కొరియన్ కనకరాజు (Korean Kanakaraju Movie Review) హర్రర్ కామెడీ థ్రిల్లర్ మూవీ రివ్యూ !

Spread the love

వరుణ్ తేజ్ , రితికా నాయక్ జంటగా నటించిన కొరియన్ కనకరాజు ( Korean Kanakaraju movie ) ఆగస్టు 7 , 2026 న థియేటర్లలో రిలీజ్ అయి సందడి చేస్తుంది. సాయిబాబు జాగర్లమూడి నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాకి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించారు.

కొద్ది విరామం తర్వాత మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తిరిగి వెండితెరమీద సందడి చేయడానికి రావడంతో అటు అభిమానుల్లోనూ , ఇటు సినీ ఇండస్ట్రీలోనూ అంచనాలు ఏర్పడ్డాయి. మరి అందరి అంచనాలను కొరియన్ కనకరాజు అందుకున్నాడా ? లేదా ? అనేది ఇప్పుడు చూద్దాం.

కధేంటంటే ?

కొరియాలో జరిగిన ఒక ఆక్సిడెంటులో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి అస్థికలు ఉన్న కొరియన్ కుండ అనుకోకుండా అనంతపురం జిల్లా పెనుకొండకు చేరుకోవడంతో కథ మొదలౌతుంది.
కట్ చేస్తే ,
అనంతపురం జిల్లా పెనుకొండకు చెందిన కనకరాజు ( వరుణ్ తేజ్ ) చెక్కభజన బృందాన్ని నిర్వహిస్తుంటాడు. కనకరాజు అన్నయ్య పృథ్వి ( అవసరాల శ్రీనివాస్ ) మాత్రం తాను తమ్ముడిలా చెక్కభజనలు చేయలేనని , ఏదైనా బిజినెస్ చేసి డబ్బులు సంపాదిస్తానని చెప్పి పదిలక్షలు అప్పు తీసుకుని ఇంటినుంచి వెళ్ళిపోతాడు. ఇక కనకరాజు స్నేహితుడు కిష్టప్ప ( సత్య ) పెనుకొండలో ఫోటో స్టూడియో నడుపుతూ ఉంటాడు. ఊళ్ళోనే ఉండే చెంగారెడ్డి ( సునీల్ ) గ్యాంగుతో కనకరాజుకు గొడవలు జరుగుతుంటాయి.

ఇదిలా ఉండగా పెనుకొండకు దగ్గర్లో ఉన్న కియా కార్ల ఫ్యాక్టరీలో పనిచేస్తున్న చైత్ర ను ( రితికా నాయక్ ) కనకరాజు ప్రేమిస్తాడు. కానీ చైత్రకు మాత్రం తాను కొరియాలో స్థిరపడి కొరియన్ ను పెళ్ళిచేసుకోవాలని కోరిక.

చైత్రతో కనకరాజు ప్రేమ వ్యవహారం నడుస్తుండగానే ఓ రోజు బార్ లో చెంగారెడ్డి గ్యాంగుతో కనకరాజుకు గొడవ జరుగుతుంది. ఈ గొడవలో కనకరాజు బార్ కౌంటర్లో ఉన్న కొరియన్ కుండలో లిక్కర్ పోసుకుని తాగేస్తాడు. కానీ ఆ కొరియన్ కుండలోని ద్రవం తాగడంతో కనకరాజు ప్రవర్తనలో విపరీతమైన మార్పులు వస్తాయి.

కొరియాలో మరణించిన వ్యక్తి ఆత్మ కనకరాజు శరీరంలో ప్రవేశించిందని తెలుసుకుంటారు. ఆ ఆత్మ కోరిక ప్రకారం కనకరాజు , చైత్ర , కిష్టప్పలతో కలిసి కొరియా వెళ్లాల్సి వస్తుంది.

కొరియా వెళ్లిన కనకరాజు బృందానికి అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదురౌతాయి?
కొరియా ఆత్మ కనకరాజు శరీరంలోకి ఎందుకు ప్రవేశించింది?
అసలు ఆ ఆత్మ గతం ఏంటి?
తన శరీరంలో చేరిన కొరియన్ ఆత్మ నుంచి కనకరాజు ఎలా బయటపడతాడు? అనేది మిగిలిన కథ.

ఎలా ఉంది?

ఈ సినిమా ఎలా ఉందో చెప్పుకోవాలంటే కథని మనం రెండు భాగాలుగా విడగొట్టుకోవాలి. మొదటిభాగంలో చెక్కభజన కనకరాజును చూస్తాం. రెండో భాగంలో కొరియన్ కనకరాజును చూస్తాం. మొదటిభాగంలో పెనుకొండను , రాయలసీమ యాసను చూస్తాం. రెండో భాగంలో కొరియాను , అక్కడ తెలుగులో మాట్లాడే కొరియన్లను చూస్తాం. ఇక్కడ మొదటి భాగం , రెండో భాగం అంటే ఫస్టాఫ్ , సెకండాఫ్ లు అని అర్ధం చేసుకోవాలి.

ఫస్టాఫ్ లో కనపడే కనకరాజు తల్లితండ్రులు , చెంగారెడ్డి గ్యాంగ్ , చెక్కభజన బృందం , సెకండాఫ్ లో కనిపించరు. ఒకరకంగా చెప్పాలంటే ఒకే టికెట్ మీద రెండు సినిమాలు చూడటం అన్నమాట. అయితే దర్శకుడు రాసుకున్న అసలు కథ సెకండాఫ్ అయ్యుంటుంది. ఎందుకంటే టైటిల్ ప్రకారం అసలు స్టోరీ సెకండాఫ్ లోనే నడుస్తుంది. నిజానికి ఇదే కథను దర్శకుడు పెనుకొండలోనే నడపొచ్చు. కానీ కొరియన్ టచ్ ఇవ్వడమనేదే ఈ కధకు ప్రధానబలం అవుతుంది. ఆ పరంగా దర్శకుడు స్క్రిప్ట్ వర్క్ బాగానే ప్లాన్ చేసుకున్నారు. అలాకాకుండా ఇదే కథను పెనుకొండలో నడిపితే ఏమౌతుంది? రొటీన్ స్టోరీ అవుతుంది. కాబట్టి దర్శకుడు కొరియా నేపధ్యాన్ని ఎంచుకోవడం సరైన ఛాయిస్.

అయితే ఇదొక హర్రర్ థ్రిల్లర్ స్టోరీ మాత్రమే అయితే దర్శకుడి మీద ఎక్కువ భారం పడేది కాదు. కానీ దర్శకుడు దీనికి కామెడీ టచ్ ఇవ్వాలనుకున్నాడు. నిజానికి ఇది కఠినమైన టాస్క్. సీరియస్ టోన్ లో సాగే కధనంలో కామెడీని పండించాలంటే సన్నివేశాలు సింక్ అవ్వాలి. ఆ సన్నివేశం కామెడీని డిమాండ్ చేయాలి. లేకపోతే కామెడీ కోసం సన్నివేశాలను ఇరికించినట్టు అవుతుంది. ఆ కామెడీ కూడా మోతాదు మించకుండా ఎక్కించాలి. పొరపాటున డోస్ ఎక్కువైందో ఆ ప్రభావం అసలు కథ మీద పడే అవకాశం ఉంటుంది. ఈ సినిమాలో జరిగింది అదే.

ఇప్పుడు సినిమాలో కామెడీ గురించి చెప్పుకునేముందు ఫస్టాఫ్ , సెకండాఫ్ ల గురించి ఒకసారి చెప్పుకుందాం. ఈ సినిమా ప్రారంభంలో ప్రతి క్యారక్టర్ కు ఒక్కో పోర్టుఫోలియో ఇచ్చారు. కనకరాజుకు చెక్కభజన బృందం , కిష్టప్పకు ఫోటో స్టూడియో , చైత్రకు కియా ఫ్యాక్టరీలో ఉద్యోగం , చెంగారెడ్డి గ్యాంగ్ కనకరాజుతో ఫైటింగులు చేసే పని అప్పచెప్పారు. అయితే వీళ్ళలో చెంగారెడ్డి గ్యాంగ్ మాత్రమే దర్శకుడు తమకు అప్పచెప్పిన పనిని శ్రద్దగా చేసుకుని హీరో చేతిలో తన్నులు తిన్నారు. కనకరాజు చెక్కభజనలు చేసిందిలేదు .. కిష్టప్ప ఫోటోలు తీసింది లేదు .. కాబట్టి ఫస్టాఫ్ పాత్రల ఇంట్రడక్షన్ కి మాత్రమే పనికొస్తుంది. దానికి తోడు వరుణ్ తేజ్ , సత్యలు చేసే కామెడీ మనకు నవ్వులను పంచుతాయి.

ఇప్పుడు సెకండాఫ్ గురించి చెప్పుకుందాం. ఎప్పుడైతే హీరోతోపాటు మనం కూడా కొరియా వెళ్తామో కధనం యాక్షన్ థ్రిల్లర్ మోడ్ లోకి టర్న్ తీసుకుంటుంది. ఈ టర్నింగ్ మనకు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. హీరో బృందం కొరియా వెళ్లిన తర్వాత తన శరీరంలో ఉన్న ఆత్మ ఎవరో తెలియడం , అక్కడ వరుణ్ తేజ్ యాక్షన్ హీరోగా మారడం , కొరియన్ ఆర్టిస్టుల మధ్య సత్య , వీటివి గణేష్ లు సందడి చేయడంతో కొంచం సరదాగానూ , కొంచం థ్రిల్లింగ్ గానూ కధనం పరుగులు పెడుతుంది.

ఇప్పుడు ఫస్టాఫ్ , సెకండాఫ్ కామెడీ పోర్షన్ గురించి చెప్పుకుందాం. ఫస్టాఫ్ అయినా , సెకండాఫ్ అయినా సరే కామెడీ చేయడమే తన పని సత్య ఫిక్స్ అయిపోయాడు. అందుకే తనదైన కామెడీ టైమింగుతో సత్య దూసుకుపోయాడు. అయితే సత్యని ఎప్పుడు వాడుకోవాలి అనే టైమింగులో దర్శకుడు తడబడ్డాడు. ఫస్టాఫ్ లో సత్య కామెడీ చేయడం అప్పటి కధకు అవసరం. ఇక సెకండాఫ్ లో వరుణ్ తేజ్ పూర్తిగా స్టీరింగుని తన చేతుల్లోకి తీసుకోవడం ఇప్పటి కధకు అవసరం.

కొరియాలో సత్య క్షుద్ర పూజకు కూర్చోవడం , అతడి తండ్రి వీడియో కాల్ లో మంత్రాలు చదివించడం , మధ్యలో నెట్ వర్క్ ఆగిపోయి కొరియన్ దయ్యాలు వచ్చేయడం లాంటి సీన్లను స్మూత్ కామెడీ కేటగిరీలో వేయలేం. ఈ సీన్ లో మోతాదు ఎక్కువ అవడంతో కొంచం ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. ఇక వీటివి గణేష్ , బుల్లిరాజులతో చేయించిన కామెడీ బాగానే ఉంది.

ఇక సినిమా అంతా ఒకెత్తు .. క్లైమాక్స్ మాత్రం ఇంకోకెత్తు . అప్పటిదాకా నడిపిన హర్రర్ కామెడీ థ్రిల్లర్ జానర్ నుంచి దర్శకుడు ఫాంటసీ జోన్ లోకి వచ్చేసారు. భీభత్సమైన బీజీఎమ్ తో , గత్తరలేచిపోయే గ్రాఫిక్స్ తో రెండు ఆత్మలు గాల్లో కొట్టుకునే సన్నివేశాలు చూస్తుంటే అసహజంగా అనిపిస్తాయి. దానికితోడు కనకరాజు శరీరంలోనుంచి కొరియన్ ఆత్మను పంపేయడానికి కిష్టప్ప తండ్రి మురళీధర్ గౌడ్ రెండు సీసాలతో కొరియా చేరుకోవడం , అక్కడ స్మశానంలో చేసే క్రతువు మోతాదు శృతిమించినట్టు అనిపిస్తుంది.

కామెడీ విషయంలో అయినా ప్రేక్షకులు లాజిక్కులు పట్టించుకోవడం మానేస్తారేమో కానీ ఇలాంటి సన్నివేశాల్లో మాత్రం ఖచ్చితంగా జస్టిఫికేషన్ వెతుకుతారు. దర్శకుడు ముగింపును కూడా జాగ్రత్తగా ప్లాన్ చేసి ఉంటే ఫలితాలు ఇంకా బాగుండేవి.

ఎవరెలా చేసారు?

ఒకే మనిషి రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలు చేయడం ఛాలెంజింగ్ టాస్క్ లాంటిది. ఈ టాస్క్ ను వరుణ్ తేజ్ బాగానే పూర్తిచేసాడు. ఫస్టాఫ్ లో పెనుకొండ కనకరాజుగా , సెకండాఫ్ లో కొరియన్ కనకరాజుగా వరుణ్ తేజ్ నటన బాగుంది కానీ సెకండాఫ్ లో అతడి క్యారక్టర్ కు ఇంకా స్కోప్ పెరగడంతో , దాన్ని ఆయన బాగానే వాడుకుని పాత్రకు న్యాయం చేసారు.

ఇక హీరోయిన్ రితికా నాయక్ తెలుగు డబ్బింగ్ కన్నా కొరియన్ భాషలో మాట్లాడటమే బాగుంది. ఆమె డబ్బింగ్ ఇంకొంచం ఇంప్రూవ్ చేసి ఉంటే బాగుండేది. అలాగే ఆమె నటన బాగుంది కానీ ఆ పాత్రకు స్కోప్ తక్కువగా ఉండటం లోటుగా అనిపిస్తుంది.

ఇప్పుడు సత్య గురించి చెప్పుకోవాలి. కొరియన్ కనకరాజుని తన భుజాల మీద వేసుకుని నడిపించాడు. కామెడీ టైమింగులో తనదైన శైలిలో దూసుకుపోయాడు.

వీటివి గణేష్ , బుల్లిరాజుల కామెడీ కూడా బాగుంది.
అవసరాల శ్రీనివాస్ పాత్రకు పెద్దగా స్కోప్ దక్కలేదు.

కమెడియన్ గా ఉన్నప్పుడే సునీల్ నటన బాగుండేది. ఎందుకో సునీల్ నెగిటివ్ షేడ్స్ లో సరిగా సెట్ కాలేదనిపిస్తుంది. ఎప్పుడు చూసినా ఒకేరకమైన ఎక్స్ప్రెషన్స్ ఇస్తుండటంతో మొనాటనీ వచ్చేసింది.

సాంకేతికత

ఎస్ ఎస్ థమన్ బీజీఎమ్ గురించి కొత్తగా చెప్పుకునేది ఏముంది? వాయించిపారేసారు .. నిజానికి ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ బలం అవుతుంది.
మనోజ్ రెడ్డి సినిమాటోగ్రఫీ కూడా బాగానే ఉంది.
నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.

విశ్లేషణ

కొరియన్ కనకరాజు మూవీలో ప్రధమార్థం గురించి చెప్పుకోవాలంటే కొత్త విషయం ఏమీ ఉండదు. రొటీన్ కమ్మర్షియల్ ఫార్మాట్లో కధనం సాగుతుంది. ఇక ద్వితీయార్థం లోకి వచ్చేసరికి స్టోరీ యాక్షన్ డ్రామాలోకి టర్న్ అయి పరుగులు పెడుతుంది. రెండు భాగాల గురించి చెప్పాలంటే ఫస్టాఫ్ కన్నా సెకండాఫ్ లో అసలు కథలోకి రావడంతో ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది.

కొరియన్ కనకరాజు హర్రర్ కామెడీ థ్రిల్లర్ జానర్ మూవీ ..ఇందులో హర్రర్ , థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఒకట్రెండు చోట్ల మినహా బాగానే కుదిరాయి. ఇకపోతే కామెడీ కూడా బాగానే ఉందికానీ ఒకట్రెండు చోట్ల శృతిమించినట్టు అనిపిస్తుంది. అయితే కామెడీలో లాజిక్కులు వెతుక్కోకూడదు .. నవ్వామా ? లేదా ? అనే ఫార్ములా ఫాలో అయ్యేటట్లయితే ఇందులో కామెడీ నచ్చుతుంది. కామెడీలో కూడా లాజిక్కులు వెతికేవారికి మాత్రం ఎబ్బెట్టుగా అనిపిస్తుంది.

నటీనటులు : వరుణ్ తేజ్ , రితిక నాయక్ , సత్య , మురళీధర్ గౌడ్ , అవసరాల శ్రీనివాస్ , సునీల్ తదితరులు.
సంగీతం : ఎస్ ఎస్ థమన్
సినిమాటోగ్రఫీ : మనోజ్ రెడ్డి
నిర్మాత : సాయిబాబు జాగర్లమూడి
దర్శకత్వం : మేర్లపాక గాంధీ
విడుదల 🙁 07-08-2026 )
రేటింగ్ : 2 .75 / 5


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!