ఓటిటిలోకి వచ్చిన సాయిపల్లవి ఏక్ దిన్ మూవీ (Ek Din movie) ఎలా ఉందంటే ?- మూవీ రివ్యూ!

Spread the love

సాయిపల్లవి , ప్రముఖ బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ జంటగా
నటించిన ఏక్ దిన్ ( Ek Din movie ) హిందీ మూవీ జులై 17 నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటిటిలో తెలుగులో కూడా అందుబాటులోకి వచ్చింది .

ఇప్పటికే తెలుగు , తమిళ , మలయాళం సినిమా ఇండస్ట్రీలలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సాయిపల్లవి బాలీవుడ్ లో ఏకంగా అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్లో ఆఫర్ దక్కించుకుని ఆయన తనయుడు జునైద్ ఖాన్ సరసన తెరంగ్రేట్రం చేసింది . మే 1 న థియేటర్లలో రిలీజ్ అయిన ఏక్ దిన్ హిందీ మూవీ జులై 17 నుంచి అమెజాన్ ప్రైమ్ లో తెలుగులో అందుబాటులోకి వచ్చింది . అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ వన్ డే అనే థాయ్ మూవీని రీమేక్ చేసి హిందీలో విడుదల చేసారు .

ఇప్పుడు ఏక్ దిన్ మూవీ ఎలా ఉందో చూద్దాం.

కధేంటంటే ?

కధానాయకుడు దినేష్ శ్రీవాత్సవ సెల్ఫ్ ఇంట్రడక్షన్ తో మూవీ ప్రారంభం అవుతుంది . దినేష్ ( జునైద్ ఖాన్ ) ఒక ఐటి కంపెనీలో టెక్నికల్ ఇంజినీర్ జాబ్ చేస్తూ ఉంటాడు . అదే కంపెనీలో పనిచేసే మీరాని ( సాయిపల్లవి ) ప్రేమిస్తాడు . కానీ మీరా మాత్రం కంపెనీ హెడ్ నకుల్ తో రిలేషన్ లో ఉంటుంది . ఈ విషయం తెలుసుకున్న దినేష్ మీరా ప్రేమ తనకు దక్కలేదని ఆవేదన పడుతుంటాడు .

ఇదిలా ఉండగా అప్పటికే నకుల్ కు రీతుతో పెళ్లి కూడా అయ్యుంటుంది . తన భార్యకు విడాకులు ఇచ్చి మీరాను పెళ్లిచేసుకుంటానని ఆమెను నమ్మిస్తాడు . తన ప్లానులో భాగంగా మీరాకు ఉన్న జపాన్ చూడాలనే కోరికను అడ్డం పెట్టుకుని ఆమెతో ప్రైవేటుగా గడపటానికి జపాన్ ట్రిప్ ప్లాన్ చేస్తాడు . ఐదు రోజుల ఈ ట్రిప్ కి ఆఫీసు స్టాఫ్ ను కూడా తీసుకెళ్తాడు . అయితే ఐదు రోజుల తర్వాత స్టాఫ్ ని ఇండియా పంపేసి మరో రెండు రోజులు కేవలం మీరా , తాను మాత్రమే జపాన్ లో ఉండేలా టికెట్స్ రిజర్వ్ చేసుకుంటాడు .

అనుకున్నట్టుగానే నకుల్.. మీరా అండ్ తన స్టాఫ్ తో కలిసి జపాన్ వెళ్తాడు . ఈ స్టాఫ్ లో దినేష్ కూడా ఉంటాడు . మీరా , నకుల్ ల మధ్య ఉన్న రిలేషన్ సంగతి తెలిసినా కూడా మీరా ప్రేమ తనకు ఒక్కరోజు దక్కినా చాలని దినేష్ అనుకుంటాడు .

అయితే అనుకోకుండా నకుల్ భార్య రీతూ జపాన్ రావడంతో కథ అడ్డం తిరుగుతుంది . మీటింగులో తాను ప్రెగ్నెంట్ అని రీతూ చెప్తుంది . దాంతో తన భార్యకు విడాకులు ఇస్తున్నట్టు చెప్పి నకుల్ తనని నమ్మించి మోసం చేసాడని మీరా తెలుసుకుంటుంది . ఆ ఫ్రస్టేషన్లో తాగేసి మంచు తుఫానులో ఇరుక్కుని ఆక్సిడెంట్ కావడంతో హాస్పిటల్లో చేరుతుంది . తలకు తగిలిన దెబ్బ వల్ల ఆమెకు అరుదైన TGA అనే వ్యాధి బారినపడినట్టు డాక్టర్లు చెప్తారు . అందువల్ల ఒకరోజుపాటు ఆమెకు ఏమీ గుర్తు ఉండదని , 24 గంటల తర్వాత మళ్ళీ ఆమె మెమొరీ రిస్టోర్ అవుతుందని డాక్టర్ చెపుతుంది .

మీరాకు మెమొరీ లాస్ అయిన ఆ ఒక్కరోజు దినేష్ ఏం చేస్తాడు ?
తన ప్రేమను ఆమెకు తెలియచేస్తాడా ? లేదా ?
భార్య విషయం మీరాకు చెప్పకుండా దాచిపెట్టిన నకుల్ చివరికి ఏం చేస్తాడు ?
మెమొరీ తిరిగి వచ్చిన తర్వాత మీరా ఏం చేస్తుంది ? అనేది మిగిలిన కథ .

ఎలా ఉంది ?

హీరో ఎలివేషన్లు చూపించటానికి కొంత , హీరోయిన్ అందాలను చూపించటానికి కొంత , పార్కులు , డ్యూయెట్లకు మరికొంత టైమ్ తీసుకోకుండా దర్శకుడు నేరుగా పాయింటుకు వచ్చేసాడు . ఆ మాటకొస్తే ఇందులో హీరో దినేష్ కు అసలు ఎలివేషన్లే ఉండవు . జస్ట్ ఒక కామన్ మ్యాన్ మాదిరి పరిచయం చేస్తాడు . దినేష్ మీరాని ప్రేమిస్తాడు.. అంతే.. సింపుల్ .. అంతే కానీ ఆ ప్రేమని ఎస్టాబ్లిష్ చేయడం కోసం దర్శకుడు ఫస్టాఫ్ అంతా సాగదీయకుండా నేరుగా కథలోకి వచ్చేస్తాడు. ఇక హీరోయిన్ సంగతి చెప్పాలి కదా ? అది కూడా అంతే ..సింపుల్గా చెప్పేస్తాడు .. హీరోయిన్ తన బాస్ తో రిలేషన్లో ఉంటుందని . మూవీ మొదలైన ముప్పై నిమిషాల్లోనే కథ పట్ల మనకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది .

హీరో ..హీరోయిన్ను ప్రేమిస్తాడు . హీరోయిన్ తన బాస్ ను ప్రేమిస్తుంది . ఇప్పుడు మన డౌట్ ఏంటి ? బాస్ చేసిన మోసం గురించి తెలుసుకున్న హీరోయిన్ చివరికి హీరోని ప్రేమిస్తుందా ? లేదా ? అనే కదా ? ఈ ప్రశ్నకి దర్శకుడు సెకండాఫ్ లో సమాధానం చెప్పాడు . ఆ సమాధానమే ఈ మూవీకి ప్లస్సు . ఆ సమాధానం కూడా రోజుల తరబడి నాన్చకుండా దర్శకుడు ఒక్కరోజులోనే తేల్చి చెప్పేసాడు . కాకపోతే క్వశ్చన్ పేపర్ ముందే లీక్ అయినట్టు చాలావరకు సమాధానాలు మనకు ముందే తెలిసిపోతాయి . అదే ఈ మూవీకి మైనస్సు . బిగినింగ్ లోనే స్టోరీ మెయిన్ ప్లాట్ మనకు అర్థమైపోతుంది . ఇక అక్కడ్నుంచి సాగే కధనం కూడా ప్రిడిక్టబుల్ గా ఉంటుంది . తెలిసిన కథతో పాటే మనమూ జపాన్ లో తిరుగుతున్నట్టు అనిపిస్తుంది కానీ కొత్తగా తెలుసుకునేది ఏమీ ఉండదు .

మీరాకు వచ్చినట్టు చెప్పిన TGA జబ్బు మెడికల్ సైన్సులో నిజంగా ఉందో లేదో తెలీదు కానీ మూవీకి మాత్రం బాగా పనికొచ్చింది . ఒక్కరోజు మెమొరీ లాస్ అవడమనే కాన్సెప్టే కధకు కీలకం . భావోద్వేగాలు పండించడానికి , కావాల్సినంత సంఘర్షణ అనుభవించటానికి , ప్రేమ , ఎడబాటు లాంటి సెంటిమెంట్లను ఎడాపెడా వాడెయ్యడానికి ఆ ఒక్కరోజు జబ్బు చాలా పనికొచ్చింది . సరే ఆ జబ్బు సంగతి అలా ఉంచితే ఆ ఒకరోజు అనే పాయింటును ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా ఇంట్రెస్టింగ్ గా వాడుకోవడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు . ఎందుకంటే ఆ ఒకరోజు మెమొరీ లాస్ అయిన మీరా ..మెమొరీ లాస్ కాని దినేష్ లతో పాటు మనమూ జపాన్ మొత్తం చూసేస్తాం . జపాన్ లోని బ్యూటిఫుల్ ప్లేసులు , ఆ స్నో ఫాలింగ్ , అన్నీ చూసి హీరో హీరోయిన్లతో పాటు మనమూ నేత్రానందం పొందుతాం . అలా ఆ ఒకరోజు మొత్తం హాలిడే ట్రిప్ లా గడిచిపోతుంది .

ఇప్పుడు కథ మళ్ళీ మొదటికొస్తుంది . మీరాకు తిరిగి మెమొరీ వచ్చి దినేష్ ను చూసి హూ ఆర్ యు ? అంటే ? ఎలా ? అందుకే దినేష్ భయపడతాడు . ఆమె తనను అసహ్యించుకుంటుందేమో అని తెగ ఆలోచించేస్తాడు . పోనీలే ఎలాగైతేనేమి ఆమెకు మెమొరీ లేని ఆ ఒక్కరోజైనా తనని ప్రేమించిందని సంతోషపడతాడు . ప్రేమను చూసిన ఆమె కళ్ళలో కోపం చూడలేక ఉద్యోగం మానేసి వెళ్ళిపోతాడు .

ఇక్కడ కూడా దర్శకుడి నేరేషన్ సింపుల్గా ఉంటుంది .తన ప్రేమ విఫలం అయిందని రొటీన్ కమర్షియల్ ఫార్మాట్ మాదిరి భుజాల దాకా గడ్డం పెంచుకోవడం , సీసాలకు సీసాలు తాగేసి పడిపోవడాలు, లాంటి భయానక సన్నివేశాలు పెట్టకుండా సింపుల్గా తల్లితో జ్ఞానోదయం చేయిస్తాడు . కాకపోతే మరీ బాగోదు అనుకున్నాడేమో దర్శకుడు మన హీరోగారికి కొంచం గడ్డం తగిలించాడు . నిజంగా గతంలో చాలా సినిమాల్లో లవ్ ఫెయిల్యూర్ కేసుల్లో గడ్డాలు పెంచుకున్న హీరోలను , సీసాలకు సీసాలు తాగి పడిపోయే హీరోలను చూసిన ప్రేక్షకులకు ఇది పెద్ద రిలీఫ్ . దర్శకుడు ఎక్కడికక్కడ సింపుల్గా తేల్చేసిన విధానం బాగుంది . అలాగే క్లైమాక్స్ కూడా . కాకపోతే ఈ మూవీలో ఒకేఒక లోటు ఏంటంటే అన్నీ మనకు ముందే తెలిసిపోవడం . ఇంకో పొరపాటు ఏంటంటే దర్శకుడు కథ మీదకన్నా జపాన్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టడం . ఆ జపాన్ సైట్ సీయింగ్ కొంచం ట్రిమ్ చేసి నకుల్ వెర్షన్ కూడా కొంచం చూపించి ఉంటే బాగుండేది .

ఎవరెలా చేసారు ?

ఈ సినిమా మొత్తం నకుల్ , మీరా , దినేష్ అనే మూడు పాత్రల చుట్టూనే తిరుగుతుంది . మళ్ళీ ఈ మూడు పాత్రల్లో నకుల్ పాత్రకు పెద్దగా స్కోప్ లేదు . అందర్నీ జపాన్లో వదిలేసి భార్యతో కలిసి ఆ పాత్ర మాయం అవుతుంది . ఆ పాత్రలో కునాల్ కపూర్ నటన పర్లేదు .

ఇక సాయిపల్లవి గురించి కొత్తగా చెప్పేది ఏముంటుంది ? ఇలాంటి పాత్రలు ఆమెకు కొట్టిన పిండి . మీరా పాత్రలో పర్ఫెక్ట్ గా నటించింది .

ఇప్పుడు అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ గురించి మాట్లాడుకుందాం . లుక్ బాగున్నాడు . పాత్రకు తగట్టుగా అతి మంచితనం , అమాయకత్వం బాగానే ఒలకబోశాడు . తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు .

సాంకేతికత

రామ్ సంపత్ అందించిన సంగీతం బాగుంది .
మనోజ్ కెమెరా పనితనం కూడా బాగుంది . అందులోనూ జపాన్ మంచుకొండలను చక్కగా చూపించాడు .
అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ వెనుక నిలబడి మూవీ మొత్తం దాదాపు జపాన్ లోనే తీశారు కాబట్టి నిర్మాణ విలువల గురించి తక్కువగా చెప్పడానికి ఏముంటుంది ? బాగుంది .

విశ్లేషణ

ఈ మూవీ స్క్రీన్ ప్లే లో దర్శకుడి సింప్లిసిటీ బాగుంది . పదిలైన్లలో చెప్పాల్సిన విషయాన్ని ఒక్క లైనులో చెప్పగలగడం ఒక ఆర్ట్ . ఈ ఆర్ట్ లో దర్శకుడు పాస్ అయ్యాడు . అందుకే తాను చెప్పాలనుకున్న ఒకరోజు ప్రేమను ఎక్కువ రోజులు నాన్చకుండా అక్కడికక్కడే తేల్చేసాడు . ఒక్కో పాత్రను బబుల్ గమ్ మాదిరి లాగి పీకకుండా సింపుల్గా నేరేట్ చేసుకుంటూ వచ్చిన తీరు బాగుంది .

సాయిపల్లవి , జునైద్ ఖాన్ పెయిర్ కూడా బాగానే ఉంది . దానికి తోడు కొన్ని సన్నివేశాలు చూస్తే ఇద్దరూ పోటీపడి నటించినట్టుగా అనిపిస్తుంది . అమెజాన్ ప్రైమ్ లో తెలుగులో కూడా అందుబాటులో ఉంది కాబట్టి ఓ లుక్కేయండి .

నటీనటులు : సాయిపల్లవి , జునైద్ ఖాన్ , కునాల్ కపూర్ తదితరులు
సంగీతం : రామ్ సంపత్
సినిమాటోగ్రఫీ : మనోజ్
నిర్మాత : అమీర్ ఖాన్
దర్శకత్వం : సునీల్ పాండే
విడుదల : అమెజాన్ ప్రైమ్ (17-07-2026)
రేటింగ్ : 2.75 / 5


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!