జన నాయకుడు మూవీ (ZEE5) రివ్యూ – Jana Nayagan Movie review!

Spread the love

జన నాయకుడు మూవీ (Jana Nayagan Movie) విజయ్ నటించిన చివరి సినిమా. టైటిల్ కార్డులో Honble CM Vijay Tamilanadu అని మొదటిసారి పేరు పడిన సినిమా కూడా జన నాయకుడే.

ఇకపై తాను సినిమాలలో నటించనని , ఇదే తన ఆఖరి సినిమా అని TVK పేరుతో కొత్త రాజకీయ పార్టీ స్థాపించినప్పుడే విజయ్ అనౌన్స్ చేశారు. ఒకపక్క తమిళనాడు రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని విజయ్ నిర్ణయం తీసుకోవడం, మరోపక్క జన నాయకుడు ఆయన నటించే ఆఖరి సినిమా కావడంతో ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి.

దానికితోడు రాజకీయాలకు సంబంధించి తన ఆలోచనలను విజయ్ ఈ సినిమాలో పంచుకున్నాడని టాక్ రావడంతో అటు సినీ వర్గాలు , ఇటు రాజకీయ వర్గాలు జన నాయకుడు ఈ సినిమా విడుదల కోసం ఎదురు చూశారు. చివరికి అనేక బాలారిష్టాలను దాటుకుని ఎట్టకేలకు జూలై 23 ,2026 లో ఈ మూవీ థియేటర్లలో విడుదల అయ్యింది. అయితే అందరి అంచనాలకు తగినట్టుగా ఈ మూవీ ఉండకపోవడం ఆయన అభిమానులను నిరాశ పరిచింది.

తాజాగా ఈ నెల 21 (ఆగస్టు 21, 2026) నుంచి ఈ సినిమా ZEE 5 లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పుడు జన నాయకుడు ఎలా ఉందో చూద్దాం.

కథేంటంటే?

భయాన్ని కూడా భయపెట్టే ఒక వీరుడి కథ ఒక పోలీస్ ఆఫీసర్ చెప్పడంతో మూవీ మొదలౌతుంది.

దళపతి వెట్రి కొండాన్ ( విజయ్) ఒక హత్య కేసులో శిక్ష పడి జైలు జీవితం అనుభవిస్తుంటాడు. అయితే వేరొక కేసులో శిక్ష పడి అదే జైలుకు చేరుకున్న ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ ను చంపేయడానికి కొంతమంది రౌడీలు వెంటపడటంతో కొండాన్ వాళ్ళతో ఫైట్ చేసి ఆ బిజినెస్ మ్యాన్ ను కాపాడుతాడు.

దీంతో కొండాన్ జైలర్ ( గౌతమ్ మీనన్) దృష్టిలో పడతాడు. అతడి తల్లి చివరి కోరికను తీర్చడం కోసం జైలర్ కొండాన్ ను విలేజ్ కి తీసుకెళ్తాడు. దాంతో కొండాన్ జైలర్ కు, తల్లి లేని అతడి పాప విజ్జీకి (మమిత బైజు) దగ్గరవుతాడు. జైలర్ ను కొంతమంది యాక్సిడెంట్లో చంపేయడంతో పాప బాధ్యతలను కొండాన్ స్వీకరిస్తాడు.

ఇదిలా ఉండగా జాన్ హిమ్లార్ (బాబీ దేవోల్) మనుషులు విజ్జిని చంపడానికి ప్రయత్నించడంతో ఆమెను కాపాడటానికి కొండాన్ రంగంలోకి దిగుతాడు.

ఇంతకీ ఈ జాన్ హిమ్లార్ ఎవరు?
అతడి మనుషులు ఎందుకు విజ్జిని చంపాలనుకుంటారు?
రోజా రంగస్వామికి (ప్రకాష్ రాజ్) జాన్ హిమ్లార్ కి ఉన్న లింక్ ఏంటి?
జాన్ హిమ్లార్ ఇండియాలో ప్లాన్ చేసిన ఆపరేషన్ M లక్ష్యం ఏంటి?
ఈ ఆపరేషన్ ను కొండాన్ ఎలా చేధిస్తాడు? అనేది మిగిలిన కథ.

ఎలా ఉంది?

దళపతి విజయ్ కి చాలా విషయాల్లో అదృష్టం కలిసి వచ్చింది. సెన్సార్ ఇబ్బందులతో ఈ సినిమా విడుదల వాయిదా పడటం, రాజకీయ కారణాలతోనే తన సినిమా విడుదల వాయిదా వేస్తున్నారని ప్రత్యర్ధి పార్టీల మీద విజయ్ ఆరోపణలు చేయడం వంటి పరిణామాలతో అందరి దృష్టి జన నాయకుడు మీద పడింది.

నిజానికి అలా ఆలస్యం కావడమే విజయ్ కి కలిసొచ్చింది. ఎన్నికల ముందు ఈ డిజాస్టర్ మూవీ విడుదల అయ్యుంటే ఆయన ఇమేజ్ కి కొంచం ఇబ్బంది కలిగేది.
ఈ సినిమా ఒక ట్రాక్ మీద నడవదు. ఒకేసారి నాలుగైదు ట్రాకుల మీద నడుస్తుంది. ఏ ట్రాక్ ఎటు పోతుందో ఎవరికీ ఎరుక అవదు.

90 వ దశకంలో తెలుగు సినిమా మధ్యలో ఇంగ్లీష్ సినిమా బిట్లు వేసేవాళ్ళు. సడెన్గా వేరే సినిమా రావడంతో అప్పట్లో కొంతమంది ప్రేక్షకులు భయంతో కూడిన గాభరాతో కంగారు పడేవారు. శంకరాభరణం సినిమాలో శంకర శాస్త్రులు గారి మాదిరి ‘ మనం వచ్చిన సినిమా ఏంటి? తెరమీద కనిపిస్తున్న ఈ సినిమా ఏంటి? నారదా ‘ అంటూ థియేటర్లోనే గావుకేకలు పెట్టేవారు. జన నాయకుడు సినిమా చూసినవాళ్లలో చాలామందికి నోస్తాల్జియా రోజులు గుర్తుకొస్తాయి.

సరే ఎలక్షన్లు, సెన్సార్ గోలలే కాకుండా ఈ సినిమా విషయంలో కథ లొల్లి కూడా నడిచింది. తెలుగులో బాలయ్య నటించిన భగవంత్ కేసరి సినిమాకి జన నాయకుడు సినిమా రీమేక్ అని టాక్ రావడం ,ఆ చిత్ర నిర్మాణ సంస్థ మాత్రం అబ్బే అలాంటిదేమీ లేదని అనడం వంటి తెలుగు, తమిళ ఎపిసోడ్లు కూడా నడిచాయి. చివరికి ఎలాగైతేనేమి ఈ సినిమాకి కథ అనిల్ రావిపూడి అని టైటిల్ కార్డ్ వేసేశారు.

ఇంతవరకు బాగానే ఉంది. తెలుగులో బాలయ్య నటించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన భగవంత్ కేసరి కథను ఎటువంటి మార్పులు చేయకుండా అచ్చుకు అచ్చు విజయ్ తో రీమేక్ చేయించి ఉంటే ఎలా ఉండేదో తెలీదు కానీ దర్శకుడు ఆ కథని అతుకుల బొంత చేసేశారు. చిన్నప్పుడు ఇంట్లో బామ్మలు మిగిలిపోయిన గుడ్డలతో ఒక బొంత తయారుచేసేవారు. ఆ బొంతలో ఏ క్లాత్ ఎక్కడ్నుంచి మొదలై ఎక్కడ ఎండ్ అవుతుందో తెలీదు. కానీ మొత్తానికి ఒక బొంత మాత్రం తయారవుతుంది. దీని పరిస్థితి కూడా అలాగే ఉంటుంది.

భగవంత్ కేసరి చూసినవాళ్ళకు ఈ సినిమా ప్రారంభం కూడా అలాగే ఉండటంతో ఐసీ అనుకుంటూ చూడటం మొదలుపెడతారు. ఇంతలో సడెన్గా కళ్లముందు ఆఫ్రికన్లు ప్రత్యక్షం అవుతారు. ఇక్కడ కొంతమంది షాక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. గాభరా పడక్కర్లేదు.. ఇది కూడా జన నాయకుడు సినిమాలో సన్నివేశమే.

చిదంబరం స్టేడియం లాంటి విశాలమైన గ్రౌండ్లో వేసిన జైల్ సెట్ లో ఒక ఆజానుబాహుడు దిగుతాడు. వెనకనుంచి కెమెరా రన్ అవుతుంటుంది కాబట్టి అతడి ముఖం మనకు కనపడదు. ‘పొద్దున్నే నిన్ను ఉరి తీస్తున్నారు కాబట్టి నీ ఆఖరి కోరికేంటో కనుక్కోమని మా ప్రెసిడెంట్ అడిగాడు ‘ అని ఓ ఆఫ్రికన్ అనడం, నా సంగతి అలా ఉంచు.. ఉరి కంభం ఎక్కేముందు మీ ప్రెసిడెంట్ ఆఖరి కోరికేంటో కనుక్కో ‘ అని ఆ శాల్తీ రిప్లై ఇవ్వడంతో ఇప్పుడు అక్కడ పెద్ద వార్ ఏదో జరగబోతుంది అని ప్రేక్షకులకు అనుమానం వస్తుంది.
అనుకున్నట్టుగానే నాలుగైదు జీపుల్లో ఆ మనిషి తాలుకూ మనుషులు రావడం, డిష్యుం, డిష్యుం అంటూ కాల్చుకుంటూ ఆఫ్రికన్ సోల్జర్స్ అందర్నీ నేల మీద పడుకోబెట్టి ఆ మనిషి దగ్గరికెళ్ళి బాస్ ఆపరేషన్ ఫినిష్ బయలుదేరండి అంటూ ఎర్రకోటు తొడగడంతో ముఖం కెమెరా మీదకు ఫోకస్ అవుతుంది. అతడే జాన్ జిమ్లార్ అలియాస్ మన బాబీ దేవోల్.

బాబీ దేవోల్ పాత్ర పరిచయానికి దర్శకుడు అంత ఫోకస్ పెట్టాడన్నమాట. నిజానికి ఈ సీన్ తెలుగు మాతృకలో లేదనుకుంటా. భగవంత్ కేసరి చూసినవాళ్లు ఏ రకంగానూ ఈ మూవీతో కనెక్ట్ కాలేరు. ఆడపిల్లలు చిన్నప్పట్నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో భగవంత్ కేసరిలో బాలయ్య చెబుతుంటే ఎమోషన్స్ ఆపుకోలేరు.. కానీ అదే సీన్ ఇందులో చూస్తే ఎలాంటి ఫీల్ రాలేదు. అలాగే బాలయ్యకు, శ్రీలీలకు మధ్య నడిచిన ఎమోషనల్ డ్రామా భగవంత్ కేసరిని నిలబెట్టింది.. ఎందుకో ఇందులో అది లోపించింది.

మోతాదును మించిన ఫైట్లు కూడా జన నాయకుడిని దెబ్బ తీసాయి. మామూలుగా ఒక హీరో వందమంది రౌడీలను ఒకేసారి కొడితే అది సాధారణం.. కానీ ఒక హీరో ఒకేసారి వెయ్యిమంది రౌడీలను కొడితే అది అసాధారణం. అటువంటి అసాధారణమైన ఫైట్లు ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తాయి. క్లైమాక్స్ ఫైట్ సీన్లు అయితే ఎక్కడికో వెళ్లిపోతాయి. వందలమంది రౌడీలకు తోడు రోబోలను కూడా దింపడంతో ఎవరు ఎవర్ని కొడుతున్నారో? ఎందుకు కొడుతున్నారో కూడా అర్థం కాదు. అసలు చెప్పాలనుకున్న పాయింట్ వదిలేసి చివరి ఇరవై నిమిషాలు దీనికే కేటాయించడం విచారకరం.

ఎంజీఆర్ దళపతి విజయ్ కి కొరడా అందించడం, నేటి పొలిటీషియన్ల మీద వేసిన చురకలు, మన ప్రజాస్వామ్యాన్ని ఏ శక్తులు విచ్చిన్నం చేయలేవని మెసేజ్ ఇవ్వడం, వంటి డైలాగులు, సన్నివేశాలు విజయ్ పొలిటికల్ ఇమేజ్ పెంచే విధంగా ఉంటాయి. కనీసం ఈ పాయింటులో అయినా దర్శకుడు అనవసరమైన వయోలెన్సుని తగ్గించి అదే లైనులో స్టోరీని రన్ చేసి ఉంటే బాగుండేది.

ఫస్టాఫ్ మొత్తం దాదాపు భగవంత్ కేసరి సినిమా అనుకరణలో సాగితే సెకండాఫ్ మాత్రం దర్శకుడి సొంత బాణీలో కథనం సాగుతుంది. ఇందులో కనిపించే రోజా రంగస్వామి ( ప్రకాష్ రాజ్) జాన్ జిమ్లార్ (బాబీ దేవోల్) పాత్రలు భగవంత్ కేసరిలో కనిపించవు. ఒకరకంగా చెప్పాలంటే భగవంత్ కేసరి సినిమా కథతో జన నాయకుడు సినిమా మొదలెట్టి ఆఫ్రికా,పాకిస్తాన్ ల చుట్టూ కథ నడిపి చివరకు దర్శకుడు తమిళనాడులో ముగించారు. ఫస్టాఫ్ బాలయ్య కోసం రాసుకున్న కథ.. సెకండాఫ్ విజయ్ కోసం రాసుకున్న కథలతో జన నాయకుడు సినిమా బయటికి వచ్చింది.

ఎవరెలా చేశారు?

ఇలాంటి పాత్రలు దళపతి విజయ్ కి కొట్టిన పిండి. ఒక్క ఫైటింగ్ సీన్లలో మినహా విజయ్ నటన నాచురల్ గా ఆయన స్టైల్ లోనే నడిచింది.
విజ్జి పాత్రలో మమిత బైజు నటన కూడా బాగానే ఉంది.
ప్రకాష్ రాజ్ , సునీల్ ల నటన ఎప్పటిలానే ఉంది.. కొత్తదనం లేకపోవడంతో మోనాటని వస్తుంది.
బాబీ దేవోల్ పాత్రకు ఇచ్చిన అతి ఎలివేషన్లు సహజంగా అనిపించవు.

సాంకేతికత

అనిరుధ్ అందించిన సంగీత హోరు ఎప్పటిలానే ఉంది.
సత్యన్ సూరన్ అందించిన సినిమాటోగ్రఫీ పర్లేదు
నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి.

విశ్లేషణ

లాజిక్కుల జోలికి పోకుండా కేవలం విజయ్ స్టైల్ నటన చూడటానికి ఇష్టపడేవాళ్లు ఈ సినిమా చూడొచ్చు. ఇది ఫక్తు కమర్షియల్ సినిమా.. విజయ్ ఒంటిచేత్తో ఎంతమంది రౌడీలనైనా గాల్లో ఎగరేస్తాడు.

ఈ సినిమాలో విజయ్ కి ఎంత భారీ ఎలివేషన్లు ఉంటాయో.. బాబీ దేవోల్ కి కూడా అంతే ఎలివేషన్లు ఉంటాయి. అవన్నీ ఓకే అనుకునేవాళ్లు ZEE 5 ఓటీటీలో తెలుగులో కూడా ఈ సినిమాని చూడొచ్చు.

నటీనటులు: విజయ్, మమిత బైజు, బాబీ దేవోల్, ప్రకాష్ రాజ్, సునీల్, గౌతమ్ మీనన్ తదితరులు
సంగీతం : అనిరుధ్
సినిమాటోగ్రఫీ: సత్యన్ సూరన్
నిర్మాత: వెంకట్ కె నారాయణ
దర్శకత్వం: హెచ్ వినోద్
విడుదల: ZEE 5 (21-08-2026)
రేటింగ్: 2/5


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!