లెనిన్ సినిమా మీద నిర్మాత , దర్శకుల కన్నా హీరో అక్కినేని అఖిల్ ఎక్కువ ఆశలు పెట్టుకున్నాడు . ఎందుకంటే కొన్నేళ్లుగా సరైన బ్లాక్ బస్టర్ హిట్ లేక అఖిల్ కసి మీదున్నాడు. ఆ కసితోనే తన కెరీర్ లోనే మరే సినిమాకి కష్టపడనంతగా ఈ సినిమాకి కష్టపడ్డాడు .తన కష్టం మీద నమ్మకంతోనే సినిమా రిలీజుకు ముందే లెనిన్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ఆత్మవిశ్వాసంతో చెప్పాడు .
నిజానికి ఈ సినిమా మీద అక్కినేని నాగార్జున కూడా చాలా ఆశలు పెట్టుకున్నారు . ఇద్దరు కొడుకుల్లో అక్కినేని చైతన్య తన కెరీర్లో కొన్ని బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టాడు . కానీ అఖిల్ ఖాతాలో ఇంతవరకు సరైన హిట్ పడకపోవడంతో ప్రొడక్షన్ వర్క్ నుంచి ప్రతి పనీ నాగార్జున స్వయంగా చూసుకున్నాడు . మనం తర్వాత అన్నపూర్ణ బ్యానర్లో అఖిల్ మరో సూపర్ హిట్ కొట్టాలని హీరోతో సమానంగా నాగార్జున కూడా కష్టపడ్డాడు . అందుకే సినిమా రిలీజ్ అయి పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో అఖిల్ ఎమోషన్ అయి తండ్రి నాగార్జున కాళ్ళమీద పడి కన్నీళ్లు పెట్టుకున్నాడు . చాలాకాలం తర్వాత కొడుకు సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో నాగార్జున కూడా భావోద్వేగానికి లోనయ్యారు .
సరే ఇప్పుడు ప్రేక్షకుల కోణంలో లెనిన్ ఎలా ఉందో చూద్దాం.
కధేంటంటే ?
లెనిన్ మూవీ ప్రారంభం మహాభారత ఘట్టాలను గుర్తు చేసే వాయిస్ ఓవర్ తో ప్రారంభం అవుతుంది . అందులో ద్రౌపదిని కొలిచే ఒక కథను చెప్తారు . ఇప్పటికీ చిత్తూరు జిల్లాలో ద్రౌపది మాతకు కట్టిన గుడిలో గ్రామస్తులు ప్రతి ఏటా 18 రోజులు జాతర చేస్తుంటారని చెప్తారు .
కట్ చేస్తే లెనిన్ కథ రామాపురం భారతి మిట్ట అనే గ్రామం నుంచి మొదలౌతుంది . గ్రామస్తులు ఇక్కడ ద్రౌపది మాటకు గుడికట్టించి పూజలు చేస్తూ ఉంటారు . అయితే పురాణం కథ ప్రకారం అక్కడి భూమిలో చుక్క నెత్తురు కూడా పడకూడదు . ఒకవేళ నెత్తురు పడితే అరిష్టం అని గ్రామస్తులు నమ్ముతుంటారు . ఇదిలా ఉండగా ప్రతియేడులాగానే ఆ ఏడు కూడా గ్రామంలో 18 రోజుల ఉత్సవాలు చేయడానికి ఏర్పాట్లు జరుగుతాయి .
గుడి గోపురంపైన జెండా ప్రతిష్టించిన తర్వాతనే ఉత్సవాలు ప్రారంభించాలి. జెండా ప్రతిష్టించడానికి గ్రామస్తులు పోటీ పడుతున్న సమయంలో ఆకలితో ఒక అనాధ బాలుడు అక్కడ అడుగుపెడతాడు . జెండా పాతితేకానీ ప్రసాదాలు పెట్టడానికి వీల్లేదని పూజారి చెప్పడంతో ఆ అనాధ బాలుడు తానే జెండా మోసి గుడి గోపురం మీద ఎగరేస్తాడు . సరిగ్గా అతడు జెండా పట్టినవేళా విశేషంతో ఊరిలో వర్షాలు పడతాయి .
దాంతో గ్రామస్తులకు ఆ అనాధ బాలుడు అంటే నమ్మకం ఏర్పడుతుంది . ఊరి పెద్ద జయంతమ్మ తన కొడుకు వసంత్ తో సమానంగా అతడ్ని చేరదీస్తుంది . ఆ అనాధ బాలుడే లెనిన్ ( అఖిల్ అక్కినేని ) . లెనిన్ ..వసంత్ లు సొంత అన్నదమ్ముల కంటే ఎక్కువ ప్రేమగా ఉంటారు . వసంత్ పై చదువుల కోసం మద్రాస్ వెళ్లగా లెనిన్ ఊరిలోనే ఉండి అందరికీ తలలో నాలుకలా ఉంటాడు . ఆ ఊర్లోనే సొంతవాళ్లతోనే మాటలు పడుతుండే యతిరాజులు ( శివాజీ రాజా ) , శకుని లాంటి పాత్రలో బ్రహ్మాజీ , జయంతమ్మ కుటుంబం మీద పగపెంచుకున్న ఎమ్మెల్యే రాఘవరెడ్డిలు ఉంటారు .
చదువులు పూర్తిచేసుకుని గ్రామానికి వచ్చిన భారతి ( భాగ్యశ్రీ బొర్షే ) లెనిన్ ను ప్రేమిస్తుంది . భారతిని ప్రేమించిన వసంత్ వీరి ప్రేమగురించి తెలుసుకుని దగ్గరుండి వీళ్లిద్దరికీ వివాహం జరిపిస్తాడు . అయితే అనుకోని పరిస్థితుల్లో లెనిన్ జైలుకి వెళ్లాల్సి వస్తుంది .
లెనిన్ జైలుకి ఎందుకు వెళ్లాల్సివచ్చింది ?
రామాపురం భారతి మిట్ట గ్రామం తనకు జీవితాన్ని ఇచ్చిందన్న లెనిన్ అదే గ్రామంలో కొందర్ని చంపాలని ఎందుకు అనుకుంటాడు ?
తనకు అన్యాయం చేసినవాళ్ళని చంపాలని లెనిన్ ఎవరి గురించి అనుకుంటాడు ?
అసలు లెనిన్ కు అన్యాయం చేసింది ఎవరు ?
యతిరాజులు చేసిన నమ్మకద్రోహం ఏంటి ?
తాను ప్రాణప్రదంగా ప్రేమించే భారతికి ఏం జరుగుతుంది ?
లెనిన్ , భారతిల వైవాహిక జీవితం ఎలా ఉంటుంది ? అనే ప్రశ్నలకు సమాధానమే మిగిలిన కథ .
ఎలా ఉంది ?
దర్శకుడు చారిత్రాత్మక మహాభారత ఘట్టాల ఆధారంగా కొన్ని పాత్రలను , సన్నివేశాలను రాసుకున్నారు . అందుకే మూవీ ప్రారంభంలోనే మహాభారతంలోని ద్రౌపది పాత్రను ఉటంకించారు . అక్కడనుంచే కథను రామాపురం భారతి మిట్టకు చేర్చిన దర్శక నైపుణ్యం బాగుంది . మహాభారత ఘట్టానికి , ప్రస్తుత కధకు లింక్ పెడుతూ కథను ప్రారంబించడంతోనే దర్శకుడు మొదటి విజయం సాధించాడు . ఈ ఉపోద్ఘాతం లేకుండా నేరుగా కథను మొదలుపెట్టి ఉంటే కొంత కన్ఫ్యూజన్ గా ఉండేది .
ఆ మాటకొస్తే ఈ మధ్య మన దర్శకులు చాలామంది ఎవరికీ తెలియని మరుగున పడిన కొన్ని చారిత్రక నేపధ్యం ఉన్న ఘట్టాలను తమ సినిమాల్లో వాడుకుని మంచి ఫలితాలు సాధిస్తున్నారు . అల్లు అర్జున్ నటించిన పుష్ప మూవీలో చిత్తూరు జిల్లాలోని పోతురాజు గంగమ్మ ల జాతరను వాడుకున్నారు . అలాగే కాంతారాలో కేరళలో జరిగే ఒక ప్రాచీన జాతరను వాడుకున్నారు . రాజమౌళి కూడా తన సినిమాల్లో కొన్ని మహాభారత ఘట్టాలను వాడుకున్నారు . ప్రస్తుతం లెనిన్ మూవీలో కూడా దర్శకుడు మహాభారత ఘట్టాలను ఉటంకిస్తూ తన కథను ప్రారంభిస్తారు .
ఇక రామాపురం భారతి మిట్ట గుడి కోసం వేసిన సెట్టింగులు నాచురల్ గా లేకుండా కృత్రిమంగా అనిపించడం దర్శకుడి మొదటి వైఫల్యం . ఆ కాస్త స్థలంలోనే ఒక ఊరిని ప్రొజెక్ట్ చేయడం సహజంగా అనిపించలేదు . ఈ విషయంలో కళా దర్శకుడు మరింత ఎఫర్ట్ పెట్టి ఉంటే బాగుండేది .
ఇప్పుడు ఫస్టాఫ్ విషయానికి వస్తే రొటీన్ కమ్మర్షియల్ ఫార్మాట్ లోనే సినిమా సాగుతుంది . ఇందులో ప్రేక్షకులను మురిపించే ఉరుములు మెరుపులు ఏమీ ఉండవు . యధాప్రకారం హీరో ఇంట్రడక్షన్ భారీ ఎలివేషన్ తో మొదలౌతుంది . కధలో నాయకుడు కావడమే కాదు ఊరికి కూడా నాయకుడు అవుతాడు . కోట్ల ఆస్తి , చదువు , అందం ఉన్న వసంతును కాదని చదువు లేని ఖాళీగా ఉండే లెనిన్ ను హీరోయిన్ ప్రేమించడం , వీరి ప్రేమను అప్పటిదాకా పరువు కోసం పాకులాడే తండ్రి ఒప్పుకోవడం , హీరో హీరోయిన్లు పంటచేలలో పాటలు పాడుకోవడం , వసంత్ వచ్చిన తర్వాత కూడా ఊరికి లెనిన్ మాత్రమే నాయకుడు అవడం , వంటి సన్నివేశాలన్నీ మనం ముందే ఊహించిన విధంగా ఉంటాయి కాబట్టి కొత్తదనం ఏమీ ఉండదు . అయితే దర్శకుడు కూడా ఫస్టాఫ్ ను కేవలం కథ ప్రారంభాన్ని , పాత్రలను పరిచయం చేయడానికి కేటాయించుకున్నట్టు ఉంది . పైగా కొన్ని సీన్లలో భాగ్యశ్రీ బొర్షే పాత్ర అఖిల్ పాత్రను డామినేట్ చేసేలా ఉంటుంది .
ఈ పరిచయ కార్యక్రమాలు అన్నీ అయిపోయిన తర్వాత మెల్లిగా సెకండాఫ్ లో అసలు కథలోకి వెళ్తాడు . సెకండాఫ్ లో ఎదురయ్యే మలుపులే ఈ సినిమాకి ప్రధాన బలం . కధలో అసలు సంఘర్షణ ఇక్కడ్నుంచే మొదలౌతుంది . యతిరాజుల నమ్మకద్రోహం , లెనిన్ పట్ల మారిన వసంత్ దృక్పధం , గాంధారిని తలపించేలా ఉండే జయంతమ్మ నిర్ణయాలు , కధనంలో డెప్త్ ను పెంచాయి . దానికి తోడు తనకు అన్యాయం చేసిన వారినందరినీ ఒకేసారి చంపడానికి నిర్ణయించుకుని లెనిన్ జైలు నుంచి తిరిగి ఊరికి రావడం , అసలు లెనిన్ కు అన్యాయం చేసింది ఎవరో ప్రీ క్లైమాక్స్ వరకు రివీల్ చేయకపోవడం వంటి సన్నివేశాలు ఉత్కంఠతను పెంచుతాయి . సెకండాఫ్ లో ఒకదాని వెంబడి ఒకటి మలుపులను సృష్టిస్తూ దర్శకుడు కధనాన్ని నడిపిన విధానం బాగుంది . ఈ సన్నివేశాల్లో గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే కనిపిస్తుంది .
కానీ ఇదే సందర్భంలో లెనిన్ జైలుకి ఎందుకు వెళ్ళాడు ? అనేదాని మీద దర్శకుడు ఇంకొంచం క్లారిటీగా చెప్పి ఉండాల్సింది . ప్రీ క్లైమాక్సులో భారతిని టార్గెట్ చేసిన వసంత్ లెనిన్ ను ఎందుకు వదిలేసాడు ? అనే ప్రశ్నకు కూడా దర్శకుడు సమాధానం చెప్పాల్సి ఉంటుంది . లెనిన్ గురించి ఎలివేషన్లు ఇచ్చుకుంటూ వచ్చిన జైలర్ సునీల్ చివరలో ఈ హత్యలు ఆపడం తన ధర్మం అంటూ బయలుదేరడం సినిమాటిక్ లిబర్టీలో కుదురుతుందేమో కానీ లాజికల్ గా అంతగా నప్పదు . అది పక్కనబెడితే ఇందులో పతాక సన్నివేశాలు సినిమాని పతాక స్థాయిలో నిలబెడతాయి .
ఎవరెలా చేసారు ?
ఈ సినిమా కోసం పడ్డ కష్టం తన కెరీర్లోనే మరే సినిమాకి పడలేదని అఖిల్ చెప్పిన మాటలకూ అర్ధం చివరి ఇరవై నిమిషాల అతడి నటన చూసిన ఎవరికైనా అర్ధమౌతుంది . నిజంగా అఖిల్ చాలా కష్టపడ్డాడు . మీరు జాగ్రత్తగా గమనించండి . కొన్ని సన్నివేశాలు చూస్తున్నప్పుడు అఖిల్ లో నాగార్జున కనిపిస్తాడు . మరికొన్ని సన్నివేశాల్లో నాగార్జున వినిపిస్తాడు . ఈ సినిమా కోసం వొళ్ళు చేసాడో , లేకపోతే సినిమాలో అఖిల్ అలా కనిపించదు తెలీదు కానీ అఖిల్ కొంచం బొద్దుగా కనిపించాడు .
ఇక భారతి పాత్రలో భాగ్యశ్రీ బొర్షే ఒదిగిపోయింది . చాలా చలాకీగా డైలాగులు చెప్తూ గ్లామర్ ఒలకబోసింది .
వసంత్ పాత్రలో నటించిన ప్రమోద్ పంజు నటన కూడా బాగుంది . ప్రథమార్థంలో కన్నా ద్వితీయార్థంలో అతడి పాత్రకు ఎక్కువ స్కోప్ దక్కింది .
యతిరాజులు పాత్రలో శివాజీ యధాప్రకారం నటించాడు . కాకపోతే దర్శకుడు అతడినుంచి పూర్తిస్థాయిలో నటన రాబట్టుకోలేదు అనిపిస్తుంది .
ఈశ్వరి రావు నటన కూడా బావుంది .
సాంకేతికత
ఎస్ ఎస్ థమన్ పనితనం టైటిల్స్ నుంచే కనిపిస్తుంది . హీరో అఖిల్ ఎలివేషన్లకు థమన్ బీజీఎమ్ తోడై మూవీకి హైప్ తీసుకొచ్చింది . పాటల్లో కూడా థమన్ మార్క్ కనిపించింది . జయ మంగళం సాంగ్ బావుంది .
రామాపురం భారతి మిట్ట సెట్టింగులను తన కెమెరా పనితనంతో లియోన్ బ్రిట్టో మరింత అందంగా చూపించాడు . ఓవరాల్ గా ఫోటోగ్రఫీ బాగుంది .
ఇక నిర్మాణ విలువల గురించి చెప్పాలంటే వెనుక అన్నపూర్ణ బ్యానర్ ఉండగా లోటేముంటుంది ? బాగానే ఉన్నాయి .
విశ్లేషణ
లెనిన్ మూవీని రెండు భాగాలుగా విశ్లేషణ చేసుకుందాం . మొదటిభాగంలో మహాభారత ఘట్టాన్ని ఉటంకిస్తూ కథ ప్రారంభించిన విధానం ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది . కాసేపట్లోనే మూవీ రొటీన్ కమర్షియల్ ఫార్మాట్ లోకి టర్న్ తీసుకోవడంతో ఆ ఇంట్రెస్ట్ కొద్దిగా తగ్గుతుంది.
ఇక సెకండాఫ్ వచ్చేసరికి దర్శకుడు కధనంలో వేగం పెంచుతాడు . ఎప్పుడైతే కధనంలో వేగం పెరిగిందో సంఘర్షణ కూడా పెరుగుతుంది . దానికి తోడు ఊహించని కొన్ని మలుపులు మనల్ని థ్రిల్ చేస్తాయి . లెనిన్ టార్గెట్ ఎవరనేది తెలియక ఆ టీ కుర్రాడి మాదిరి మనం కూడా కొంత ఎగ్జైట్ అవుతాము . దానికి తోడు చివరి ఇరవై నిమిషాల అఖిల్ నటన సినిమాని తారాస్థాయికి తీసుకెళ్తుంది . ఈ సినిమాతో అఖిల్ సినీ కెరీర్ గురించి లెనిన్ కి ముందు .. లెనిన్ తర్వాత అని చెప్పుకోవాల్సి వస్తుంది . సినిమా మీద కొంతమంది ప్రేక్షకులకు భిన్నాభిప్రాయాలు ఉండొచ్చేమో కానీ అఖిల్ నటన మీద మాత్రం అందరికీ ఏకాభిప్రాయం ఉంటుంది . ఇది సినిమా చూసిన ఎవరైనా ఒప్పుకునే సత్యం .
నటీనటులు : అఖిల్ అక్కినేని , భాగ్యశ్రీ బొర్షే , శివాజీ , ప్రమోద్ కుంజు , ఈశ్వరి రావు తదితరులు
సంగీతం ; ఎస్ ఎస్ థమన్
సినిమాటోగ్రఫీ : లియోన్ బ్రిట్టో
నిర్మాత : అక్కినేని నాగార్జున , సూర్యదేవర నాగవంశీ
దర్శకత్వం : మురళి కిషోర్ అబ్బూరి
విడుదల : 10-07-2026
రేటింగ్ : 3 / 5
