మాలీవుడ్ టైమ్స్ మలయాళం మూవీ (OTT) రివ్యూ !

Spread the love

ప్రేమలు హీరో నస్లేన్ నటించిన మలయాళం డార్క్ కామెడీ మూవీ మాలీవుడ్ టైమ్స్ జూన్ 5 న థియేటర్లలో రిలీజ్ అయి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది . జులై 3 నుంచి జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కి వచ్చింది . ఆషిక్ ఉస్మాన్ నిర్మించిన ఈ సినిమాకి అభినవ్ సుందర్ నాయక్ దర్శకత్వం వహించారు .

వెండి తెర మీద ఏం జరుగుతుందో సినిమా చూసే మనకందరికీ తెలుసు . కానీ వెండి తెర వెనుక జరిగే రాజకీయాలు కొందరికే తెలుస్తాయి . సినిమా వెనుక నేపధ్యం కథలతో గతంలో చాలా సినిమాలు వచ్చాయి . ఒక కథ సినిమాగా మారే క్రమంలో ఎటువంటి పరిణామాలు జరుగుతాయనేది గతంలో కొంతమంది దర్శకులు తమ సినిమాలలో చెప్పేసారు . కాకపోతే తెర వెనుక సంఘటనలను ప్రేక్షకులకు రీచ్ అయ్యే విధంగా చెప్పడంలోనే ఆ సినిమా విజయం ఆధారపడి ఉంటుంది . మాలీవుడ్ టైమ్స్ మూవీ ద్వారా సినిమాల్లో టాప్ దర్శకుడిగా ఎదగాలనుకుని ఒక ఔత్సాహిక యువ దర్శకుడు పడిన శ్రమ , విజయాలు పరాజయాలు , ఒత్తిళ్లు , సంఘర్షణలను దర్శకుడు అభినవ్ సుందర్ నాయక్ కళ్ళకు కట్టినట్టుగా చూపించారు .
ఇప్పుడు మాలీవుడ్ టైమ్స్ మూవీ ఎలా ఉందో చూద్దాం .

కధేంటంటే ?

వైకోమ్ డేవిడ్ ప్రముఖ హర్రర్ నవలా రచయిత . షుమారు 350 కి పైగా నవలలు రాసి పాఠకుల ఆదరణ పొంది ఫేమస్ అవుతాడు . అతడి కొడుకే వైకోమ్ సచిన్ . ఇతడు కూడా తండ్రిలా గొప్ప రచయిత కావాలని చిన్నతనం నుంచే కలలు కంటుంటాడు . అందుకే స్కూల్ మ్యాగజైన్ లో పబ్లిష్ చేసేందుకు ఒక షార్ట్ హర్రర్ స్టోరీ రాసి టీచర్ కి ఇస్తాడు . కానీ అతడి కథ బాగోలేదని టీచర్ ఆ కథను రిజెక్ట్ చేస్తుంది .

దాంతో సచిన్ డిప్రెషన్ తో సూసైడ్ చేసుకోవాలని అనుకుంటాడు . కానీ కొడుకు ఆలోచనను పసిగట్టిన తండ్రి తాను రచయితగా ఎలా ఎదిగింది అనే అసలు రహస్యాన్ని సచిన్ కు చెప్పేస్తాడు .

ఇదిలా ఉండగా ఈ కధలో హీరో వినీత్ మాధవన్ ది ( నస్లేన్ ) కూడా ఇంచుమించు ఇలాంటి పరిస్థితే. ఐదో క్లాస్ చదువుతున్న వినీత్ కి హర్రర్ నవలలు అంటే పిచ్చి . ముఖ్యంగా వైకోమ్ డేవిడ్ రాసే హర్రర్ నవలలను వదలకుండా చదువుతాడు . స్కూల్ చదువుల మీద దృష్టి పెట్టకుండా హర్రర్ నవలలు చదవడం మీద దృష్టి పెట్టిన కొడుకు ప్రవర్తన చూసి అతడి తల్లితండ్రులు ఆందోళన పడుతూ ఉంటారు . కానీ వినీత్ మాత్రం పెద్దయ్యాక తాను గొప్ప మలయాళం హర్రర్ మూవీ తీసి ప్రేక్షకులను భయపెట్టి ప్రముఖ దర్శకుల జాబితాలో చేరతాను అని చెప్తూ ఉంటాడు .

స్కూల్ చదువులు పూర్తికావడంతో అతడు షార్ట్ ఫిలిమ్స్ తీయడం మీద ఫోకస్ పెడతాడు . అందర్నీ భయపెట్టేలా ఒక షార్ట్ ఫిలిం తీస్తానని చెప్పి స్నేహితుడి సాయంతో హ్యాండీ కెమెరాతో షూటింగ్ పూర్తిచేసి ముందు ఇంట్లోవాళ్ళకి చూపిస్తాడు . వినీత్ తీసిన షార్ట్ ఫిలిం చూసి మిగతావాళ్ళు పెద్దగా భయపడరు కానీ అతడి తాత మాత్రం కోమాలోకి వెళ్ళిపోతాడు . తాను తీసిన షార్ట్ ఫిలిం చూసి తాత భయపడి కోమాలోకి వెళ్లిపోయాడని వినీత్ భావించుకుని షార్ట్ ఫిలిమ్స్ నుంచి ఫీచర్ ఫిలిమ్స్ మీద దృష్టి పెడతాడు . ఇక్కడ్నుంచి అసలు కథ మొదలౌతుంది .

రైటర్ వైకోమ్ డేవిడ్ తన కొడుకు సచిన్ కు చెప్పిన రహస్యం ఏంటి ?
వినీత్ డైరెక్ట్ చేసిన షార్ట్ ఫిలిం చూసే నిజంగా అతడి తాత కోమాలోకి వెళ్లిపోయాడా ?
హర్రర్ సినిమాల దర్శకుడిగా పేరు తెచ్చుకోవాలని సినీ ఇండస్ట్రీకి వెళ్లిన వినీత్ కు ఎటువంటి అనుభవాలు ఎదురయ్యాయి ?
చివరకు అన్ని ఆటుపోట్లను తట్టుకుని వినీత్ తన లక్ష్యాన్ని సాధించుకున్నాడా ? అనేది మిగిలిన కథ .

ఎలా ఉంది ?

ఈ రోజు ప్రముఖ దర్శకులుగా పేరు తెచ్చుకున్న ఎందరో సీనియర్ దర్శకులు ఆ స్థాయికి చేరుకోవడానికి ఎన్నో కష్టాలు పడి ఉంటారు . ఎంతో శ్రమ పడి ఉంటారు . ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ఉంటారు . అవమానాలను , పరాజయాలను , ఒత్తిళ్లను కూడా అనుభవించి ఉంటారు . ఆ దశలన్నీ దాటుకుని ఒక స్థాయికి ఎదిగిన తర్వాత ఇక వెనుతిరిగి చూసుకునే అవసరం వాళ్ళకి ఉండదు .

ఈ సినిమాలో ఓ సన్నివేశంలో సిక్స్త్ సెన్స్ అనే హాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ గురించి టాపిక్ వస్తుంది . ఆ సినిమాని తీసిన శ్యామల సుబ్రమణియన్ మలయాళీ అని తెలిసి వినీత్ ఆశ్చర్యపోతాడు . పైగా అతడు తన పదహారో ఏటనే హిట్ సినిమా తీసి పాపులర్ అయ్యాడు . 28 ఏళ్లకే రామ్ గోపాల్ వర్మ తన మొదటి సినిమా శివ తీసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు . అలాగే ఇంకో ఇద్దరు ముగ్గురు దర్శకులు అతి పిన్న వయసులోనే బ్లాక్ బస్టర్ హిట్ మూవీలు తీసారని చెప్తారు . వినీత్ వాళ్ళ లైఫ్ ను ఇన్స్పిరేషన్ గా తీసుకుని తాను కూడా అలా సూపర్ హిట్ డైరెక్టర్ కావాలని కలలు కంటుంటాడు .

అయితే సక్సెస్ ఫుల్ దర్శకుల గురించి ఇంత ఉపాధ్ఘాతం ఇచ్చిన దర్శకుడు అభినవ్ వాళ్ళు సక్సెస్ కావడానికి ముందు పడిన శ్రమ , కృషి , అంకిత భావం గురించి కూడా చిన్న ఇంట్రడక్షన్ ఇచ్చి ఉంటే బాగుండేది . శివ స్క్రిప్ట్ పట్టుకుని చాన్నాళ్లు అన్నపూర్ణ స్టూడియో చుట్టూ తిరిగినట్టు కొన్ని ఇంటర్వ్యూలలో రామ్ గోపాల్ వర్మ చెప్పారు . చివరికి ఎలాగోలా నాగార్జునని ఒప్పించి శివ సినిమా షూటింగ్ మొదలుపెడితే పాత్రల విషయంలో చిన్న డిస్ప్యూట్లు వచ్చి ఇబ్బందులు పడ్డాడు . ఇలా రామ్ గోపాల్ వర్మ కూడా అన్ని బాలారిష్టాలు దాటుకున్న తర్వాతనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు .

సరే , మళ్ళీ యువ దర్శకుడు వినీత్ విషయానికి వస్తే , నిజ జీవితంలో కూడా సినిమాల మీద ప్యాషన్ తో హ్యాండీ కెమెరాలతో షార్ట్ ఫిలిమ్స్ తీస్తూ కెరీర్ మొదలుపెట్టిన కొంతమంది యువ దర్శకులు ఉన్నారు . డీజే టిల్లు మూవీ తీసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విమల్ కృష్ణ తన కెరీర్ మొదట్లో వైజాగ్ రోడ్ల మీద హ్యాండీ కెమెరాతో షార్ట్ ఫిలిమ్స్ చేసినవాడే . ఇందులో హీరో వినీత్ మాధవన్ మాదిరే అతడు కూడా సినీ కెరీర్ తొలినాళ్లలో సినీ ఇండస్ట్రీలో కష్టాలు ఎదుర్కున్నాడు . చివరికి స్వయంకృషితో సక్సెస్ అయ్యాడు . మాలీవుడ్ మూవీ చూస్తే నేటి యువ దర్శకులకు తమ కెరీర్ తొలినాళ్ళు ఖచ్చితంగా గుర్తుకొస్తుంది . ఔత్సాహిక దర్శకులు ఈ మూవీ చూస్తే ఒక గైడ్ మాదిరి పనిచేస్తుంది .

ఎందుకంటే సినిమా రంగంలో రాణించాలంటే కేవలం మనదగ్గర టాలెంట్ ఉంటే సరిపోదు. ఆ రంగంలో ఉన్న పోటీలను తట్టుకోవాలి . రాజకీయాలను , వ్యాపార ఆలోచనలను పసిగట్టగలగాలి . ప్రభుత్వానికి కట్టాల్సిన పన్ను ఎగ్గొట్టడానికి నిర్మాతలు తమను పావుగా వాడుకోకుండా యువ దర్శకులు జాగ్రత్త పడాలి . ముఖ్యంగా కష్టపడి తాము రాసుకున్న స్క్రిప్ట్ ను వేరొకరు కాపీ కొట్టకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి . ఫిలిం మేకింగ్ లో తమ ఐడియాలను , థీమ్ ను ఎవరికీ తెలియకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి . మలయాళ టాప్ దర్శకుడిగా ఎదగాలనుకున్న వినీత్ కు ఎదురైన అనుభవాలు ఇవే . వీటినే దర్శకుడు ఎటువంటి మొహమాటాలకు పోకుండా ఉన్నదిఉన్నట్టుగా చూపించాడు .

ఫస్టాఫ్ లో వినీత్ చిన్నతనం , సినిమాల పట్ల అతడికున్న ప్యాషన్ , టాప్ డైరెక్టర్ గా ఎదగాలనుకున్న అతడి లక్ష్యం , ఆ లక్ష్యానికి తోడుగా నిలిచిన స్నేహితుడు , వీడియో క్యాసెట్ ఓనర్ , షార్ట్ ఫిలిమ్స్ తీయడం వంటి సన్నివేశాలతో కధనం చకచకా పరుగులు పెడుతుంది .

ఇక సెకండాఫ్ కి వచ్చేసరికి సినిమా కష్టాలు మొదలౌతాయి . వినీత్ టాలెంటును అందరూ మెచ్చుకుంటారు కానీ అతడు సక్సెస్ అవ్వడు . ఈ క్రమంలో వచ్చే కొన్ని సన్నివేశాలు సాగతీతలా అనిపించడమే కాకుండా బోర్ కూడా కొడుతుంది . ఎంతసేపూ అతడు పడే సినిమా కష్టాలు చూసి చూసి వినీత్ తో పాటు ప్రేక్షకులకు కూడా విసుగు వస్తుంది . అంతులేని కథ లాగ వినీత్ ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు కానీ సినీ ఇండస్ట్రీలో ఉండే రాజకీయాల వల్ల సక్సెస్ కాలేకపోతాడు . కనీసం క్లైమాక్సులో అన్నా వినీత్ సినిమా కష్టాలకు ముగింపు పలికి లక్ష్యం సాధించిన యువ దర్శకుడిగా చూపించి ఉంటే ఇన్స్పిరేషన్ గా ఉండేది . దర్శకుడు హీరో ఫెయిల్యూర్స్ మీద ఫోకస్ పెట్టినంతగా అతడి విజయాల మీద ఫోకస్ పెట్టలేదు . ఇంతాచేసి ముగింపులో హీరోగారికి సెకండ్ ప్రైజుతో సరిపెట్టారు . ఓవరాల్ గా సెకండాఫ్ లో ఆఖరి ఇరవై నిమిషాలు బాగుంది .

ఎవరెలా చేసారు ?

ఈ సినిమా అంతా వినీత్ మాధవన్ చుట్టూ తిరుగుతుంది . తన టాలెంటును నిరూపించుకుని సినీ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ కావాలనే లక్ష్యం కలిగిన కుర్రాడి పాత్రలో నస్లేన్ నటన బాగుంది .
సచిన్ క్యారక్టర్ డిజైన్ చేసిన తీరు బాగుంది . టాప్ ప్రొడ్యూసర్ బషీర్ పాత్రలో వినీత్ శ్రీనివాసన్ , హీరో స్వరూప్ పాత్రలో నటించిన బేసిల్ జోసెఫ్ నటనలు కూడా బాగుంది .

సాంకేతికత

కేసి బాలసారంగన్ అందించిన సంగీతం బాగానే ఉంది .
విశ్వజిత్ అందించిన ఫోటోగ్రఫీ బాగుంది .
నిర్మాణ విలువలు కూడా బాగానే ఉన్నాయి .

విశ్లేషణ

సినిమాల మీద ప్యాషన్ ఉన్నవాళ్ళకి ఈ సినిమా నచ్చుతుంది . లక్ష్యం సాధించుకునే దిశలో ఔత్సాహిక దర్శకుడు పడే శ్రమ నేపథ్యంలో ఫస్టాఫ్ సాగుతుంది . రైటర్ వైకోమ్ డేవిడ్ పాత్ర పరిచయం , సచిన్ , వినీత్ ల చిన్ననాటి లక్ష్యాలతో మూవీ ప్రారంభించిన తీరు ఆకట్టుకుంటుంది . సెకండాఫ్ లో సినిమా కష్టాలు ఎక్కువ అవడంతో మనకు కొద్దిగా బోర్ కొడుతుంది .
imdb లో 10 కి 7.3 రేటింగ్ తెచ్చుకుంది . జియో హాట్ స్టార్ లో తెలుగులో కూడా అందుబాటులో ఉంది .


నటీనటులు : నస్లేన్ , బేసిల్ జోసెఫ్ , వినీత్ శ్రీనివాసన్ తదితరులు
సంగీతం : కేసి బాలసారంగన్
సినిమాటోగ్రఫీ : విశ్వజిత్
నిర్మాత : ఆషిక్ ఉస్మాన్
దర్శకత్వం : అభినవ్ సుందర్ నాయక్
విడుదల : జియో హాట్ స్టార్ ( 03-07-2026 )
రేటింగ్ : 2.75 /5


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!