సినీ చరిత్రలో మెగాస్టార్ చిరంజీవిది (Mega star Chiranjeevi) ఒక ప్రత్యేకమైన పేజి – జై చిరంజీవ !

Spread the love

ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి (Mega star Chiranjeevi) 71 వ పుట్టినరోజు సందర్భంగా ముందుగా రచ్చబండ కబుర్లు శుభాకాంక్షలు తెలియచేస్తుంది.

సినిమా హీరో కావాలనేది చాలామంది కనే కల. ఈ కలను నెరవేర్చుకునేందుకు కొంతమంది సిఫార్సులను నమ్ముకుంటారు. మరికొంతమంది మొదటి ప్రయత్నం విఫలం అయ్యిందని వెనక్కిమళ్లుతారు. ఇంకొందరు తమలో టాలెంట్ లేక పరాభవంతో వెనుతిరుగుతారు.

అతికొద్దిమంది మాత్రమే తమ కలను నెరవేర్చుకోవడానికి అహోరాత్రులు కష్టపడతారు. తమ లక్ష్యాన్ని చేరుకోవడానికి అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను ప్రయత్నిస్తారు. చివరికి స్వయంకృషితో అనుకున్నది సాధిస్తారు. అలాంటివారిలో కొణిదెల శివశంకర వర ప్రసాద్ కూడా ఒకరు.

60 – 70 దశకం వరకు శివశంకర వర ప్రసాద్ చాలామందిలాగే మాములు వ్యక్తి. స్కూల్లోనో , కాలేజీలోనో మన బెంచీలోనే , మన పక్కనే కూర్చున్న సాధారణ స్టూడెంట్. ఉన్నత స్థానాలకు ఎదిగినవారెవరూ పుట్టుకతోనే ఆ స్థాయికి ఎదగరు. మనసులో ఉన్న సంకల్పం , లక్ష్యం , ఆశయం , పట్టుదల , కఠోర శ్రమ వాళ్ళని ఒక స్థాయికి ఎదగటానికి తోడ్పడుతుంది.

మనలో చాలామంది డాక్టర్ అవ్వాలనో , యాక్టర్ అవ్వాలనో , క్రికెట్ ప్లేయర్ అవ్వాలనో , గొప్ప వ్యాపారవేత్త గానో , గొప్ప రాజకీయ నాయకునిగానో , ఇంకా ఇతర రంగాల్లో ఉన్నత స్థానాలకు ఎదగాలని కలలు కంటాం. కానీ కొంతమందే ఆ స్థానాలకు ఎదుగుతారు. మిగిలినవాళ్లు జీవితంలో రాజీ పడి దొరికిన స్థాయితో సరిపుచ్చుకుంటారు.

దీనికి ఒక కారణం ఉంది. చాలామంది కలలు మాత్రమే కంటారు. అతికొద్దిమంది మాత్రమే లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఆ కలలను నెరవేర్చుకోవడానికి కఠోరంగా కష్టపడతారు. అలా కష్టపడి ఆయా రంగాల్లో ఎదిగినవాళ్లు చాలామంది ఉన్నారు. వారిలో కొణిదెల శివశంకర వర ప్రసాద్ ఒకరు.

సినీ హీరో కావాలనేది అతడి కల

అందరిలా ఒక రాయేసి తన అదృష్టాన్ని పరీక్షించుకోలేదు. కొందరిలా సరైన అవకాశాలు రాలేదని నిరాశతో కుంగిపోలేదు. ఇలాంటి రోల్ అయితేనే చేస్తానని మరికొందరిలా గిరిగీసుకుని కూర్చోలేదు.

అలా అనుకుంటే అతడు కొణిదెల శివశంకర వర ప్రసాద్ గానే మిగిలిపోయి ఉండేవాడు. ఈ రోజు దేశవ్యాప్తంగా మూడువేల అభిమాన సంఘాలు ఉన్న మెగాస్టార్ చిరంజీవి అయ్యేవాడు కాదు. తెలుగు సినీ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక పేజీని సృష్టించుకునేవాడు కాదు. శివశంకర వరప్రసాద్ మెగాస్టార్ చిరంజీవి కావడం వెనుక పూర్తిగా అతడి స్వయంకృషి ఉంది. నవతరం నటులకు చిరంజీవి జీవితమే ఒక పాఠం అవుతుంది. వెండితెర మీద గొప్ప హీరో కావాలనుకునేవాళ్ళు చిరంజీవి జీవితాన్ని చదువుకుంటే చాలు.

శివశంకర వరప్రసాద్ బాల్యం

1955 ఆగస్టు 22 న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో కొణిదెల వెంకట్రావు , అంజనాదేవి దంపతులకు జన్మించిన కుమారుడి పేరే శివశంకర వరప్రసాద్. ఫ్యామిలీ నేపధ్యం చూస్తే మధ్యతరగతి. తండ్రి వెంకట్రావు పోలీస్ శాఖలో కానిస్టేబుల్ గా పనిచేస్తూ ఉండేవారు. తండ్రి నుంచి ఇన్స్పిరేషన్ పొందాడేమో శివశంకర వరప్రసాద్ కూడా చిన్నతనం నుంచి ఎన్ సి సి క్యాడెట్ లో శిక్షణ పొందాడు. బహుశా తండ్రి కూడా కొడుకుని తనలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో చేర్పించాలని అనుకున్నారేమో శివశంకర వర ప్రసాద్ ను ఎన్ సి సి క్యాడెట్ లో శిక్షణ తీసుకోవడానికి ప్రోత్సహించారు. కానీ శివశంకర వరప్రసాద్ ఆలోచన వేరు. ఎప్పటికైనా జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలని చదువుకునే రోజుల్లోనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాడు. అప్పుడు అతడి కళ్ళముందు వెండితెర మెరిసింది.

సినీ ప్రయాణం

సినిమాల్లో ప్రయత్నించాలనే ఆలోచన రావడంతోనే ఆలస్యం చేయకుండా 1976 లో రైలెక్కి మద్రాసు చేరుకున్నాడు. మద్రాస్ చేరుకున్న తర్వాత శివశంకర వరప్రసాద్ కి అసలు విషయం అర్థమైంది. అప్పటికే అక్కడ సినిమాల్లో అవకాశాల కోసం కుర్రాళ్ళు క్యూ కట్టి ఉన్నారు. ఏ స్టూడియోకి వెళ్లినా , ఏ దర్శకుడి దగ్గరికి వెళ్లినా చాంతాడంత లైన్ కనపడేది. దాంతో సినిమాల్లో ఛాన్స్ రావడం రైలేక్కినంత తేలిక కాదని శివశంకర వరప్రసాద్ కి అర్థమైంది. ఇతడొక్కడికే కాదు .. రైలెక్కి మద్రాస్ చేరుకున్న చాలామందికి అర్థమైంది. అందుకే చాలామంది నిరాశతో రిటర్న్ ట్రైన్ ఎక్కి తమ ఊళ్లకు వెళ్లిపోయారు. వాళ్లలో చాలామంది ఇప్పుడు మధ్యతరగతి జీవితంలో సెటిల్ అయిపోయారు.

కానీ శివశంకర వరప్రసాద్ మాత్రం రిటర్న్ ట్రైన్ ఎక్కలేదు. పోటీని తట్టుకుని అవకాశాలు చేజిక్కుంచుకోవాలంటే టాలెంట్ ఉండాలని తెలుసుకున్నాడు. అందుకే మద్రాస్ ఫిలిం ఇన్స్టిట్యూట్ లో నటనలో శిక్షణ పొందాడు. ఈలోపు ఎన్నో నిద్రలేని రాత్రులు.. ఆర్థిక బాధలు.. అవమానాలు కూడా పడ్డాడు.

1978 లో పునాదిరాళ్ళు సినిమాల్లో అవకాశం వచ్చింది. భవిష్యత్తులోపెద్దహీరో కావాలంటే ముందు వెండితెర మీద తనను తాను ప్రూవ్ చేసుకోవాలనుకున్నాడు. వచ్చిన అవకాశాన్ని అందిబుచ్చుకున్నాడు. ఈ కుర్రాడెవరో బాగా చేస్తున్నాడే అని అనిపించుకున్నాడు. మెల్లిగా శివశంకర వర ప్రసాద్ కి అవకాశాలు రావడం మొదలుపెట్టాయి.

వివాహం

సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కొద్దికాలంలోనే శివశంకర వర ప్రసాద్ చాలామంది ఇండస్ట్రీ పెద్దల దృష్టిలో పడ్డారు. అలా అప్పటి ప్రముఖ హాస్య నటుడు అల్లు రామలింగయ్య దృష్టిలో ఈ వరప్రసాద్ పడ్డాడు. తన కూతురు సురేఖను ఇచ్చి వివాహం జరిపించడానికి ఆయన రాయబారాలు చేసారు. ఆ రాయబారాలు ఫలించి 1980 , ఫిబ్రవరి 20 న శివశంకర వరప్రసాద్.. సురేఖను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు సుష్మిత, శ్రీజ , కొడుకు రామ్ చరణ్ జన్మించారు.

సినీ కెరీర్ పీక్

సురేఖతో వివాహం తర్వాత 1980 – 90 దశకంలో చిరంజీవి సినీ కెరీర్ పీక్ కు వెళ్ళింది. 1983 లో విడుదలైన ఖైదీ సినిమా తో చిరంజీవి గ్రాఫ్ అమాంతం పెరిగింది. ఎన్టీఆర్ , ఏఎన్ఆర్ , కృష్ణ , కృష్ణంరాజు , శోభన్ బాబుల వంటి లెజెండ్ హీరోల మధ్య చిరంజీవి దూసుకుని వచ్చాడు. అప్పటిదాకా ఉన్న సాంప్రదాయ నృత్యాల స్థానంలో తనదైన శైలిలో కొత్తదైనా డాన్స్ ట్రెండ్ సృష్టించాడు. అంతే.. చిరంజీవి వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది. గ్యాంగ్ లీడర్ నుంచి జగదేక వీరుడు వరకు బ్లాక్ బస్టర్ హిట్లు కొడుతూ చిరంజీవి వెండితెర సంచలనం సృష్టించాడు.

పురస్కారాలు

తమ సినిమాల్లో చిరంజీవి అనే హీరో ఉంటే చాలు ప్రాఫిట్స్ గ్యారంటీ అని నిర్మాతలు మెగాస్టార్ కాల్షీట్ల కోసం ఎగబడ్డారు. ఆ హవా 90 లు దాటి రెండువేలకు వచ్చినా కొనసాగుతూనే ఉంది. తనకొచ్చిన పేరు ప్రఖ్యాతులతో చిరంజీవి పొంగిపోలేదు. తన సంపాదనలో కొంతభాగం సేవా కార్యక్రమాలకు ఖర్చు పెట్టాలని నిర్ణయించుకున్నాడు. అందుకే 1998 లో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ , ఐ బ్యాంకులతో ఇప్పటివరకు వేలాదిమంది లబ్ది పొందారు. సినిమా నటుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా ఆయన చేస్తున్న సేవాకార్యక్రమాలు కేంద్రప్రభుత్వం దృష్టికి వెళ్లాయి. అందుకే 2006 లో ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డుతో చిరంజీవిని సత్కరించారు. అలాగే 2024 లో మరోప్రతిష్టాత్మక అవార్డు పద్మవిభూషణ్ కూడా చిరంజీవి దక్కించుకున్నారు. ఇక నంది , రఘుపతి వెంకయ్య అవార్డులతో పాటు చిరంజీవి దక్కించుకున్న మెమొంటోలు స్టోర్ చేయడానికి ఒక రూమ్ కూడా సరిపోదేమో ?

చిరంజీవి రాజకీయ జీవితం

ఒక ఫ్లోలో సాగిపోతున్న చిరంజీవి సినీ ప్రయాణానికి 2008 లో ఒక బ్రేక్ పడింది. ఆ బ్రేక్ కూడా ఆయనంతట ఆయన ఇచ్చుకున్నదే. 2008 ఆగస్టు 26 న తిరుపతిలో జరిగిన భారీ బహిరంగ సభలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపన ప్రకటన చేసారు. 2009 లో ఏపీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో 295 స్థానాలకు గానూ ప్రజారాజ్యం పార్టీ కేవలం 18 స్థానాలను మాత్రమే కైవసం చేసుకుంది. అదికూడా చిరంజీవి పాలకొల్లు , తిరుపతి స్థానాల నుంచి పోటీ చేస్తే పాలకొల్లులో ఓడిపోయి తిరుపతి స్థానాన్ని నిలుపుకున్నారు.

సినీ ప్రయాణంలో ఎదురులేని హీరోగా ఎదిగిన చిరంజీవికి ఈ ఓటమి ఊహించని షాక్ ఇచ్చింది. దాంతో ఆయన తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి రాజ్యసభకు వెళ్లి 2012 – 14 మధ్య కాలంలో కేంద్రమంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వహించారు.

తిరిగి సినిమాల్లోకి

చిరంజీవి రాజకీయాల్లో ఇమడలేకపోయారు. అందుకే కేంద్రమంత్రి పదవికి , రాజకీయాలకు గుడ్ బై చెప్పి 2017 లో ఖైదీ నంబర్ 150 తో తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. షుమారు పదేళ్ల గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చినా ప్రేక్షకులు ఆయనకు బ్రహ్మరధం పట్టి హిట్ అందించారు. ఈ మధ్య రిలీజ్ అయిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ప్రస్తుతం చిరంజీవి నటించిన విశ్వంభర సినిమా విడుదల కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.

ముగింపు

ఈ రోజు 71 వ జన్మదినోత్సవం జరుపుకుంటున్న మెగాస్టార్ చిరంజీవిలో గ్రేస్ ఏ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ అదే ఎనర్జీ , అదే స్టైల్ . తెలుగు సినిమా చరిత్రలో చిరంజీవిది ఒక ప్రత్యేకమైన శకం. ఆయన పైకి ఎదగడమే కాదు కుటుంబంలో మరికొంతమందిని ప్రోత్సహించి ఎదగడానికి తోడ్పడ్డారు. ఈ రోజు ఆయన ఇద్దరు తమ్ముళ్లలో పవన్ కళ్యాణ్ ఏపీకి డిప్యూటీ సీఎం కాగా , నాగబాబు క్యాబినెట్ హోదాలో పదవిలో కొనసాగుతున్నారు. వీరే కాదు ఆ మెగా కాంపౌండ్ లోనుంచి వచ్చిన వరుణ్ తేజ్ , సాయిధరమ్ తేజ్ వంటివారు వర్ధమాన హీరోలుగా ఎదుగుతున్నారు. తెలుగు సినిమా ట్రెండును మార్చి ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికిన మెగాస్టార్ చిరంజీవి ధన్యుడు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!