ఆన్లైన్లో ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ రావడం అంత తేలిక కాదు !

Spread the love

“సార్ ! నమస్తే ..ఫామిలీ మెంబర్ సర్టిఫికెట్ కావాలి సార్”
“ఓకే .. ఫ్యామిలీ మెంబెర్ సర్టిఫికెట్ ఎవరికి ?”
“నాకే కావాలి సార్”
“పర్పస్ ఏంటి ?”
“ఫ్యామిలీ మెంబెర్స్ కోసం సార్”
“నేను అడిగింది అది కాదు .. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ దేనికోసం అడుగుతున్నారు?”
“అవసరం పడింది సార్”
“బ్యాంక్ వాళ్ళు అడిగారా ?”
“అదీ .. హ .. అవును సార్”
“మీ ఫ్యామిలీ హెడ్ ఎక్స్పైర్ అయ్యారా ?”
“అవును సార్”
“ఏం చేసేవారు ?”
“గవర్నమెంట్ ఆఫీసర్ సార్”
“ఓహో.. బ్యాంకులో డిపాజిట్లు అవీ బాగానే ఉండి ఉంటాయి కదా” ( వ్యంగ్యంగా )
“లేదు సార్ .. ఒక బ్యాంకులో డిపాజిట్ ఉంది కానీ నామినీ రాయడం మర్చిపోవడంతో బ్యాంక్ మేనేజర్ ఫ్యామిలీ సర్టిఫికెట్ అడుగుతున్నారు” .
“అవును .. ఒకటైనా , వందైనా ఫ్యామిలీ సర్టిఫికెట్ కావాల్సిందే” ( మళ్ళీ వ్యంగ్యంగా )
“పెద్ద అమౌంట్ కూడా ఏమీ లేదు సార్”
“మరి వదిలేయపోయారా ?” ( ఎగతాళిగా )
“ఒక్కటైనా లీగల్ గా మాకే చెందాలి కదా సార్”
“ఓహో ..మీది ఓన్ హౌసా ?”
“అవును సార్”
“అందుకే సర్టిఫికెట్ కోసం వచ్చారా ?”
“అర్ధం కాలేదు సార్”
“సరే ..అప్లికేషన్ నింపి మీ సేవలో అప్లై చేసి ఓసారి నన్ను కలవండి”
“నేను వేరే ఊర్లో జాబ్ చేస్తున్నాను సార్ .. మళ్ళీ రావడం వీలు పడదు . అన్ని డాక్యుమెంట్లతో మీ సేవ ఆన్లైన్లో అప్లై చేస్తాను . కొద్దిగా సర్టిఫికెట్ వెంటనే జెనరేట్ అయ్యేలా చూడండి సార్” .
“ఏంటీ ? మీరు ఆన్లైన్లో అప్లై చేయగానే ఫ్యామిలీ సర్టిఫికెట్ వచ్చేస్తుందని అనుకుంటున్నారా?”
“అదేంటి సార్ .. అప్లికేషన్ తో పాటు మా ఫ్యామిలీ మెంబెర్స్ ఆధార్ , రేషన్ కార్డు , ఓటర్ ఐడి కార్డు అన్నీ అప్లోడ్ చేస్తాం కదా సార్ ? ఆ డాక్యుమెంట్స్ సరిపోతాయి కదా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ ఇవ్వడానికి ?”
“ఆ డాక్యుమెంట్స్ ఒరిజినలే అని గ్యారంటీ ఏంటి ? ఫేక్ అయి ఉండొచ్చు కదా ?”
“గెజిటెడ్ ఆఫీసర్ చేత అటెస్టేషన్ చేయిస్తాను సార్”
“అవి ఎలాగూ చేయించాలి .. అసలు ఆ అడ్రస్ లో మీరు ఉంటున్నారని గ్యారంటీ ఏంటి ?”
“ఆధార్ లో ఉంటుంది కదా సార్”
“ఆధార్ అడ్రస్ ఎప్పుడు కావాలంటే అప్పుడు చేంజ్ చేసుకోవచ్చు కదా ?”
“మరి ఏం చేయాలి సార్ ?”
“ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత నన్ను కలవండి”
“ఎందుకు సార్ ?”
“ఇంత చెప్పినా అర్ధం కాలేదా ? నేను పర్సనల్ గా సైట్ విజిట్ వచ్చి మీరిచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టా ? కాదా ? నిర్దారించుకోవాలి . అన్నీ సరిగా ఉంటేనే ఫ్యామిలీ సర్టిఫికెట్ వస్తుంది” .
“ఫ్యామిలీ సర్టిఫికెట్ రావడానికి ఎన్ని రోజులు పడుతుంది సార్ ?”
“మీరు గవర్నమెంట్ ఆఫీసుకి రావడం ఇదే మొదటిసారా ?”
“అవును సార్ .. ఇంతకుముందు ఎప్పుడూ అవసరం పడలేదు”
“ఇప్పుడు అవసరం పడిందిగా .. ఎదుటివారి అవసరాలు ఏంటో కూడా కనుక్కోవాలి” ( చిన్నగా నవ్వుతూ అన్నాడు )
“సరే సార్ అర్థమైంది .. ఇప్పుడు నేనేం చేయాలో చెప్పండి”
“బయట తెల్లచొక్కా వేసుకున్న ఒక మనిషి ఉంటాడు . అతడ్ని కలవండి . మీరు ఏం చేయాలో చెప్తాడు . ‘ డోర్ విజిట్ ‘ అయ్యాక మీరు ఎప్పుడు రావాలో అతడే చెప్తాడు” .
“అర్థమైంది సార్.. కొంచం త్వరగా డోర్ విజిట్ చేయండి సార్ .. నాకు ఎక్కువ రోజులు లీవ్ దొరకదు ..పనులు ముగించుకుని డ్యూటీలో జాయిన్ అవ్వాలి “
“సరే ముందు బయట ఉన్న తెల్ల చొక్కా ఆయన్ని కలవండి”
“సరే సార్”

ఇంకొక మితృడిది వేరొకరకమైన అనుభవం .

సరే , రాష్ట్రంలో ఉంటే ఎలాగోలా ఒకరోజు అటుఇటుగా తిప్పలు పడి ఉండి పనిపూర్తి చేసుకోవచ్చు . కానీ తల్లితండ్రులు ఇక్కడ ఉండి , పిల్లలు విదేశాల్లో ఉంటే సర్టిఫికెట్ కోసం వాళ్ళు పడే కష్టాలు వర్ణనాతీతం . ఇలా అప్లై చేసి అలా ఇన్స్టంట్ గా సర్టిఫికెట్ పొందే సదుపాయం కొన్ని అప్లికేషన్లకు ఉంది కానీ ఫ్యామిలీ సర్టిఫికెట్ కు లేదు .

అమెరికానుంచి వచ్చిన అతడికి ఇండియాలో ఆధార్ లేదు . ఆధార్ లేదన్న ఒక్క పాయింటే కానీ తాను వారసుడు అని నిరూపించుకోవడానికి కావాల్సిన ఆధారాలు అన్నీ ఉన్నాయి . కానీ ఏ పనికావాలన్నా వ్యవస్థలకు కావాల్సింది అన్నిటికన్నాముందు ఆధార్ . అక్కడినుంచే ప్రతిపనీ అడుగు ముందుకు పడుతుంది . దానితో పని మళ్ళీ మొదటినుంచి మొదలుపెట్టాలి . అఫిడవిట్లు , నోటరీలు చేయించాలి . ఒకవేళ పాత ఆధార్ ఉంటే దాని అప్డేట్లు వగైరా , వగైరా పేపర్ వర్కులన్నీ చేసుకోవాలి . విదేశాల నుంచి వచ్చేవాళ్ళకి ఈ ప్రాసెస్ కొంచం అసౌకర్యం కలిగిస్తుంది . అయినా ఆ సర్టిఫికెట్ తో చాలా విషయాలు ముడిపడి ఉంటాయి కాబట్టి తప్పదు .

చదివారుగా .. ఫ్యామిలీ సర్టిఫికెట్ కోసం ప్రభుత్వ ఆఫీసు గడప తొక్కిన ఇద్దరు మిత్రుల అనుభవాలు . సర్టిఫికెట్ కోసం అప్లై చేసిన అందరి అనుభవాలు ఇలా ఉండకపోవచ్చు . అలాగే ఫ్యామిలీ సర్టిఫికెట్ ఇస్స్యూ చేసే అందరు ఆర్ ఐ లు , వి ఆర్ ఓ లు ఇలాగే ఉండకపోవచ్చు . కానీ ఫ్యామిలీ సర్టిఫికెట్ కోసం ఆన్లైన్లో అప్లై చేసుకుని , ఆన్లైన్లోనే సర్టిఫికెట్ డౌన్లోడ్ చేసుకునే మధ్యలో ఉండే ఇలాటి ప్రొసీజర్ వల్ల టైమ్ ఏ మాత్రం సేవ్ కాకపోగా చాలామందికి తలనొప్పులు , చిరాకులు తెచ్చి పెడతాయి . పేరుకే ఆన్లైన్ కానీ అసలైన పని ఆఫ్ లైన్లోనే ఉంటుంది . అదే కొన్ని సమస్యలకు కారణం అవుతుంది . ఈ మధ్య ఈ విధానంలో కొన్ని మార్పులు చేసారు కానీ దరఖాస్తుదారుల సమస్యలు పూర్తిగా తీరలేదు . ఇప్పటికీ కొంతమంది ఇబ్బందులు పడుతున్నారు .

ఇప్పుడు ఫ్యామిలీ సర్టిఫికెట్ అంటే ఏంటో చూద్దాం

కుటుంబ పెద్ద మరణిస్తే వారసులు బ్యాంకులలో డిపాజిట్లు క్లెయిమ్ చేసుకోవాలంటే ఫ్యామిలీ సర్టిఫికెట్ కంపల్సరీ . ఇది లేనిదే ఏ బ్యాంకులోనూ , పోస్టాఫీసులోనూ పనికాదు . అలాగే ప్రాపర్టీల విషయంలో కూడా లీగల్ హక్కుదారులు అని నిరూపించుకోవాలంటే ఈ ఫ్యామిలీ సర్టిఫికెట్ అవసరం ఉంటుంది . ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వ్యక్తి సర్వీసులో ఉండగానే మరణిస్తే వారసుల కోటాలో ఉద్యోగం పొందాలంటే ఈ ఫ్యామిలీ సర్టిఫికెట్ కావాలి.

గమ్మత్తు ఏమిటంటే అప్పటికే ఆధార్ ఉన్నా , ఓటర్ ఐడి ఉన్నా , రేషన్ కార్డు ఉన్నా , ఇవేమీ ఫ్యామిలీ మెంబర్ గా నిరూపించుకోవడానికి పనికిరావు . రేషన్ కార్డులో కుటుంబ సభ్యుల పేర్లు ఉన్నా లేటెస్ట్ కావాలి అనే నెపంతో తిరిగి ఫ్యామిలీ సర్టిఫికెట్ అడుగుతారు . ప్రభుత్వాలు ఈ ఫ్యామిలీ సర్టిఫికెట్ ను జారీ చేసే బాధ్యతను రెవెన్యూ డిపార్ట్మెంట్ చేతిలో పెట్టింది . ముందుగా ఆర్ ఐ / వి ఆర్ ఓ లకు అప్లికేషన్ చేరుతుంది . సదరు అధికారి ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి రిపోర్ట్ ఇస్తాడు . అతడి రిపోర్ట్ బేస్ చేసుకుని తహసీల్దార్ / ఎం ఆర్ ఓ సర్టిఫికెట్ కు ఆమోదముద్ర వేస్తారు . వారి స్టాంప్ పడిన తర్వాత ప్రభుత్వ పోర్టల్ లో అప్లోడ్ చేస్తారు . ఆ తర్వాతనే అప్లికెంట్ సర్టిఫికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి వీలు పడుతుంది . దీనికి టైమ్ లిమిట్ గడువు ఉన్నా టైముకు పని పూర్తిఅయిన దాఖలాలు చాలా తక్కువగా ఉన్నాయి .

మరి ఏం చెయ్యాలి ?

ఈ విధానంలో ప్రభుత్వాలను తప్పు పట్టడానికి కూడా ఏమీ లేదు . ముఖ్యమైన సర్టిఫికెట్ల కోసం ఆన్లైన్లో ఇలా అప్లై చేసుకుని అలా సర్టిఫికెట్ డౌన్లోడ్ కావడం వంటి సదుపాయం ఏ వ్యవస్థలోనూ సాధ్యం కాదు . మరీ ముఖ్యంగా కొన్ని డాక్యుమెంట్లు పర్సనల్ గా వెరిఫై చేసిన తర్వాతనే ఇంపార్టెంట్ సర్టిఫికెట్లు ఇష్యూ చేయడం అనేది భద్రత పరంగా అవసరమే కానీ ఆ పేరుతో కాలయాపన జరిగితే ఇబ్బందులు పడేది దరఖాస్తుదారులే . ఆన్లైన్ పేరుతో తిరిగి ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తుదారులను ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగకుండా చేసే ప్రత్యామ్నాయ మార్గాల మీద ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి.

మొక్కుబడి ఆన్లైన్ విధానాలు కాకుండా , పార్షియల్ ఆన్లైన్ విధానాలు కాకుండా దరఖాస్తుదారులు ప్రభుత్వ ఆఫీసులకు వచ్చే పని కూడా లేకుండా సంపూర్ణంగా ఆన్లైన్లోనే సంబంధిత ప్రక్రియ పూర్తయ్యేలా ప్రణాళికలు ఉండాలి . అప్పుడే ఆన్లైన్ ప్రక్రియకు సార్థకత ఉంటుంది . పౌర సేవలలో ప్రభుత్వ పారదర్శకతకు అర్ధం ఉంటుంది . అలా కాకుండా కేవలం అప్లై చేయడం వరకే ఆన్లైన్ కి పరిమితం చేసి మిగిలిన తంతు అంతా ఆఫ్ లైన్లో నడపడం వల్ల అవినీతికి ఆస్కారం ఇచ్చినట్టు అవడమే కాకుండా పౌరులకు పెద్దగా ఉపయోగం ఉండదు .

ఫ్యామిలీ సర్టిఫికెట్ అనే కాదు కొన్ని ఇతర ఆన్లైన్ సేవలు కూడా ఇదే పద్దతిలో ఉన్నాయి . ఇటువంటి లోపాలను సరిదిద్దుకోవాలంటే ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం ఉండాలి. మీరు చూడండి ఒక డిపార్ట్మెంట్ రోడ్లు వేసి వెళ్లిపోయిన తర్వాత ఇంకో డిపార్ట్మెంట్ ఆ రోడ్డును తవ్వి డ్రైనేజి లైన్ వేస్తారు . దీనివల్ల ఖర్చు తడిసి మోపెడు అవుతుంది . ఇదంతా ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లేకవడంతో వచ్చే తిప్పలు . అలాగే రేషన్ కార్డులు ఇచ్చేటప్పుడో , జనాభా వివరాలు నమోదు చేసేటప్పుడో కుటుంబ సభ్యుల వివరాలు ఎలాగూ నమోదు చేస్తారు . ఇటువంటి వివరాలను డిజిటలైజ్ చేసి భద్రపరిస్తే కావాల్సినవారు ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకుంటారు . వీటికి అయ్యే ఛార్జీలను సంబంధిత శాఖ దరఖాస్తుదారుల నుంచి వసూలు చేయొచ్చు . ఈ విషయంలో ప్రభుత్వాలు దృష్టి పెట్టి దరఖాస్తుదారులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పనిలేకుండా పౌర సేవలను పూర్తిగా ఆన్లైన్లోనే పొందేలా ప్రణాళికలు రూపొందించాలి .


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!