కరుణాస్ , నిమిష సజయన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఎన్న విలై తమిళ్ ఒరిజినల్ సినిమా ( Enna Vilai Movie) అక్టోబర్ 15 నుంచి ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో తెలుగు ఆడియోతో స్ట్రీమింగ్ అవుతుంది. సెప్టెంబర్ 17 న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం ఓటిటిలో కూడా IMDB మంచి రేటింగ్ సాధించి దూసుకుపోతుంది.
ఇప్పుడు ఎన్న విలై మూవీ ఎలా ఉందో చూద్దాం.
కధేంటంటే?
రామేశ్వరం సముద్రపు ఒడ్డున ఉన్న జాలరి గూడెం నుంచి కథ మొదలౌతుంది. ఆ జాలరిగూడెం లోనే తవశి ముత్తు ( కరుణాస్ ) తన భార్య, కూతురు, కొడుకు, చెల్లెలుతో కలిసిర్ నివసిస్తూ ఉంటాడు. సముద్రంలో భక్తులు విసిరే చిల్లర డబ్బులను ఏరుకోవడం.. చేపలు పట్టడం.. బొమ్మలు అమ్మడం అతడి వృత్తి.

ఓ రోజు అలా సముద్రంలోకి దిగి చిల్లర ఏరుకుంటుండగా అతడి చేతికి ఖరీదైన వజ్రాలు పొదిగిన ఒక లాకెట్ దొరుకుతుంది. దాని విలువ తెలియని తవశి ముత్తు అక్కడే సముద్రపు ఒడ్డున బీట్ చూసే పోలీస్ కానిస్టేబుల్ వరదరాజులకు ఆ లాకెట్ చూపించి సముద్రంలో తనకి దొరికిందని.. దాని సంగతేంటో చూడమంటాడు. లాకెట్ విలువ గ్రహించిన వరదరాజులు ఇది ఉట్టి గిల్ట్ ఆభరణం అనీ.. నయాపైసా విలువ చేయదని చెప్పి అందులో ఉన్న ఒక డైమండ్ ను కాజేస్తాడు.
ఇంటికెళ్ళిన తర్వాత తవశి భార్య ఆ లాకెట్ చూసి ఇది ప్యూర్ బంగారంతో తయారైన లాకెట్ అనీ .. వెంటనే పోలీసులకు అప్పచెప్పమని చెప్తుంది. తవశి నిజాయితీగా పోలీస్ స్టేషన్ కు వెళ్ళి ఆ లాకెట్ ను వాళ్ళకు అప్పగిస్తాడు. కానీ ఈ విషయం బయటికి వస్తే తాము ఆ డైమండ్ కొట్టేసిన సంగతి ఎక్కడ బయటపడుతుందో అనే భయంతో వరదరాజులు ఇంకో ఇద్దరు పోలీసులు కలిసి తవశిని దొంగతనం నేరం మీద లాకప్ లో వేసి కేసు పెట్టి కోర్టులో హాజరు పరుస్తారు.
చేయని నేరానికి దొంగతనం కేసులో ఇరుక్కోవడంతో ఇకపై తన పరువుకు విలువేది? అంటూ తవశి కుమిలిపోతాడు. ఈ పరిస్థితుల్లో తవశి తరపున వాదించడానికి లాయర్ కాంచన (నిమిష సజయన్) రంగంలోకి దిగుతుంది.
ఈ నేరం తమ మీదకు రాకుండా పోలీసులు ఏం చేస్తారు? తవశి తరపున లాయర్ కాంచన కోర్టులో ఎటువంటి వాదనలు వినిపిస్తుంది? చేయని నేరానికి కోర్టుల చుట్టూ తిరుగుతున్న తవశి ముత్తు చివరికి తన పరువు కోసం న్యాయస్థానాలను ఏమి కోరుకుంటాడు? అనేది మిగిలిన కథ.
ఎలా ఉంది?
మీరు గమనించే ఉంటారు.. ఫలానా రాజకీయ నాయకుడు ఫలానా రాజకీయ నాయకుడి మీద కోటి రూపాయల పరువు నష్టం దావా వేశారు.. తన పరువుకు భంగం కలిగించేలా వాఖ్యలు చేసిన సదరు రాజకీయ నాయకుడి మీద క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవాలని కోర్టు వారిని కోరుతూ లాయర్ ద్వారా నోటీసులు కూడా పంపిస్తారు.
కానీ ఇంతవరకు ఏ కేసులో అయినా ఎవరైనా కోర్ట్ మెట్లు ఎక్కినట్టు మీరు గమనించారా? ఒకవేళ కోర్ట్ మెట్లు ఎక్కినా ఎవరైనా పరువు నష్టం పరిహారం పొందినట్టు ఎక్కడైనా చూశారా? చూసి ఉండరు.. ఎందుకంటే రాజకీయ నాయకులు వేసే పరువు నష్టం దావాలు కూడా రాజకీయాలతో ముడిపడి ఉంటాయి.. ఎందుకంటే నిజానికి వాళ్ళకి కావాల్సింది తమ పరువుకి తగిన పరిహారం కాదు.. రాజకీయ మైలేజ్ మాత్రమే.
ఇక ఈ సినిమాలోని జాలరి తవశి మాత్రం మన రాజకీయ నాయకులలాంటి వాడు కాదు.. చేయని నేరానికి పోలీసులు తనని అరెస్ట్ చేసి కోర్టుల చుట్టూ తిప్పుతుండేసరికి ఇన్నేళ్లు నీతి నిజాయితీగా బతికిన తనను దొంగగా ముద్ర వేయడంతో తన పరువుకు భంగం కలిగిందని కుమిలిపోతాడు.
ముత్తు నీతి నిజాయితీల గురించి తెలియడంతో కుటుంబ సభ్యులు కూడా అతడికి అండగా నిలబడతారు. వీళ్ళకి ఓ లాయరమ్మ తోడవుతుంది. దాంతో ముత్తు కథ కోర్టుకు చేరుతుంది.
కోర్టులో వాద ప్రతివాదాలు నడుస్తాయి. చివరకు ముత్తు దొంగతనం చేయలేదని రుజువౌతుంది.
మాములు సినిమాలైతే కథ ఇక్కడితో అయిపోతుంది. కానీ ఈ సినిమాలో దర్శకుడు అసలు కథను ఇక్కడినుంచే మొదలుపెట్టాడు. అదే ఈ సినిమాకి కొత్తదనం తెచ్చిన కొత్త పాయింట్.
పరువనేది కేవలం ధనవంతులకు మాత్రమే పరిమితం కాదు..ఒక పేదవాడైన జాలరికి కూడా మనసుంటుంది.. పరువు ప్రతిష్టలు ఉంటాయి.. తన పరువుకు భంగం కలిగినప్పుడు.. ఆ పరువును తిరిగి పొందటానికి సదరు పేదవాడు న్యాయ స్థానం తలుపు తడితే ఎలా ఉంటుంది? న్యాయ స్థానాలు ఏ విధంగా స్పందిస్తాయి.. అనే కోణంలో దర్శకుడు కథనాన్ని నడిపించాడు.
తన కథనానికి దర్శకుడు ఒక బలమైన సన్నివేశాన్ని జోడించాడు. ముత్తు విలువైన లాకెట్ ను దొంగతనం చేశాడని తెలియడంతో మీడియా మొత్తం కెమెరాలు వేసుకుని అతడి పూరి పాక చుట్టూ చేరతారు. అప్పుడు ముత్తు తన భార్య పిల్లలను పట్టుకుని తాను నిజాయితీగా బతుకుతానే కానీ దొంగతనాలు చేసి కాదని చెప్తూ పెద్దగా ఏడుస్తాడు. భయంతో బిక్కు బిక్కు మంటూ బల్ల కింద నక్కుతాడు. సినిమాలో ఈ సన్నివేశం హృదయాలను టచ్ చేస్తుంది.
తిరిగి క్లైమాక్స్ సీన్ ప్రేక్షకులని ఎంగేజ్ చేస్తాయి. ప్రభు కాసేపు సీఎం పాత్రలో మెరిసి ఫినిషింగ్ టచ్ ఇస్తాడు. చివరగా అడ్వకేట్ జనరల్ ముత్తుకి జరిగిన అన్యాయానికి క్షమాపణలు చెప్తూ ప్రభుత్వం తరపున సీఎం పది లక్షల రూపాయల నష్ట పరిహారం అనౌన్స్ చేసినట్టు చెప్తాడు. కానీ ముత్తు మాత్రం తనకు కావాల్సింది డబ్బు కాదని.. పోయిన తన పరువు తిరిగి కావాలని చేతులు జోడించి చెప్తాడు. సినిమాకి క్లైమాక్స్ కోర్ట్ సీన్ కూడా హైలెట్ అవుతుంది.
ఇక ఫస్టాఫ్ ప్రారంభం.. సెకండాఫ్ ఎండింగ్ మినహా మధ్యలో వచ్చే కోర్ట్ సీన్లు సాగతీతలా అనిపిస్తాయి. ఈ అనవసరమైన కోర్ట్ డ్రామాతో ప్రేక్షకులకు కొంత బోర్ ఫీల్ వస్తుంది. ఈ పార్ట్ లో దర్శకుడు కొంత ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది.
ఓవరాల్ గా దర్శకుడు రాసుకున్న పాయింట్ కొత్తదే కానీ తెరకెక్కించిన విధానంలో అక్కడక్కడా తడబడినట్టు అనిపిస్తుంది. నిజానికి ఈ పాయింటును మరింత జాగ్రత్తగా ఎస్టాబ్లిష్ చేసి ఉంటే సినిమా వీరే లెవెల్లో ఉండేది. అందుకే సినిమా మొత్తం చూసిన తర్వాత ఆడియన్స్ కి ఎక్కడో ఏదో మిస్ అయిన ఫీలింగ్ వస్తుంది.
ఎవరెలా చేశారు?
ఈ సినిమా మొత్తంలో పరువు కోసం పాకులాడే ఓ అమాయక జాలరి మాత్రమే కనిపిస్తాడు. తవశి ముత్తు కనిపించినప్పుడల్లా అతడి అమాయకపు చూపులు చూసి జాలేస్తుంది.
పది లక్షలు నష్ట పరిహారం ఇస్తామన్నా తీసుకోకుండా తనకు పరువు ముఖ్యమని అమాయకంగా చేతులు జోడించి చెప్తున్నప్పుడు మనకు కరుణాస్ కనిపించడు.. ముత్తు మాత్రమే కనిపిస్తాడు. అందుకే ఈ సినిమా కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కరుణాస్ మాత్రమే అవుతాడు.
ఇక అతడి తర్వాత లాయర్ కాంచన పాత్రలో నిమిష సజయన్ నటన బాగుంది.
సాంకేతికత
శ్యామ్ సిఎస్ అందించిన సంగీతం బాగానే ఉంది కానీ కొన్ని సన్నివేశాలకు సరైన బీట్లు పడి ఉంటే ఇంకా బాగుండేది.
ఆల్బీ ఆంటోనీ అందించిన ఫోటోగ్రఫీ పర్లేదు.
నిర్మాణ విలువలు కూడా పర్లేదు.
విశ్లేషణ
ఎన్న విలై సినిమా పరువు కోసం పరితపించిన ఓ జాలరి కథ. ఈ సినిమాలో కమర్షియల్ హంగులు పెద్దగా కనిపించవు..దర్శకుడు కథకు సాధ్యమైనంత వరకు వాస్తవికతను జోడించాలని ప్రయత్నించాడు.
అందుకే కోర్ట్ వాదనలలో పుస్తకాలలో ఉన్న సెక్షన్లు అన్నీ బట్టీ కొట్టి మరీ చదివించాడు. ఇలాంటి కోర్ట్ డ్రామాలు అందరికీ నచ్చకపోవచ్చు. ఆ విషయం పక్కనబెడితే ఒక సామాన్య జాలరి కోణంలో దర్శకుడు కథనాన్ని నడిపించిన తీరు ఆకట్టుకుంటుంది.
ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో తెలుగు ఆడియో లో కూడా అందుబాటులో ఉంది కాబట్టి ఓ లుక్కేయండి.
నటీనటులు : కరుణాస్ , నిమిష సజయన్, మోహన్ తదితరులు
సంగీతం: శ్యామ్ సిఎస్
సినిమాటోగ్రఫీ: ఆల్బీ ఆంటోనీ
దర్శకత్వం: సజీవ్ పోలూర్
ఓటిటి: నెట్ ఫ్లిక్స్
స్ట్రీమింగ్ డేట్: 15-10-2026
రేటింగ్: 2.75/5
