ఓటిటిలోకి వచ్చిన శ్రీకాంత్ మిస్టర్ మిడిల్ క్లాస్ మూవీ (Mister Middle Class మూవీ Review) ఎలా ఉందంటే?

Spread the love

శ్రీకాంత్, లయ,రాజేంద్రప్రసాద్ లు ప్రధాన పాత్రల్లో నటించిన మిస్టర్ మిడిల్ క్లాస్ మూవీ ( Mister Middle Class Movie ) ఆగస్ట్ 19 నుంచి ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కి వచ్చింది. జూలై 17 న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా నెల తిరిగేలోపలే ఓటీటీలోకి వచ్చేసింది.

జి కె చందు నిర్మాణంలో జి నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ కామెడీ డ్రామా సినిమా ఎలా ఉందో చూద్దాం.

కథేంటంటే?

వెంకట రమణ ( శ్రీకాంత్) వెంకటేశ్వర స్వామి భక్తుడు. భార్య పద్మావతి (లయ) , ఇద్దరు పిల్లలు, తండ్రి ఏడుకొండలు (మురళీధర్ గౌడ్) , చెల్లి, బావ అతడి కుటుంబం. అయితే వెంకట రమణ తన పేరుతోనే టిఫిన్, భోజన హోటల్ పెట్టి బోలెడు లాభాలు గడిస్తాడు. హోటల్ వ్యాపారంలో లాభాలు బాగా రావడంతో అత్యాశకు పోయి అప్పు చేసి మరీ స్టార్ హోటల్ ఓపెన్ చేస్తాడు. కానీ అందులో లాస్ రావడంతో వెంకట రమణ అప్పులు తీర్చడం కోసం హోటల్ అమ్మేసి ఫ్యామిలీతో సహా అదే హోటల్లో ఉద్యోగాలు చేయాల్సివస్తుంది.

మళ్ళీ అతడి పరిస్థితి మొదటికి వస్తుంది. తనని ఎలాగైనా కోటీశ్వరుణ్ణి చేయమని రోజూ వెంకటేశ్వర స్వామి కి ఇంట్లోనే పూజలు చేస్తూ ఉంటాడు. అయినా అతడి పరిస్థితి మారదు. దీంతో అలిగిన వెంకట రమణ స్వామికి పూజలు చేయడం మానేస్తాడు.

ఈ పరిస్థితుల్లో వెంకట రమణ కు వెంకటేశ్వర స్వామి గుడిలో సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగం వస్తుంది. తన అప్పులు తీరే మార్గం లేకపోవడంతో మరణమే తనకు శరణ్యం అనుకుని గుడి మెట్ల మీద నిద్రపోతాడు. వెంకట రమణ కష్టాలు చూసి చలించిన స్వామి వైకుంఠం నుంచి దిగివచ్చి అతడికి తన ఒంటిమీదున్న నగలు మొత్తం ఇచ్చేస్తాడు.

అయినా వెంకట రమణకు కొత్త కష్టాలు రావడంతో స్వామి అతడికి ఒక బుక్ ఇచ్చి ‘ ఇందులో 13 పేజీలు ఉంటాయి.. ఒక్కో పేజీలో నువ్వు ఏమి రాసినా అనుకున్నది నెరవేరుతుంది ‘ అని చెప్పి కొన్ని కండిషన్స్ కూడా పెడతాడు.

స్వామి ఇచ్చిన బుక్ తో వెంకట రమణ కష్టాలు తీరిపోయాయా?
ఆ బుక్ ద్వారా వెంకట రమణ తనకు ఏం కోరుకుంటాడు?
చివరకు ఆ 13 పేజీలు పూర్తి అయ్యేసరికి వెంకట రమణ జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయి? అనేది మిగిలిన కథ.

ఎలా ఉంది?

వెంకట రమణ మిడిల్ క్లాస్ జీవితంతో సినిమా మొదలౌతుంది. భార్య, పిల్లలు, తండ్రి, చెల్లి, బావతో కలిసి ఉమ్మడిగా ఒకే ఇంట్లో ఉంటూనే అప్పులు తీర్చే మార్గం లేక సతమతం అవడం.. కాఫీ పొడి అయిపోతే అదే బాటిల్లో వేడి నీళ్లు పోసి బ్లాక్ కాఫీ పేరుతో తండ్రికి ఇవ్వడం..చీటికి మాటికి హెల్త్ చెకప్ కోసం తండ్రి ఏడుకొండలు కొడుకు వెంటపడటం.. హాస్పిటల్ కి వెళ్తే అయ్యే ఖర్చులను తల్చుకుని గాభరా పడే కొడుకు ఏదో కారణంతో తండ్రి మెడికల్ చెకప్పులను వాయిదా వేయడం..అందుకే కష్టపడకుండా రాత్రికి రాత్రి కోటీశ్వరుణ్ణి అయిపోవాలని స్వామికి రోజుకి వంద రూపాయలు ఖర్చు పెట్టి మరీ వెంకట రమణ పూజలు చేయడం లాంటి సన్నివేశాలతో దర్శకుడు మధ్యతరగతి జీవితాలను కళ్లముందు ఉంచాడు.

సినిమా మొదలైన గంట వరకు మిడిల్ క్లాస్ జీవితాల చుట్టూ ఫ్యామిలీ డ్రామా కథ నడిపిన దర్శకుడు రాజేంద్రప్రసాద్ ను దింపి డివోషనల్ టచ్ ఇవ్వడంతో స్టోరీ ఫాంటసీ జానర్లోకి టర్న్ అవుతుంది.

ఫ్యామిలీ డ్రామా వరకు నడిచిన కథనం నేల మీదే ఉంటుంది. ఎప్పుడైతే వేంకటేశ్వర స్వామి రూపంలో రాజేంద్రప్రసాద్ ఎంటర్ అవుతాడో కథ గాల్లోకి వెళ్తుంది.. అంటే ఇక అక్కడ్నుంచి లాజిక్కులు వెతక్కూడదని అర్థం.

దేవుడు దిగివచ్చిన తర్వాత కథనం దర్శకుడి సినిమాటిక్ లిబర్టీ ప్రకారం ముందుకు సాగుతుంది. ఇక అక్కడ్నుంచి మనం కథ జోలికి, లాజిక్కుల జోలికి పోకూడదు. కామెడీ ఎంతవరకు వర్కౌట్ అయ్యిందనే వెతుక్కోవాలి. సరే, దేవుడు దిగి వచ్చిన తర్వాత కూడా ఓ ఇరవై నిమిషాలు కథ మంచి డివోషనల్ వే లోనే వెళ్తుంది. ఎప్పుడైతే దేవుడు వెంకట రమణ చేతిలో పుస్తకం పెడతాడో అప్పట్నుంచి కథనం గాడి తప్పుతుంది.

సెకండాఫ్ నుంచి దర్శకుడు డివోషనల్ ఎలిమెంట్ ను వైకుంఠంలోనే వదిలేసి కామెడీ పేరుతో రకరకాల ప్రయోగాలు చేశారు. ముఖ్యంగా రఘుబాబు తన ప్రైవేట్ పార్ట్ మాయం అయ్యిందని పదేపదే అన్నిచోట్లా హడావుడి చేయడం నవ్వులను పంచకపోగా ఫ్యామిలీ ఆడియన్స్ కి ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. రఘుబాబు ఎపిసోడ్ తో కథలో ఉన్న చక్కటి మెసేజ్ దెబ్బ తింది.

ఇక ఆ బుక్ పట్టుకుని ఎవరికి వాళ్ళు తమకు తోచింది రాసుకోవడంతో ఆ పుస్తకానికి ఉన్న వాల్యూని దర్శకుడు తనంతట తానే తగ్గించడంతో కథలో ఉన్న ఆత్మ మాయం అయిపోతుంది. ఆ బుక్ కూడా కామెడీ పీస్ అయిపోయిన తర్వాత ఇక ప్రేక్షకులకు దానితో దివోషనల్ కనెక్షన్ ఏముంటుంది? ఇక్కడే ఫీల్ చెడిపోయింది.

సెకండాఫ్ లో కామెడీ డోస్ పెంచాలనే ఆతృతలో దర్శకుడు కొన్నిచోట్ల తడబడ్డాడు. సునీల్, వెన్నెల కిషోర్, బాబూ మోహన్, పృథ్వీ వంటి సీనియర్ కమెడియన్ ఆర్టిస్టులను దింపిన దర్శకుడు వాళ్ళని సరైన దిశలో వాడుకోలేకపోయాడు. పవన్ కళ్యాణ్ OG గెటప్ తో సునీల్ చేసిన డ్రామా, అఖండ బాలయ్య స్నూఫ్ పేరుతో వెన్నెల కిషోర్ చేసిన విన్యాసాలు, తన ప్రైవేట్ పార్ట్ పోయిందని రఘుబాబు చేసిన వెకిలి కామెడీతో హాస్యం అపహాస్యం పాలయ్యింది.

కష్టపడకుండా , నీ వంతు ప్రయత్నం నీవు చేయకుండా అంతా దేవుడిదే భారం అనుకుంటూ కాలక్షేపం చేస్తే ఆ దేవుడు కూడా నీ తలరాతను మార్చలేడు అనే చక్కటి మెసేజ్ ను ఆడియన్స్ కు రీచ్ అయ్యేవిధంగా పూర్తిస్థాయిలో ఎస్టాబ్లిష్ చేయడం మీద ఫోకస్ పెట్టకుండా దర్శకుడు కామెడీ జానర్లోకి టర్న్ అయి కథని ఎక్కడికో తీసుకుపోయారు. నిజానికి దర్శకుడు చెప్పాలనుకున్న మెసేజ్ చాలా గట్టిది.. అయితే స్క్రీన్ ప్లే దగ్గరికి వచ్చేసరికి ఆయన తడబడ్డారు.

ప్రీ క్లైమాక్సులో దొర్లిన అతి కామెడీని క్లైమాక్స్ సన్నివేశం కొంత కవర్ చేసింది. తన భక్తుడి భార్య చావుబతుకుల్లో ఉంటే వైద్యుడి రూపంలో భగవంతుడే దిగివచ్చి ఆపరేషన్ చేసి ప్రాణాలు కాపాడటం మాత్రం హృదయాలను టచ్ చేస్తుంది.

ఎవరెలా చేశారు?

ఫ్యామిలీ హీరోగా శ్రీకాంత్ ఇప్పటికే చాలా సినిమాల్లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. మిడిల్ క్లాస్ మ్యాన్ వెంకట రమణ పాత్రలో శ్రీకాంత్ పూర్తి న్యాయం చేశాడు. కొన్ని సన్నివేశాల్లో మనకు శ్రీకాంత్ కనిపించడు.. వెంకట రమణ మాత్రమే కనిపిస్తాడు. లయ నటన ఎప్పటిలానే చాలా సహజంగా ఉంది. ఈ మధ్య తెరవెనుక విమర్శలు ఎదుర్కొంటున్న నవ్వులరేడు రాజేంద్రప్రసాద్ నటన తెరమీద హుందాగా ఉంది.

వెన్నెల కిషోర్ ఓపెనింగ్ బాగుంది.. ఎండింగ్ అతి అయ్యింది.
చాన్నాళ్లకు బాబూ మోహన్ కనిపించారు.
రఘుబాబు కామెడీ అతి అయ్యింది.
సునీల్ , పృథ్వీ ల నటనలో కొత్తదనం మిస్ అయ్యింది.

సాంకేతికత

సాయి కార్తీక్ అందించిన సంగీతం పర్లేదు.
అంజి అందించిన ఛాయాగ్రహణం బాగానే ఉంది.. వైకుంఠం నేపథ్యంలో కనిపించే కొన్ని విజువల్స్ బాగున్నాయి.
నిర్మాణ విలువలు పర్లేదు.

విశ్లేషణ

సాధారణంగా మిడిల్ క్లాస్ జీవితాలను ప్రతిబింబించే స్టోరీలకు చాలామంది కనెక్ట్ అవుతారు. ఎందుకంటే కొన్ని సినిమాల్లో పాత్రలను తమలో చూసుకుంటారు. ఇందులో వెంకట రమణ పాత్ర అటువంటిదే.

భోజన హోటల్ పెట్టినప్పుడు కుటుంబాన్ని పోషించుకోవడానికి సరిపడా లాభాలు వచ్చినా ఇంకా సంపాదించాలనే ఆశతో అప్పులు చేసి మరీ పెద్ద హోటల్ ఓపెన్ చేయడంతో నష్టాలు వచ్చి అతడి కథ మొదటికి వస్తుంది.

మధ్యతరగతి జీవితాల్లో జరిగే పరిణామాలు చాలావరకు ఇలాగే ఉంటాయి. కొంతమంది కోటీశ్వరుల మాదిరి అప్పుచేసి ఎగ్గొట్టి విదేశాలకు పారిపోవడం వీళ్ళకి తెలీదు. తగులుకున్న అప్పును తీర్చేందుకు కిందామీద పడుతుంటారు. అందుకే తమ జీవితాల్లో గొప్ప మార్పులు రావాలని భగవంతుడి వెంట పడుతుంటారు. అలా భగవంతుడి వెంట పడిన వెంకట రమణ కథే మిస్టర్ మిడిల్ క్లాస్ మూవీ.

ఫస్టాఫ్ మాత్రం మధ్య తరగతి జీవితాల చుట్టూ కథ నడిపిన దర్శకుడు సెకండాఫ్ లో కామెడీ పేరుతో అసలు కథ నుంచి పక్కకి జరగడం చాలామందికి నచ్చకపోవచ్చు.

అమెజాన్ ప్రైమ్ లో మిస్టర్ మిడిల్ క్లాస్ అందుబాటులో ఉంది కాబట్టి వన్ టైమ్ వాచ్ మూవీ కింద ఓ లుక్కేయండి.

నటీనటులు: శ్రీకాంత్, లయ, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, రఘుబాబు, పృథ్వీ, మురళీధర్ గౌడ్, బాబూ మోహన్ తదితరులు
సంగీతం: సాయి కార్తీక్
సినిమాటోగ్రఫీ: అంజి
నిర్మాత: జి కె చందు
దర్శకత్వం: జి నాగేశ్వర రెడ్డి
విడుదల: అమెజాన్ ప్రైమ్ (19-08-2026)
రేటింగ్: 2.5 / 5


Spread the love

One thought on “ఓటిటిలోకి వచ్చిన శ్రీకాంత్ మిస్టర్ మిడిల్ క్లాస్ మూవీ (Mister Middle Class మూవీ Review) ఎలా ఉందంటే?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!