ఓటిటిలోకి వచ్చిన సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ వదలా (Vadala Movie Review) ఎలా ఉందంటే ? – మూవీ రివ్యూ !

Spread the love

జగపతిబాబు , లయ ప్రధాన పాత్రల్లో నటించిన సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ వదలా (Vadala Movie ) ఆగస్టు 14 నుంచి ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కి వచ్చింది . జులై 17 న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ నెలతిరిగేలోపలే ఓటిటిలోకి వచ్చేసింది .

చాన్నాళ్ల తర్వాత జగపతిబాబు , లయ కలిసి వదలా మూవీలో నటించారు . ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ నిర్మించగా , ఆకెళ్ళ వి కృష్ణ దర్శకత్వం వహించారు . ఇప్పుడు వదలా మూవీ ఎలా ఉందో చూద్దాం .

కధేంటంటే ?

డాక్టర్ యోగి సిద్దార్థ్ ( జగపతిబాబు ) తన భార్య ప్రియ (లయ ) , పిల్లలు అప్పు , చింటులతో హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తుంటాడు . అయితే అతడి జీవితంలోకి ఆముద ( హృతిక శ్రీనివాస్ ) అనే అమ్మాయి రావడంతో కుటుంబ సమస్యలతో ఇబ్బందులు పడుతుంటాడు .

ఆముద డాక్టర్ యోగి జీవితంలోకి రావడం కూడా ఆక్సిడెంటల్ గా జరుగుతుంది . ఓరోజు డాక్టర్ యోగి కారులో హాస్పిటల్ కు వెళ్తున్నప్పుడు దారిలో ఆక్సిడెంట్ అయిన కారులో ఆముద కనిపిస్తుంది . ఇది చూసిన యోగి ఆ అమ్మాయిని తన హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ ఇప్పిస్తాడు . హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన ఆముద యోగి ఎదుటి ఫ్లాట్ లోనే దిగి అతడి ఫ్యామిలీకి కూడా దగ్గరౌతుంది .

అయితే ఆముద పరిచయమైనప్పటినుంచి యోగి ఫ్లాట్ లో విచిత్రమైన సంఘటనలు జరుగుతుంటాయి . పేరులేని అజ్ఞాత వ్యక్తులనుంచి ఫ్లవర్ బొకేలు , పెయింటింగులు రావడం మొదలుపెడతాయి . గుర్తు తెలియని నంబర్ నుంచి యోగి ఫోనుకు యు ఆర్ మై వరల్డ్ అనే వాట్సాప్ మెసేజులు రావడం మొదలుపెడతాయి .

దీంతో ప్రియ తన భర్త వేరే అమ్మాయితో రిలేషన్లో ఉన్నాడేమో అని అనుమానపడుతుంది . కానీ యోగి మాత్రం తనకు ఎవరినుంచి మెసేజులు వస్తున్నాయో తెలీదంటాడు . ఇదిలా ఉండగా పదేళ్ల క్రితం జరిగిన సిలిండర్ పేలుడు ప్రమాదంలో నివాస్ ( అవసరాల శ్రీనివాస్) తన భార్య , పిల్లలతో అనుమానాస్పదంగా మరణించడంతో ఇన్స్పెక్టర్ పద్మాకర్ ( రవి వర్మ ) ఆ కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తుంటాడు .

యోగి జీవితంలోకి ప్రవేశించిన ఆముద గతం ఏంటి ?
సిలిండర్ పేలుడు కేసులో ఇన్స్పెక్టర్ పద్మాకర్ ఏం తెలుసుకుంటాడు ?
ఆ కేసుకు , ఆముదకు ఉన్న లింక్ ఏంటి ?
ఆముద రాకతో యోగి ఫ్యామిలీలో ఏం జరుగుతుంది ? అనేది మిగిలిన కథ .

ఎలా ఉంది ?

సినిమా ఎలా ఉందో చెప్పే ముందు ఇంకొక విషయం కూడా చెప్పాలి . అదేంటంటే ఈ మూవీలో యు ఆర్ మై వరల్డ్ అనే వాక్యం చాలాసార్లు వినాల్సివస్తుంది . రిపీటెడ్ గా ఈ వాక్యం రావడం వెనుక అసలు కథ తెలియాలంటే మనం క్లైమాక్స్ దాకా మూవీని చూడాలి . అసలుకు దర్శకుడు ఈ వాక్యంతోనే మూవీని మొదలెడతాడు . కాకపోతే యోగి (జగపతిబాబు) తన భార్య మాత్రమే తన ప్రపంచం అనుకుంటాడు . కానీ ఆముద ( హృతిక శ్రీనివాస్ ) అనే అమ్మాయి మాత్రం జగపతిబాబునే తన ప్రపంచం అనుకుంటుంది . అలా అనుకోవడంతోనే యోగి జీవితంలో చిక్కులు వస్తాయి .

ఇక ఈ సినిమా మొదటి గంటలోనే మనకు మూడు ఉప కధలు ఎదురౌతాయి . మొదటి ఉప కధలో జగపతిబాబు , భార్య , తండ్రి , పిల్లలు ఈ ఐదు క్యారెక్టర్ల చుట్టూ ఒక కథ నడుస్తుంది . ఈ ఐదు క్యారెక్టర్లకు ఆముద అనే ఇంకో క్యారక్టర్ తోడవుతుంది .

రెండో ఉపకథలో అవసరాల శ్రీనివాస్ క్యారక్టర్ ఎంటర్ అవుతుంది . జగపతిబాబుకి ఫ్యామిలీ అంటే ఎంతిష్టమో ఇతడికి తన కూతురంటే అంతిష్టం .

ఇక మూడో ఉప కధలో ఒక ఇన్స్పెక్టర్ పదేళ్ల క్రితం జరిగిన సిలిండర్ పేలుడు కేసును ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటాడు . ఈ మూడు ఉపకథలు క్లైమాక్సులో అసలు కథలోకి కలుస్తాయి. దర్శకుడు తాను చెప్పాలనుకున్న పాయింటును నేరుగా చెప్పకుండా ఈ మూడు లింకులను కలుపుతూ చెప్పడానికి ప్రయత్నించడంతో చాలాసేపటివరకు అసలు కధేంటో మనకు తెలియక కన్ఫ్యూజ్ అవుతాము .

జగపతిబాబు వంటి సీనియర్ నటుడి పాత్రను దర్శకుడు సరిగా ఎస్టాబ్లిష్ చేయలేదు అనిపిస్తుంది . ఆ పాత్ర స్వభావం ఏంటో అతడి భార్య లయతో పాటు చాలాసేపటి వరకు మనక్కూడా అర్ధం కాదు . ఒకపక్క భార్యతో నువ్వే నా ప్రపంచం అంటాడు . ఇంకోపక్క ఆముద అనే అమ్మాయితో అతిగా ప్రవర్తిస్తూ ఉంటాడు . ఒక డాక్టర్ గా హాస్పిటల్లో ఆముద ట్రీట్మెంట్ విషయంలో అతడి చొరవను అర్ధం చేసుకోవచ్చు . కానీ ఆ అమ్మాయి తన ఎదురు ఫ్లాట్ లో దిగితే ఫ్లయింగ్ కిస్సులు ఇవ్వడం , గిటార్ వాయించడం వంటి సీన్లు ఇరికించడంలో దర్శకుడి ఉద్దేశ్యం బహుశా ఇద్దరి రిలేషన్లో ఏదో ఉందని ప్రేక్షకులు కూడా అనుకోవాలని అయ్యుంటుంది .

దానికి తోడు భార్యతో యోగి చేసే రొమాన్స్ కొంచం ఓవర్ అయినట్టు అనిపిస్తుంది . రొమాన్స్ అంటే అశ్లీలం అని అర్ధం కాదు . లేటు వయసులో ఘాటు ప్రేమ అంటారే .. అది . సరే భార్యతో యోగి రొమాన్స్ సంగతి అటుంచితే ఆముద అనే క్యారక్టర్ ఎంటర్ అయిన గంట తర్వాత కూడా ఆ అమ్మాయి యు ఆర్ మై వరల్డ్ అంటూ జగపతిబాబు వెంట ఎందుకు పడుతుందో దర్శకుడు రివీల్ చేయకపోవడంతో ప్రేక్షకుల సహనానికి పరీక్ష ఎదురౌతుంది . ఒకే వాక్యాన్ని పదేపదే రిపీట్ చేస్తే థ్రిల్ అవుతుందనుకున్నారేమో కానీ ఇంకేదో అయ్యింది. దానికి తోడు అదోరకమైన జబ్బుతో అసలు ఎక్స్ప్రెషన్స్ ఇవ్వలేని ప్రియ తండ్రి జెన్నీని చంపాలని ఆముద ప్రయత్నించడం కధనాన్ని సాగతీయడానికి పనికొస్తుందే కానీ అసలు కధకి ఆ సీన్లు అవసరం లేదేమో అనిపిస్తుంది .

ఇక ఆ ఇన్స్పెక్టర్ పరిస్థితి చూస్తే మాత్రం ఎవరైనా జాలి పడాల్సిందే . ఈ మూవీలో ఇన్స్పెక్టర్ క్యారక్టర్ కు మంచి స్కోప్ ఉంది కానీ అది సరిగా ఎస్టాబ్లిష్ కాలేదు . పదేళ్ల క్రితం కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ఇన్స్పెక్టర్ అని ఆ పాత్రకు మంచి ఎలివేషన్లు ఇచ్చారు కానీ ఆముద కొట్టిన ఒకేఒక్క దెబ్బకు తలపగిలి కింద పడుకుంటాడు . కానీ ఆశ్చర్యం ఏంటంటే తలపగిలి బోలెడు రక్తం కారిన ఆ ఇన్స్పెక్టర్ పాత్ర ముగిసిపోయుంటుంది అని మనం అనుకుంటే తిరిగి లేచి కూర్చుంటాడు . కానీ ఆ ఇన్స్పెక్టర్ తిరిగి లేవడమే మంచిదైంది . ఎందుకంటే ఆముద యు ఆర్ మై వరల్డ్ అంటూ యోగి వెంట ఎందుకు పడుతుందో ఫైనల్గా మనక్కూడా తెలుస్తుంది .

సరే , చివరికి ఆముద గతం మనకి తెలిసిపోతుంది . దర్శకుడు ఒక ట్విస్టుతో ఆ పాత్రను ముగిద్దామని ప్లాన్ చేసుకున్నట్టున్నారు . కానీ ఆయన ఇచ్చిన ట్విస్ట్ చూస్తే సినిమాలో జగపతి క్యారక్టర్ తో పాటు మనమూ షాక్ అవుతాం . యు ఆర్ మై వరల్డ్ అంటూ ఆముద యోగి వెంట ఎందుకుపడుతుందో అప్పటికికానీ మనకు అర్ధం కాదు . చివరికి అర్ధమైన తర్వాత ఆముద యోగిని అలాంటి రిలేషన్ తో ఎలా ఊహించుకుందో మనకి అర్ధం కాదు . పైగా సైకలాజికల్ ప్రాబ్లమ్ అంటూ దర్శకుడు ఇచ్చిన క్లైమాక్స్ ట్విస్ట్ మనకు కన్విన్సింగ్ గా అనిపించదు .

ఎవరెలా చేసారు ?

ఏజ్ పెరుగుతున్నకొద్దీ జగపతిబాబు ఫిట్నెస్ కూడా పెరుగుతున్నట్టుంది . ఆ విషయం హృతిక శ్రీనివాస్ తో జగపతిబాబు చేసిన సాంగ్ చూస్తే అర్థమైపోతుంది . కానీ దర్శకుడు జగపతిబాబు నుంచి పూర్తిస్థాయి నటన రాబట్టుకోలేదు అనిపిస్తుంది .
లయ ఎప్పటిలానే సహజంగా నటించింది .

ఇక నెగిటివ్ షేడ్ ఉన్న ఆముద పాత్రలో హృతిక శ్రీనివాస్ నటన బాగుంది .పాత్రకు తగ్గట్టుగా హావభావాలను ప్రదర్శించింది .

ఇన్స్పెక్టర్ పద్మాకర్ గా రవివర్మ నటన బాగానే ఉంది కానీ అతడి పాత్రకు స్కోప్ దక్కలేదు . అవసరాల శ్రీనివాస్ పరిస్థితి కూడా అంతే .

సాంకేతికత

కార్తీక్ కొడకండ్ల అందించిన సంగీతం బాగుంది .
ఇక చోటా కె నాయుడి కెమెరా పనితీరు గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు . ఈ మూవీలో కూడా ఆ క్వాలిటీ కనిపించింది .
నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి .

విశ్లేషణ

ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ . ఈ జానర్లో తీసే మూవీల్లో ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే అప్పటిదాకా క్యారక్టర్ చేసే విచిత్రమైన పనులకు సైకలాజికల్ ప్రాబ్లమ్ అని క్లైమాక్సులో చెప్పేయొచ్చు . ఓహో ఇంతసేపు ఆ క్యారక్టర్ ఇలా చేసిందంటే సైకలాజికల్ ప్రాబ్లమ్ కారణమా ? అని ప్రేక్షకులు అనుకోవడానికి అవకాశం ఉంటుంది .

కానీ ఈ మూవీలో కూడా ఆముద పాత్ర అలా ప్రవర్తించటానికి సైకలాజికల్ ప్రాబ్లమ్ అని దర్శకుడు పాయింట్ రాసుకోవడం కొంతవరకు కన్విన్సింగ్ గా అనిపించవచ్చు కానీ క్లైమాక్సులో ఆ పాత్ర జగపతిబాబును ఉద్దేశించి ఊహించుకున్న విధానం కన్విన్సింగ్ గా అనిపించదు .

సైకలాజికల్ థ్రిల్లర్ జానర్ మూవీలు చూడటానికి ఇష్టపడేవారు వన్ టైమ్ వాచ్ మూవీకింద అమెజాన్ ప్రైమ్ లో చూడొచ్చు .

నటీనటులు : జగపతిబాబు , లయ , అవసరాల శ్రీనివాస్ , హృతిక శ్రీనివాస్ , రవివర్మ , జెన్నీ తదితరులు
సంగీతం : కార్తీక్ కొడకండ్ల
సినిమాటోగ్రఫీ : చోటా కె నాయుడు
నిర్మాత : తమ్మారెడ్డి భరద్వాజ
దర్శకత్వం : ఆకెళ్ళ వి కృష్ణ
విడుదల : అమెజాన్ ప్రైమ్ ( 14 -08-2026 )
రేటింగ్ : 2.5 / 5


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!