ఫారెస్ట్ గార్డ్ (Forest Guard Movie Review) థ్రిల్లర్ మూవీ రివ్యూ !

Spread the love

తమిళనటుడు కదిర్ ప్రధానపాత్రలో నటించిన థ్రిల్లర్ ఫారెస్ట్ గార్డ్ మూవీ (Forest Guard Movie) ఈ నెల 15 (ఆగస్టు 15, 2026) నుంచి ఆహా ఓటిటిలో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది . ఈ సినిమా మొత్తం దాదాపు ఫారెస్ట్ నేపథ్యంలో సాగుతుంది.

అడవిలో కలుసుకున్న ముగ్గురు మిత్రులు , అదే సమయంలో జంతువుల వేట కోసం అడవికి వెళ్లిన నలుగురు వ్యక్తుల చుట్టూ కథ తిరుగుతుంది. కర్మఫలం , స్వార్థం , స్నేహం అనే పాయింట్ల ఆధారంగా దర్శకుడు కథను రాసుకుని తెరకెక్కించాడు.

ఇప్పుడు ఫారెస్ట్ గార్డ్ మూవీ ఎలా ఉందో చూద్దాం.

కధేంటంటే ?

మిథున్ ( కదిర్ ) , ఆనంద్ ( హకీమ్ ) , ఇమ్మాన్యుయల్ ( సుదీ కొప్పు ) ముగ్గురూ ప్రాణస్నేహితులు. ఈ స్నేహితులు ముగ్గురూ ఎమ్మెల్యే రఘుకు అనుచరులుగా కొనసాగుతుంటారు. అయితే ఒకసారి వీరి విలేజ్ లో పరిశ్రమ పెట్టడానికి ఒక పెద్ద బిజినెస్ సంస్థ ముందుకు వస్తుంది. కానీ తమ భూముల్లో ఆ సంస్థ పరిశ్రమ పెట్టడానికి ఎమ్మెల్యే రఘు ఒప్పుకోడు. మిథున్ మాత్రం ఆ పరిశ్రమ వస్తే తమ కాలనీ వాసులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని చెప్పి ఎమ్మెల్యే నిర్ణయంతో విభేదించి బయటికి వచ్చేస్తాడు.

దాంతో ఎమ్మెల్యే రఘు మిథున్ మీద కక్ష కడతాడు. అతడి స్నేహితుడు ఆనంద్ ను చేరతీసి మిథున్ మీద కుట్రకు ప్లాన్ చేస్తాడు.

ఇదిలా ఉండగా దట్టమైన అడవిలో ఫారెస్ట్ ఆఫీసర్ ఉద్యోగం చేస్తున్న మిథున్ తన స్నేహితులు ఆనంద్ , ఇమ్మాన్యుయల్ లను జింక మాంసం వండుకుని పార్టీ చేసుకుందామని పిలుస్తాడు. దీంతో ఆనంద్ , ఇమ్మాన్యుయల్ లు అడవికి బయలుదేరుతారు. అక్కడ మిథున్ మీద కుట్ర చేయడానికి ఎమ్మెల్యే రఘు ప్లాన్ చేస్తాడు.

మరోపక్క అడవి జంతువుల మాంసం కోసం కృష్ణ ( షైన్ టామ్ చాకో ) మరో ముగ్గురితో కలిసి అడవికి బయలుదేరుతాడు.

అపుడు అడవిలో ఏం జరుగుతుంది?
మిథున్ మీద రఘు పన్నిన కుట్ర అమలవుతుందా?
స్నేహితుడి కోసం అడవికి వెళ్లిన ఆనంద్ , ఇమ్మాన్యుయల్ లు ఏం చేస్తారు?
మరో ముగ్గురితో కలిసి అడవికి వెళ్లిన కృష్ణకు ఎలాంటి అనుభవం ఎదురౌతుంది? అనేది మిగిలిన కథ.

ఎలా ఉంది ?

గ్రామీణ నేపథ్యంలో రాజకీయాలు , స్నేహాలు ఎలా ఉంటాయి అనే పాయింట్ల ఆధారంగా సినిమా కథ మొదలౌతుంది. ముగ్గురు స్నేహితులు ఎమ్మెల్యే అనుచరులుగా ఉండటం , విలేజ్ లోని నిరుద్యోగుల కోసం మిథున్ అండ్ కో ఆలోచనలు చేయడం , ఈ క్రమంలో ఎమ్మెల్యే రఘుతో విభేదాలు రావడం , దాంతో రఘు .. మిథున్ మీద కక్ష పెంచుకోవడం వంటి సన్నివేశాలతో ఫస్టాఫ్ కధనం నడుస్తుంది.

విలేజ్ లో ఆనంద్ అవమానాలు పడటం , స్నేహితుడు మిథున్ తో గ్యాప్ రావడం , రఘు పక్కకు చేరడం , ప్రాణస్నేహితుడ్ని మోసం చేయలేక ఆనంద్ అంతర్మధనం పడటం వంటి సన్నివేశాలతో కధనంలో సంఘర్షణ పెరుగుతుంది. ఇలా ఫ్రెండ్షిప్ బాండింగ్ , లోకల్ పాలిటిక్స్ చుట్టూ దర్శకుడు కధనాన్ని నడిపారు.

ఎప్పుడైతే ఫారెస్ట్ బ్యాక్డ్రాప్ తో కధనం మొదలౌతుందో ప్రేక్షకుల్లో మూవీ మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఫస్టాఫ్ లో ఈ ముగ్గురి స్నేహితుల చుట్టూ కధనాన్ని నడిపిన దర్శకుడు ఇక్కడ్నుంచి కృష్ణ అండ్ కో లను దింపాడు.

ఒకపక్కన అడవిలో కృష్ణ జంతువుల వేట మొదలెట్టడం , ఇంకో పక్కన అడవి జంతువులను చంపిన నేరం మీద మిథున్ ను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయించి జైలుకు పంపాలని రఘు ప్లాన్ చేయడం వంటి సన్నివేశాలతో దర్శకుడు కధనంలో స్పీడ్ పెంచాడు. ఎమ్మెల్యే రఘు ప్లాన్ ప్రకారం ఆనంద్ పనిపూర్తి చేస్తాడా ? లేదా ? అనే పాయింట్ చుట్టూ నడిపిన సీన్స్ కొంత ఉత్సుకత కలిగిస్తాయి.

దర్శకుడు ఇక్కడ తీసుకున్న మలుపు కొత్తదనాన్ని ఇస్తుంది. అంటే అందరూ ఊహించిన మలుపు కాకుండా స్టోరీని టర్న్ చేసిన విధానం ఈ సినిమాకి ప్లస్ అవుతుంది. ఈ టర్నింగ్ కి ఫ్రెండ్షిప్ బాండింగ్ అనే కలర్ అద్దటంతో కొంత ఎమోషనల్ డ్రామా క్యారీ అవుతుంది.

ఇక అడవిలో జంతువులను వేటాడి జింకను చంపిన కృష్ణ పాత్ర ద్వారా దర్శకుడు కర్మఫలం అనే లైన్ టచ్ చేస్తాడు. అన్యాయంగా మూగజీవాలను చంపడం ద్వారా కర్మఫలం అనుభవించాడు అని దర్శకుడు ఇచ్చిన సందేశం అయితే బాగానే ఉంది కానీ అడవిలో ఆ బ్యాచ్ చేసిన అతి కొంచం ఎక్కువ అవడంతో విసుగు వస్తుంది.

సెకండాఫ్ లో మిథున్ , అతడి స్నేహితులు , కృష్ణ అండ్ కో ల చుట్టూ దర్శకుడు సమాంతరంగా కధనాన్ని నడిపించారు. ఎక్కడో దూరంగా అడవిలో ఉద్యోగం చేసుకుంటున్న మిథున్ మీద రఘు ఇంకా కుట్రలు చేయాలనుకోవడం జస్టిఫికేషన్ గా అనిపించదు. మిథున్ తో రఘు గొడవలు విలేజ్ వరకే పరిమితం చేసుంటే బాగుండేది. అయితే దాన్ని అడవికి మార్చడం వెనుక సరైన కారణాన్ని దర్శకుడు ఎస్టాబ్లిష్ చేయలేకపోయాడు.

ఇక ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ తో నడిచిన కధనం ఇంకాస్త బాగా ప్లాన్ చేసి ఉంటే బాగుండేది. అడవిలో ఏనుగు ఎదురుపడిన సీన్ బాగుంది. అలాంటివే ఇంకో రెండు మూడు సీన్లు ఫారెస్ట్ బ్యాక్డ్రాప్ లో షూట్ చేసి ఉంటే ఇంకా బాగుండేది. దానికి బదులు ఎక్కువ భాగం ఫారెస్ట్ గెస్ట్ హౌస్ లోనే కధనాన్ని నడపటంతో పెద్దగా థ్రిల్ ఇవ్వలేదు.

ఇక దర్శకుడు క్లైమాక్స్ ను నడిపించిన తీరు బాగానే ఉంది. అటు అడవి జంతువులను వేటాడి చంపిన కృష్ణకు కర్మఫలం వెంటాడటం , ఇటు నమ్మిన స్నేహితుడికి న్యాయం చేయలేకపోయిన స్నేహితుల ఆవేదనను భావోద్వేగంగా ముగించిన తీరు టచ్ చేస్తుంది.

ఎవరెలా చేసారు ?

ఈ మూవీలో మిథున్ పాత్రలో కదిర్ నటన సాలిడ్ గా ఉంది. కదిర్ కి మంచి స్కోప్ ఉన్న పాత్ర దక్కింది కానీ అతడి క్యారక్టర్ ఇంకాస్త పర్ఫెక్ట్ గా తీర్చిదిద్ది ఉంటే బాగుండేది. ఆనంద్ పాత్రలో హకీమ్ , ఇమ్మాన్యుయల్ పాత్రలో సుదీ కొప్పలు బాగానే చేసారు.
కృష్ణ పాత్రలో నటించిన షైన్ టామ్ చాకో నుంచి దర్శకుడు పూర్తిస్థాయిలో నటన రాబట్టుకోలేకపోయారు.

సాంకేతికత

సూరజ్ కురుప్ అందించిన సంగీతం బాగుంది.
సురేష్ రాజన్ ఫోటోగ్రఫీ యావరేజుగా ఉంది. నైట్ మోడ్ లో ఫారెస్ట్ అందాలను సరిగా విజువలైజ్ చేయలేకపోయారనిపిస్తుంది.
నిర్మాణ విలువలు పర్లేదు.

విశ్లేషణ

ఈ సినిమాలో ఫస్టాఫ్ రొటీన్ ఫార్మాట్ లో విలేజ్ బ్యాక్ డ్రాప్ , లోకల్ పాలిటిక్స్ , ఫ్రెండ్షిప్ బాండింగ్ చుట్టూ నడుస్తుంది కాబట్టి మనం కొత్తగా ఫీల్ కావడానికి ఏమీ ఉండదు. సెకండాఫ్ నుంచి సీన్ ఫారెస్టుకి మారడంతో కొంత ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది.

ఇంకో విషయం ఏంటంటే ఇందులో ఇంటర్వెల్ కి ముందు మూడు పాటలు , తర్వాత మూడు పాటలు , గాల్లో ఫైటింగులు వంటి రొటీన్ కమ్మర్షియల్ ఎలిమెంట్స్ జోలికి పోకుండా దర్శకుడు కధనాన్ని నడిపిన తీరు బాగుంది. ఒరిజినల్ గా ఇదే మూవీ మలయాళంలో మీషా అనే టైటిల్ తో రిలీజ్ అయ్యింది. తెలుగులో డబ్బింగ్ వెర్షన్ సరిగా కుదరకపోవడమో ఏంటో కానీ ఎక్కడో ఏదో మిస్ అయినట్టుంది. అదీకాకుండా బహుశా బలమైన ట్విస్టులు లేకపోవడం , రొటీన్ స్టోరీ కావడం , స్క్రీన్ ప్లే మ్యాజిక్ లేకపోవడం అయ్యుంటుంది.

ఈ మధ్య సినిమా మొదలయ్యేముందు మద్యపానం , పొగతాగడం హానికరం యాడ్లు వేయడం , అటుపిమ్మట డిస్క్లైమర్ అంటూ ఈ సినిమాలో జంతువులకు , పక్షులకు ఎటువంటి హాని చేసే సన్నివేశాలు ఉండవు అని చూపించడం కంపల్సరీ చేసినట్టున్నారు. ఆ యాడ్ వేయడం వరకు థియేటర్లు , డిస్క్లైమర్ వేయడం వరకు దర్శకులు బాగానే ఫాలో అవుతున్నారు కానీ అసలు విషయాన్ని వదిలేస్తున్నారు. కొన్ని సినిమాలు తాగుడుతోనే మొదలౌతున్నాయి. మరికొన్ని సినిమాలు జంతువులకు హాని చేయడంతోనే మొదలౌతున్నాయి.

ఈ సినిమాలో జింకపిల్లను చంపి మాంసం వండుకునే సీన్ ను కనీసం బ్లర్ చేయాల్సింది. అలా చేయనప్పుడు ఆ డిస్క్లైమర్లకు విలువేముంటుంది? అలా ఉంటాయి మన సెన్సార్ నిబంధనలు. ఈ సినిమాలో అస్సలు నచ్చని సన్నివేశం అదే.

చివరగా ఈ ఫారెస్ట్ గార్డ్ సినిమా ఆహా ఓటిటిలో తెలుగులో కూడా అందుబాటులో ఉంది కాబట్టి వన్ టైమ్ వాచ్ మూవీ కింద చూడొచ్చు.

నటీనటులు : కదిర్ , షైన్ టామ్ చాకో , హకీమ్ , సుదీ తదితరులు
సంగీతం : సూరజ్ కురుప్
సినిమాటోగ్రఫీ : సురేష్ రాజన్
దర్శకత్వం : ఈఎంసి జోసెఫ్
విడుదల : ఆహా ఓటిటి తెలుగు ( 15-08-2026 )
రేటింగ్ : 2 / 5


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!