బాల్టి (BALTI) మలయాళం యాక్షన్ డ్రామా మూవీ రివ్యూ !

Spread the love

తాజాగా సోని లివ్ ఓటిటిలో మలయాళం యాక్షన్ డ్రామా మూవీ బాల్టి (Balti movie) స్ట్రీమింగ్ కి వచ్చింది . మేకర్స్ ప్రచార చిత్రాల్లో స్పోర్ట్స్ యాక్షన్ సినిమాగా బాల్టీని ప్రమోట్ చేసారు . ప్రధానంగా కబడ్డీ క్రీడాకారులైన నలుగురు స్నేహితుల జీవితాల్లో ఏం జరిగింది అనేదే కథ అని చెప్పుకున్నారు . శుక్రవారం నుంచి ( జులై 10 ) సోని లివ్ లో తెలుగులో కూడా అందుబాటులోకి వచ్చింది .

ఈ మధ్య క్రీడల నేపథ్యంలో వచ్చిన కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి . జెర్సీ నుంచి పెద్ది వరకు క్రీడానేపధ్యంలో కధనాలు కొనసాగాయి . దాంతో ఆ జానర్ లో కూడా మూవీలకు వ్యూయర్షిప్ ఎక్కువగా ఉంది . ఎందుకంటే క్రికెట్ మొదలుకుని కబడ్డీ వరకు ఏదో ఒక ఆటని ఇష్టపడనివారు ఉండరు . అందుకే క్రీడల బ్యాక్ డ్రాప్ లో నడిచే సినిమాలకు కూడా ఆదరణ పెరుగుతుంది .

బాల్టి కూడా కబడ్డీ క్రీడల నేపథ్యంలో కొనసాగుతుందని మేకర్స్ చెప్పినా , ఇంకోవైపు గ్యాంగ్ వార్ నేపధ్యం కూడా కధలో భాగం అయి ఉంది . ఈ రెండూ ఒకదానితో ఒకటి సంబంధం లేని వేరు వేరు ట్రాకులు . మరి దర్శకుడు ఈ రెండు ట్రాకుల మధ్య స్టోరీని సమాంతరంగా నడిపించాడా ? లేదా ? అనేది ఇప్పుడు చూద్దాం .

కధేంటంటే ?

మూవీ ప్రారంభమే దర్శకుడు ఒక జాతర .. ఒక మర్డర్ తో గ్రిప్పింగ్ గా ప్రారంభించాడు . ఓపెనింగ్ బావుంది అని ప్రేక్షకులు ఇంకాస్త ముందుకెళ్తారు . ఉదయన్ ( షేన్ నిగమ్ ) , రమేష్ , మణి , కుమార్ నలుగురు స్నేహితులు . కేరళ , తమిళనాడు బోర్డర్లో ఉన్న ఓ పట్టణంలో కబడ్డీ క్రీడాకారులుగా పేరు తెచ్చుకుంటారు .

ఆ పట్టణంలో కబడ్డీ పందాలు పెద్దఎత్తున జరుగుతూ ఉంటాయి . పందెంలో గెలిచిన జట్టులో ఒక్కొక్కరికి పదివేల ప్రైజ్ మనీ కూడా ఇస్తారు . ఈ నలుగురికీ కబడ్డీ ఆడటం తప్ప ఇంకో పని రాదు . అయితే ఒకసారి ఊళ్ళో జరిగిన కబడ్డీ పోటీలలో భైరవన్ ( సెల్వ రాఘవన్ ) తాలూకా జట్టును ఓడిస్తారు .

దాంతో ఒక్కసారిగా ముగ్గురు మాఫియా నాయకుల కళ్ళు వీరిపై పడుతుంది . వారిలో అధిక వడ్డీలతో పేదవాళ్ళను పీడించుకుతినే భైరవన్ ఒకరు కాగా ఇతడికి పోటీగా వడ్డీలకు తిప్పుకునే గౌరీ రెండవ వారు . ఇక మూడో వ్యక్తి సోడా బాబు . ఈ సోడాబాబు సోడా వ్యాపారంతో పాటు స్మగ్లింగ్ కూడా చేస్తుంటాడు .

వీళ్ళు తమవైపు ఉంటే కబడ్డీ పోటీల్లో గెలవడం సునాయాసం అవుతుందని ముగ్గురూ భావిస్తారు . అందుకే తమ తరపున ఆడాలని సోడా బాబు కుమార్ ను అడుగుతాడు . ఈ విషయం తెలుసుకున్న భైరవన్ .. సోడాబాబు ఇచ్చే అమౌంట్ కన్నా మూడురెట్లు ఎక్కువ ఇస్తానని వీరికి ఆశ పెట్టి తన తరపున ఆడమంటాడు . భైరవన్ ఎక్కువ డబ్బులు ఆఫర్ చేయడంతో అతడి తరపున కబడ్డీ పోటీలు ఆడి గెలుస్తారు . దీంతో సోడాబాబు వీళ్ళ మీద కక్ష పెంచుకుంటాడు . మరోవైపు తాను ప్రేమించిన అమ్మాయి అన్నను వడ్డీల పేరుతో భైరవన్ హింసించడంతో ఉదయ్ ఎదురు తిరుగుతాడు . దాంతో ఒకవైపు భైరవన్ ముఠా , మరోవైపు సోడా బాబు ముఠా వీరిని అంతమొందించాలని బయలుదేరుతారు .

అసలు భైరవన్ తో ఉదయ్ టీముకు ఎందుకు గొడవ వస్తుంది ?
ఉదయ్ జట్టు తరపున ఆడలేదని కక్ష పెంచుకున్న సోడాబాబు ఏం చేస్తాడు ?
మొత్తం గొడవలను తనకు అనుకూలంగా మార్చుకోవడానికి గౌరి ఏం చేసింది ? అనేది మిగిలిన కథ .

ఎలా ఉంది ?

కవర్ పేజ్ చూసి బుక్ ని అంచనా వేయకూడదని ఇంగ్లీష్ కొటేషన్ ఉంది . అలాగే ఈ సినిమా విషయానికి వస్తే పోస్టర్ చూసి మూవీ అంచనా వేయకూడదని ఇంకో మలయాళం సామెత చెప్పుకోవచ్చు . మూవీ ప్రమోషన్లో మేకర్స్ బాల్టి ఒక స్పోర్ట్స్ డ్రామా అని తెగ ఊదరగొట్టారు . మూవీ ఏ జానర్ కిందికి వస్తుందో చెప్పినందుకైనా కబడ్డీ ..కబడ్డీ అనకపోతే బాగోదని ఫస్టాఫ్ లో కొంతభాగం కబడ్డీ నామస్మరణం చేసారు . నిజమే .. హీరో అండ్ అతడి స్నేహితులతో కబడ్డీ ఆట బ్రహ్మాండంగా ఆడించారు . సినిమా కోసం పాత్రధారులు పడిన కబడ్డీ కష్టమంతా ఇందులో కనిపిస్తుంది . అందులో ఏ మాత్రం అనుమానం లేదు . ఎక్కడా గ్రాఫిక్కులు వాడకుండా గ్రౌండ్లో కబడ్డీ సీన్లను సహజంగా చూపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు . భైరవన్ ఎంటర్ కాకముందు వరకు ఇదేదో స్పోర్ట్స్ డ్రామా మూవీ అనుకుంటాం.

కానీ భైరవన్ రంగప్రవేశంతో స్టోరీ లైన్ మారిపోయింది . ఆ తర్వాత మనకు కబడ్డీ ..కబడ్డీ ..అనే అరుపులు వినపడవు . వడ్డీ .. వడ్డీ .. అనే అరుపులు మాత్రమే వినిపిస్తాయి . సెకండాఫ్ నుంచి విచిత్రంగా కబడ్డీ మాయమైపోయి వడ్డీ వ్యాపారం రంగంలోకి వస్తుంది . కబడ్డీ క్రీడాకారులు మాయమైపోయి లోన్ రికవరీ ఏజంట్లు ప్రత్యక్షం అవుతారు . లోన్ రికవరీ ఏజంట్లు అంటే ఎవరో అనుకునేరు . కధలో ఫస్టాఫ్ లో కబడ్డీ ఆడి ఎదురులేని జట్టు అనిపించుకున్న ఉదయ్ అండ్ అతడి స్నేహితులే . దాంతో కథ రెండుగా చీలిపోయింది . ఒక స్టేషన్ వచ్చాక రైలు కొన్ని బోగీలను అక్కడే వదిలేసి ముందుకు వెళ్లినట్టు దర్శకుడు కబడ్డీ కథను ఇంటర్వెల్ లో వదిలేసి , మాఫియా వైపు పరుగులు పెట్టించాడు .

ఇక సెకండాఫ్ నుంచి మీరు కబడ్డీ ఆటను మర్చిపోండి . మరేం చూడాలి అంటే ? భైరవన్ వెర్సస్ ఉదయ్ జట్టు , సోడాబాబు వెర్సస్ ఉదయ్ జట్టు , గౌరి వెర్సస్ ఉదయ్ జట్టుల మధ్య జరిగే యాక్షన్ సన్నివేశాలను చూడాలి . యాక్షన్ సన్నివేశాలంటే తెలుసుగా ? హీరో ..విలన్ల గ్యాంగ్ కోసం ఛేజింగులు చేయడం ..అలాగే విలన్లు ..హీరో గ్యాంగ్ కోసం ఛేజింగులు చేయడం..కొన్ని ఫైటింగులు ..కొంత రక్తపాతం ..రొటీన్ రొడ్డకొట్టుడు ఫార్ములాలతో ది ఎండ్ అనడం గట్రా ..గట్రా అన్నమాట .

సెకండాఫ్ లో ప్రతిదీ మనకు ముందే తెలిసిపోతున్నప్పుడు ఉత్సుకత ఎక్కడ్నుంచి వస్తుంది . పోనీ స్పోర్ట్స్ డ్రామా నుంచి స్టోరీ యాక్షన్ మోడ్ లోకి టర్న్ తీసుకుంది అనుకుందాం . అప్పుడు ఇంట్రెస్ట్ కలిగించేంత గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఉండాలి కదా . అడుగడుగునా కాకపోయినా మధ్య మధ్యలో అయినా ఒకట్రెండు ట్విస్టులు ఉండాలి కదా ? అయినా వడ్డీ వ్యాపారాలు చేసుకునే లోకల్ గ్యాంగుకు , కబడ్డీ ఆటనే ప్రాణంగా ప్రేమించే క్రీడాకారులకు చుట్టరికం కలపాలన్న ఆలోచన ఎలా వచ్చింది ? లక్షల్లో వడ్డీలకు తిప్పే లోకల్ గ్యాంగులకు ఈ నలుగురు కబడ్డీ ఆటగాళ్లు మినహా పనివాళ్ళు దొరకలేదా ? ఒకరంటే ఒకరికి పడని ఈ మూడు గ్యాంగులు కబడ్డీ పందేల కోసం పోటీలు పడటం ఏంటి ?

సరే , యాక్షన్ పార్టును అలా ఉంచుదాం . లవ్ ట్రాక్ సంగతేంటి ? హీరో , హీరోయిన్లు ఇద్దరూ పేదరికం బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళే అనే పాయింటును మటన్ కొట్టు దగ్గరా , పూల కొట్టుదగ్గరా దర్శకుడు ఫోకస్ చేసిన విధానం బాగానే ఉంది కానీ కనీసం వాళ్ళిద్దరి లవ్ విషయంలో అయినా ఏదైనా క్లారిటీ తీసుకుని ఉంటే బాగుండేది . భైరవన్ తో ..హీరో గొడవపడటానికి ఉపయోగపడటానికి మినహా పాపం ఆ హీరోయిన్ కి కధలో పెద్దగా స్కోప్ లేదు . ఆ రకంగా దర్శకుడు లవ్ అనబడే బోగీని ఇంకో స్టేషన్లో వదిలేసి ముందుకు వెళ్ళాడు .

ఓవరాల్ గా దర్శకుడు స్పోర్ట్స్ డ్రామా బోగీని ఒక స్టేషన్లోను , హీరో ,హీరోయిన్ల లవ్ బోగీని ఇంకో స్టేషన్లోనూ , యాక్షన్ డ్రామాని మరొక స్టేషన్లోనూ వదిలేసి కేవలం ఇంజిన్ తో లాస్ట్ స్టేషన్ చేరుకున్నాడు . కథ పొరలుపొరలుగా విడిపోయి చివరికి హీరో చేతికి మట్టి , కుమార్ చేతికి రక్తం , మనచేతికి ఆముదంతో ముగుస్తుంది .

ఎవరెలా చేసారు ?

ఈ సినిమాకి హీరో తో పాటు అతడి ముగ్గురు స్నేహితులు , లోకల్ గ్యాంగులు భైరవన్ , సోడాబాబు , గౌరీలు కీలకం అవుతారు .

ముందు ఉదయ్ పాత్ర పోషించిన షేన్ నిగమ్ గురించి చెప్పుకోవాలంటే కబడ్డీ కోసం అతడు చేసిన కసరత్తు , కష్టం ఇందులో కనిపిస్తుంది . చాలా ప్రొఫెషనలిజంగా , సహజంగా నటించాడు . తల్లి కొడుకుల బాండింగ్ , లవర్ బాయ్ , ఫైటర్.. ఇలా డిఫరెంట్ షేడ్స్ లో చక్కగా నటించి మెప్పించాడు . ఇక అతడితో పాటు నటించిన ముగ్గురు స్నేహితుల నటన కూడా బాగానే ఉంది .

భైరవన్ పాత్రలో తమిళ దర్శకుడు సెల్వ రాఘవన్ పర్ఫెక్ట్ గా ఒదిగిపోయాడు . పైకి జెంటిల్మెన్ లా కనిపిస్తూ అంతర్గతంగా విలనిజం పండించడంలో సెల్వ రాఘవన్ చక్కటి నటన ప్రదర్శించాడు . ఇక సోడా బాబు పాత్రలో అల్పోన్స్ పుట్రేన్ , గౌరి పాత్రలో పూర్ణిమ ఇంద్రజిత్ తమ పాత్రల పరిధిమేరకు బాగానే నటించారు .
కావేరి పాత్రలో నటించిన హీరోయిన్ ప్రీతి అస్రానికి మూవీలో పెద్దగా స్కోప్ లేదు .

సాంకేతికత

సాయి అభ్యంకర్ అందించిన సంగీతం బాగానే ఉంది .
అలెక్స్ పులిక్కర్ కెమెరా పనితనం కబడ్డీ పోటీలలో కనిపిస్తుంది . ఆట ఎంత గొప్పగా సాగిందో కెమెరా పనితనం కూడా అంతే గొప్పగా సాగింది .
నిర్మాణ విలువలు పర్లేదు .

విశ్లేషణ

స్పోర్ట్స్ డ్రామా , యాక్షన్ డ్రామాలను సమాంతరంగా కలిపి చూపించడంలో దర్శకుడు తడబడ్డాడు . ఒక టైములో అసలు దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడు అనేది కూడా అర్ధం కాదు .హీరో జట్టు ఆటతో మొదలెట్టి , మధ్యలో హీరో ,హీరోయిన్ల మధ్య ఒక పాటతో కొనసాగించి చివరికి కథ ఎటో వెళ్ళిపోయింది . ఫస్టాఫ్ కి , సెకండాఫ్ కి సంబంధం ఉండదు . ఆ లైను వేరే ..ఈ లైను వేరే .. ఈ రెంటికీ మధ్య లింక్ తెగకుండా స్క్రీన్ ప్లే నడపడంలో దర్శకుడు తడబడ్డాడు . ఇక్కడే స్టోరీ పక్కదారి పట్టింది .

మరి సినిమాలో ఏం బావుంది ? ఏం బాగోలేదు ? అని క్లుప్తంగా చెప్పుకోవాలంటే ఫస్టాఫ్ లో వచ్చే కబడ్డీ ఆట సీన్లు బాగుంటాయి . స్పోర్ట్స్ ప్రేమికులకు నచ్చుతుంది . ఇక యాక్షన్ సీన్లు ఇష్టపడేవారికి సెకండాఫ్ కూడా నచ్చుతుంది . సోని లివ్ ఓటిటిలో తెలుగులో కూడా అందుబాటులో ఉంది కాబట్టి వన్ టైమ్ వాచ్ కింద మూవీని చూడొచ్చు .

నటీనటులు : షేన్ నిగమ్ , ప్రీతి అస్రాని , సెల్వ రాఘవన్ , తదితరులు
సంగీతం : సాయి అభ్యంకర్
సినిమాటోగ్రఫీ : అలెక్స్ పులిక్కర్
నిర్మాత : బిను జార్జ్
దర్శకత్వం : ఉన్ని శివలింగం
విడుదల : సోని లివ్ ( 10-07-2026 )
రేటింగ్ : 2 / 5


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!