ప్రీతమ్ అండ్ పెడ్రో వెబ్ సిరీస్ (Pritam and Pedro) మొదటి ఎపిసోడ్ చూడగానే ఇంట్రెస్టింగ్ అనిపించింది . బ్యాంక్ ఏటీఎం మెషిన్ దొంగతనం చేసిన దొంగలను ఓ కుర్రాడు ల్యాప్ టాప్ ద్వారా సాంకేతికతను వాడి 15 నిమిషాల్లో వాళ్ళ ఆచూకీని పోలీసులకు పట్టి ఇస్తాడు . ఇదెలా సాధ్యం ? కనీసం దొంగతనం జరిగిన స్పాట్ కు వెళ్ళలేదు . సిసి కెమెరా ఫుటేజ్ చూడలేదు . కేవలం ల్యాప్ టాప్ వాడి 15 నిమిషాల్లో దొంగతనం ఎవరు చేసారు ? వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ? ఏటీఎం మెషిన్ ఎక్కడుంది ? పేర్లతో సహా ఎలా కనిపెట్టగలిగావు ? అని క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ పెడ్రో ఆ కుర్రాడ్ని అడుగుతాడు . అప్పుడు ఆ కుర్రాడు చెప్పిన సమాధానం విని మనం వావ్ అనుకోవడంతో పాటు వామ్మో అనుకునేలా చేస్తాయి. మిగిలిన భాగాలు కూడా చూడాలని నాకు ఆసక్తి కలిగించింది ఈ మొదటి భాగమే .
బాలీవుడ్ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ కొడుకు వీర్ హిరానీ హీరోగా నటించిన ప్రీతమ్ అండ్ పెడ్రో వెబ్ సిరీస్ జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది . ఒక్కో ఎపిసోడ్ షుమారు ముప్పై నిమిషాల నుంచి 35 నిమిషాల నిడివితో మొత్తం ఆరు ఎపిసోడ్లు ఉన్న ఈ సిరీస్ లో ప్రతి ఎపిసోడ్ మనకు ఉత్కంఠత కలిగిస్తుంది .
ఇప్పుడు ప్రీతమ్ అండ్ పెడ్రో క్రైమ్ థ్రిల్లర్ కామెడీ సిరీస్ ఎలా ఉందో చూద్దాం .
ప్రధాన కథ ఏంటంటే ?
సిరీస్ మొదటి ఎపిసోడ్ ఓ బ్యాంక్ ఏటీఎం దొంగతనంతో మొదలౌతుంది . ఈ కేసు క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ పెడ్రో ( అర్షద్ వార్షి ) ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటాడు . దొంగతనం జరిగి రెండు రోజులైనా ఎటువంటి క్లూలు దొరక్కపోవడంతో కేసు ముందుకు కదలదు . ఇటువంటి పరిస్థితుల్లో తన బామ్మ పాడిన పాటల క్యాసెట్ ఉన్న టేప్ రికార్డర్ దొంగతనం జరిగిందని , ఆ పాటలు వింటూ తన తాత ఆవిడ జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటున్నాడని , కాబట్టి వెంటనే దొంగను పట్టుకుని తమ టేప్ రికార్డర్ తమకు ఇప్పించాలని ప్రీతమ్ ( వీర్ హిరానీ ) తన తాతను వెంటపెట్టుకుని పోలీస్ స్టేషన్ కు వచ్చి కంప్లైంట్ ఇస్తాడు .
ఒకపక్కన ఏటీఎం దొంగతనం చేసిన దొంగలు దొరక్క మేము తలలు పట్టుకుంటుంటే 500 రూపాయల టేప్ రికార్డర్ గురించి పోలీస్ స్టేషన్ కి వస్తావా ? అని పోలీసులు విసుక్కుని అతడ్ని లాకప్ లో పెడతారు . అదే సమయంలో క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ పెడ్రో స్టేషన్ కి వస్తాడు . మాటల సందర్భంలో బ్యాంక్ ఏటీఎం దొంగతనం గురించి విన్న ప్రీతమ్ తనకు ల్యాప్ టాప్ ఇస్తే 15 నిమిషాల్లో దొంగల ఆచూకీ కనిపెడతా అని చెప్తాడు .
ముందు అతడి మాటలు నమ్మకపోయినా పెడ్రో అతడికి ఒక అవకాశం ఇస్తాడు . ప్రీతమ్ ల్యాప్ టాప్ ద్వారా ఏటీఎం దొంగతనం జరిగిన ఏరియాలో ఆ టైములో ఆక్టివ్ లో ఉన్న మొబైల్ ఫోన్లను , సోషల్ మీడియా అకౌంట్లను ట్రాక్ చేసి నలుగురు దొంగలను పేర్లతో సహా బయటపెడతాడు .
ఈ ఎపిసోడ్ ద్వారా టెక్నాలజీని వాడటం ద్వారా నేరస్తులను నిమిషాల్లో ఏ విధంగా పట్టుకోవచ్చో దర్శకుడు చెప్పాడు . అయితే అసలు కథ ఇది కాదు . స్పోర్ట్స్ మినిష్టర్ భార్య ఫోన్ పోయిన కేసులో ఇన్స్పెక్టర్ పెడ్రో చేసిన ఒక పనివల్ల మినిష్టర్ కి కోపం వచ్చి అతడ్ని క్రైమ్ బ్రాంచ్ నుంచి సైబర్ సెల్ కు ట్రాన్స్ఫర్ చేయిస్తాడు . ఈ సంఘటన తర్వాత స్పోర్ట్స్ మినిష్టర్ కొడుకును తాము కిడ్నాప్ చేశామని , వెంటనే తాము అడిగిన డబ్బులను సంచులలో పెట్టి ఇవ్వాలని ఒక గుర్తు తెలియని కిడ్నాపర్ ఫోన్ చేసి బెదిరించడంతో అసలు కథ మొదలౌతుంది . ప్రీతమ్ సాయంతో తాను కిడ్నాపర్ బారినుంచి మినిష్టర్ కొడుకును విడిపించి తీసుకొస్తానని పెడ్రో అధికారులను , మినిష్టర్ ను ఒప్పించి రంగంలోకి దిగుతాడు .
అసలు మినిష్టర్ కొడుకును కిడ్నాప్ చేసింది ఎవరు ?
ప్రీతమ్ గతం ఏంటి ?
ప్రీతమ్ కు సైబర్ నేరగాడు మార్టిన్ కు ఉన్న గొడవలు ఏంటి ?
ప్రీతమ్ సాయంతో ఇన్స్పెక్టర్ పెడ్రో ఈ మిస్టరీని ఎలా ఛేదిస్తాడు ?
ఈ ఇద్దరూ కలిసి చివరికి మినిష్టర్ కొడుకుని కాపాడుతారా ? అనేది మిగిలిన ఎపిసోడ్లలో తెలుస్తుంది .
ఎలా ఉంది ?
నేను ముందే చెప్పినట్టు మొదటి ఎపిసోడ్ తోనే దర్శకుడు ఇంప్రెస్ చేసాడు . మొబైల్ ఫోన్లను ట్రాక్ చేయడం ద్వారా ఎవరినైనా సరే ప్రపంచంలో ఎక్కడున్నా ఎలా పసిగట్టవచ్చో సింపుల్ గా చెప్పేసారు . ఎపిసోడ్లు ముందుకువెళ్తున్న కొద్దీ టెక్నాలజీ వల్ల ఉపయోగం ఎంత ఉందో హాని కూడా అంతే ఉందని దర్శకుడు ప్రీతమ్ అండ్ మార్టిన్ పాత్రల ద్వారా చెప్పుకుంటూ పోయాడు . టెక్నాలజీ వాడటం ద్వారా సైబర్ అండ్ క్రిమినల్ నేరస్తులను ఎలా పట్టుకోవచ్చో ప్రీతమ్ చెప్తే , అదే టెక్నాలజీని వాడి చట్టానికి దొరక్కుండా నేరాలు ఎలా చేయొచ్చో మార్టిన్ చెప్తాడు . సైబర్ టెక్నాలజీలో ఇద్దరు జీనియస్ల మధ్య జరిగిన మైండ్ గేమ్ ని దర్శకుడు ఉత్కంఠతగా నడిపాడు . ఈ సిరీస్ కి ప్రీతమ్ అండ్ మార్టిన్ల ట్రాక్ ప్రధాన బలం అవుతుంది . ఒకరకంగా చెప్పాలంటే ఇద్దరు సైబర్ టెక్నాలజీ జీనియస్ల మధ్య జరిగిన మైండ్ గేమ్ లో పోలీసులు జోకర్లు అయిపోయారు . పోలీస్ ట్రాక్ ని బలహీనంగా నడవడం ఈ సిరీస్ ని కొంత బలహీనం చేసింది .
ఇక మొదటి ఎపిసోడ్ తర్వాత వచ్చిన మాజీ ఎస్సై ఎపిసోడ్ కూడా బాగానే ఉంది . నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఒక హోటల్లో పార్టీ చేసుకుంటున్న తన భార్యను , ఆమె ప్రియుడ్ని కాసేపట్లో చంపేసి తాను కూడా సూసైడ్ చేసుకుంటున్నట్టు ఒక టీవీ న్యూస్ రీడర్ కి ఆ ఎస్సై మెయిల్ పంపించడం , ఆ మెయిల్ ఐపి ట్రాక్ చేయడం ద్వారా ప్రీతమ్ అండ్ పెడ్రోలు సమయానికి అక్కడికి చేరుకొని ఆ మర్దర్లు ఆపడం వంటి సన్నివేశాలు థ్రిల్ పంచుతాయి .
ఎప్పుడైతే మినిష్టర్ కొడుకు కిడ్నాప్ కేసును ఛేదించటానికి ప్రీతమ్ సాయంతో పెడ్రో రంగంలోకి దిగుతాడో అక్కడ్నుంచి మనకు కొన్ని సాగతీత సన్నివేశాలు ఎదురౌతాయి .
కిడ్నాపర్ ఉన్న రిసార్టుకు పోలీసులు వెళ్లడం , అక్కడ జరిగిన డ్రామా మనకి ఇంట్రెస్టింగ్ గా అనిపించకపోగా విసుగు తెప్పిస్తాయి . ప్రీతమ్ పక్కన లేకపోతే పోలీసులు ఒట్టి జోకర్లు అని ఈ సన్నివేశాలతో దర్శకుడు తేల్చేసాడు .
మళ్ళీ ఎప్పుడైతే కధలో మార్టిన్ ఎంటర్ అవుతాడో అప్పట్నుంచి స్టోరీ ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది . ప్రీతమ్ ఫ్లాష్ బ్యాక్ , మార్టిన్ రివెంజ్ వంటి సన్నివేశాలతో కథను మలుపుతిప్పిన విధానం బాగుంది . ఆఖరి ఎపిసోడ్లలో మార్టిన్ , ప్రీతమ్ ల మధ్య నడిచిన మొబైల్ ట్రాకింగ్ సన్నివేశాలు ఉత్కంఠతను కలిగిస్తాయి . క్లైమాక్సులో మినిష్టర్ భార్యను బ్లాక్ మెయిలర్ నుంచి కాపాడిన సన్నివేశం బాగానే ఉంది కానీ కొంత సిల్లీ గా కూడా ఉంది . కనీసం చివర్లో అన్నా పెడ్రో టాలెంటును గుర్తిస్తారేమో అనుకుంటే యధాప్రకారం అతడ్ని పేకాటలో జోకర్ని చేసేసారు . బహుశా రెండో సీజన్లో అయినా దర్శకుడు పెడ్రో ని ఏమన్నా జాకీలు పెట్టి లేపుతారేమో చూడాలి .
ఓవరాల్ గా దర్శకుడు ఈ సిరీస్ కోసం ఏరికోరి అన్ని దినుసులను బాగానే మిక్స్ చేసాడు . తాత , మనవళ్ల మధ్య బాండింగ్ తో భావోద్వేగాలను , పెడ్రో , ప్రీతమ్ ల మధ్య ఐదు వందల రూపాయల బెట్ తో కామెడీని , మార్టిన్ .. ప్రీతమ్ ల మధ్య సైబర్ టెక్నాలజీ పోటీలతో థ్రిల్ ను , సమపాళ్లలో రంగరించి వదిలాడు .
ఎవరెలా చేసారు ?
ఈ సిరీస్ టైటిల్ ఏదైతే పెట్టారో ఆ ఇద్దరే మొదటినుంచి చివరివరకు అన్ని ఎపిసోడ్లలో కనిపిస్తారు . క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ పెడ్రో మిడిల్ ఏజ్ వాడైతే , ప్రీతమ్ యంగ్ ఏజ్ వాడు . అయితే సిరీస్ లో ఈ ఇద్దరి కాంబినేషన్ బాగా కుదిరింది . పెడ్రో పాత్ర పోషించిన అర్షద్ వార్షి కాసేపు నవ్విస్తాడు . కాసేపు థ్రిల్ పంచుతాడు . పాత్రకు తగ్గట్టుగా చాలా సహజంగా నటించాడు .
ఇక ప్రీతమ్ పాత్ర పోషించిన వీర్ హిరానీ స్మార్ట్ గా ఉన్నాడు . ఈ క్యారక్టర్ కి పర్ఫెక్ట్ గా షూట్ అయ్యాడు . ఒక్కోసారి అమాయకంగా , ఒక్కోసారి జీనియస్ మాదిరి రకరకాల ఎక్స్ప్రెషన్స్ తో నటించి మెప్పించాడు . ఇక ఇతడికి పోటీగా మార్టిన్ ( విక్రాంత్ మస్సె ) దిగడంతో నువ్వా ? నేనా ? అన్నట్టుగా సాగింది . విలనిజాన్ని మార్టిన్ చాలా స్టైలిష్ గా పండించాడు . సిరీస్ మొత్తానికి ఈ మూడు పాత్రలే ప్లస్ అవుతాయి .
సాంకేతికత
సినిమాటోగ్రఫీ బాగానే ఉంది .
బీజీఎమ్ కూడా బాగానే ఉంది కానీ కొన్ని సన్నివేశాల్లో ఇంకాస్త ఇంప్రూవ్మెంట్ ఉంటే బాగుండేది అనిపిస్తుంది .
నిర్మాణ విలువలు కూడా బాగానే ఉన్నాయి .
విశ్లేషణ
డిజిటల్ టెక్నాలజీ వచ్చిన తర్వాత మానవ జీవన శైలి మారిపోయింది . స్మార్ట్ ఫోన్లు , ల్యాప్ టాప్ లతో ప్రపంచంలో ఎక్కడినుంచైనా ఆర్థిక , వ్యాపార కార్యకలాపాలను నిర్వహించుకోవడం తేలికై పోయింది . ప్రపంచం అరచేతిలోకి వచ్చేసింది . లక్షల్లో డిజిటల్ లావాదేవీలు చేయడం దగ్గర్నుంచి ఆఖరికి చాయ్ తాగి పదిరూపాయలు పే చేయాలన్నా చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు పనైపోతుంది .
అయితే సాంకేతికత వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో , సైబర్ నేరాలు జరగడానికి అన్ని అవకాశాలు ఉన్నాయనే పాయింటును ఈ సిరీస్ బలంగా చూపిస్తుంది . ప్రపంచం మన అరచేతిలోకి వచ్చిందని సంబరపడుతున్నామే కానీ జాగ్రత్తగా ఉండకపోతే సైబర్ నేరస్తుల చేతుల్లో మనం ఇరుక్కుపోతామని గ్రహించడం లేదు . ఈ సిరీస్ లో కొన్ని సన్నివేశాలు చూసిన తర్వాత మనం ల్యాప్ టాప్ వాడాలన్నా , స్మార్ట్ ఫోన్ వాడాలన్నా వామ్మో అనుకోకుండా ఉండలేం .
జియో హాట్ స్టార్ లో తెలుగులో కూడా అందుబాటులో ఉంది కాబట్టి మిస్ కాకుండా చూడండి . క్రైమ్ , థ్రిల్లర్ వెబ్ సిరీస్ లు ఇష్టపడేవారికి ఖచ్చితంగా నచ్చుతుంది .
నటీనటులు : వీర్ హిరాని , అర్షద్ వార్షి , విక్రాంత్ మస్సె తదితరులు
నిర్మాత : రాజ్ కుమార్ హిరాని
దర్శకత్వం : అరుణ్ ధావరే
విడుదల : జియో హాట్ స్టార్ (03-07-2026 )
