విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన రణబాలి సినిమా (Ranabaali Movie) ఈరోజు (16-10-2026) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ అయ్యింది.
దర్శకుడు రాసుకున్న కథ చారిత్రక నేపథ్యానికి సంబంధించింది కావడం.. రాయలసీమ ప్రాంతానికి చెందిన శింగనమల పాలెగాడి పాత్రలో విజయ్ దేవరకొండ సరికొత్త అవతారంలో కనిపించడం వంటి అంశాలు విడుదలకు ముందే సినిమాపై అంచనాలు పెంచింది. మరి అందరి అంచనాలకు తగినట్టుగా సినిమా ఉందో లేదో ఇప్పుడు చూద్దాం.
కధేంటంటే ?
కథా కాలం 1870 ప్రాంతానికి సంబంధించింది. బుర్ర కథ చెప్పే కళాకారులు రణబాలి అనే వీరుడి గురించి చెప్పడంతో సినిమా మొదలౌతుంది.
రాయలసీమ శింగనమల ప్రాంతానికి చెందిన రాజమ్మ (ఈశ్వరీ రావు) తాను కొలిచే భద్ర మల్లన్న గుహ వద్ద మగపిల్లవాడికి జన్మ ఇస్తుంది. కానీ పుట్టుకతోనే ఆ పిల్లవాడు కళ్ళు తెరవక అచేతనంగా ఉండటంతో ఎలాగైనా తన కొడుక్కి ప్రాణభిక్ష పెట్టమని భద్ర మల్లన్న ను రాజమ్మ వేడుకుంటుంది.
రాజమ్మ ప్రార్థనలతో భద్ర మల్లన్న గుహ నుంచి ప్రత్యక్షం అయి ఈ పిల్లవాడు కారణ జన్ముడని.. అతడికి రణబాలి అని పేరు పెట్టి రాజమ్మకు పిల్లవాడి జన్మ గురించి ఒక రహస్యం చెప్తాడు. ఆ రహస్యం తెలుసుకున్న రాజమ్మ షాక్ అవుతుంది.
కట్ చేస్తే,
రణబాలి పెరిగి పెద్దవాడు అవుతాడు. భద్ర మల్లన్నకు ఇచ్చిన మాట ప్రకారం రాజమ్మ ప్రతి ఏడూ గ్రామంలో పోతును బలి ఇచ్చి జాతర జరిపిస్తుంటుంది. జాతరలో రణబాలి రథం లాగి పోతులయ్య అవతారం ఎత్తుతాడు. రాజమ్మ కోరిక మీద జయమ్మను (రష్మిక ) ను వివాహం చేసుకుంటాడు.

ఇదిలా ఉండగా హెక్టార్ (ఆర్నాల్డ్ ) అనే బ్రిటిష్ కమిషనర్ మద్రాస్ ప్రెసిడెన్సీ ప్రాంతంలో కృత్రిమ కరువు కాటకాలు సృష్టించి రైతుల దగ్గర్నుంచి పన్నుల రూపంలో బలవంతంగా ధాన్యం వసూలు చేస్తుంటాడు. అలా ఐదు లక్షల టన్నుల ధాన్యాన్ని వసూలు చేసి స్వదేశానికి తరలించి గవర్నర్ పదవి పొందాలని కుట్రలు చేయడం మొదలు పెడతాడు.
తన కుట్రలో భాగంగా మద్రాస్ ప్రెసిడెన్సీ ప్రాంతంలో గ్రామాలకు గ్రామాలను వల్లకాడుగా మార్చి అక్కడి ప్రజలను కట్టు బానిసలుగా మార్చి వెట్టి చాకిరి చేయించుకుంటాడు. ఈ విషయం తెలుసుకున్న శింగనమలకు చెందిన రణబాలి ఆంగ్లేయుల నిర్ణయాన్ని వ్యతిరేకించి పోరాటం మొదలు పెడతాడు.
రణబాలి జన్మ వృత్తాంతం గురించి రాజమ్మకు భద్ర మల్లన్న చెప్పిన రహస్యం ఏంటి? జయమ్మతో రణబాలి వైవాహిక జీవితం ఏ విధంగా సాగుతుంది? కరువుతో అల్లాడిపోతున్న ప్రజలను రణబాలి ఏ విధంగా ఆదుకుంటాడు? బ్రిటిష్ కమిషనర్ హెక్టార్ తో రణబాలి చేసే పోరాటం ఎలా ఉంటుంది? అనేది మిగిలిన కథ.
ఎలా ఉంది?
రణబాలి అనేది కేవలం సినిమా మాత్రమే కాదు.. కాలగర్భంలో మరుగున పడిపోయిన చారిత్రక సత్యాన్ని ఆవిష్కరించిన కథ. నమ్ముకున్న నేలతల్లి కోసం పోరాడిన యోధుడి కథ. కరువు కాటకాలతో గుప్పెడు గింజలు దొరక్క అల్లాడిపోతున్న ప్రజలను ఆదుకున్న గొప్ప పాలెగాడి కథ.
నిజానికి చరిత్ర తవ్వితే ఇలాంటి కథలు ఎన్నో బయటపడతాయి. ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి సినిమా వచ్చేవరకు ఆ వీరుడి చరిత్ర చాలామందికి తెలీదు. ఈరోజు మనం స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్నామంటే ఆనాడు తెల్ల దొరల పాలనను ఎదురించి నిలిచిన వీరులే కారణం.
ఇక ఈ సినిమా విషయానికి వస్తే కథాకాలానికి తగ్గట్టుగా దర్శకుడు బుర్ర కథ రూపంలో రణబాలి గురించి పరిచయం చేసిన తీరు బాగుంది. అప్పట్లో గ్రామ దేవతలను నమ్ముకునే ప్రజలు పాటించే ఆచార వ్యవహారాలను సినిమా ప్రారంభంలోనే దర్శకుడు కళ్ళకు కట్టాడు. పోతును బలి ఇవ్వడం.. పోతు రక్తంతో తడిసిన ధాన్యాన్ని ఊరంతా చల్లితే వర్షాలు సమృద్ధిగా పడి పంటలు బాగా పండుతాయనే ఊరి జనాల నమ్మకాలు.. జాతర జరపడం..రథాన్ని లాగడం వంటి సన్నివేశాలతో ఫస్టాఫ్ రన్ అవుతుంది.
అదే సమయంలో రణబాలి జయమ్మను వివాహం చేసుకోవడం.. వారి వైవాహిక జీవితంలో ఎదురయ్యే అలకలు.. ప్రేమల సన్నివేశాలతో సినిమా సీరియస్ మోడ్ నుంచి కొంత సరదాగా సాగిపోతుంది. ఎప్పుడైతే ఆంగ్లేయులు శింగనమల గ్రామానికి వచ్చి బలవంతపు పన్ను కట్టాలని గ్రామస్తులను బెదిరిస్తారో అప్పట్నుంచి కథనం యాక్షన్ మోడ్ లోకి టర్న్ అవుతుంది.
రణబాలి ఆంగ్లేయుల నిర్ణయాన్ని వ్యతిరేకించి కారం పెట్టడం.. శింగనమల సమీపంలోని గుత్తి లో ఆంగ్లేయులు నిర్వహిస్తున్న క్యాంప్ మీద దాడి చేసి అక్కడి ప్రజలను వెట్టిచాకిరి నుంచి విముక్తుల్ని చేయడంతో కథనం పూర్తి యాక్షన్ డ్రామాలోకి టర్న్ అవుతుంది. గుత్తి క్యాంప్ లో రణబాలి ఫైట్ సీన్ లో విజయ దేవరకొండ విశ్వ రూపం చూపిస్తాడు. అక్కడి బ్రిటిష్ అధికారి గుండెల్లో స్తంభం దింపి జెండా స్థానంలో నిలబెట్టే సీన్ సినిమాకి హైలెట్ గా నిలుస్తుంది.
కాకపోతే ఫస్టాఫ్ తో పోలిస్తే సెకండాఫ్ లో స్లో నేరేషన్ ఉంటుంది. అక్కడ్నుంచి కథ ఎంతసేపూ ముందుకు పోకుండా అక్కడక్కడే తిరుగుతున్నట్టు ఉంటుంది.. అప్పటికే అక్కడ కరువు కాటకాలు చూసేసాం.. ఆంగ్లేయుల ఆకృత్యాలు చూసేసాం.. రణబాలి పోరాటాలు చూసేసాం.. వాట్ నెక్స్ట్? అనే ప్రశ్న ఎదురౌతుంది.
అయినా సరే దర్శకుడు మళ్ళీ కరువు కాటకాలు.. ప్రజల ఆకలి చావులు.. నీయక్క అంటూ రణబాలి గుర్రం మీద బయలు దేరడం చూసి.. చూసి కొద్దిగా బోర్ ఫీల్ వస్తుంది. దర్శకుడు ఇంకేదైనా కొత్త పాయింట్ చెప్తాడేమోనని ఆశగా ఎదురు చూసే ప్రేక్షకులకు నిరాశ మిగులుతుంది.
ఒకరకంగా చెప్పాలంటే సెకండాఫ్ లో విజయ్ దేవరకొండ కన్నా రష్మిక లీడ్ తీసుకుని తన నటనతో సినిమాని నిలబెట్టింది అనిపిస్తుంది. అప్పటిదాకా రణబాలి భార్య పాత్రలో నామమాత్ర పాత్ర పోషించిన రష్మిక ప్రీ క్లైమాక్స్ నుంచి లీడ్ తీసుకోవడంతో ఆ పాత్రకు స్కోప్ పెరుగుతుంది.
ఇక క్లైమాక్స్ రొటీన్ గానే ముగిసిందని అనిపిస్తుంది. కాంతారా సినిమా క్లైమాక్స్ బాగా వర్కవుట్ అవడంతో చాలామంది దర్శకులు అదే ఫార్ములాని ఫాలో అవుతున్నారు. ఆ మధ్య వచ్చిన కార్తీ సినిమాలో కూడా క్లైమాక్సులో హీరో పోతురాజు అవతారం ఎత్తి పూనకంతో ఊగిపోతాడు. కాబట్టి ఈ సినిమాలో క్లైమాక్స్ మనకి పెద్దగా గూస్ బంప్స్ ఏమీ తెప్పించదు.
ఒక చారిత్రక నేపథ్యం ఉన్న అంశాన్ని కథగా రాసుకుని తెరకెక్కించాలనుకున్న దర్శకుడి ప్రయత్నం అభినందనీయమే అయినా సినిమా లెంత్ విషయంలో ఆయన జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఇంకా బాగుండేది. నిజానికి ఈ సినిమాకి ఇంత నిడివి అవసరం లేదు.. అనవసరమైన రిపీటెడ్ సన్నివేశాలను ట్రిమ్ చేసి ఉంటే ఇంకా బాగుండేది.
దురంధర్ సినిమా కూడా నిడివి ఎక్కువ ఉండటంతో దర్శకుడు సినిమాని ఎనిమిది చాప్టర్లు గా విడగొట్టుకుని తెరకెక్కించారు. అలాగే రణబాలి సినిమాని కూడా దర్శకుడు ప్రథమ అంకం.. ద్వితీయ అంకం అని చాప్టర్ల వారీగా విడగొట్టుకుని కథనాన్ని నడిపారు కానీ కొత్త పాయింట్ చెప్పలేకపోయారు. అదే ఈ సినిమాకి మైనస్ అవుతుంది.
సినిమా కథ చారిత్రక నేపథ్యంతో ముడి పడి ఉన్నప్పటికీ కొంత సినిమాటిక్ లిబర్టీ తీసుకుని మార్పులు చేయడం జరిగిందని డిస్క్లైమర్ లోనే దర్శకుడు చెప్పేశారు కాబట్టి కొన్ని సన్నివేశాల గురించి ఇక్కడ చర్చ అనవసరం.
కాకపోతే 1870 ల నాటి కరువు కాటకాలలో మరణించిన ప్రజల సంఖ్య గురించి అంకెలతో సహా దర్శకుడు చూపించడం ఆనాటి సంఘటనలను కళ్ళముందు నిలిపింది. ఆ నాటి దయనీయ దృశ్యాలను చూస్తే ఎవరికైనా హృదయం ద్రవించక మానదు.. ముఖ్యంగా బిడ్డకు చనుబాలు ఇస్తున్న తల్లి ఆకలి బాధకు తట్టుకోలేక మరణించే సీన్ చూస్తే మాత్రం ఎవరికైనా మనసు కలుక్కుంటుంది.
ఇక ఈ సినిమాలో కొన్ని సీన్స్ లో దర్శకుడు ఓవర్ లిబర్టీ తీసుకున్నారనిపిస్తుంది. కడుపుతో ఉన్న ఈశ్వరిరావు.. రష్మికల డెలివరీ సీన్లు చాలా అసహజంగా అనిపిస్తాయి. ఈ విషయంలో దర్శకుడు ఔటాఫ్ మెడికల్ సిలబస్ వెళ్ళిపోయారు. సినిమా స్టార్టింగ్ లో ఓ ఫైటింగ్ సీన్లో విజయ్ దేవరకొండ వీపుకి.. కాలికి బాణాలు దిగుతాయి.. మరుక్షణంలో ఇటు తిరిగేసరికి అవి కనిపించవు. ఇలాంటి చిన్న చిన్న లోపాల విషయంలో దర్శకుడు మరింత జాగ్రత్త వహించి ఉంటే బాగుండేది.
ఎవరెలా చేశారు?
రణబాలి చాలా పవర్ ఫుల్ క్యారక్టర్.. ఆ క్యారక్టర్ ను విజయ్ దేవరకొండ తన బాడీ లాంగ్వేజ్ తో.. మ్యానరిజంతో మరింత పవర్ఫుల్ గా మార్చారు. రాయలసీమ యాసలో విజయ్ దేవరకొండ పలికిన డైలాగులు బాగున్నాయి కానీ చీటికి మాటికి నీయక్క అనడం ఫ్యామిలీ ఆడియన్స్ కి అంతగా కనెక్ట్ అవదు.. అయితే పాత్ర డిమాండ్ చేస్తుంది కాబట్టి ఆ మాత్రం తప్పదు.. రాయలసీమ పౌరుషాన్ని విజయ్ దేవరకొండ కళ్లలోనే చూపించాడు.
ఇక జయమ్మ పాత్రలో రష్మిక ను తీసుకోవడం సరైన ఛాయిస్.. భర్త తనని సరిగా పట్టించుకోవడం లేదని అలుగుతూ మూతి ముప్పైసార్లు తిప్పుతూ క్యూట్ ఎక్స్ప్రేషన్స్ ఇచ్చింది. క్లైమాక్స్ సీన్ లో రష్మిక ప్రేక్షకుల కంట తడి పెట్టిస్తుంది.
మిగిలినవాళ్ళు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.
సాంకేతికత
అజయ్ అతుల్ అందించిన సంగీతం ఆశించిన స్థాయిలో లేదు.. విజయ్ దేవరకొండ కు ఇచ్చిన ఎలివేషన్ ని మరో మెట్టు పైన నిలిపేలా బిజిఎం లేదు. సరైన బిజిఎం పడితే కొన్ని సీన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉండేవి.
నీరవ్ షా అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది..1870 ల నాటి కాలాన్ని కళ్లముందు ఆవిష్కరించారు.
మైత్రీ మూవీ మేకర్స్ వారు అందించిన నిర్మాణ విలువలు బాగున్నాయి
విశ్లేషణ
రణబాలి పూర్తి కమర్షియల్ సినిమా కాదు.. చారిత్రక నేపథ్యం ఆధారంగా దర్శకుడు కథ రాసుకుని కొంత సినిమాటిక్ లిబర్టీతో తెరకెక్కించారు.. దానికి సినిమా తోడు లెంత్ కూడా ఎక్కువే.. కొంచం ఓపిక.. సహనం అవసరం.
విజయ్ దేవరకొండ యాక్షన్ సీన్స్.. విజయ్ దేవరకొండ.. రష్మిక ల కెమిస్ట్రీ మనల్ని ఎంగేజ్ చేస్తాయి. ఇక సెకండాఫ్ లో స్లో నేరేషన్ కొంత విసుగు కూడా తెప్పిస్తుంది. దానికి తోడు బిజీఎం కూడా ఆశించిన స్థాయిలో లేకపోవడంతో నిరాశ కలిగిస్తుంది. ఓవరాల్ గా ఈ సినిమా ఫస్టాఫ్ బాగుంది.. సెకండాఫ్ పర్లేదు. అన్నట్టు ఇంకో విషయం ఏంటంటే ఆ బ్రిటిష్ కమిషనర్ ఆవేశంతో రణబాలి అంటూ ఎన్నిసార్లు అరుస్తాడో.. విజయ్ దేవరకొండ అంతకన్నా ఆవేశంతో నీయక్క అని అరుస్తాడు. అదీ సంగతి !
నటీనటులు : విజయ్ దేవరకొండ, రష్మిక,ఈశ్వరిరావు తదితరులు
సంగీతం: అజయ్ అతుల్
సినిమాటోగ్రఫీ: నీరవ్ షా
నిర్మాణం: మైత్రీ మూవీ మేకర్స్
దర్శకత్వం: రాహుల్ సాంకృత్యాన్
థియేటర్ విడుదల: 16-10-2026
రేటింగ్: 2.75/ 5
