మర్డర్ మిస్టరీ హర్రర్ థ్రిల్లర్ స్టోరీ !

Spread the love

జేబులోంచి సిగరెట్ తీసి వెలిగించుకుని గుండెల నిండా గట్టిగా దమ్ములాగి వదులుతూ టైమ్ చూసుకున్నాడు ఇన్స్పెక్టర్
అర్థరాత్రి ఒంటిగంట కావొస్తోంది.

చిరంజీవి కొత్త సినిమా ప్రీమియర్ షో ఉండటంతో బందోబస్తు కోసం కానిస్టేబుళ్లు వెళ్ళడంతో స్టేషన్లో సెంట్రీ, రైటర్ , డ్రైవర్ మినహా ఎవరూ లేరు.

నైట్ రౌండ్స్ ముగించుకుని వచ్చాడేమో బడలికగా ఉంది
మరోపక్క నిద్ర కూడా ముంచుకొస్తుంది.

ఇంతలో ఫోన్ మోగింది
ట్రూ కాలర్ లో లవ్ అని చూపించింది
ఫోన్ ఎత్తి ‘ హలో ‘ అన్నాడు.

“మహానుభావా.. తమరు డ్యూటీకి వెళ్తే ఇల్లు గుర్తుకురాదా ?”అవతలినుంచి చిరుకోపంతో భార్య
“ఇదిగో.. జస్ట్ బయలుదేరుతున్నాను.. ఇంతలో నువ్ ఫోన్ చేశావ్.. పావుగంటలో ఇంట్లో ఉంటాను” అని ఫోన్ కట్ చేసేలోపలే,

“లేదు సార్.. ఈ రోజు మీరు ఇంటికి వెళ్ళడం లేదు.. ఒక ముఖ్యమైన మర్డర్ మిస్టరీ ఛేదించడానికి ఆన్ డ్యూటీ వెళ్తున్నారు” అన్న మాటలు వినిపించి ఉలిక్కిపడి తల ఎత్తి చూసాడు.

ఎదురుగా ఎవరో అపరిచిత వ్యక్తి నిలబడి ఉన్నాడు
నుదుట విభూది, చింపిరి జుట్టు, మాసిన బట్టలతో అదో రకంగా ఉన్నాడు.

ఇన్స్పెక్టర్ ఉలిక్కిపడింది అతడి అవతారం చూసి కాదు.. అతడి మాటలు విని..
ఆ మాటల్లో ఏదో కమాండింగ్ ఉంది
ఆ స్వరంలో ఏదో శక్తి ఉంది.

క్షణాల్లో తేరుకుని ” ఎవరు నువ్వు ” అన్నాడు ఇన్స్పెక్టర్.

“శివ.. శివ గణేశన్ సార్”

“ఓహో.. అరవ తంబివా ?”

“ఎవరెలా అనుకుంటే అలా” అని నర్మగర్భంగా నవ్వాడు.

” సరే .. నువ్వెవరో కానీ నేరుగా నా రూములోకి ఎలా వచ్చావ్? బయట ఆ భద్రం ఏం చేస్తున్నాడు?” అని విసుక్కుని పిలవబోయాడు.

“భద్రాన్ని పిలిచేముందు నేను చెప్పే ఒక ముఖ్యమైన విషయం వినండి సార్”

” ఏంటది?” విసుగ్గా టైమ్ చూసుకుంటూ అన్నాడు.

“సరిగ్గా 12.27 నిమిషాలకు ఒక మర్డర్ జరిగింది” కూల్ గా చెప్పాడు అతడు.

“వ్వాట్?” ఉలిక్కిపడుతూ అరిచాడు ఇన్స్పెక్టర్.

“ఆ మర్డర్ చేసింది ఎమ్మెల్యే రామ్ భూపాల్”

అతడి మాటలు వినగానే ఒక్కసారిగా కుర్చీలో నిటారుగా కూర్చున్నాడు ఇన్స్పెక్టర్.

” నువ్వు చెప్తుంది నిజమా?”అక్షరాలు కూడబలుక్కుంటూ గొణిగాడు ఇన్స్పెక్టర్.

“ఇంకో నిజం ఏంటంటే ఆ మర్డర్ చేయించింది హోమ్ మినిస్టర్ తిమ్మప్ప “
పక్కలో బాంబు పడ్డట్టు ఉలిక్కిపడి కుర్చీలోంచి లేచాడు ఇన్స్పెక్టర్.

“హేయ్.. ఎవరు నువ్వు.. అర్థరాత్రి తాగొచ్చి నాతోనే పరాచికాలు ఆడుతున్నావా?” బయటికి కోపంగా అన్నాడు కానీ ఇన్స్పెక్టర్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
అప్రయత్నంగా అతడి నుదుటి నుంచి చెమట చుక్క జారి పడింది.

“పరాచికాలు ఆడటానికి ఇది సమయము కాదు.. సందర్భమూ కాదు.. ఎందుకంటే ఈ తెల్లవారు ఝామున సీఎం మీద పెద్ద కుట్ర జరగబోతుంది” శూన్యంలోకి చూస్తూ మరో బాంబు పేల్చాడు అతడు.

ఇన్స్పెక్టర్ చొక్కా తడిసిపోయింది
మెల్లిగా వెన్నులోనుంచి చలి మొదలైంది.

“ఇంకా నా మాటలు నమ్మడం లేదు కదూ? మీరు ఆలస్యం చేసిన కొద్దీ ఊహించని నష్టం జరుగుతుంది..మొయినాబాద్ లో ఉన్న ఎమ్మెల్యే ఫామ్ హౌస్ వెనుక ఉన్న తోటలో జామచెట్టు చెట్టు పక్కన భూమిలో తవ్వి చూడండి.. శవం దొరుకుతుంది”మళ్ళీ అతడే చెప్పాడు.

ఇన్స్పెక్టర్ గొంతు తడారిపోయింది
ఇతడి మాటల్ని జోక్ గా తీసుకోవాలా? సీరియస్ గా తీసుకోవాలా? ఒకవేళ ఇతడు చెప్పింది నిజమే అయితే..??
ఆ ఊహ రాగానే ఇన్స్పెక్టర్ కాళ్ళు వణికాయి.

“ఇవన్నీ నీకెలా తెలుసు?” వణుకుతున్న గొంతుతో అడిగాడు ఇన్స్పెక్టర్

“ఆ మర్డర్ నా కళ్ళతో చూసాను కాబట్టి?”

“మరి హోమ్ మినిస్టర్ ఇన్వాల్వ్మెంట్ గురించి.. సీఎం మీద కుట్రల గురించి నీకెలా తెలుసు?”

“చనిపోయిన వ్యక్తి కొద్ది నిమిషాల ముందు నాకు చెప్పాడు?”

“అతడు నీకేమవుతాడు?”

“మీరు నాకేమి అవుతారో.. అతడూ అదే అవుతాడు”

“పోనీ అతడి పేరేంటి? అతడేం చేస్తుంటాడో? అదైనా తెలుసా?”

“తెలీదు.. కానీ అతడు చివర్లో నాకు ఒక్కటే చెప్పాడు.. ఈ వివరాలన్నీ కేవలం మీకు మాత్రమే చెప్పమని చెప్పాడు”

“నాకు మాత్రమే చెప్పమన్నాడా ? సరే ఇవన్నీ నిజాలే అని నమ్మేది ఎలా? అతడు నీకు చెప్పిన మాటలబట్టి పెద్దవాళ్ళ మీద కేసులు పెట్టలేము కదా?”

“అందుకే అతడు అన్నీ రికార్డ్ చేసి పెన్ డ్రైవ్ లో స్టోర్ చేశాడు”

“మరి ఆ పెన్ డ్రైవ్ ఎక్కడ ఉంది?”

“మీకు చేరుతుంది అని చెప్పాడు”

“వాట్..? నాకు చేరుతుంది అని చెప్పాడా? అయినా ఇంతవరకు నాకు ఎలాంటి పెన్ డ్రైవ్ లు అందలేదు.. అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్ధం అవుతుందా? అర్థరాత్రి వచ్చి ఏకంగా నాతోనే గేమ్స్ ఆడుతావా?” కోపంగా లాఠీ అందుకున్నాడు.

“ఇన్స్పెక్టర్.. నా మాటలు నిజమో.. అబద్దమో ఎమ్మెల్యే ఫామ్ హౌస్ లో నేను చెప్పిన చోట తవ్వి చూడండి.. ఆ తర్వాత పెన్ డ్రైవ్ దొరికిన తర్వాత ఏం చేయాలో ఆలోచించవచ్చు ” కూల్ గా చెప్తున్నాడు అతడు.

“అయితే నువ్వు కూడా బయలుదేరు.. అక్కడే తేల్చుకుందాం.. ఒకవేళ నీ మాటలు అబద్ధమని తేలిందో నిన్ను అక్కడే ఎన్కౌంటర్ చేసి పారేస్తాను ” పళ్ళు పటపటా కొరుకుతూ కుర్చీలోంచి లేచాడు.

“నేను మీతో వస్తే మీ ప్రాణాలకు కూడా ప్రమాదం.. వాళ్ళు నన్ను ఆల్రెడీ చూసేసారు.. నా ప్రాణాలకు కూడా ప్రమాదం ఉంది.. అందుకే నేను ఇక్కడే ఉంటాను.. ముందు మీరు అక్కడ ఉన్న శవాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం చేయించండి.. అన్ని విషయాలు బయటికి వస్తాయి.. నా మాటలు అబద్ధమైతే ఇదే స్టేషన్లో నన్ను లాకప్ డెత్ చేసేయండి.. ఆలస్యం అయితే సీఎం కూడా రిస్కులో పడతారు.. మీ పోలీస్ వృత్తిలో అతి పెద్ద ఆపరేషన్ ఇప్పుడే మొదలవబోతుంది.. ఇది మీ జీవితాన్నే మార్చేస్తుంది.. త్వరగా బయలుదేరండి “ఉత్కంఠత గా ఏకబిగిన చెప్పుకుంటూ పోయాడు అతడు.

ఇన్స్పెక్టర్ కుర్చీలోంచి లేచి” సరే నీ మాటల మీద నమ్మకంతో వెళ్ళి చూస్తాను.. ఒకవేళ నీ మాటలు అబద్ధమని తేలిందో.. నిన్ను ఇక్కడే..” అంటూ రివాల్వర్ చూపించి బయలుదేరబోతూ అతడి చేతి వంక చూసి ఉలిక్కిపడి ఆగాడు.

“ఇందాక మర్డర్ ఎన్ని గంటలకు జరిగింది అన్నావు?”

“సరిగ్గా 12.27 నిమిషాలకు”

“మరి నీ చేతికి ఉన్న స్మార్ట్ వాచ్ కూడా అదే టైమ్ దగ్గర ఆగిపోయింది ఏంటి?”

“అదా? బ్యాటరీ డెడ్ అయినట్టుంది సార్”

ఎందుకో అతడి మాటల్లో ఇన్స్పెక్టర్ కి ద్వందార్ధం ధ్వనించినట్టు అనిపించింది .

***

బయటకు వచ్చి అక్కడ ఉన్న సెంట్రీకి ” లోపల నా గదిలో ఒకడున్నాడు.. నేను తిరిగి వచ్చేవరకు వాడ్ని ఎట్టిపరిస్థితుల్లోనూ బయటికి పంపొద్దు” అని చెప్పి జీపు ఎక్కాడు
సెంట్రీ ఏదో చెప్పబోయాడు కానీ ఇన్స్పెక్టర్ అప్పటికే జీపు లో కూర్చోవడంతో ఆగిపోయాడు

ఈలోపు ప్రీమియర్ షో డ్యూటీ ముగించుకుని వచ్చిన..స్టేషన్ గుమ్మంలో ఎదురైన కానిస్టేబుళ్లను కూడా జీపులో ఎక్కించుకుని మొయినాబాద్ ఫామ్ హౌస్ కి బయలుదేరాడు ఇన్స్పెక్టర్

***

జీపు వాయువేగంతో మొయినాబాద్ ఫామ్ హౌస్ చేరుకుంది
పర్మిషన్ లేనిదే ఎవరినీ లోపలికి పంపొద్దని సార్ చెప్పారంటూ గేట్ దగ్గర సెక్యూరిటీ గార్డులు అడ్డుకోవడంతో పోలీసులు దిగి వాళ్ళ దగ్గర ఉన్న సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని గార్డులను సెక్యూరిటీ క్యాబిన్ లో పడేసి లాక్ చేసి లోనికి వెళ్ళారు

శివ గణేశన్ చెప్పిన చోటుకు వెళ్ళి తవ్వడం మొదలు పెట్టారు
కొంత తవ్విన తర్వాత భూమిలో శవం కనిపించింది
పోలీసులు ఆ శవాన్ని బయటికి తీసిన తర్వాత ఇన్స్పెక్టర్ మెల్లిగా దగ్గరికి వెళ్ళి మొబైల్ టార్చ్ లైట్ తో ముఖం మీద ఫోకస్ చేసి పక్కలో బాంబు పడ్డట్టు ఉలిక్కిపడి ఎగిరి అవతల పడ్డాడు.

వొళ్లంతా ముచ్చెమటలు పట్టాయి
చలి జ్వరం వచ్చిన వాడిలా గజగజా వణికిపోతున్నాడు
మాస్ హిస్టీరియా వచ్చినవాడిలా నో ..నో.. అంటూ ఊగిపోతున్నాడు.

ఇన్స్పెక్టర్ చేష్టలు చూసి కానిస్టేబుళ్లు కూడా హడలిపోయారు
“సార్.. సార్.. ఏమైంది సార్?” కంగారుగా అడిగారు .

“వీడు..వీడు.. ఇప్పటిదాకా నాతో స్టేషన్లో మాట్లాడాడు..శివ.. శివ గణేశన్.. ఎలా?.. ఇదెలా సాధ్యం?”వణుకుతున్న గొంతుతో అరుస్తున్నాడు

మెల్లిగా మొబైల్ తీసుకుని స్టేషన్ కి ఫోన్ చేశాడు.

” భద్రం.. నా రూములో ఒక వ్యక్తి ఉంటాడు..చూడు.. అతడు అక్కడే ఉన్నాడేమో చూడు..” అతడి మాటలు నూతి లోనుంచి వస్తున్నట్టు వచ్చాయి.. చేతులు వణుకుతున్నాయి.

“సార్.. మీ రూములో ఎవరూ లేరు సార్” అవతలినుంచి భద్రం ఇంకా ఏదో చెప్తున్నాడు.

మధ్యలోనే అతడి మాటల్ని కట్ చేస్తూ,
“కాదు..కాదు.. ఒకసారి సీసీ కెమెరా ఫుటేజ్ చెక్ చేసి చెప్పు”

“సార్ సీసీ ఫుటేజ్ చెక్ చేశాం సార్.. బయటివాళ్ళు ఎవరూ మన స్టేషన్ కి రాలేదు సార్.. మీ రూములోకి కూడా ఎవరూ రాలేదు సార్.. కానీ మీ టేబుల్ మీద మాత్రం ఏదో పెన్ డ్రైవ్ ఉంది సార్”

కానీ ఇన్స్పెక్టర్ కి అవేమీ వినిపించడం లేదు
పెన్ డ్రైవ్.. పెన్ డ్రైవ్.. సీఎం మీద జరగబోయే అత్యంత ప్రమాదకరమైన కుట్రను ఛేదించే పెన్ డ్రైవ్ ప్రస్తుతం తన టేబుల్ మీద ఉంది

మరోసారి శవం ముఖం వంక చూసాడు
నుదుట విభూది.. చింపిరి జుట్టు.. మాసిన బట్టలు..శివ.. శివ గణేశన్
అతడి చేతికున్న స్మార్ట్ వాచ్ సరిగ్గా రాత్రి 12.27 నిమిషాల దగ్గర ఆగిపోయి ఉంది.

( ఆ తర్వాత ఏం జరిగి ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాను )

రచ్చబండ కబుర్లు పాఠకుల కోసం నేను రాసిన ఈ హర్రర్ థ్రిల్లర్ స్టోరీ మీకు అందరికీ నచ్చుతుందనే ఆశిస్తున్నాను . మీ అభిప్రాయాలు కూడా నిర్మొహమాటంగా తెలియచేయవచ్చు . ఇందులోని పాత్రలు , సన్నివేశాలు కేవలం కల్పితం మాత్రమే . ఈ కథ పూర్తిగా నా స్వంతం . పిక్ మాత్రం అంతర్జాలం నుంచి సేకరించడం జరిగింది )
పరేష్ తుర్లపాటి ✍️


Spread the love

2 thoughts on “మర్డర్ మిస్టరీ హర్రర్ థ్రిల్లర్ స్టోరీ !

  1. బాగుంది. నెక్స్ట్ పార్ట్ ఎప్పుడు విడుదల అవుతుంది? 👌💐

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!