సోషల్ మీడియా వేదికగా ప్రారంభమైన కాక్రోచ్ జనతా పార్టీ (cockroach janata party) నిన్న సోమవారం (20-07-2026) ఒక్కసారిగా దేశప్రజల చర్చల్లో స్థానం దక్కించుకుంది . ఇన్నాళ్లు స్తబ్దుగా సాగిన కాక్రోచ్ ఉద్యమం నిన్న ఢిల్లీలో V టర్న్ ( వయొలెన్స్ ) తీసుకుని ఒక్కసారిగా భగ్గుమంది . ఢిల్లీ పోలీస్ , రాజకీయ నాయకులనే కాదు దేశ ప్రజలను సైతం ఉలిక్కిపడేలా చేసింది .
నిన్నటి హింసాకాండకు సంబంధించిన వీడియోలు మెయిన్ స్ట్రీమ్ మీడియాతోపాటు , సోషల్ మీడియాలో కూడా చక్కర్లు కొడుతున్నాయి . అయితే ఢిల్లీలో జరిగిన సంఘటనలను ఎవరికి వారు తమకు అనుకూలంగా ఉన్న వీడియోలనే సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు . CJP దాడులలో పోలీసుల తలలు పగిలాయని ఒక వర్గం వారు వీడియోలను సర్క్యులేట్ చేస్తే , పోలీసుల దాడులలో CJP కార్యకర్తల తలలు పగిలాయని ఇంకో వర్గం వారు వీడియోలు సర్క్యులేట్ చేస్తున్నాయి . తప్పు మీదంటే మీది అని ఇరువర్గాలు వాదనలు చేసుకుంటూ ఉద్రిక్తతలు మరింత పెంచుకుంటున్నాయి .
నిన్న జరిగిన సంఘటనలలో ఎవరిది తప్పు అనే విషయాన్ని విశ్లేషించుకునేముందు ఒక్కటి మాత్రం నిజమని అందరూ ఒప్పుకోవాలి . ఇంతకుముందెన్నడూ లేని స్థాయిలో మొదటిసారి ఢిల్లీలో భారీ అల్లర్లు జరిగాయి . అటు పోలీసులకు , ఇటు కాక్రోచ్ కార్యకర్తలకూ, ఇరువైపులా గాయాలు అయ్యాయి . పోలీసు వాహనాలు డ్యామేజ్ అయ్యాయి .
నిన్నటి సంఘటనలకు మూలకారణం అయిన కాక్రోచ్ జనతా పార్టీ ఆవిర్భావం వెనుక ఉన్న కారణాన్ని ఒకసారి చూద్దాం .
కాక్రోచ్ జనతా పార్టీ ఆవిర్భావం
ప్రస్తుతం మనం డిజిటల్ యుగంలో ఉన్నాం . ప్రపంచం మొత్తంలో విద్యావేత్తలు , రాజకీయ నాయకులు , వ్యాపారవేత్తలు , ఇతర రంగాలకు చెందినవారు డిజిటల్ ప్లాట్ ఫామ్ ను ఉపయోగించుకుని అద్భుత ఫలితాలు సాధిస్తున్నారు . ఇవాళ సోషల్ మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియాని దాటుకుని ముందుకు దూసుకుపోతుంది . ఇక్కడ దాదాపు ప్రతిరాజకీయ పార్టీ తమ సొంత సోషల్ మీడియా నెట్ వర్క్ పెట్టుకుని రాజకీయ లబ్దిని పొందుతున్నాయి . ఇక నేటి జెన్ జి తరం గురించి కొత్తగా చెప్పేది ఏముంది ? సోషల్ మీడియా ద్వారా అద్భుతాలు చేస్తున్నారు .
ఇప్పుడు అభిజిత్ దీప్కె గురించి చెప్పుకుందాం . ఎవరీ అభిజిత్ ?
బోస్టన్ యూనివర్సిటీలో చదువుకుంటున్న 30 ఏళ్ళ సాధారణ విద్యార్థి అభిజిత్ . కాకపోతే డిజిటల్ క్రియేటర్ గా పేరు తెచ్చుకుని సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉంటాడు . గత మే నెలలో కోర్ట్ విచారణ సందర్భంలో భారత సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి . ఆ వ్యాఖ్యలతో నిరుద్యోగుల మనోభావాలు దెబ్బతిన్నాయి . నిజానికి సీజేఐ తన వాఖ్యల పట్ల అదే రోజు వివరణ కూడా ఇచ్చారు . కొందరు ఫేక్ డిగ్రీలతో ఉన్నత ఉద్యోగాలలో ప్రవేశించటానికి ప్రయత్నిస్తున్నారు..అటువంటివారు వ్యవస్థను పాడుచేయడానికి బొద్దింకల్లా పనిచేస్తున్నారని వారిని ఉద్దేశించి మాత్రమే అన్నానని , సాధారణ నిరుద్యోగులను ఉద్దేశించి అనలేదని , తన వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారని అన్నారు .
కానీ ఇవాళ్టి సోషల్ మీడియా స్పీడ్ సంగతి తెలియనిది ఏముంది ? సీజేఐ గారు ఇచ్చిన వివరణ కన్నా బొద్దింకలు అనే మాటే ముందు వెళ్ళింది . దాంతో ఈ అభిజిత్ అనే కుర్రాడు ‘ “ఎస్ ..మేము నిజంగా బొద్దింకలమే ” అంటూ కాక్రోచ్ మాస్క్ తో ఒక మీమ్ తయారుచేసి ఇన్స్టాలో పోస్ట్ చేసాడు . నిజానికి సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఇలాంటి మీమ్స్ వేలల్లో కనిపిస్తాయి . వాటిలో చాలావరకు వైరల్ అవుతాయి . బహుశా అభిజిత్ కూడా ఆ మీమ్ పోస్ట్ చేసేటప్పుడు కేవలం ఇన్స్టాలో వ్యూస్ కోసం చేసి ఉండొచ్చు . కానీ ఆ మీమ్ కి అతడు ఊహించని రెస్పాన్స్ వచ్చింది . గంటల్లోనే 60 లక్షలమంది ఫాలోవర్లు చేరారు . ఇంకేముంది కథ మలుపు తిరిగింది . సరదాగా పెట్టిన పోస్ట్ కాక్రోచ్ జనతా పార్టీగా ఆవిర్భవించింది . పార్టీ పేరు పెట్టడమే కాదు ఐదు డిమాండ్లతో ఒక బ్రోచర్ కూడా రిలీజ్ చేసారు . నిజానికి అతడి మొదటి డిమాండ్లలో కూడా రిటైర్డు న్యాయమూర్తులకు నామినేటెడ్ పదవులు ఇవ్వకూడదు లాంటి సీజేఐ వాఖ్యల పట్ల ప్రతిస్పందన కనిపిస్తుంది కానీ వేరే ఇతర పొలిటికల్ డిమాండ్స్ ఏమీ కనిపించలేదు . కానీ ఎప్పుడైతే సోషల్ మీడియాలో కాక్రోచ్ జనతా పార్టీ ఫేమస్ అయ్యిందో అప్పుడు రాజకీయ పార్టీల చూపు అభిజిత్ మీద పడింది . దాంతో అతడి స్థానం ఢిల్లీకి మారింది .
ఢిల్లీలో అభిజిత్ ఏం చేసాడు ?
అభిజిత్ ఢిల్లీకి రావడంతోనే NEET ప్రశ్నపత్రాల లీక్ అంశం ఎత్తుకున్నాడు . ఏకంగా కేంద్ర విద్య శాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఢిల్లీలోని జంతరమంతర్ వేదికగా మీటింగ్ పెట్టి తొలిసారిగా మెయిన్ స్ట్రీమ్ ముందుకు వచ్చాడు . కానీ బీజేపీ సోషల్ మీడియా చాలా స్ట్రాంగ్ గా ఉందనే విషయం కూడా అభిజిత్ అప్పుడే గ్రహించాడు . మొదటి రౌండ్ లో బీజేపీ సోషల్ మీడియా ధాటికి తట్టుకోలేక CJP వెనకబడింది . అందుకే తమ ఉద్యమంలో ఒక స్టార్ క్యాంపైనర్ ను దించితే కానీ తమ పోరాటానికి ఫోకస్ పెరగదు అని అలోచించి అందుకు అర్హత ఉన్న వ్యక్తుల కోసం వెతికారు . ఈ లిస్టులో క్రేజ్రీవాల్ నుంచి ప్రకాష్ రాజ్ వరకు చాలామంది పేర్లు బయటికి వచ్చాయి . కానీ క్రేజ్రీవాల్ రంగంలోకి దిగితే పొలిటికల్ కలర్ వచ్చి ఉద్యమం నీరుగారిపోతుంది . ప్రకాష్ రాజ్ దిగితే నెగిటివ్ స్క్రోలింగ్ వచ్చే అవకాశం ఉందని భావిస్తున్న సమయంలో వారి దృష్టిలో సోనమ్ వాంగ్ ఛుక్ పడ్డాడు . సామజిక కార్యకర్తగా , పర్యావరణ వేత్తగా సోనమ్ వాంగ్ ఛుక్ కు మంచి పేరుంది .
సోనమ్ వాంగ్ ఛుక్ నిరాహార దీక్ష
CJP డిమాండుకు మద్దతుగా జూన్ 28 నుంచి సోనమ్ వాంగ్ ఛుక్ నిరాహార దీక్ష మొదలుపెట్టారు . మొదట్లో బీజేపీ కూడా అయన దీక్షను పెద్దగా పట్టించుకోలేదు . కానీ దీక్షతో రోజురోజుకీ ఆయన నీరసించిపోవడంతో బీజేపీ అధినాయకులు ఆలోచనలో పడ్డారు . అప్పటికే ఆయన నిరాహార దీక్ష మొదలుపెట్టి ఇరవై రోజులు అయ్యింది . ఇదేరకంగా మరికొన్ని రోజులు ఆయన నిరాహార దీక్ష చేస్తే చనిపోయే అవకాశం ఉందని డాక్టర్లు రిపోర్ట్ ఇవ్వడంతో ఈ అంశంలో ఏదో ఒకటి చెయ్యాలని బీజేపీ నిర్ణయించుకుంది .
విద్యా శాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తొలగింపుకు ఆలోచన చేసిన బీజేపీ అధినాయకత్వం?
నిజానికి కాక్రోచ్ డిమాండ్లు కూడా పెద్దగా ఏమీ లేవు . వాటిలో నీట్ ప్రశ్నపత్రాల లీకేజికి బాధ్యత వహిస్తూ విద్యా శాఖా మంత్రిని క్యాబినెట్ నుంచి తొలగించడం మొదటిది . ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థులకు కోటి రూపాయల నష్టపరిహారం రెండవది . భవిష్యత్తులో నీట్ వంటి ప్రవేశ పరీక్షల్లో అక్రమాలు జరక్కుండా తగిన చర్యలు తీసుకోవడం అనేది మూడోది .
వీటిలో రెండు , మూడు డిమాండ్ల పట్ల బీజేపీ నాయకత్వానికి ఎలాంటి ఆక్షేపణలు లేవు . ఆ రెండు డిమాండ్లు అయితే అప్పటికప్పుడు ఆమోదించేదే . కానీ ఆ మొదటి డిమాండే బీజేపీని ఇరకాటంలో పెడుతుంది . నీట్ ప్రశ్నపత్రాలు లీకేజ్ అవడం వాస్తవం . ప్రభుత్వం ప్రశ్న పత్రాల లీక్ వ్యవహారంపై సిబిఐ ఎంక్వైరీకి ఆదేశాలు ఇవ్వడం వాస్తవం . పేపర్ లీక్ కావడం వల్ల షుమారు 25 లక్షలమంది విద్యార్థులకు నష్టం కలిగిందనేది వాస్తవం . నీట్ లీకేజిలో ఇన్ని వాస్తవాలు ఉన్నాయి . కాక్రోచ్ డిమాండ్లు గాలికి పుట్టినవి కావు . ప్రజల్లో కూడా ఆలోచన రేకెత్తించే డిమాండ్ తోనే ముందుకొచ్చారు . నరేంద్ర మోడీ మూడు సార్ల పాలనలో మొదటిసారి ఒక మంత్రి వల్ల డిఫెన్సులో పడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి . రైలు ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర రైల్వే మంత్రి పదవికి లాల్ బహదూర్ శాస్త్రి రాజీనామా చేసిన ఉదంతాన్ని నెటిజన్లు గుర్తుచేస్తున్నారు . ఆ రకంగా చూస్తే నీట్ పేపర్ లీకేజికి బాధ్యత వహిస్తూ విద్యా శాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం సబబే . కానీ ఎందుకో ఆయన రాజీనామా చేయలేదు .
పోనీ ఆయనచేత బలవంతంగా రాజీనామా చేయిద్దామంటే నీట్ అంశాన్ని విపక్షాలు రాజకీయ ప్రయోజనాలకోసం వాడుకుంటాయేమో అన్న అనుమానం బీజేపీకి ఉంది . అందుకే ఈ అంశాన్ని తెలివిగా పరిష్కరించుకోవాలని నిర్ణయించుకుంది . క్యాబినెట్ విస్తరణ పేరుతో కొంతమంది మంత్రులకు ఉద్వాసన పలకాలని . ఆ లిస్టులో ధర్మేంద్ర ప్రధాన్ పేరు కూడా ఉండాలని తొలుత భావించారు కానీ కేవలం ఒక్క మంత్రి కోసం కొంతమంది మంత్రులను తొలగించడం వివాదాలకు దారి తీస్తుందని బీజేపీ నాయకత్వం ఆ ఆలోచన మానుకుంది .
తర్వాత ఏం జరిగింది ?
జులై 20 సోమవారం నుంచి పార్లమెంట్ వర్షాకాలం సమావేశాలు ఉండటంతో బీజేపీ అప్రమత్తం అయింది . బీజేపీ కూడా అభిజిత్ ను లెక్కలోకి తీసుకోలేదు . తన ఫోకస్ అంతా ఆ సామజిక వేత్త మీద పెట్టింది . సోనమ్ వాంగ్ ఛుక్ విషయంలో జరగరానిది ఏమైనా జరిగితే ఇబ్బందులు వస్తాయని గ్రహించి శనివారం నాడే ఆయన్ని హాస్పిటల్ కు తరలించారు . కానీ బీజేపీ ఇక్కడే పొరపాటు చేసింది . ఈ కాక్రోచుల గుంపుతో తమకు పెద్దగా ప్రమాదం లేదని తక్కువగా అంచనా వేసింది . శనివారానికి , సోమవారానికి మధ్య ఒక రోజు ఉందని ఆలోచించలేకపోయింది . ఈ ఒక్కరోజులో ఢిల్లీ అంతటా కాక్రోచులు భారీగా గుమిగూడతాయని అంచనా వేయలేకపోయింది . పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఎందుకని కనీసం వాళ్ళని హౌస్ అరెస్ట్ కూడా చేయకుండా వదిలేసింది . ఇంటిలిజెన్స్ వర్గాలు కూడా కాక్రోచుల కదలికలను పసిగట్టలేకపోయాయి . సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు మొదలౌతున్నాయి ..ప్రభుత్వం మెడలు వంచాలంటే ఇదే తగిన సమయం అని కాక్రోచుల గ్రూపుల్లో మెసేజులు వెళ్లాయి .
జులై 20 సోమవారం ఏం జరిగింది ?
సోమవారం ఢిల్లీలో జరిగిన సంఘటనలు ఇంటిలిజెన్సు వర్గాలతో పాటు బీజేపీ నాయకత్వం కూడా ఊహించలేకపోయింది . వేలాదిమంది కాక్రోచులతో ఢిల్లీ వీధులు నిండిపోయాయి . ఉదయం నుంచే ఇంటర్నెట్ సౌకర్యం బంద్ చేసారు . ఢిల్లీ వీధులు యుద్ధభూమిని తలపించాయి . ఇరువైపులా వందమందికి పైగా గాయాలు తగిలి హాస్పిటళ్లలో చేరారు . వారిలో ఒక యువతి పరిస్థితి సీరియస్ గా ఉందని తెలుస్తుంది. సోనమ్ వాంగ్ ఛుక్ ఇరవై ఒక్కరోజులు దీక్ష చేసినా రాని స్పందన ఒక్కరోజులో వచ్చింది . పరిస్థితి గ్రహించిన జేపీ నడ్డా అప్పటికప్పుడు కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాతో సమావేశం అయ్యారు . వెంటనే అమిత్ షా దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు . నడ్డాను హాస్పిటల్ కు పంపి బాధితులను పరామర్శింప చేసారు . CJP లోని కొంతమంది నాయకులను పిలిపించుకుని వారి డిమాండ్ల పట్ల సానుకూలంగా స్పందిస్తామని ప్రకటన చేసారు . కానీ ఈ మొక్కుబడి మంత్రం కాక్రోచుల ముందు పనిచేయలేదు . కేంద్రమంత్రి రాజీనామా చేసేవరకు తమ పోరాటం కొనసాగుతుందని అభిజిత్ చెప్పారు .
ముగింపు
మోడీ మూడు టెర్ముల పాలనలో జాతీయ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ స్థాయిలో ప్రభుత్వాన్ని కదిలించలేకపోయింది అనేది వాస్తవం . బీజేపీ తో పోరాటంలో కాంగ్రెస్ పార్టీ కన్నా CJP ఎక్కువగా క్రియాశీలక పాత్ర పోషిస్తుంది . అలా అని కాంగ్రెస్ పార్టీ కాక్రోచుల ఉద్యమాన్ని హైజాక్ చేయడంలో కూడా విఫలం అయ్యింది . తెరవెనుక విపక్షాలు కాక్రోచులకు మద్దతు ఇవ్వడం అనేది వేరే సంగతి . కేవలం ఎన్నికల సంఘం గుర్తింపు కూడా లేని ఒక చిన్న కాక్రోచుల గుంపు ఈ స్థాయిలో ప్రకంపనలు సృష్టించిందంటే ఆలోచించదగ్గ విషయమే . గతంలో జరిగిన , ఇప్పుడు జరుగుతున్న రైతు ఉద్యమం పంధాలో కాక్రోచుల ఉద్యమం జరగడం గమనార్హం . అయితే గతంలో జరిగిన రైతు ఉద్యమంలో విదేశీ శక్తులు ఉన్నాయని బీజేపీ సమర్థవంతంగా వారి పోరాటాన్ని తిప్పి కొట్టింది . అందుకు తగిన ఆధారాలను కూడా సోషల్ మీడియాలో ఉంచడంతో అప్పట్లో వారి ఉద్యమం గాల్లో కలిసిపోయింది . ఇప్పుడు కాక్రోచుల విషయంలో కూడా బీజేపీ విదేశీ శక్తులు , ఫండింగుల అంశాలను తీసుకువచ్చింది కానీ ఆ ఆరోపణలు ఇంతవరకు శాస్త్రీయంగా నిర్ధారణ కాలేదు . ఈ సందర్భంగా గతంలో అస్సాం లో విద్యార్థులు ఉద్యమాలు చేసి అధికారంలోకి వచ్చిన సంగతి మర్చిపోరాదు . అలాగే ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర సాధనలో కూడా ఉస్మానియా విద్యార్థులు చేసిన పోరాటాలు గమనంలోకి తీసుకోవాలి . ప్రజా ఉద్యమాలలో విద్యార్థులు , యువతరం చాలావరకు విజయాలు సాధించినట్టు చరిత్రలో ఉంది .
గోటితో పోయేదానికి గొడ్డలిదాకా అన్నట్టుగా ఒక మంత్రిచేత రాజీనామా చేయించడంతో ముగిసిపోయే కాక్రోచ్ కథ ఇక్కడిదాకా రావడంలో బీజేపీ పొరపాటు ఉందేమో అనిపిస్తుంది . నీట్ లో నిజంగా తప్పు జరిగింది కాబట్టి నైతిక బాధ్యతగా మంత్రి రాజీనామా చేస్తే పెరిగేది బీజేపీ ప్రతిష్ఠనే అనడంలో ఎటువంటి సందేహం లేదు . ఇప్పటిదాకా అవినీతి మరకలు (ఆరోపణలు వేరు ..రుజువు కావడం వేరు ) అంటించుకోకుండా పరిపాలన చేస్తున్న నరేంద్ర మోడీకి మంత్రిచేత రాజీనామా చేయించడం పెద్ద విషయం కాదు . అలాగే కాక్రోచ్ జనతా పార్టీ కూడా రాజకీయాల జోలికి వెళ్లకుండా శాంతియుత మార్గంలో సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాలు చేసే తప్పులను వెలికితీస్తూ పోరాటం చేస్తే భవిష్యత్తులో యువతరానికి రోల్ మోడల్ గా నిలుస్తారు .
