వైశాఖ్ రవి , నేహఛావ్లా ప్రధాన పాత్రలో నటించిన మలయాళం హర్రర్ థ్రిల్లర్ మూవీ అరూపి (Aroopi movie ) ఆగస్టు 14 , 2026 నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చింది . జులై 3 న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ మిక్సెడ్ రెస్పాన్స్ తెచ్చుకుంది .
వంద ఏళ్ళక్రితం చెక్కపెట్టెలో బంధించిన ఆత్మ బయటకువస్తే ఎలాంటి పరిణామాలు జరుగుతాయి అనే లైన్లో దర్శకుడు స్టోరీ రాసుకుని తెరకెక్కించారు .
ఇప్పుడు అరూపి మూవీ ఎలా ఉందో చూద్దాం .
కధేంటంటే ?
ఆర్యనాట్టు వంశంలో వందయేళ్ళక్రితం జరిగిన ఒక సంఘటన గురించి చెప్పడంతో సినిమా మొదలౌతుంది . ఇదే రాజవంశానికి చెందిన పద్మిని రాజవంశీకుడైన సూర్యన్ నంబూద్రితో ప్రేమలో పడుతుంది . కానీ వీరి ప్రేమ ఇష్టంలేని కుటుంబీకుడు ఆమెను గొంతునులిమి చంపేస్తాడు .
దాంతో తన కోరిక నెరవేరని పద్మిని ఆత్మ ఆక్రోశంతో రగిలిపోతుండటంతో అనర్దాలు జరుగుతున్నాయని ఆమె ఆత్మను ఒక చెక్కేపెట్టెలో బంధిస్తారు . తరతరాలుగా ఆ భవనంలో నివాసం ఉన్న రాజవంశీకులు ఆ చెక్కపెట్టె జోలికి మాత్రం వెళ్ళరు .
ఇదిలా ఉండగా ఆ రాజవంశంలో చివరివాడైన నిరంజన్ కి ( వైశాఖి రవి ) తనని ఎవరో పిలుస్తున్నట్టు , ఎవరో తనని ఫాలో అవుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది . బహుశా తమ వంశంలో పగతో రగిలిపోతున్న పద్మిని ఆత్మ పనే అయ్యుంటుంది అనుకుని స్వగ్రామంలో ఉన్న తమ పూర్వీకుల పురాతన భవనానికి వెళ్తాడు .
అప్పటికే ఆ భవనంలో ఇద్దరు దొంగలు జొరబడి ఆ చెక్కపెట్టెను తెరవడంతో అందులో ఉన్న ఆత్మ బయటికి వస్తుంది .
పగతో రగిలిపోతున్న పద్మిని ఆత్మ ఏం చేస్తుంది ?
పూర్వీకుల భవనంలోకి అడుగుపెట్టిన నిరంజన్ కు ఎటువంటి అనుభవాలు ఎదురౌతాయి ?
చివరికి ఏం జరుగుతుంది ? అనేది మిగిలిన కథ .
ఎలా ఉంది ?
హర్రర్ జానర్ మూవీ అనగానే దయ్యాలు , ఆత్మల కధే అని చాలామందికి అర్ధమయ్యే ఉంటుంది . ఈ జానర్ మూవీల్లో ప్రేక్షకులను భయపెట్టాలంటే దర్శకుడు స్క్రీన్ ప్లే మ్యాజిక్ చేయాలి . ఏసీ థియేటర్లో కూడా ప్రేక్షకులకు ముచ్చెమటలు పట్టించేలా కధనం ఉండాలి . బాపురే .. నెక్స్ట్ సీన్ ఎలా ఉంటుందో అని ఎగ్జైట్ అయిపోయి ప్రేక్షకుడు టెన్షన్ తో గోళ్లు కొరికేసుకోవాలి . అప్పుడే దర్శకుడు ఆశించిన వ్రతఫలం దక్కుతుంది . ఇలా హర్రర్ మూవీలు తీసి ప్రేక్షకులను భయపెట్టిన దర్శకుల లిస్ట్ చాలా ఉంది .
అయితే కొంతమంది దర్శకుల తీరు డిఫరెంటుగా ఉంటుంది . ప్రేక్షకులను భయపెట్టడం సంగతి అటుంచి సినిమా ఎటుపోతుందో తెలియక వాళ్ళు భయపడతారు . ఆ భయంలో ఎక్కడ మొదలెట్టామో .. ఎక్కడ ముగించామో తెలియక ఒళ్ళంతా చెమటలు పెట్టేసుకుంటారు . అలాంటి హర్రర్ మూవీలు చూస్తున్న ప్రేక్షకులు మాత్రం దర్శకుడు ఎలాగూ దొరకడు కాబట్టి కనీసం ఆ దయాన్నైనా గొంతుపిసికి చంపేద్దామన్నంత కోపంతో రగిలిపోతారు . సినిమాలో తాము చూస్తున్నది దయ్యామో ? మనిషో ? అర్థంకాక బిపి బంతిని అమాంతం పిసికేస్తారు .
మన విఠలాచార్య టైములో దయ్యాన్ని చూసి పిల్లలు జడుపు జ్వరాలు తెచ్చుకుని అక్కడే భయపడేవాళ్లు .. పెద్దవాళ్ళు పక్కకెళ్లి చాటుగా భయపడి పరువు కాపాడుకునేవాళ్ళు . అంటే సినిమా దయ్యాన్ని చూసి భయపడేలా ఆర్టిస్టుకు మేకప్పులు చేసేవాళ్ళు . ఆ క్యారెక్టర్లను పర్ఫెక్ట్ గా డిజైన్ చేసేవాళ్ళు . అప్పట్లో లైట్లేసుకుని సినిమాలు చూసిన రోజులు కూడా ఉన్నాయి . ఇప్పుడేమో ఇంతోటిదానికి లైట్లు కూడానా ? కరెంట్ దండగ అనుకుని మొత్తం లైట్లు బంద్ చేసి పాప్ కార్న్ తింటూ హర్రర్ సినిమాలు చూసేస్తున్నాం .
అవి ఓల్డ్ జి దయ్యాలన్నమాట . ఇప్పుడు జెనెరేషన్స్ మారిపోయాయి కాబట్టి దర్శకులు లేటెస్ట్ దయ్యాలను తయారు చేసి జనాల మీదికి వదులుతున్నారు . ఈ దయ్యాలను చూసి ఎంత ట్రై చేసినా ప్రేక్షకులు భయపడలేకపోతున్నారు . సరే ప్రేక్షకులు ఎలాగూ భయపడటం లేదు . కనీసం ఆర్టిస్టులైనా భయపడాలి కదా ? భయపడకపోగా దయ్యాలతో డ్యూయెట్లు పాడేస్తున్నారు . రొమాన్స్ చేసేస్తున్నారు .
సరే , ఇప్పుడు ఈ సినిమా విషయానికి వస్తే ఇందులో కూడా ఒక దయ్యం ఉంటుంది . కంగారుపడకండి .. ఈ దయ్యం మనుషుల్లానే ఉంటుంది .. అందరికీ కనపడుతుంది కూడా . అందుకే దయ్యం హీరోతో లవ్ లో పడితే తప్పేంటి ? అని అనుకున్నారేమో చక్కగా దయ్యానికి , హీరోకి కలిపి ఒక చిన్న లవ్ ట్రాక్ కూడా పెట్టేసారు . ఇద్దరూ కలిసి అలా ఒక సాంగ్ కూడా పాడేసుకుంటారు .
అదేంటి దయ్యంతో హీరో డ్యూయెట్లు ఏంటి అనుకుంటున్నారా ? ప్రేక్షకులకు ఇలాంటి సందేహాలు వస్తాయనే దర్శకుడు ఒక మాంత్రికుడిని రంగంలోకి దింపి జగదేక వీరుడు .. అతిలోక సుందరి సినిమాలో శ్రీదేవి ఉంగరం తొడుక్కున్నట్టు ఇందులో కూడా దయ్యం ఉంగరం తొడుక్కుంటే మాయమైపోతుందని ఒక చిన్న ట్విస్ట్ పెడతాడు .
సరే సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసే హీరోగారికి దయ్యంతో కాకుండా తన ఆఫీసులోనే పనిచేసే సాక్షి అనే ఒక అమ్మాయితో కూడా లవ్ అఫైర్ ఉంటుంది . మళ్ళీ ఈ ట్రాక్ సెపరేట్ . వీళ్ళిద్దరికి కూడా ఒక సాంగ్ ఉంటుంది . ఇక ఆఫీసులో , ఇంట్లో నిరంజన్ డిస్ట్రబ్ గా ఉండటం , అతడు ఎందుకు అలా డిస్ట్రబ్ గా ఉంటున్నాడో తెలుసుకోవడం కోసం హీరోయిన్ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టడం కధనాన్ని సాగతీయడానికి బాగా పనికొచ్చాయి . ఇలా దాదాపు ఫస్టాఫ్ అంతా మనకు ఎలాంటి భయాలు లేకుండానే గడిచిపోతుంది .
ఇక సెకండాఫ్ లో అయినా ఆ దయ్యాన్ని చూసి భయపడదాం అనుకుంటే పద్మిని మనకా అవకాశం ఇవ్వలేదు . దయ్యం అందంగా ముస్తాబై హీరోతో కారులో షికార్లు కొట్టడంతో ఆనందబాష్పాలు వస్తాయి . మధ్యలో మనల్ని కడుపుబ్బా నవ్వించటానికి ఇద్దరు దొంగలు కూడా అటూఇటూ తిరుగుతుంటారు .
ఇక క్లైమాక్స్ అయితే మనీ సినిమాలో బ్రహ్మానందం , పోలీసులు దొంగా పోలీస్ ఆట ఆడుకున్నట్టు ఇందులో దయ్యంతో ఇద్దరు దొంగలు , ఒక ఇన్స్పెక్టర్ , కలిసి దొంగాపోలీస్ ఆట ఆడుకుంటారు . దానికితోడు అమ్రిష్ పురి టైపులో ఒక మాంత్రికుడు హాం ఫట్ అంటూ దయ్యం ముఖం మీద క్లైమాక్స్ పౌడర్ చల్లడంతో సినిమా ముగుస్తుంది .
ఓవరాల్ గా ప్రేక్షకులు ఊహించినంతగా ఆన్ స్క్రీన్ మీద దర్శకుడు స్టోరీని నేరేట్ చేయలేకపోయాడు అనిపిస్తుంది. కోట్ల విలువ చేసే పంచలోహ విగ్రహాలను కొట్టేయడానికి ఇద్దరు చిల్లర దొంగలు బయలుదేరడం , పురాతన భవనం కొలనులో మర్డర్ జరిగిందని వచ్చిన పోలీసులు మళ్ళీ చివర్లోనే దర్శనాలు ఇవ్వడం , దయ్యానికి , హీరోకి కెమిస్ట్రీ కలపాలని చూడటం , పాత సినిమాల్లో ఆల్రెడీ చూసేసిన క్లైమాక్సులనే దర్శకుడు ఫాలో అవడం ప్రేక్షకులకు థ్రిల్ పంచదు .
దయ్యం కథ రివీల్ అయిన తర్వాత కొత్తగా తెలుసుకోవడానికి ఏమీ లేకపోవడంతో స్టోరీ ప్రిడిక్టబుల్ గా నడుస్తుంది .
ఎవరెలా చేసారు ?
ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం చాలా కష్టం . కూల్ చేయాల్సిన హీరో భయపెట్టాడు . భయపెట్టాల్సిన దయ్యం కూల్ చేసింది .
అయినా ఈ సినిమాలో ఈ రెండు పాత్రలే ఎక్కువగా కనిపిస్తాయి కాబట్టి నిరంజన్ గా వైశాఖి రవి నటన పర్లేదు . దయ్యం నటన కూడా పర్లేదు అని చెప్పుకోవాలి .
సాంకేతికత
చతికిలపడిపోతున్న ఈ సినిమాని సంగీత దర్శకుడు గోపి సుందర్ తన మ్యాజిక్ తో కొంతవరకు లేపే ప్రయత్నం చేసాడు . ఆయన అందించిన బీజీఎమ్ బాగుంది .
అమల్ అందించిన సినిమాటోగ్రఫీ పర్లేదు .
విశ్లేషణ
హర్రర్ థ్రిల్లర్ జానర్ మూవీలు చూడటానికి చాలామంది ఇష్టపడతారు . సరైన దర్శకుడి చేతిలో సరైన కథ పడి స్క్రీన్ ప్లే మ్యాజిక్ చేస్తే ఏసీలు వేడెక్కిపోతాయి . లేకపోతే చప్పున చల్లారిపోతాయి .
ఈ మూవీకోసం దర్శకుడు రాసుకున్న స్టోరీ కొత్తదేమీ కాదు . కనీసం గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో మ్యాజిక్ చేస్తాడనుకుంటే అక్కడా డిజప్పాయింట్ చేసారు . ఫస్టాఫ్ లో సాక్షితో లవ్ ట్రాక్ నడిపిన దర్శకుడు సెకండాఫ్ లో హీరోయిన్ సంగతి మర్చిపోయి దయ్యంతో లవ్ ట్రాక్ నడిపారు . మళ్ళీ చివరికి హీరోయిన్ సంగతి గుర్తొచ్చి ఆమెను తెరమీదికి తీసుకొచ్చారు . ఇది ఎడిటింగ్ పొరపాటో , లేకపోతే స్టోరీ నేరేషన్ పొరపాటో తెలీదు కానీ మొత్తానికి పొరపాటు జరిగిందని తెలుస్తుంది . ముగింపులో ఆ దొంగా పోలీస్ ఆట కాస్త ఎక్కువైనట్టు అనిపిస్తుంది .
సినిమా చూడాలనుకునేవారు ఎలాంటి ఎక్స్పెక్టేషన్లు పెట్టుకోకుండా అమెజాన్ ప్రైమ్ లో మలయాళం వెర్షన్లో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ లో చూడాలి .
నటీనటులు : వైశాఖి రవి , నేహాచావ్లా తదితరులు
సంగీతం : గోపి సుందర్
సినిమాటోగ్రఫీ : అమల్
దర్శకత్వం : అభిలాష్ వారియర్
విడుదల : అమెజాన్ ప్రైమ్ ( 14-08-2026 )
రేటింగ్ : 1.5 / 5
