గతానికీ , ప్రస్తుతానికీ తెలుగు సినిమా మేకింగులోనూ , టేకింగులోనూ చాలా మార్పులు వచ్చాయి. ఇక్కడ గతం అంటే నాకు తెలిసి 80 -90 దశకాలనుంచి నేటివరకు మారుతున్న నేటి సినిమాల ట్రెండ్ గురించి ఒకసారి విశ్లేషణ చేసుకుందాం.
కథలు – గతం
మీరు గమనించారా ? ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం తెలుగు సినిమాల్లో కధలకు సోమాలియా కరువు మాదిరి కొరత ఏరపడింది. ఎనభైయ్యవ దశకంలో కథలు చదవకుండా హీరోలు సినిమాలు ఒప్పుకునేవారు కాదు. ఎన్టీఆర్ , ఏఎన్ఆర్ , కృష్ణ , కృష్ణంరాజు , శోభన్ బాబుల తరం వరకు కధలకు ప్రాధాన్యం ఉండేది. ఒక కొత్త సినిమాకి కొబ్బరికాయ కొట్టాలంటే ముందు స్క్రిప్ట్ ఎలా ఉందో చూసుకునేవారు. అప్పట్లో సినీ రచయితలకు కూడా చేతినిండా పని ఉండేది. మళ్ళీ వీళ్ళకి తోడు సంభాషణల రచయితలు తోడయ్యేవారు. చేతినిండా కథలు ఉండటంతో ఒక్కో హీరో ఏడాదికి మినిమమ్ నాలుగైదు సినిమాలు చేసేవాళ్ళు. ఇప్పుడు ఒక్కో హీరో ఏడాదికి ఒక సినిమా చేయడమే గగనం అయిపోతుంది.
కథలు – ప్రస్తుతం
మరి ఇప్పటి సంగతో ? సినిమాల్లో కథలు వెతకడం అంటే మైసూర్ బోండాలో మైసూర్ వెతకడమే. కధలకు విపరీతమైన కరువు వచ్చిన రోజులకు వచ్చేసాం. అప్పట్లో ఒకే రచయిత పది సినిమాలకు కథలు రాసిన రోజులు ఉన్నాయి. మరి ఇప్పుడో ? పది మంది రచయితలు కలిసి ఒక సినిమాకి కథ రాస్తున్నారు. వెండితెర మీద ఫలానా రచయిత పేరు చూడగానే కథ మీద మనకు నమ్మకం వచ్చేసేది. అలాగే ఆనాటి సినీ రచయితలు మన నమ్మకాలను వమ్ము చేయకుండా కధతోనే సినిమాలకు హిట్ కొట్టేవాళ్ళు. తెలుగు సినిమా వందరోజులు ఆడిన దశనుంచి వారం రోజులు ఆడే దశకు చేరుకోవడానికి ప్రధాన కారణం కధల కొరతే.
మరి కధలకు ప్రత్యామ్నాయం ఏమొచ్చింది?
నాణ్యమైన కధల స్థానంలో నాసిరకం గ్రాఫిక్స్ వెండితెర మీద మాయ చేస్తుంది. దీన్నే గ్రాఫిక్స్ మాయ అందురు. ప్రేక్షకుడ్ని కథ గురించి మర్చిపోయేలా చేసే మత్తుమందు పేరే గ్రాఫిక్స్. గ్రాఫిక్స్ మాయలో పడి థియేటర్లో కూర్చున్న మనం ఆ కాసేపు కథ గురించి మర్చిపోతాం. సినిమా అయిపోయి ఇంటికొచ్చి చూసుకుంటే ఎంత గింజుకున్నా మనకు కథ గుర్తుకురాదు. గుర్తుకురావడానికి అసలు కథ ఉంటేగా? చాలా సినిమాల్లో పరిస్థితి ఇదే.
సాహిత్యం – సంగీతం
ఒకప్పటి సినిమాల్లో సాహిత్య , సంగీతాలకు పెద్ద పీట వేసేవారు. గలగలా పారే పాటల సాహిత్యానికి సంగీతం తోడై కొత్త సొబగులు అద్దేది. అప్పట్లో కేవలం పాటల కోసమే కొన్ని సినిమాలు చూసిన రోజులు ఉన్నాయి. నచ్చిన పాటల్లోని చరణాలను చాన్నాళ్లు హమ్ చేసేవాళ్ళం. పాటల సాహిత్యం మీద మమకారంతో పాటల పుస్తకాలు కొనుక్కునేవాళ్ళం. విజయవాడ అలంకార థియేటర్ ఎదురు రోడ్డులో ఆదివారం నాడు ఫుట్ పాత్ మీద అమ్మే రకరకాల రంగుల కాగితాల్లో ప్రింట్ అయిన పాటల పుస్తకాలను కొనుక్కున్న వారిలో నేనూ ఒకడిని. ఇప్పుడవన్నీ కాలగర్భంలో కలిసిపోయాయి. సాహిత్యాన్ని ఇయర్ డ్రమ్ములు పగిలిపోయే డ్రమ్ముల వాయింపు మింగేసింది. ఆ తుఫాను హోరులో అసలు పాటేంటో కూడా ఎవరికీ అర్ధం కాకుండా పోతుంది . ఇక హమ్ చేయడానికి ఏముంటుంది? హమ్ కిసీసే కమ్ నహీ హై అనుకోవడమే.
బీజీఎమ్ ఉంటే చాలు
ప్రస్తుత జెనెరేషన్లో చాలామందికి సంగీత , సాహిత్యాలతో పనిలేదు. చెవులు హోల్ పడేలా బీజీఎమ్ ఉంటే చాలు . బీజీఎమ్ అంటే ఏంటో అనుకునేరు. సాంప్రదాయ సంగీత వాయిద్యాలను పక్కనపడేసి నాలుగు డ్రమ్ములు ముందేసుకుని వాయించడమే. చక్రవర్తులు, మహదేవన్ లు వెళ్లిపోయారు. ఆత్రేయ , ఆరుద్రలు లేరు. వేటూరి , సిరివెన్నెలలు గగనాన పాటలు రాసుకోవడానికి వెళ్లిపోయారు. అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్ఛవాన్ని అని ప్రశ్నించిన సిరివెన్నెల ఇప్పుడు లేరు. వారానికి దాయి..నెలకోసారి ఇస్తా ..లాంటి తింగరి అనంతమైన పాటలు వచ్చేస్తున్నాయి. తెలుగు పాటల్లో చక్కటి సాహిత్యం స్థానంలో బూతు రంగప్రవేశం చేసింది. ఒకవేళ అడపాదడపా చక్కటి సాహిత్యం ఉన్నా సంగీత హోరు దాన్ని కప్పేస్తుంది. నేటి యూతు కూడా బీజీఎమ్ ఉంటే చాలు అనుకునే పరిస్థితికి వచ్చారు. ఇందులో వాళ్ళని తప్పుపట్టడానికి కూడా ఏమీ లేదు. జెనెరేషన్లు మారినా ఇంకా పాత కాలంనాటి సంగీత , సాహిత్యాలను ప్రేమించే నాలాంటివాళ్ళు అప్డేట్ కావాలి అనుకోవడమే.
హీరోలు -హీరోయిన్లు
ఎనభైయ్యవ దశకంలో ఎన్టీఆర్ , ఏఎన్ఆర్ , కృష్ణ , కృష్ణంరాజు , శోభన్ బాబుల శకం నడిచింది. అలాగే వాణిశ్రీ , జయప్రద , జయసుధ , శ్రీదేవి , వంటి నటీమణుల హవా నడిచింది. ఎంతలా అంటే ఏడాదికి తక్కువలో తక్కువ నాలుగైదు సినిమాలు చేస్తూ షుమారు నాలుగు దశాబ్దాలకు పైగా వెండితెర వెలుగులు పంచారు. వీళ్ళని మనం సొంత ఫ్యామిలీ మాదిరి ఓన్ చేసుకుని ఆదరించాం. ఇవాళ వచ్చే హీరోల్లో చాలామంది అప్పట్లా దశాబ్దాల తరబడి సిల్వర్ స్క్రీన్ ను ఏలలేకపోతున్నారు. దీనికి కారణం మనం కూడా చాలామందితో ఎందుకో అలా కనెక్ట్ కాలేకపోతున్నాం.
అప్పటికీ నేటి హీరోలను చాలామందిని భారీ ఎలివేషన్లతో లాక్కొస్తున్నారు. గతంలో హీరోలు నటనతో మనల్ని మెప్పిస్తే నేటితరం హీరోలు ట్రాన్స్ఫార్మర్లు పేలిపోయే భారీ ఎలివేషన్లతో మనల్ని కవర్ చేస్తున్నారు.
ఇక నేటి హీరోయిన్ల సంగతి చెప్పడానికి ఏముంది. క్లబ్ డాన్సర్ కు తక్కువ .. క్యాబరేకు ఎక్కువ అయిపోయింది పరిస్థితి. గతంలో ప్రేక్షకులను ఎంటర్ చేయడానికి మధ్య మధ్యలో జ్యోతిలక్ష్మి , జయమాలినిలు వచ్చి ఆ బాధ్యతను తమ భుజాన వేసుకుని పాటలో మెరిసి మాయమైపోయేవారు. కానీ నేటి తరం హీరోయిన్లు టూ పీస్ కాస్ట్యూమ్స్ తో మొత్తంగా ఆ బాధ్యతను తమ భుజాన వేసుకుని కళామతల్లి సేవ చేసుకుంటూ తరిస్తున్నారు.
విలన్ క్యారెక్టర్లు – నాడు , నేడు
రావుగోపాల రావు , ప్రభాకర రెడ్డి , నాగభూషణం , కైకాల సత్యనారాయణ , లాంటి నటులు దశాబ్దాల పాటు సినిమాల్లో నెగిటివ్ క్యారెక్టర్లు చేసి మనల్ని మెప్పించారు. విచిత్రం ఏంటంటే వీళ్ళు నెగిటివ్ క్యారెక్టర్లు వేసినా మనం అభిమానించాం. అందుకు కారణం వారి నటనే. దానికి తోడు వారి ఆహార్యం కూడా ఫెమిలియర్ గా ఉండటమే. మరి నేటి విలన్ల సంగతో ? నటనతో పనిలేదు .. కేవలం పిల్లికళ్ళు ఉంటే చాలు విలన్ క్యారక్టర్ వేసేయొచ్చు.
క్యారక్టర్ ఆర్టిస్టులు
నేటి తెలుగు సినిమాలకు క్యారక్టర్ ఆర్టిస్టుల కొరత కూడా చాలా ఉంది. అప్పట్లో చాలా సినిమాలను ఎస్వీ రంగారావు , గుమ్మడి , జగ్గయ్య లాంటి క్యారక్టర్ ఆర్టిస్టులు తమ భుజాన వేసుకుని నడిపించారు. వీరి రాకతోనే చాలా సినిమాలకు బలం పెరిగింది అనడం అతిశయోక్తి కాదు.
మరి ఇప్పుడు చూస్తే ఆ స్థాయిలో కాకపోయినా కొంతవరకైనా నటించి మెప్పించగలిగిన క్యారక్టర్ ఆర్టిస్టులను వేళ్లమీదే లెక్కపెట్టవచ్చు.
ఫైట్స్
ఫైటింగ్ కంపోజింగులు కూడా మారాయి. అప్పట్లో మాగ్జిమమ్ ఫైటింగులు నేల మీదే ఉండేవి. ఇప్పుడవి గాల్లోకి మారాయి. నాకు తెలిసి అప్పట్లో రాజు అని ఫైట్ మాస్టర్ ఉండేవాడు. హీరో .. విలన్ల మధ్య చాలా సహజంగా ఫైట్స్ కంపోజ్ చేసేవాడు. ఇప్పుడు ఫైటింగులకు అర్దాలే మారిపోయాయి. ఒక హీరో వందమంది రౌడీలను ఒకేసారి ఎగిరి తన్ని వాళ్ళని స్పేస్ సెంటర్ కి పంకపోతే అతడు హీరోనే కాదు. మినిమం హీరో తొడకొడితే మినిమమ్ పది సుమోలు గాల్లోకి లేవాలి. హీరో గట్టిగా గాలి ఊదితే పట్టాల మీద వెళ్తున్న ట్రైన్ ఆకాశంలోకి , ఆకాశంలో ఎగురుతున్న విమానం నేలమీదికి దిగాలి. ఇక ట్రాన్స్ఫార్మర్లు పేలిపోవడం , కరెంట్ డిపార్టుమెంటుకు పని పడటం కంపల్సరీ.
ఒక లక్ష టిఎంసిల రక్తాన్ని డ్రమ్ముల్లో పారించి వెండితెరను ఎరుపెక్కించడం కామన్ అయిపోయింది. ఈ ఎరుపుకు మనం కూడా అలవాటు పడిపోయాం కాబట్టి దర్శకులు ఎన్ని టీఎంసీలు వదిలారు అనేదానిమీదే రేటింగులు ఇవ్వడానికి మనం కూడా ప్రిపేర్ అయిపోయాం.
ముగింపు
జెనెరేషన్లు మారాయి కాబట్టి మార్పు కూడా సహజమే. కానీ ఆ మార్పు సవ్య దిశగా సాగితే బాగుంటుంది. సినిమాని ఎంటర్టైన్మెంట్ అనుకునే రోజులనుంచి పనిష్మెంట్ అనుకునే పరిస్థితికి నేటి సినిమాలు ఉంటున్నాయి. ఇక్కడ నేటి సినిమాలు అంటే అన్ని సినిమాలు అని అర్ధం కాదు. చాలా సినిమాలు అని భావించండి.
వందరోజులు సినిమా ఆడిన రోజులనుంచి వారం , పదిరోజులకే థియేటర్ నుంచి ఓటిటిలోకి సినిమాలు బదిలీ అవుతున్న స్థాయికి తెలుగు సినిమాలు పడిపోతున్నాయి. అలా పడిపోవడానికి పైరసీ ఒక కారణం అయితే సరైన కథలు లేకపోవడమే ప్రధాన కారణం.
అయితే గతం తో పోలిస్తే నేటి తెలుగు సినిమాల్లో టెక్నికల్ వాల్యూస్ బాగా పెరిగాయి. రాజమౌళి లాంటి దర్శకులు బాహుబలి వంటి భారీ బడ్జెట్ సినిమాలు తీసినా , వారణాసి వంటి సినిమాలు తీస్తున్నా పెరిగిన సాంకేతిక పరిజ్ఞానమే కారణం. బాలీవుడ్ తరహాకు ఏమాత్రం తగ్గని స్థాయిలో కొన్ని తెలుగు సినిమాలు ఉంటున్నాయి. ఇది నిజంగా అభినందించదగ్గ విషయం.
ప్రస్తుతం కధలకు కొరత ఉందనే విషయం గమనించే కొంతమంది దర్శకులు రైటర్స్ వర్క్ షాప్ లు కూడా నిర్వహిస్తున్నారు. ఈ దిశగా దర్శకులందరూ మరింత వర్క్ చేస్తే కొత్త కథలు పుట్టుకురావడంతో పాటు ఔత్సాహిక రచయిత , రచయిత్రులకు ఉపాధి దొరుకుతుంది. ఎప్పుడైతే పెరిగిన టెక్నాలజీకి సరైన కథలు తోడవుతాయో తెలుగు సినిమాలకు పూర్వ వైభవం వస్తుంది. ఇప్పటికీ చూడండి.. నూతన నటీనటులతో నిర్మిస్తున్న లో బడ్జెట్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్ కొడుతున్నాయి. దీనికి ప్రధాన కారణం కథా బలమే.
నేను పైన కొంతమంది నటీనటులను , ఆర్టిస్టులను మాత్రమే పేర్కొన్నాను. అలాంటి వాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారు. కాబట్టి ఎవరినైనా మెన్షన్ చేయడం మిస్ అయితే అన్యధా భావించవద్దు.
