వంగవీటి మోహన రంగా వారసుడు రాధాకృష్ణ (Vangaveeti Radhakrishna) మరోసారి పార్టీ మారారు..రెండు రోజుల క్రితం ఆయన టీడీపీని వదిలి జనసేనలో చేరారు.. విజయవాడ నగర పాలక సంస్థ మేయర్ పదవికి తమ పార్టీ అభ్యర్దిగా వంగవీటి రాధా పేరును జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. రేపు ఉదయం రాధా తన నామినేషన్ కూడా వేయబోతున్నారు.
ఈ క్రమంలో వంగవీటి రాధా రాజకీయ ప్రస్థానాన్ని ఒకసారి విశ్లేషించుకుందాం. ముందుగా వంగవీటి మోహన రంగా హత్య తర్వాత ఏం జరిగిందో చూద్దాం.
రంగా హత్య తర్వాత?
1988 డిసెంబర్ 26 న వంగవీటి మోహన రంగా హత్య జరిగింది.. ఆయన హత్య దరిమిలా ఏపీలో పెద్దఎత్తున హింసాకాండలు చెలరేగి షుమారు 53 రోజుల పాటు కర్ఫ్యూ నడిచింది. తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆయన భార్య రత్నకుమారి విజయవాడ తూర్పు నియోజక వర్గం నుంచి..ఆయన సోదరుడు వంగవీటి చలపతి రావు ఉయ్యూరు నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున శాసన సభ్యులుగా పోటీ చేసి విజయం సాధించారు.
దరిమిలా రత్నకుమారికి మంత్రి వర్గంలో స్థానం లభిస్తుందని అభిమానులు ఆశించారు.. కానీ అప్పటికే వంగవీటి కోటాలో చలపతిరావు కూడా బరిలో ఉండటంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇద్దరినీ తాత్కాలికంగా పక్కనబెట్టింది.
టీడీపీలో చేరిన రత్నకుమారి
మారిన రాజకీయ పరిస్థితుల్లో రత్నకుమారి కాంగ్రెస్ పార్టీని వీడి చంద్రబాబు నేతృత్వంలోని తెలుగు దేశం పార్టీలో చేరారు. రత్నకుమారి టీడీపీలో చేరడాన్ని వంగవీటి మోహన రంగా అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. వంగవీటి మోహన రంగా హత్యలో తెలుగుదేశం ప్రభుత్వ ప్రమేయం ఉందని రంగా హత్య జరిగిన రోజు రత్నకుమారి బాహాటంగా విమర్శించారు.. తన భర్త హత్యకు కోడెల శివప్రసాద్ రావు ..చంద్రబాబులను బాధ్యులుగా చేస్తూ ఆమె తీవ్ర ఆరోపణలు కూడా చేశారు.
అదే సమయంలో రత్నకుమారిని పరామర్శించడానికి వచ్చిన ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ను ఇంటిలోపలికి కూడా అనుమతించకపోవడంతో ఆయన కాసేపు వేచి చూసి వెళ్ళిపోయారు.
ఇదంతా గతం.. తరువాయి కాలంలో రత్నకుమారి అదే టీడీపీలో చేరడం వంగవీటి మోహన రంగా అభిమానులు ఊహించని పరిణామం. కానీ టీడీపీలో చేరినా రత్నకుమారి రాజకీయ ఎదుగుదలలో పెద్ద మార్పులు రాలేదు. దాంతో ఆమె కొద్దికాలం క్రియాశీలక రాజకీయాలకు దూరం జరిగారు.
రాధా రాజకీయ ప్రవేశం (2004)
వంగవీటి మోహన రంగా వారసుడు రాధాకృష్ణ రాజకీయ ప్రవేశం కూడా చాలా గమ్మత్తుగా.. ఎవరూ ఊహించని అనూహ్య పరిస్థితుల్లో జరిగింది. వంగవీటి మోహన రంగా కు రాధాకృష్ణ మొదటి సంతానం కాగా.. ఆశాకిరణ్ రెండో సంతానం.. వీరిలో ఆశాకిరణ్ పెళ్లి చేసుకుని ఆస్ట్రేలియా వెళ్లి అక్కడే సెటిల్ అయిపోగా, రాధాకృష్ణ మాత్రం తల్లి దగ్గరే ఉండిపోయాడు.
రంగా వారసుడు ఉన్నాడని ప్రజలకు తెలుసు కానీ ఎక్కడ ఉంటాడో.. ఎలా ఉంటాడో ఎవరికీ తెలీదు. అయితే ఓ దినపత్రికకు చెందిన విజయవాడ ఎడిషన్ లో లోపలి పేజీలో వచ్చిన ఒక చిన్న వార్త రాధాకృష్ణ రాజకీయ ప్రస్థానానికి నాంది అయ్యింది. ఆ క్షణం వరకు అభిమానులతో పాటు రాధా సైతం ఊహించని పరిణామం ఇది.
ఒంటి మీద గాయాలతో విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన వంగవీటి మోహన రంగా వారసుడు రాధాకృష్ణ .. ఇదీ ఆ వార్త.. చాలా చిన్న వార్త.. అదీ లోపలి పేజీలో చిన్న కాలం వచ్చింది.. అంతే జనం ఉప్పెనలా ఆసుపత్రి వైపు దూసుకు వచ్చారు. రంగా వారసుడిని చూడటానికి చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు అభిమానులు బయలుదేరారు. సాయంత్రానికి విజయవాడలో ఉన్న ఆ ఆసుపత్రికి జనం పోటెత్తారు. వంగవీటి మోహన రంగా మరణించి 16 ఏళ్లు దాటినా ఆయన ఇంకా జనం గుండెల్లో ఉన్నారనడానికి పోటెత్తిన జన సందోహమే నిదర్శనం.
రత్నకుమారి టీడీపీలోకి వెళ్లడం.. విజయవాడలో రంగా స్థాయిలో పోరాటం చేయగల నాయకత్వం కొరవడటంతో అభిమానులు రాధాకృష్ణలో రంగా నాయకత్వ పోరాట పటిమను ఆశించారు. అందుకే రంగా వారసుడికి జేజేలు పలికారు. దాంతో ఈ విషయం పీసీసీ దృష్టికి వెళ్ళింది. రంగా వారసుడి కోటాలో రాధాకృష్ణకు కాంగ్రెస్ పార్టీ తరపున విజయవాడ తూర్పు నియోజక వర్గ స్థానానికి టికెట్ కేటాయించారు.

నిజానికి ఇది రాధాకృష్ణ కూడా ఊహించని పరిణామం. ఎందుకంటే అప్పటికి రాధాకృష్ణ వయసు 26 ఏళ్లు.. ముందునుంచీ తండ్రికి దూరంగా పెరగడం వల్ల తగినంత రాజకీయ అనుభవం.. పరిచయాలు లేవు. ఈ పరిస్థితుల్లో రాధా తరపున ఆయన మేనమామ చెన్నుపాటి శ్రీను రంగంలోకి దిగారు.
ఈయన ముందునుంచీ తన బావ వంగవీటి మోహన రంగా ఆర్గనైజేషన్లో క్రియాశీలకంగా పనిచేశారు.. వంగవీటి మోహన రంగా మరణం తర్వాత కూడా రాధారంగా మిత్రమండలి సంస్థకు నాయకత్వం వహించి క్యాడర్ చెల్లాచెదురు కాకుండా కాపాడుకుంటూ వచ్చారు.
చెన్నుపాటి శ్రీను అనుభవం రాధాకృష్ణకు అక్కరకు వచ్చింది. అతి చిన్న వయసులోనే గతంలో తన తండ్రి ప్రాతినిధ్యం వహించిన విజయవాడ తూర్పు నియోజక వర్గం నుంచి (2004) ఎమ్మెల్యేగా గెలిచి శాసన సభలో అడుగుపెట్టారు. ఆ రకంగా 2004 సంవత్సరం నుంచి కాంగ్రెస్ పార్టీతో రాధాకృష్ణ రాజకీయ ప్రయాణం మొదలైంది.
రంగా క్యాడర్ లో జోష్
వంగవీటి మోహన రంగా వారసుడు రాధాకృష్ణ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడంతో రంగా క్యాడర్ లో తిరిగి జోష్ వచ్చింది. తండ్రి స్థానంలో కొడుకుని ఊహించుకుని సంతోషపడ్డారు. రాధా నుంచి కూడా రంగా పోరాట పటిమను ఆశించారు. దానికి తగ్గట్టు రాధా కూడా తన రాజకీయ ప్రస్థానం తొలినాళ్లలో అభిమానులకు అందుబాటులో ఉంటూ వచ్చారు. తన తండ్రి రాజకీయ, వర్గ ప్రత్యర్ధి దేవినేని నెహ్రూ విషయంలో కూడా దూకుడుగా విమర్శనాస్త్రాలు సంధించారు.
మలుపు తిప్పిన వివాదం
కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న రాధా రాజకీయ ప్రయాణాన్ని ఒక చిన్న వివాదం మలుపు తిప్పింది. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి హైదరాబాదులో ఉన్న అత్యంత ఖరీదైన ఒక స్థల వివాదంలో దేవినేని నెహ్రూ కు అనుకూలంగా ఫేవర్ చేసి పెట్టారనే విషయం రాధా కు తెలిసి సీఎం దగ్గర తన అసంతృప్తిని తెలియజేసారని అనధికార వార్తలు బయటికి వచ్చాయి.
ప్రజారాజ్యంలో చేరిక
సరిగ్గా ఇదే సమయంలో చిరంజీవి ఏపీలో ప్రజారాజ్యం పార్టీని స్థాపించి ఎన్నికలకు వెళ్లబోతున్నట్టు ప్రకటించారు. దాంతో వంగవీటి రాధాకృష్ణ 2008 లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ప్రజారాజ్యం కండువా కప్పుకున్నారు. రాధాకృష్ణ మొదటిసారి కండువా మార్చింది ప్రజా రాజ్యం పార్టీతోనే.

అయితే ఈ విషయంలో మరోసారి ఆలోచించుకొని వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా స్వయంగా రాధాకృష్ణకు నచ్చచెప్పాలని చూసారు. కానీ రాధాకృష్ణ ఎవరినీ సంప్రదించకుండా ప్రజారాజ్యం తీర్ధం పుచ్చుకున్నారు. ఇక్కడే రాధాకృష్ణకు మొదటి తప్పటడుగు పడింది. 2009 ఎన్నికల్లో తనతో పాటు విజయవాడ బరి నుంచి ప్రజారాజ్యం తరపున పోటీ చేయడానికి వెల్లంపల్లి శ్రీనివాస్.. యలమంచిలి రవి లకు టికెట్లు ఇప్పించిన రాధా చివరికి తాను ఓడిపోగా మిగిలిన ఇద్దరు గెలిచారు. వంగవీటి మోహన రంగా కు కంచుకోటలా నిలిచిన విజయవాడ స్థానంలోనే ఆయన వారసుడు రాధా ఓడిపోవడం అభిమానులు ఊహించనిది. దీంతో రాధా రాజకీయ జీవితంలో మొదటిసారి శూన్యత ఆవరించింది. ఆయన మొదటిసారి సాధారణ ఎన్నికల్లో ఓడిపోయిన సందర్భం కూడా ఇదే.
చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీ లో విలీనం చేసినప్పుడైనా రాధా తాను కూడా కాంగ్రెస్ పార్టీ లో చేరి ఉంటే ఆయన రాజకీయ భవిష్యత్ ఎలా ఉండేదో కానీ స్తబ్దత గా ఉండి మరో పొరపాటు చేశారు. ఆ రకంగా 2008 నుంచి 2012 వరకు రాధా రాజకీయ జీవితం ఎటువంటి ఎదుగు బొదుగు లేకుండా గడిచిపోయింది.
వైసీపీ కండువా

కొంతకాలం మౌనంగా ఉన్న రాధాకృష్ణ తిరిగి 2012 ఏప్రిల్ నెలలో వైసీపీ కండువా కప్పుకున్నారు. 2014 లో విజయవాడ తూర్పు నియోజక వర్గం నుంచి వైసీపీ అభ్యర్థి గా పోటీ చేసి ఓడిపోయారు. రాధాకృష్ణ రాజకీయ జీవితంలో ఇది రెండో ఓటమి. తిరిగి 2019 వరకు ఆయన రాజకీయ జీవితంలో శూన్యత ఆవరించింది. ఈ రెండు తప్పుల నుంచి పాఠం నేర్చుకొని రాధాకృష్ణ తిరిగి ఇంకో పొరపాటు చేశారు.
టీడీపీ కండువా
2019 లో రాధాకృష్ణ టీడీపీలో చేరి వంగవీటి మోహన రంగా అభిమానులకు షాక్ ఇచ్చారు. రాధా నిర్ణయాన్ని అప్పట్లో వంగవీటి మోహన రంగా అభిమానులు బాహాటంగా వ్యతిరేకించారు. ఏ పార్టీకి వ్యతిరేకంగా తండ్రి పోరాటం చేశారో అదే పార్టీలో కొడుకు చేరాలన్న నిర్ణయాన్ని పునరాలోచించుకోమని ఆయనకు విన్నపాలు కూడా చేశారు.

కానీ రాధాకృష్ణ మాత్రం టీడీపీ వైపే మొగ్గు చూపించారు. తండ్రి హత్యలో టీడీపీ పార్టీ సానుభూతి పరులు ఉండి ఉండొచ్చు కానీ చంద్రబాబు వంటి నాయకులకు సంబంధం ఎలా ఉంటుంది? అని తన చేరికను సమర్థించుకున్నారు.
అలా 2019 లో టీడీపీలో జాయిన్ అయిన రాధాకృష్ణకు 2026 వరకు ఎటువంటి ప్రాతినిధ్యం లభించలేదు. అయినా సరే రాధాకృష్ణ టీడీపీలోనే కొనసాగుతూ కేవలం తండ్రి విగ్రహాలు ఆవిష్కరించుకుంటూ వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రాధాకృష్ణ మరోసారి కండువా మార్చారు.
జనసేన కండువా
రెండురోజుల క్రితం (అక్టోబర్ 14, 2026) రాధాకృష్ణ టీడీపీని విడిచిపెట్టి జనసేనాని పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన కండువా కప్పుకున్నారు. అయితే ఈ సారి రాధాకృష్ణ వ్యూహాత్మకంగానే పార్టీ మారారనిపిస్తుంది. విజయవాడ నగర పాలక సంస్థ మేయర్ పదవికి పోటీ చేయాలనేది రాధాకృష్ణ ముందస్తు వ్యూహంలో భాగమే.
అందుకే జనసేనలో తన చేరికను చంద్రబాబుకు చెప్పే చేశారు.

చంద్రబాబు కూడా రాధాకృష్ణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి కొన్ని ఈక్వేషన్స్ ఉన్నాయి. రాధాకృష్ణ కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కావడంతో ఆ వర్గం ఓట్లు చేరిపోకుండా జనసేన నుంచి ఆయన పోటీ చేస్తే బాగుంటుందని ముందస్తు అంచనాకు వచ్చినట్టు తెలుస్తుంది. రాధాకృష్ణకు టికెట్ కేటాయించేవిషయంలో సీఎం చంద్రబాబుకు ..డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లకు పూర్తి క్లారిటీ ఉంది. ఆ ఈక్వేషన్స్ లో భాగంగానే రాధాకృష్ణ జనసేన కండువా కప్పుకున్నారనే ప్రచారం కూడా విజయవాడ సర్కిల్ లో గిరికీలు కొడుతుంది.
ముగింపు
2004 లో మొదలైన వంగవీటి వారసుడి రాజకీయ ప్రస్థానం అనేక మలుపులు తిరుగుతూ ముందుకు సాగుతుంది. అయితే రాజకీయ పరిభాషలో చెప్పాలంటే రాధాకృష్ణ ఖాతాలో ఇంతవరకు సరైన హిట్ పడలేదు. ఆయనతో కలిసి ప్రయాణించిన వెల్లంపల్లి శ్రీనివాస్ లాంటి నాయకులు మంత్రి పదవులు కూడా అలంకరించగా 20 ఏళ్ల రాజకీయ జీవితంలో రాధాకృష్ణ కేవలం మాజీ ఎమ్మెల్యేగానే మిగిలిపోయారు.
తాజాగా రాధా విజయవాడ మేయర్ పదవికి పోటీ పడుతూ బరిలోకి దిగుతున్నారు. మిగిలినవాళ్ళ సంగతి ఎలా ఉన్నా తిరిగి విజయవాడ మీద పట్టు సాధించడం కోసమైనా సరే ఈ గెలుపు రాధా కు అవసరం. రాధా రాజకీయ భవిష్యత్తుకు ఈ గెలుపు అత్యంత కీలకం అవుతుంది.
వంగవీటి మోహన రంగా వారసుడిగా రాధాకృష్ణకు ఇప్పటివరకు సరైన పదవులు దక్కలేదని అభిమానులలో అసంతృప్తి ఉంది. అందుకే రాధా ఈ అవకాశాన్ని తన రాజకీయ భవిష్యత్ కోసం వినియోగించుకుంటారని ఆశిద్దాం.
