మాస్ మహారాజ్ రవితేజ నటించిన ఇరుముడి మూవీ ( Irumudi Movie Review) రివ్యూ !

Spread the love

మాస్ మహారాజ్ రవితేజ నటించిన ఇరుముడి మూవీ ( Irumudi Movie ) ఈరోజు ( 21-08-2026 ) న థియేటర్లలో రిలీజ్ అయ్యింది. మాస్ మహారాజ్ సినిమా అనగానే అటు ఫ్యాన్స్ , ఇటు ఆడియన్స్ ట్రాన్స్ఫార్మర్లు పేలిపోయే ఎలివేషన్లు ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ రొటీన్ కు భిన్నంగా అదే మాస్ మహారాజ్ తో ఇరుముడి కట్టిస్తే ఎలా ఉంటుంది? రవితేజతో నేల విడిచి సాము చేయకుండా కధనం నడిపిస్తే ఎలా ఉంటుంది? కొత్తగా ఉంటుంది. ఆసక్తికరంగా కూడా ఉంటుంది. ఇరుముడి సినిమాలో రవితేజ పాత్రలో బలం అదే.

ఇప్పుడు ఇరుముడి మూవీ ఎలా ఉందో చూద్దాం.

కధేంటంటే ?

సీలేరుకు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న పొల్లూరు విలేజ్ లో అరటి తోట రైతు త్రినాథ్ ( రవితేజ ) , తన భార్య కావేరి ( ప్రియా భవాని శంకర్ ) కూతురు మణికంఠ ( బేబీ నక్షత్ర ) లతో నివసిస్తూ ఉంటాడు. త్రినాథ్ కి తన కూతురు మణికంఠ అంటే ప్రాణం. నాలుగేళ్లు అయినా ఆ దంపతులకు పిల్లలు పుట్టకపోవడంతో గురుస్వామి సలహాతో త్రినాథ్ మొదటిసారి అయ్యప్ప మాల వేసుకుని స్వామికి మొక్కుకుంటాడు. అతడి మొక్కు ఫలించి ఆడపిల్ల పుట్టడంతో తన కూతురికి మణికంఠ అని పేరు పెట్టుకుని అల్లారుముద్దుగా పెంచుకుంటాడు.

అయితే 41 రోజుల మాలధారణ సమయం మినహా మిగతా రోజుల్లో త్రినాథ్ మందు తాగుతూనే ఉంటాడు. మాల వేసుకున్నప్పుడు మాత్రం మందు జోలికే పోడు. ఎంత తాగినా త్రినాథ్ లో ఓ మంచి గుణం ఉంది. కేవలం తన కూతురే కాదు .. ఊర్లో ఏ ఆడపిల్ల జోలికి ఎవరొచ్చినా త్రినాథ్ ఊరుకోడు. ఉతికి ఆరేస్తాడు. ఐదో క్లాస్ చదువుకుంటున్న తన కూతురికి కూడా ఎప్పుడూ ధైర్యం నూరిపోస్తూ ఉంటాడు.

ఏ ఆడపిల్లకు అన్యాయం జరిగినా తనకు చెప్పమని కూతురికి నేర్పడంతో , పోకిరీల నుంచి తన స్నేహితురాళ్లకు జరుగుతున్న అవమానాల గురించి మణికంఠ ఎప్పటికప్పుడు తండ్రికి చెప్తూ ఉంటుంది. ఒకసారి గురుస్వామి గోపరాజు ( సాయికుమార్ ) కూతురు గాయత్రి విషయంలో జరుగుతున్న అనూహ్య పరిణామాలను మణికంఠ చూస్తుంది. ఇదే విషయం తన తండ్రికి చెప్పాలని ప్రయత్నిస్తుంది.

అప్పుడేం జరుగుతుంది?
తండ్రితో మణికంఠ చెప్పాలనుకున్న విషయం ఏంటి?
అనుకోని సంఘటనల్లో ఇరుక్కున్న మణికంఠ ఏం చేస్తుంది?
స్పెషల్ క్లాసుల పేరుతో స్కూల్ టీచర్ ఏం చేస్తూ ఉంటుంది?
గురుస్వామి కూతురు గాయత్రికి ఏం జరుగుతుంది? అనేది మిగిలిన కథ.

ఎలా ఉంది?

అన్న నడిచొస్తే మాస్ , అన్న లుక్కేస్తే మాస్ , అన్న డైలాగేస్తే మాస్ ..మాస్ అనే పాట నిజానికి రవితేజకు బాగా సూట్ అవుతుంది. రవితేజకు మాస్ ఆడియన్స్ కనెక్ట్ అయిన విధంగా క్లాస్ ఆడియన్స్ ఎక్కువగా కనెక్ట్ కారు. రవితేజ అంటే మాస్ బ్రాండ్ అంబాసడర్. ఈయనతో ఫ్యామిలీ సినిమా తీయాలనుకోవడం సాహసమే అవుతుంది. కానీ దర్శకుడు శివ నిర్వాణ ఆ సాహసం చేసి రవితేజలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించారు. ఆ విషయం ఈ సినిమా చూసినవాళ్లకు అర్ధమౌతుంది.

ఇక కథ గురించి చెప్పాలంటే తండ్రీ కూతుళ్ళ బాండింగ్ , ఎమోషన్స్ , సెంటిమెంట్స్ తో గతంలో చాలా సినిమాలు వచ్చాయి. సప్పొజ్ ఏ హైద్రాబాదులోనో , విశాఖలోనో ఉంటున్న ఒక చిన్న బిజినెస్ మ్యాన్ కి కూతురంటే ప్రాణం అనుకుందాం ..అనుకోని పరిస్థితుల్లో ఆ కూతురికి అన్యాయం జరుగుతుంది. అప్పుడు ఆ తండ్రి తన కూతురికి అన్యాయం చేసినవాళ్ల మీద రివెంజ్ తీసుకుంటాడు. ఇదే కథను ఇలాగే తెరకెక్కిస్తే ఎలా ఉంటుంది? కొత్తదనం ఉండదు కదా? అందుకే దర్శకుడు ఈ స్క్రిప్ట్ ను పక్కాగా ప్లాన్ చేసుకున్నాడు. తండ్రీ కూతుళ్ళ స్టోరీకి డివోషనల్ టచ్ అద్దాడు. రొటీన్ కమ్మర్షియల్ సినిమాల మాదిరి సిటీ జోలికి పోకుండా ప్రకృతి అందాలు ఉట్టిపడే ప్రశాంతమైన గ్రామీణ వాతావరణాన్ని ఎంచుకున్నాడు.

సినిమాలో దాదాపు ప్రతి ఫ్రేమ్ లోనూ ప్రకృతి అందాలు ఉట్టిపడేలా దర్శకుడు తీసుకున్న జాగ్రత్తలు సినిమాకి అదనపు బలం అవుతుంది. పౌర్ణమి వెన్నెల వెలుగులో డ్యామ్ బ్యాక్ డ్రాప్ లో తండ్రి తన ముద్దుల కూతురికి ప్రేమగా గోరుముద్దలు తినిపిస్తుంటే చూడటానికి ఎంత అందంగా ఉంటుంది? హాయిగా అనిపిస్తుంది కదా? సినిమాలో ఇలాంటి సన్నివేశాలు ఐదు నిమిషాలే కనిపించవచ్చు కానీ దానిప్రభావం సినిమా అయిపోయిన తర్వాత కూడా మన మనస్సులో ముద్రపడిపోతుంది.

అసలు తండ్రీ కూతుళ్ళ బాండింగ్ అనేది పెద్ద సబ్జెక్ట్. సరైన దర్శకుడి చేతిలో పడాలే కానీ అందమైన దృశ్య కావ్యంగా మలచవచ్చు. ఈ ప్రయత్నంలో దర్శకుడు చాలావరకు సక్సెస్ అయ్యాడు. చాలావరకు అని ఎందుకంటే తండ్రి తాగుడికి కూతురు కూడా సప్పోర్ట్ చేయడం అనే ఒక్క పాయింట్ దగ్గరే కొన్ని మార్కులు తగ్గాయి.

ఇక సినిమా ప్రారంభంలోనే తండ్రికి తన కూతురంటే ఎంత ప్రాణమో దర్శకుడు ఒక సన్నివేశంలో చెప్పేసాడు. పొల్లూరు విలేజ్ లోకి తెల్లవారు ఝామున ఒక లారీ డ్రైవర్ హార్న్ కొట్టుకుంటూ వస్తాడు. ఊరిమొదట్లోనే ఉన్న ఒక కుర్రాడు ఆ లారీ డ్రైవర్ ను ఆపి తన అన్న త్రినాథ్ కూతురు జ్వరం వచ్చి పడుకుంది..హార్న్ కొట్టొద్దు అంటాడు. ఈ సన్నివేశం చూడగానే ఎంత కూతురి మీద ప్రేమ ఉంటే మాత్రం ఇలా ఊళ్ళోనుంచి వెళ్లే బళ్ళు హార్న్ కొట్టకూడదంటే ఎలా ? అనుకుంటాం. కానీ ఆ తండ్రి అప్పుడు అలా ఎందుకన్నాడో క్లైమాక్సులో తెలుసుకున్న తర్వాత గుండెలో కలుక్కుమంటుంది.

ఇలా ఈ సినిమాలో దర్శకుడు కావాల్సినంత మోతాదులో ఎమోషన్స్ బాగా పండించాడు. ఏ సినిమాకైనా భావోద్వేగాల సంఘర్షణ అనేది కీలకం. అవి ఈ సినిమాలో సరిపడా ఉన్నాయి.

ఇక ఇరుముడి అనే టైటిల్ చూసి ఇదేదో డివోషనల్ మూవీ అనుకుంటే పొరపాటులో కాలేసినట్టే. సినిమా మొదలవడమే ఫ్యామిలీ డ్రామా మొదలౌతుంది. ఆ ఫ్యామిలీ డ్రామాకు దర్శకుడు డివోషనల్ టచ్ ఒక్కటే ఇవ్వలేదు. దీనికి క్రైమ్ జానర్ కూడా అదనంగా కలిపాడు. ఫ్యామిలీ డ్రామా , డివోషనల్ టచ్, క్రైమ్ ఎలిమెంట్ అనే మూడు విభాగాలను కలుపుకుంటూ కధనం నడిపిన తీరు ఆకట్టుకుంటుంది.

అసలు ఫస్టాఫ్ లో వచ్చే’ కట్టు కట్టు ఇరుముడి కట్టు ‘ అనే సాంగ్ , సెకండాఫ్ లో వచ్చే ‘ బంగారు పల్లకి ఎక్కి ‘ అనే సాంగ్ అయ్యప్ప భక్తులకు పూనకాలు తెప్పిస్తాయి. దానికి తోడు పోకిరీలను కొట్టడానికి రవితేజ బయలుదేరుతున్నప్పుడు వారిస్తున్న భార్యతో ‘ స్వామి శరణం ‘ అని అతడు పలికే డైలాగ్ థియేటర్లో ఈలలు వేయించింది.

ఇంకో సన్నివేశం కూడా ఈలలు వేయించింది కానీ అంతలోనే పాలపొంగు మీద నీళ్లు చల్లినట్టు దిగిపోయింది. ఆ సన్నివేశంలో రవితేజ టీచర్ ఇంటికి వచ్చి గురుస్వామి కూతురు గాయత్రిని ఆటోలో తీసుకెళ్తూ కొంతముందుకెళ్ళి తిరిగి అదే ఆటోతో రివర్స్ లో వెనక్కి వచ్చినప్పుడు అభిమానులకు గూస్ బంప్స్ తెప్పిస్తుంది. కానీ ఆ సీన్ అభిమానులు ఊహించిన విధంగా ఉండకపోవడంతో కొంత డిజప్పాయింట్ అయ్యారు.

అలాగే దర్శకుడు చేసిన గొప్ప పనేంటంటే రవితేజను కమ్మర్షియల్ హీరోని చేసి హీరోయిన్ తో నాలుగైదు డ్యూయెట్లు పెట్టకపోవడం. ఒకవేళ అలాంటి సాంగులు పెట్టి ఉంటే కథ ఎప్పుడో పక్కకెళ్లి ఆడుకునేది. కానీ దర్శకుడు ఒక లైన్ లోనే స్టోరీని నేరేట్ చేసుకుంటూ వచ్చాడు.

కాకపోతే ఫస్టాఫ్ కొంత రొటీన్ కమ్మర్షియల్ ఫార్మాట్ లో కధనం నడుస్తుంది. రవితేజకు కూతురంటే ప్రాణం అని ఎస్టాబ్లిష్ చేయడానికి ఆ పిల్ల ఎవరి పేరు చెబితే వాళ్ళని తండ్రి ఉతికి ఆరేయడానికి దర్శకుడు ఎక్కువ టైమ్ తీసుకున్నాడు. ఇలాంటి సన్నివేశాలే ఒకట్రెండు సార్లు రిపీట్ కావడం కొద్దిగా సాగతీత మాదిరి అనిపిస్తుంది.

ఫస్టాఫ్ లో ఫ్యామిలీ డ్రామా , డివోషనల్ ఎలిమెంట్ తో కధనాన్ని నడిపిన దర్శకుడు సెకండాఫ్ లో క్రైమ్ జానర్ లోకి టర్న్ అయ్యాడు. ఇక్కడ్నుంచి సస్పెన్స్ డ్రామా నడుస్తుంది. గాయత్రికి ప్రమాదం జరుగుతుందేమోనని అందరూ అనుకుంటే అనూహ్యంగా దర్శకుడు కథని మలుపుతిప్పిన తీరు ఆకట్టుకుంటుంది. అయితే గురుస్వామి క్యారక్టర్ విషయంలో దర్శకుడు పొరపాటు చేసాడు. ఈ కధకు అతడి పాత్రలో స్కోప్ చాలా అవసరం. డివోషనల్ డ్రామా పండాలంటే గురుస్వామి క్యారక్టరైజేషన్ కూడా ఇంపార్టెంటే. ప్రేక్షకులకు ఊహించని మలుపు ఇవ్వాలనే ఆతృతలో దర్శకుడు ఆ పాత్రను రాంగ్ వే లో ముగించాడు. ఇది చాలామందికి నచ్చదు. ముఖ్యంగా గురుస్వాములకు.

ఇక ఈ సినిమాలో లాజికల్ గా జరిగిన పెద్దపొరపాటు ఏంటంటే ? మొదటినుంచి చివరివరకు ఒక్క పోలీసు కూడా కనిపించకపోవడం. ఊరికి బస్సే రాని పొల్లూరు విలేజ్ కి బస్ అయినా వస్తుంది కానీ పోలీసులు రారు. క్రైమ్ మీద క్రైమ్ లు జరిగినా ఎక్కడా పోలీసుల ఊసు లేకపోవడం లాజికల్ గా కన్విన్స్ అవదు.

ఇక ఈ సినిమాకి క్లైమాక్స్ సన్నివేశాలు కూడా ప్రధాన బలమే. సినిమా ప్రారంభం నుంచి ఎమోషన్స్ ని ప్రేక్షకుల మెదళ్లలోకి స్లోగా ఎక్కిస్తూ వచ్చిన దర్శకుడు క్లైమాక్సులో కంట తడిపెట్టించేసాడు. క్లైమాక్స్ సీన్ చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకుడు బరువెక్కిన హృదయాలతో సీట్లలోనుంచి లేవాల్సిందే.

ఎవరెలా చేసారు ?

ఖడ్గం , ఇడియట్ , విక్రమార్క లాంటి సినిమాల్లో మాస్ మహారాజ్ విశ్వరూపం చూసాం. ఆ తర్వాత కూడా రవితేజ అదే ఇమేజ్ తో దూసుకుపోయాడు. ఏమైందో ఏంటో గాని ఈ మధ్య సన్నబడిపోయి ముఖంలో షేపులు కూడా మారిపోవడంతో కొంత డిజాస్టర్ ఫేస్ చేసాడు. ఈ సినిమాలో రవితేజను చూస్తుంటే మళ్ళీ పాత లుక్ కనిపించింది. పూర్తి ఫిట్నెస్ తో కనిపించాడు.
రొటీన్ కు భిన్నంగా విలక్షణమైన నటనతో రవితేజ మెప్పించాడు.

ఇక రవితేజ భార్య కావేరి పాత్రలో ప్రియా భవానీ శంకర్ చాలా ఫెమిలియర్ గా కనిపించింది. ఆమెను చూస్తుంటే మనకు ఒక సాధారణ దిగువ మధ్యతరగతి గృహిణి కనిపిస్తుందే కానీ హీరోయిన్ ఏ మాత్రం కనిపించదు. ఆమె నటన కూడా చాలా సహజంగా ఉంది.

ఇక వీళ్లిద్దరి కూతురు మణికంఠ పాత్రలో బేబీ నక్షత్ర పూర్తి న్యాయం చేసింది. చక్కటి ఎక్స్ప్రెషన్స్ తో ఆకట్టుకుంది. ఇరుముడిలో ఈ పాపకు మంచి స్కోప్ ఉన్న పాత్ర దొరికింది.
సాయికుమార్ కు సరైన పాత్ర దొరికింది కానీ ఆ పాత్రను ముగించిన తీరే సరిగా లేదు.
మిగిలినవాళ్లు తమ పాత్రల పరిధిమేరకు నటించారు.

సాంకేతికత

జివి ప్రకాష్ కుమార్ సంగీతం ఈ సినిమాకి బలం ఇచ్చింది. ముఖ్యంగా అయ్యప్ప పాటల్లో భక్తులకు పూనకాలు వస్తాయి.
విష్ణు శర్మ అందించిన ఫోటోగ్రఫీ కూడా బాగుంది. ముఖ్యంగా అద్భుతమైన లొకేషన్లను తన కెమెరా పనితనంతో మరింత అందంగా చూపించారు.
నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.

విశ్లేషణ

ఆడపిల్లల పెంపకం గురించి దర్శకుడు కధలో భాగంగా అంతర్లీనంగా ఇచ్చిన సందేశం బాగుంది. తల్లితండ్రులు ఆడపిల్లలకు ముందునుంచీ భయం నూరిపోసి పెంచితే పర్యవసానాలు ఎలా ఉంటాయి? అలాగే చిన్నప్పట్నుంచి వాళ్లలో ధైర్యం నింపి పెంచితే ఏమౌతుంది? అనే రెండు పాయింట్లను టచ్ చేసారు.

ఈ మూవీలో అయ్యప్ప పాటలు భక్తులను టచ్ చేస్తే , తండ్రీ కూతుళ్ళ బాండింగ్ ప్రేక్షకులను టచ్ చేస్తుంది. ఓవరాల్ గా మాస్ మహారాజ్ రవితేజ నటన ఫాన్స్ ను అలరిస్తుంది.

నటీనటులు : రవితేజ , ప్రియా భవానీ శంకర్ , బేబీ నక్షత్ర , సాయికుమార్ తదితరులు
సంగీతం : జివి ప్రకాష్ కుమార్
సినిమాటోగ్రఫీ : విష్ణు శర్మ
నిర్మాత : నవీన్ యెర్నేని
దర్శకత్వం : శివ నిర్వాణ
విడుదల : ( 21-08-2026 )
రేటింగ్ : 3 / 5


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!