ఓటిటిలోకి వచ్చిన వడ్డే నవీన్ ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు మూవీ (Transfer Trimurthulu Movie) ఎలా ఉందంటే ? – మూవీ రివ్యూ !

Spread the love

జులై 17 నుంచి ZEE 5 ఓటిటి ప్లాట్ ఫామ్ లో వడ్డే నవీన్ నిర్మించి , నటించిన ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు మూవీ ( Transfer Trimurthulu movie ) స్ట్రీమింగ్ లోకి వచ్చింది . ఇప్పుడు ఈ మూవీలో హీరో వడ్డే నవీన్ గురించి చెప్పుకోవాలంటే రీలు ఒకసారి వెనక్కి తిప్పాలి . 90 వ దశకంలో పెళ్లి , మానసిచ్చి చూడు వంటి సినిమాలతో వడ్డే నవీన్ ఫ్యామిలీ ఆడియన్సుకు బాగా కనెక్ట్ అయ్యాడు . అప్పట్లో ఆయన తండ్రి కూడా ప్రముఖ నిర్మాత కావడం , కొన్ని సినిమాలు సొంత బ్యానర్లోనే చేసి హిట్ కొట్టడంతో వడ్డే నవీన్ మినిమం రిటర్న్స్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు . ఈయన సినిమాలు ఎక్కువగా ఫ్యామిలీ డ్రామాతోనే నడిచేవి . అలా ఒక ఫ్లోలో సాగిపోతున్న ఆయన కెరీర్ కు సడెన్గా బ్రేక్ పడింది . కొత్త హీరోల కెరీర్ కు ఎందువల్ల బ్రేక్ పడుతుందో అందరికీ తెలిసిందే . ఎంతటివారికైనా ఒక భారీ డిజాస్టర్ మూవీ చాలు కెరీర్ కొంత బ్రేక్ పడటానికి .

వడ్డే నవీన్ ఎంత వేగంగా సినిమాలు చేసాడో అంతే వేగంగా వెండి తెరకు దూరం అయ్యాడు. కనీసం సినిమా ఈవెంట్లలో కూడా నవీన్ కనిపించకపోవడంతో చాలామంది దాదాపు ఆయన గురించి మర్చిపోయారు . కానీ సుదీర్ఘ విరామం తీసుకున్న వడ్డే నవీన్ తిరిగి హీరోగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడని తెలిసి తెలుగు సినీ ఇండస్ట్రీ ఆశ్చర్యపోయింది . ఇంత గ్యాప్ తీసుకుని వస్తున్నాడంటే నవీన్ గట్టి స్క్రిప్ట్ పట్టుకునే ఉంటాడని అందరూ భావించారు . అదీ తానే నిర్మాతగా మారి నటించడానికి ముందుకు వచ్చాడంటే గట్టి కమ్ బ్యాక్ ఇస్తున్నాడని అందరూ అనుకున్నారు .

అందరూ అనుకోవడం కాదు వడ్డే నవీన్ కూడా అనుకున్నాడు . లేట్ గా వచ్చినా లేటెస్టుగా వస్తాను అని రజనీకాంత్ చెప్పినట్టు ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు మూవీతో మీకు వడ్డే నవీన్ గుర్తుండిపోతాడు అని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పాడు . అదే కాన్ఫిడెంట్ తో జూన్ 19 న తన సినిమాని థియేటర్లలో రిలీజ్ చేసాడు . ఫలితాలు నవీన్ ఊహించినంతగా లేకపోగా నిరాశ పరిచాయి . నెల తిరిగేలోపలే జులై 17 నుంచి ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు థియేటర్ నుంచి ఓటిటిలోకి ట్రాన్స్ఫర్ అయ్యాడు .
ఇప్పుడు ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు మూవీ ఎలా ఉందో చూద్దాం .

కధేంటంటే ?

2005 లో అరకు దగ్గర ప్రియమ్మ అనే ఒక గిరిజన మైనర్ బాలిక మీద ఫైనాన్స్ మినిస్టర్ కొడుకు సంతోష్ బాబు ( వివేక్ రఘువంశీ ) అత్యాచారం చేయడంతో సినిమా మొదలౌతుంది. భయంతో ఆ బాలిక అరకు పోలీస్ స్టేషన్ కు వస్తుంది . అక్కడ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసులు ( దేవి ప్రసాద్ ) ఆమె దగ్గరనుంచి కంప్లైంట్ తీసుకుని రికార్డ్ చేస్తాడు . అదే సమయంలో స్టేషన్ కు వచ్చిన ఎస్సై చిన్నికృష్ణ సంతోష్ బాబుకు అనుకూలంగా , ప్రియమ్మకు వ్యతిరేకంగా ఎఫ్ఐఆర్ రాసి ఆ అమ్మాయిని తిరిగి సంతోష్ బాబుకి అప్పచెప్తాడు .

కానీ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసులు ఈ అన్యాయాన్ని ప్రతిఘటించడంతో ఎస్సై తో పాటు సంతోష్ బాబు మనుషులు అతడ్ని కొట్టి మరీ ఆ అమ్మాయి వెంటపడతారు . ఆ గిరిజన బాలికను కాపాడలేకపోయాననే మనస్తాపంతో శ్రీనివాసులు చనిపోతాడు .

కట్ చేస్తే ,

త్రిమూర్తులు ( వడ్డే నవీన్ ) పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్ గా పనిచేస్తూ ఉంటాడు . ఇతడి నిజాయితీ ఇతడ్ని ఇబ్బందులు పెడుతూ ఉంటుంది . అందుకే పదేళ్లలో 55 ట్రాన్సర్లు పొంది రికార్డ్ బద్దలుకొట్టి డిపార్ట్మెంట్లో ట్రాన్స్ఫర్ త్రిమూర్తులుగా పేరు తెచ్చుకుంటాడు . సీఎం కార్యక్రమంలో జరిగిన ఒక వివాదంతో అతడ్ని అమలాపురం నుంచి అరకు ట్రాన్స్ఫర్ చేస్తారు . అక్కడ కూడా పాడుబడిన పాత పోలీస్ స్టేషన్ బిల్డింగులో రికార్డ్ రూమ్ గార్డ్ గా వేస్తారు . అయితే త్రిమూర్తులు రికార్డ్ రూమ్ పరిశీలిస్తున్నప్పుడు ఇరవై ఏళ్ళ క్రితం మైనర్ బాలిక మీద జరిగిన రేప్ కేస్ ఫైల్ బయటపడుతుంది .

త్రిమూర్తులకు దొరికిన ఫైల్ లో ఏముంటుంది ?
ఈ కేసుకు ప్రస్తుత సీఎం కొడుక్కి సంబంధం ఏంటి ?
అప్పట్లో కంప్లైంట్ రాసిన కానిస్టేబుల్ శ్రీనివాసులు త్రిమూర్తులకు ఏమవుతాడు ?
ఆ కేసులో సాక్షాత్తు సీఎం కొడుకు దోషిగా ఉండటంతో కానిస్టేబుల్ త్రిమూర్తులు వాళ్ళని ఏ విధంగా ఎదుర్కొంటాడు ? అనేది మిగిలిన కథ .

ఎలా ఉంది ?

ఈ సినిమా ఎలా ఉందో చెప్పాలంటే ముందు మనం లాజిక్కులను పట్టించుకోకూడదు . పొరపాటున లాజిక్కుల జోలికి వెళ్ళామా సినిమాకి కనెక్ట్ కాలేము . అయినా రివ్యూ అన్నాక అన్ని విషయాలు మాట్లాడుకోవాలి కదా ? ఒకటొకటి రివ్యూ చేసుకుందాం .

ఒక సాధారణ కానిస్టేబుల్ ఇరవై ఏళ్ళ క్రితం కేసును తిరగదోడి ఏకంగా సీఎం ఫ్యామిలీనే కోర్టుకు ఈడ్చి శిక్ష పడేలా చేస్తాడు . సింపుల్ గా ఏక వాక్యంలో కథ ఇదే . మంచి పాయింటే . హీరో ఎలివేషన్లకు అవకాశం ఉంటుంది . ఎందుకంటే మాములు కానిస్టేబుళ్లు సీఎం తో పెట్టుకోలేరు కదా ? హీరో అయితేనే అది సాధ్యం అవుతుంది . కాబట్టి కధలో హీరో వడ్డే నవీన్ ది కానిస్టేబుల్ త్రిమూర్తులు క్యారక్టర్ కాబట్టి ఖచ్చితంగా సీఎం కు శిక్ష పడుతుంది . సో ఆ పాయింట్ మనకు ముందే తెలిసిపోయింది కాబట్టి రిలాక్స్ .

అయితే పేపర్ మీద రాసుకున్న ఇదే పాయింటును తెర మీద చెప్పాలంటే కొంచం జాగ్రత్తగా స్క్రీన్ ప్లే రాసుకోవాలి . ఈ మూవీలో దెబ్బతిన్నది అదే . ఇరవై ఏళ్ళ క్రితం కేసును తిరగదోడి సీఎం కొడుకును బోనెక్కించడం అనే పాయింటులో దర్శకుడు కథ రాసుకోవడం వరకు ఓకే . అయితే దానికి కొంత వాస్తవికతను జోడించి గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో నడిపిస్తే వడ్డే నవీన్ ఆశించినట్టు నిజమైన కమ్ బ్యాక్ అయ్యేది . వాస్తవికత లేకపోతే పోయింది కనీసం సహజత్వానికి కొంత ప్రియారిటీ ఇవ్వాల్సింది . అంతేకానీ త్రిమూర్తులు కానిస్టేబుల్ అయితేనేమి , హోమ్ గార్డ్ అయితేనేమి అంతకన్నా ముందు సినిమాలో హీరో కాబట్టి సీఎం నే కాదు అవసరమైతే ( పార్ట్ టు లో చూపిస్తారేమో) పీఎం ను కూడా కోర్టుకు ఈడుస్తాడు అదంతే అని దర్శకుడు డిసైడ్ అయినప్పుడు ఇలాంటి స్క్రీన్ ప్లే లు పుట్టుకొస్తాయి .

అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే హీరో ఎలివేషన్లు చూపించాలనుకుంటే ఏ దర్శకుడికైనా కొంత లిబర్టీ అవసరం . ఇందులో కాదనేది ఏమీ లేదు . ఇప్పటికే హీరో కాలి బూటుతో మొదలెట్టి ముఖం వరకు చూడటం , హీరో నడిచి వస్తుంటే ట్రాన్స్ఫార్మర్లు పేలిపోవడం , హీరో గట్టిగా ఊదితే వందమంది రౌడీలు ఒకేసారి నాసా స్పేస్ సెంటర్ను తాకి కిందపడటం వంటి రకరకాల భారీ ఎలివేషన్లు చూసీ చూసీ అలవాటు పడిపోయాం . కానీ హీరో కాబట్టి ఏం చేసినా మీరు భరించాలి అంటే మాత్రం అందరికీ అంత సహనం ఉండొద్దూ?

బిందెడు పాలలో చుక్క విషం చాలు పాలు పాడైపోవడానికి అన్నట్టుగా సీరియస్ టోన్ లో సాగుతున్న కధనంలో ఒక చిన్న సన్నివేశం చాలు సినిమా భవిష్యత్తును నిర్ణయించడానికి . సాక్షాత్తు సీఎం మీద దాడి జరగబోతుంటే ఎంటైర్ పోలీసులు , గన్ మెన్లు , స్పెషల్ కమెండోలు మాయమైపోయి కేవలం ఒక కానిస్టేబుల్ లాఠీతో అడ్డొచ్చిన వాళ్ళని చావబాది సీఎం ను కారెక్కించిన సన్నివేశం హీరోల భారీ ఎలివేషన్లకు పరాకాష్ట . ఈ ఒక్క సన్నివేశంతో సినిమా గ్రాఫ్ సగానికి పడిపోతుంది . ఒక సాధారణ కానిస్టేబుల్ సీఎం ఫ్యామిలీని ఎదురించడం అన్న కాన్సెప్ట్ నైనా అంగీకరించవచ్చు కానీ ఇలాంటి భారీ ఎలివేషన్ మాత్రం సాధారణ ప్రేక్షకులు అంగీకరించలేరు .

ఇక సీరియస్ టోన్ లో కథ సాగుతున్నప్పుడు కధనం మీద దృష్టి పెట్టాలే కానీ హీరో మీద ఫోకస్ పెట్టకూడదు . దర్శకుడి ఫోకస్ అంతా కథ మీద కన్నా హీరో మీద పెట్టడంతో వచ్చిన ఇబ్బంది ఇది . నిజానికి దర్శకుడి ఫోకస్ హీరోకి కూడా నచ్చి ఉంటుంది . ఎందుకంటే వడ్డే నవీన్ ను వింటేజ్ లుక్ లో చూపించడం , పాటల్లో లవర్ బాయ్ , ఫైటింగుల్లో సూపర్ మ్యాన్ , ఐటెం సాంగులో డ్రీమ్ బాయ్ లాగా .. ఎలా చూసినా ఒక ప్లెజెంట్ లుక్ తో హీరోని ప్రెజెంట్ చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు . అందులో ఏ మాత్రం అనుమానం లేదు . పదేళ్ల క్రితం సిల్వర్ స్క్రీన్ మీద వడ్డే నవీన్ ఎలా ఉన్నాడో ఇప్పుడు అంతకన్నా గ్రేస్ తో కనిపించడం వెనుక దర్శకుడి కృషి కంటికి కనిపిస్తుంది . బహుశా దర్శకుడి కృషి కన్నాహీరో నవీన్ కృషి ఎక్కువగా ఉండి ఉంటుంది . ఎందుకంటే పదేళ్ల గ్యాప్ ఎక్కడా కనిపించనంత ఎనర్జటిక్ గా కనిపించాడు .

సరే , ఇప్పుడు ఫస్టాఫ్ విషయానికి వస్తే అసలు కథలోకి వెళ్ళడానికి దర్శకుడు కొంత టైమ్ తీసుకున్నాడు . త్రిమూర్తులు ట్రాన్సఫర్ల సంగతి , ఎస్సై రఘుబాబు కామెడీ ట్రాక్ , కూతురి కిడ్నాప్ డ్రామాతో ఫస్టాఫ్ నడుస్తుంది . అయినా నాట్ బ్యాడ్ .. కానీ కొన్ని సన్నివేశాలు ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది .

సెకండాఫ్ మనం అసలు కథలోకి వెళ్తాం . అరకు స్టేషన్లో పాత కేసు రికార్డ్ దొరకడం , సీఎం కొడుకును దోషిగా నిలబెట్టాలని త్రిమూర్తులు బయలుదేరడం , ఈ క్రమంలో తండ్రితో పాటు పనిచేసిన అప్పటి కానిస్టేబుల్ ను కలవడం , ప్రత్యక్ష సాక్షి అయిన ఖైదీ శంకర్ కోసం వెతకడం , తన కూతుర్ని కిడ్నాప్ చేసినందుకు ప్రతిగా ఏసిపి మనవరాలిని కిడ్నాప్ చేయడం వంటి సన్నివేశాలతో కధనం క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మోడ్ లో సాగుతుంది . ఈ ఎపిసోడ్స్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తాయి . కధనం కూడా వేగంగా పరుగులు పెట్టడంతో బోర్ కొట్టదు .

క్లైమాక్సులో కోర్ట్ డ్రామా కూడా బాగుంది కానీ ఈ సన్నివేశంలో పగ్గాలు హీరోచేతుల నుంచి తప్పించి ఇద్దరు ఆర్టిస్టుల చేతుల్లో పెట్టడంతో రావాల్సినంత మైలేజ్ రాలేదు . మొదట్నుంచీ లీడ్ లో ఉన్న హీరో ఆఖరి రౌండ్ లో వెనకబడినట్టు అయ్యింది . అన్నిటికన్నా ఈ మూవీలో ఉన్న ప్రధాన లోపం ఏంటంటే ప్రేక్షకులు ముందుగా ఊహించిన విధంగానే కధనం కొనసాగడం . దాంతో ఏ సన్నివేశం చూసినా ఎక్కడా కొత్తగా ఫీల్ అవడానికి ఏమీ ఉండదు . పాత కేసును పట్టుకుని ఊహించని ట్విస్టులతో చక్కటి క్రైమ్ థ్రిల్లర్ గా మలచాడనికి బోలెడంత స్కోప్ ఉంది . కానీ జరగలేదు . నాలుగు పాటలు , ఆరు ఫైట్లు , ఒక ఐటెం సాంగుతో రొటీన్ కమర్షియల్ ఫార్మాట్లో కధనం సాగిపోతుంది . దర్శకుడు స్క్రీన్ ప్లే మీద మరింత జాగ్రత్తగా దృష్టి పెట్టి ఉంటే బాగుండేది .

ఎవరెలా చేసారు ?

షుమారు పదేళ్ల తర్వాత సిల్వర్ స్క్రీన్ ముందుకు వచ్చిన వడ్డే నవీన్ ఈ మూవీ మీద చాలా హోప్స్ పెట్టుకునే ఉంటారు . ఆ హోప్స్ కు తగ్గట్టుగా వడ్డే నవీన్ కష్టపడ్డారు . అందులో అనుమానం లేదు . నేను ఇంతకుముందు చూసిన సినిమాలకన్నా ఈ సినిమాలో నవీన్ చాలా గ్లామర్ గా కనిపించారు . సినిమాలో కొన్ని సన్నివేశాలు చూస్తున్నప్పుడు నవీన్ ఎంత మనసు పెట్టి చేసారో అర్ధం అవుతుంది . పాటల్లో , ఫైటుల్లో నవీన్ కష్టం కనిపిస్తుంది . ఒక్క సీఎం దగ్గర ఫైట్ సన్నివేశం మినహా వడ్డే నవీన్ ప్రతి ఫ్రేమ్ లో చక్కగా నటించాడు .

ఇక హీరోయిన్ లక్ష్మి పాత్ర పోషించిన రాశి సింగ్ కు మూవీలో పెద్దగా స్కోప్ లేదు . ఎస్ బాస్ తరహాలో అవసరమైనప్పుడు కనిపించడం మినహా ఆమెకు సరైన రోల్ దక్కలేదు . ఆమె కూతురుగా నటించిన పాప క్యూట్ గా నటించింది .
సీఎం కమలాదేవి పాత్రలో శిల్పా తులస్కర్ , ఆమె కొడుకు పాత్రలో రఘువంశీ నటన పర్లేదు.
హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసులు పాత్రలో దేవీప్రసాద్ భావోద్వేగాలు బాగా పలికించారు . ఆయనకు మూవీలో మంచి పాత్ర దక్కింది . లాయర్ల పాత్రలో వడ్లమాని శ్రీనివాస్ , శివన్నారాయణల నటన బాగానే ఉంది .

సాంకేతికత

కళ్యాణ్ నాయర్ అందించిన సంగీతం బాగానే ఉంది .
కార్తీక్ ఫోటోగ్రఫీ కూడా బాగానే ఉంది
నిర్మాణ విలువలు కూడా బాగానే ఉన్నాయి .

విశ్లేషణ

90 వ దశకంలో వడ్డే నవీన్ సినిమాలు చూసినవారికి అతడిలో మంచి నటుడు కనిపిస్తాడు . ఎందుకో చాలాకాలం గ్యాప్ తీసుకుని ఇప్పుడు ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు తో మరోసారి అందరిముందుకు వచ్చాడు . ఈ సినిమా మీద నవీన్ చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు . అయితే మూవీలో వడ్డే నవీన్ కష్టం లోపం ఏమీ లేదు . ఏమన్నా లోపం ఉందంటే అది దర్శకత్వ వైఫల్యమే .

ఫస్టాఫ్ త్రిమూర్తులు పాత్ర పరిచయానికి , రఘుబాబు కామెడీ ట్రాక్ కోసం కేటాయించుకున్న దర్శకుడు సెకండాఫ్ లో అసలు కథలోకి వెళ్తారు . అయితే ఈ క్రమంలో పంటికింది రాయిలా ఎదురయ్యే కొన్ని సన్నివేశాలను ట్రిమ్ చేసి మరింత గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే అందించి ఉంటే ఫలితాలు చాలా బాగుండేవి . అయినా పర్లేదు . వన్ టైమ్ వాచ్ మూవీ కింద ఓటిటిలో చూడొచ్చు .

నటీనటులు : వడ్డే నవీన్ , రాశి సింగ్ , శిల్పా తులస్కర్ , వివేక్ రఘువంశీ , దేవీప్రసాద్ తదితరులు
సంగీతం : కళ్యాణ్ నాయర్
సినిమాటోగ్రఫీ : కార్తీక్
నిర్మాత : వడ్డే నవీన్
దర్శకత్వం : కమల్ తేజ నార్ల
విడుదల : ZEE 5 (17-07-2026)
రేటింగ్ : 2.5 / 5


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!