకులు నిర్ణయిస్తారు.
ఇక ఈ సినిమా విషయానికి వస్తే దాదాపు ఫస్టాఫ్ అంతా చూసినా కూడా మనం అసలు కథలోకి చేరుకోము. లాజిక్కుల సంగతి పూర్తిగా మర్చిపోండి. మీరు లాజిక్కులు వెతికితే ఫస్టాఫ్ కూడా చూడలేరు.
గతంలో వచ్చిన క్రైమ్ సినిమాల్లో అందరి హీరోలలానే ఈ సినిమాలో హీరో సూర్య కూడా క్రైమ్ బ్రాంచ్ లో మంచి పేరున్న ఆఫీసర్. ఊళ్ళో హత్యలు జరిగినా.. దోపిడీలు జరిగినా.. ఆఖరికి జేబు దొంగతనం జరిగినా డిపార్ట్మెంట్ మొత్తానికి ప్రేమ్ రాజ్ (సూర్య) అనబడే ఆ ఆఫీసరే దిక్కు. ఇంతవరకు ఓకే.. కేసులను నిమిషాల్లో చేధించడంలో హీరోగారికి గతానుభవం ఉంది కాబట్టి ఆయనే సుప్రీమ్ అని ఒప్పేసుకుందాం. సో వాట్ అంటారా?
గతంలో పోలీస్ డిపార్ట్మెంట్ అన్నా.. ఆర్మీ అన్నా క్రమశిక్షణకు మారుపేరు అని బయట ఒక టాక్ ఉంది. అదృష్టవశాత్తు ఆర్మీ పరువును బయటపడేసే సినిమాలు పెద్దగా వచ్చినట్టు లేదు. ఇక పోలీస్ క్యారెక్టర్ల గురించి చెప్పుకోవాలంటే రౌడీకి తక్కువ.. రేపిస్టుకి ఎక్కువ అన్నట్టు కొన్ని సినిమాల్లో చూపిస్తున్నారు.
అయితే సూర్య సినిమాలు పోలీసుల గౌరవాన్ని పెంచేలా ఉంటాయని సింగం లాంటి సినిమాలు చూసినప్పుడు చాలామంది అనుకునే ఉంటారు. అలా అనుకోవడంలో నిజం ఉంది. నిజంగా సింగం సినిమాలో సూర్య నటన చూసినప్పుడు సెల్యూట్ పోలీస్ అంటాం. అలాంటి సూర్య తన సొంత నిర్మాణంలో తీసిన సీన్ సినిమాలో పోలీసులను బఫూన్ల మాదిరి ఎలా చూపించగలిగారో అర్థం కాలేదు.
పోలీస్ ఆఫీసర్ నిక్కర్.. టీ షర్ట్ వేసుకుని ఆఫీసుకు రావడం.. ఆఫీసులో నో స్మోకింగ్ జోన్ లోనే సిగరెట్లు తాగడం.. క్రైమ్ బ్రాంచ్ చీఫ్ ను పట్టుకుని నానా బూతులు తిట్టడం.. దానికి ఆ చీఫ్ గారు అదేదో కాంప్లిమెంట్లా పగలబడి నవ్వడం.. కామెడీకి కూడా పనికిరాదు. ఎందుకంటే కామెడీకి కూడా ఒక మీటర్ ఉంటుంది . శృతిమించితే హాస్యం కూడా అపహాస్యం పాలవుతుంది. ( హీరోగారి ఈ వింత ప్రవర్తనకు తర్వాత ఏదో వివరణ ఇవ్వడానికి దర్శకుడు ప్రయత్నించాడు కానీ కన్విన్సింగ్ గా లేదు)
పోనీ అప్పటికైనా ఈ పరంపర ఆపి దర్శకుడు అసలు కథలోకి వెళ్తాడేమో అని ఇంటర్వెల్ దాకా ఆశగా చూసిన ప్రేక్షకుడికి హీరోగారి ప్రవర్తన వెనుక ఉన్న అసలు సంగతి చెప్పి దర్శకుడు నీళ్ళు చల్లాడు. ఇక మాయ అనే ఒక అసిస్టెంట్ ను పెట్టుకుని ఇంట్లో సూర్య చేసే ప్రహసనాలు నవ్వు తెప్పించకపోగా విసుగు తెప్పిస్తుంది. దీనికి తోడు మతిస్థిమితం లేని తండ్రిని.. తాగుబోతు తల్లిని దింపడంతో ప్రేక్షకుడి పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అయ్యింది.
నిజానికి సూర్య తండ్రి క్యారెక్టర్ కు.. తల్లి క్యారక్టర్ కు మంచి స్కోప్ ఉంది. అలాంటి పవర్ఫుల్ క్యారెక్టర్లకు డిఫరెంట్ మ్యానరిజాలు తగిలించడంతో ఆ పాత్రలకు ఉన్న గాఢత తగ్గిపోయింది.
ఇక సినిమాలో మనల్ని అంతో ఇంతో ఎంగేజ్ చేసే సన్నివేశాలు సెకండాఫ్ లో కనిపిస్తాయి. ముఖ్యంగా ఈశ్వర.. ప్రేమ్ రాజ్ మధ్య నడిచే ఎపిసోడ్లు ఎంగేజ్ చేస్తాయి. ప్రీ క్లైమాక్స్ నుంచి క్రైమ్ మోడ్ లో కథనం వేగం పుంజుకుంటుంది. ఈశ్వర ఎత్తులకు ప్రేమ్ రాజ్ పై ఎత్తులు వేయడం.. ఇరువురి మధ్య జరిగే మైండ్ గేమ్ లు థ్రిల్ పంచుతాయి. ఈశ్వర.. ప్రేమ్ రాజ్ ల మధ్య జరిగే క్లైమాక్స్ ఫైట్ సీన్స్ కూడా బాగున్నాయి. అన్నట్టు ప్రేమ్ రాజ్ అసిస్టెంట్ మాయకు కూడా మంచి ఫైట్ సీన్ పడింది.
ఈశ్వర పాత్ర మీద దర్శకుడు మరింత శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది. ఎందుకంటే సైకో కిల్లర్ పాత్ర నుంచి ప్రేక్షకులు చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు.
చివరికి క్లైమాక్సులో ఈశ్వరను పట్టుకోవడంతో సినిమా అయితే ముగించారు కానీ కథ ముగిసినట్టు లేదు అనిపిస్తుంది. ఎందుకంటే జైలు నుంచి విక్టర్ తప్పించుకుని పారిపోయాడు అని తెలవడంతో సూర్య తిరిగి ఆఫీసుకు బయలుదేరుతాడు.. ఈ సీన్ ద్వారా దర్శకుడు పార్ట్ 2 ప్లాన్ చేస్తున్నారని అర్థమౌతుంది. బహుశా దర్శకుడు అసలు కథను పార్ట్ 2 లో చెప్తారేమో? సీన్ 1 లో మిగిలిపోయిన సందేహాలకు 2 లో సమాధానాలు దొరుకుతాయేమో చూడాలి.
ఎవరెలా చేశారు?
ప్రేమ్ రాజ్ పాత్రలో సూర్య నటన బాగుంది.. అందులో అనుమానమే లేదు. పైగా ఇటువంటి పాత్రలు సూర్యకు కొట్టిన పిండి. కాకపోతే దర్శకుడు సూర్య పాత్రను సరిగా రాసుకోలేకపోయారు అనిపిస్తుంది. ఫస్టాఫ్ లో సూర్య పాత్ర లాజికల్ గా కుదరలేదు.
ఇక మాయ పాత్రలో నజ్రియా బాగానే నటించారు. ముఖ్యంగా ఫైట్ సీన్ బాగా పండింది.
ఇక టోవినో థామస్ కూడా చక్కటి నటుడే.. కానీ ఈ సినిమాలో ఆయనకు పూర్తి స్కోప్ దక్కలేదు.. బహుశా పార్ట్ 2 లో ఉంటుందేమో? ఈశ్వర పాత్ర పోషించిన నస్లీన్ నటన బాగుంది. కొన్ని సన్నివేశాల్లో అతడు సూర్యతో పోటీ పడ్డాడు.
సాంకేతికత
సుశీన్ శ్యామ్ అందించిన సంగీతం బాగుంది
వినీత్ అగస్త్యన్ ఫోటోగ్రఫీ పర్లేదు
నిర్మాణ విలువలు కూడా బాగానే ఉన్నాయి.
విశ్లేషణ
గతంలో సూర్య నటించిన సింగం సినిమా చూసినవాళ్లు ఆ రేంజులో అంచనాలు పెట్టుకుని ఈ సినిమా చూస్తే డిజప్పాయింట్ అవుతారు.
దర్శకుడు క్రైమ్ థ్రిల్లర్ జానర్లో కథ రాసుకున్న టైంలోనే బహుశా సెకండ్ పార్ట్ కూడా తీద్దామని ముందే ప్లాన్ చేసుకున్నారేమో అందుకే క్లైమాక్స్ లో కూడా ఈ సినిమా కథకు కంక్లూజన్ ఇవ్వలేదు. అందుకే అసలు సీన్ ఏంటో మనకు పూర్తిగా అర్థం కావాలంటే సీన్ 2 వచ్చేదాకా ఆగాలి. ఓవరాల్ గా సినిమాలో లాజిక్కులు చూసేవాళ్ళకి ఫస్టాఫ్ నచ్చదు.. సెకండాఫ్ మాత్రం నచ్చుతుంది.
నటీనటులు: సూర్య , నజ్రియా , నస్లీన్ , టోవినో థామస్ తదితరులు
సంగీతం: సుశీన్ శ్యామ్
సినిమాటోగ్రఫీ: వినీత్ అగస్త్యన్
నిర్మాత: సూర్య , జ్యోతిక
దర్శకత్వం: జీతూ మాధవన్
థియేటర్ విడుదల: 06 -11 -2026
రేటింగ్: 2.5/5
