‘ఆ రాత్రి ఏం జరిగింది ?’ హర్రర్ థ్రిల్లర్ కామెడీ స్టోరీ !

Spread the love

అర్థరాత్రి హఠాత్తుగా కరెంట్ పోవడంతో అతడికి మెలుకువ వచ్చింది
టైమ్ చూసుకున్నాడు .. రాత్రి రెండుగంటలు దాటింది .
ఎక్కడో నక్కలు ఊళలు పెడుతున్నట్టు వినిపిస్తుంది .. అయినా అడవుల్లో ఉండే నక్కలు సిటీల్లోకి ఎందుకువస్తాయి ..నా భ్రమ కాకపోతే ? అనుకున్నాడు .
అంతలోనే కుక్కల ఏడ్పులు వినిపించాయి .. ఇది ఒరిజినల్ కానీ ఈ ఊరకుక్కలతో పెద్ద ఇబ్బందిగా ఉంది .. రేపు ఆ మున్సిపాలిటీ వాళ్ళకి కంప్లైంట్ చేయాలి అనుకున్నాడు .

ఇంతలో టక్.. టక్..అంటూ ఏదో చప్పుడు మొదలైంది..కుక్కలు , నక్కలు సరే ..అచ్చం నేను స్టోరీలో రాసినట్టు అర్ధరాత్రి ఈ టక్ టక్ సౌండ్ ఏంటి ?

చుట్టూ చూసాడు
చిమ్మ చీకటిగా ఉంది

మళ్ళీ టక్.. టక్.. అని చప్పుడు..
ఈసారి చెవులు రిక్కించి విన్నాడు
హాల్లో నుంచి చప్పుడు వస్తుంది

మెల్లిగా బెడ్ మీద నుంచి లేచి చీకట్లోనే తడుముకుంటూ టేబుల్ దగ్గరికి వెళ్ళాడు
టేబుల్ మీద ఉన్న క్యాండిల్ వెలిగించాడు
ఒక్కసారిగా గదంతా వెలుగు పరచుకుంది

ఉలిక్కిపడ్డాడు.. ఎదురుగా గోడ మీద ఎవరిదో నీడ..కెవ్వున కేక పెడదాం అనుకున్నాడు..కానీ
గొంతు పెగల్లేదు

భయంతో గట్టిగా కళ్ళుమూసుకున్నాడు
గోడ మీద నీడ కూడా కళ్ళు మూసుకుంది
అప్పుడు అర్థమైంది అది తన నీడే అని..

ఈలోపు గాలికి బల్లమీదున్న కాగితాలు రెపరెపలాడాయి..
ఎగిరిపోకుండా కాగితాల మీద చెయ్యి పెట్టాడు
తను రాసిన చీకట్లో చిమచిమ హార్రర్ స్టోరీ లాస్ట్ పేజీ బ్లాంక్ గా ఉంది

అప్పుడు గుర్తుకొచ్చింది
రాత్రి పడుకోబోయే ముందు క్లైమాక్స్ రాద్దామనుకుని ఎంతకీ థాట్ రాక క్వార్టర్ బ్రాందీ తాగి పడుకున్న సంగతి . స్టోరీ మొత్తం రాసినా ముగింపు ఎంతకీ తట్టి చావకపోవడంతో కాగితాలు బల్ల మీదే ఉండిపోయాయి .

మళ్ళీ టక్.. టక్.. చప్పుడు
“ఎవరిదీ?” అని అరిచాడు మెల్లిగా
అట్నుంచి సమాధానం లేదు

అర్థరాత్రి తన ఫ్యాన్స్ లో ఎవడన్నా సైకో కిల్లర్ గాడు దూరాడా అని అనుమానం వచ్చింది
మళ్ళీ ” ఎవరిదీ?” అని అరిచాడు
రెండు క్షణాలు నిశ్శబ్దం
అంతలోనే టక్.. టక్.. టక్.. టక్.. చప్పుళ్ళు పెరిగాయి.

ఏదైతే అదయ్యిందని ఒక చేత్తో క్యాండిల్ పట్టుకుని హాల్లొకి వెళ్ళాడు.. హాల్లో గాలికి కిటికీ రెక్కలు టక్.. టక్ మని కొట్టుకోవడం చూసి హమ్మయ్య అనుకున్నాడు.. మెల్లిగా వెళ్ళి కిటికీ రెక్కలు వేసేసాడు .

అదే టైములో రివ్వున గాలి వీచి క్యాండిల్ ఆగిపోయింది
మళ్ళీ చిమ్మ చీకటి

అగ్గిపెట్టె బెడ్ రూంలో టేబుల్ మీదే ఉండిపోయింది
మెల్లిగా చీకట్లో తడుముకుంటూ బెడ్ రూమ్ వైపు బయలుదేరాడు

ఇంతలో ట్యాప్ నుంచి నీళ్లు కారుతున్న శబ్దం..
సడెన్గా ఆగిపోయాడు .

ఇంట్లో నేనొక్కడ్నే ఉన్నా కదా? మరి ఎవడు దూరాడు.. ట్యాప్ ఎవడు తిప్పాడు?..ఎవడైనా కావాలని ఇలా చేస్తున్నాడా ? హర్రర్ స్టోరీలు రాసి భయపెడుతున్నాని మనసులో పగ పెంచుకుని ఎవడో సైకో గాడు నన్ను భయపెట్టాలని ఇంట్లో దూరాడా?

ఆలోచిస్తూనే మరోసారి చెవులు రిక్కించి విన్నాడు
వాష్ రూమ్ నుంచి ట్యాప్ సౌండ్ వస్తుంది

“ఎవరిదీ?” అని అరిచాడు భయంగా..
అట్నుంచి నిశ్శబ్దం
ఇంతలో ఫెళఫెళ మంటూ శబ్దం
ఉలిక్కిపడి చూసాడు
కిటికీ అద్దంలోనుంచి ఆకాశంలో ఉరుములు కనిపించాయి
ఆశ్చర్యంగా ట్యాప్ సౌండ్ కూడా ఆగింది .

మెరుపుల సౌండుకి భయపడి దొంగవెధవ ట్యాప్ కట్టేసి ఉంటాడు.. వీడి పని కరెంట్ వచ్చాక తేల్చాలి .. అనుకుంటూ మళ్ళీ మెల్లిగా నడవడం మొదలుపెట్టాడు .

ఇంతలో కాలికి ఏదో తగులుకుంటూ వెళ్ళింది ..ఏంటది ? పామా ? నో ..పాము అయ్యుండదు.. పాము అయితే కాటేసి వెళ్లిపోయేది కదా ? అయినా ఇంట్లోకి పాము ఎందుకు వస్తుంది ? మరేమి అయ్యుంటుంది ? .. ఏ పిల్లో ..ఎలకో అయ్యుంటుంది..అయినా ఈ చీకట్లో ఏం చూస్తాం ? కరెంట్ వచ్చాక చూడొచ్చులే అనుకుంటూ ,

మెల్లిగా బెడ్ రూంలోకి వచ్చి అగ్గిపెట్టె తీసుకుని క్యాండిల్ వెలిగించి కళ్ళు మూసుకున్నాడు
మళ్ళీ ఆశ్చర్యం.. ఈసారి గోడమీద నీడ కనిపించలేదు.. నమ్మలేక నాలుగు గోడలూ చూసాడు.. నీడ లేదు .

హమ్మయ్య నీడ పారిపోయింది అనుకుంటూ ఇటు తిరిగి షాక్ అయ్యాడు.. కాళ్ళ కింద నేల గిర్రున తిరుగుతున్నట్టు అనిపించింది .

ఎదురుగా ఎవరో మనిషి నిలబడి ఉన్నాడు .

గొంతు తడారిపోయింది .. నాలుక పిడచకట్టుకుపోతుంది ..కిందపడిపోకుండా ఉండటానికి అప్రయత్నంగా బల్లపట్టుకుని ఆగిపోయాడు
ఆ మనిషి కూడా బల్లపట్టుకుని ఆగిపోయాడు .

కళ్ళు నులుముకుని చూసాడు .. కొంపదీసి రాత్రి తాగింది దిగలేదా ? ఇన్నన్ని హర్రర్ స్టోరీలు రాసి వాటిల్ని బ్యాడ్ చేసానని దయ్యాలన్నీ నా మీద కక్ష కట్టాయా ? ఇకనుంచి నన్ను కూడా చెట్టుతొర్రలోకి తీసుకెళ్తాయా ? ఇకపై నేను స్టోరీలు అక్కడే కూర్చుని రాయాలా ? పాడు ఆలోచనలతో అతడి బుర్ర పాడయ్యింది .

మరోసారి కళ్ళునులుముకుని చూసాడు
ఎదురుగా అద్దం.. ఓహ్ ..ఇంతవరకు అద్దంలో నన్ను నేనే చూసుకుని కంగారు పడిపోయానన్నమాట .. థాంక్ గాడ్ .. ఇంకానయం నా స్టోరీలోలాగా హెల్ప్ ..హెల్ప్ ..అంటూ కేకలు పెట్టుకుంటూ వీధిలోకి వెళ్ళాను కాదు.. ఇంతపెద్ద రైటర్ అయిఉండి మీరేంటి సార్ ? ఇలా భయపడిపోయారు ? అని ఫాన్స్ నవ్వుకునేవారు కాదూ? తన ఆలోచనకి తనకే నవ్వొచ్చింది .

ఎలాగైనా సరే నా భయాన్ని ఫాన్స్ కి తెలియకుండా ఫాన్స్ నే భయపెట్టేలా ఈ చీకట్లో చిమచిమ స్టోరీ పూర్తిచేయాలి .. కానీ క్లైమాక్స్ ఎలా రాస్తే బాగుంటుంది ? ఎలా రాస్తే రీడర్స్ భయపడతారు ? పోనీ ఇంకో రెండు పెగ్గులు వేస్తే ఐడియాలు ఏమన్నా వస్తాయేమో ? అయినా అసలే కరెంట్ పోయింది ..చీకట్లో ఏవేవో శబ్దాలు వినిపిస్తున్నాయి . ఇందాక కాళ్లదగ్గర ఏదో పాక్కుంటూ పోయింది . ఒకవేళ పామయితే మందు తాగి పడిపోయిన నన్ను కాటేస్తే ? వామ్మో ..వద్దులే ..క్లైమాక్స్ రేప్పొద్దున రాయొచ్చులే అనుకుంటూ బల్ల మీద చూసి భూకంపం వచ్చినవాడిలా అటూఇటూ ఊగిపోయాడు

పక్కలో బాంబు పడ్డట్టు గజగజా వణికిపోయాడు.. నుదుటి నుంచి చెమట చుక్క జారి నేల మీద పడి టప్ మని సౌండ్ వచ్చింది.. ఆ చిన్న సౌండుకే చేతులు కాళ్ళు వణకడం మొదలైంది .

బల్లమీద ఇందాక తాను చూసిన స్టోరీ లాస్ట్ పేజ్ ఉంది ..కానీ బ్లాంక్ గా కాదు .

తాను రాసిన హార్రర్ స్టోరీలో రాయకుండా మిగిలిపోయిన ఆఖరి పేజీ మీద ‘అసలు కథ ఇప్పుడే మొదలైంది’ అని ఎర్రటి అక్షరాలతో రాసి ఉంది . స్టోరీకి ముగింపు రాయాల్సింది నేను కదా? మరి వీడెవడు అసలు’ కథ ఇప్పుడే మొదలైంది ‘ అని రాసేసాడు . అసలు కథ మొదలవడం అంటే అర్ధం ఏంటి ? అంటే ఇప్పటిదాకా నేను రాసింది ఏంటి ? అసలు సిసలు హర్రర్ స్టోరీ వేరే ఉందా ? ఇంతకీ వీడెవడు ?

కొంపదీసి ఘోస్ట్ రైటరా?
ఘోస్ట్.. ఘోస్ట్..
ఆ పదం తలచుకోగానే వెన్నులోనుంచి చలి మొదలైంది
ఇంతలో సడెన్గా దడేల్మని పెద్దగా సౌండ్ వచ్చింది
భయంతో హార్రర్ రైటర్ కుప్ప కూలాడు

***

మర్నాడు పొద్దున టీవీల్లో బ్రేకింగ్ న్యూస్

రాత్రి ఉరుములు మెరుపులతో కురిసిన భారీ వర్షం నగరాన్ని ముంచెత్తింది . అంతేకాదు నిర్జన ప్రదేశంలో పిడుగు పడటంతో పెద్ద ప్రమాదం తప్పింది

ఇప్పుడే అందిన వార్త ప్రముఖ హార్రర్ నవలల రచయిత కత్తి కనకారావు గారు అకస్మాత్తుగా రాత్రి తన ఇంట్లో కుప్పకూలి కోమాలోకి వెళ్లిపోయారని తెలిసింది.. ఆయనకు మెలుకువ వస్తే కానీ ఏం జరిగిందో చెప్పలేమని డాక్టర్లు అంటున్నారు.

అత్యంత ధైర్యస్తుడైన తమ అభిమాన హార్రర్ నవలల రచయిత మీద ఎవరో కుట్ర చేసి ఉంటారని ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు . ఏదిఏమైనా సదరు హార్రర్ రైటర్ గారికి మెలుకువ వస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయని మా ప్రతినిధి అంటున్నారు

***

ఆరునెలల తర్వాత రైటర్ గారు కోమాలోనుంచి బయటికి వచ్చారు
డాక్టర్లు , పోలీసులు , మీడియావాళ్లు , అభిమానులు ఆయన చుట్టూ మూగారు .

“చెప్పండి రైటర్ గారు ..అసలు ఆ రోజు ఏం జరిగింది ? ఏం చూసి మీరు షాక్ అయ్యారు ? ప్రశ్నలమీద ప్రశ్నలు సంధించారు మీడియావాళ్లు

” నేను రైటర్ గా ఎదుగుతుండటం చూసి నా ప్రత్యర్థి రైటర్లు ఓర్వలేక కుట్రలు పన్ని నా మీదకు పామును వదిలారు ” ఎగ్జైట్ అవుతూ చెప్పాడు రైటర్

” అది పాము కాదు ..పిల్లి .. మీ ఇంట్లో పిల్లి పిల్లలను పెట్టింది ” అక్కడే ఉన్న ఓ పోలీస్ చెప్పాడు

” మరి మా ఇంట్లో వాష్ రూంలో ట్యాప్ తిప్పిన ఆగంతకుడు కూడా పిల్లేనా ?” కోపంగా అడిగాడు రైటర్

“మీ వాష్ రూంలో ట్యాప్ రిపేర్ కి వచ్చింది . ప్లంబర్ వచ్చి రిపేర్ చేసి సరిచేసాడు ..ఇప్పుడు ట్యాప్ లోనుంచి నీళ్లు రావడం లేదు ” అసహనంగా చెప్పాడు పోలీస్

“దఢేల్మని పెద్ద సౌండ్ వచ్చింది .. బహుశా నా మీద హత్యా ప్రయత్నం అయ్యుంటుంది..అది కూడా అబద్ధమేనా ? “

“మీ ఇంటికి దగ్గర్లో పిడుగు పడింది .. మీరు చూళ్ళేదా ? ఓహ్ ..మర్చిపోయాను .. మీరు అప్పటికే షాక్ తో కోమాలోకి వెళ్లిపోయారు కదా ? ఇంతకీ ఆ రాత్రి ఏం జరిగిందో చెప్పలేదు ?” వెటకారంగా అడిగాడు పోలీస్

ఆ రాత్రి ఏం జరిగిందంటే అంటూ ఒక్క క్షణం ఆలోచనలో పడ్డాడు రైటర్ . తన స్టోరీలో లాస్ట్ పేజీలో ఎవడో ఘోస్ట్ ‘ అసలు కథ ఇప్పుడే మొదలైంది ‘ అని ఎర్రటి అక్షరాలతో రాయడం గుర్తొచ్చి షాక్ తో మళ్ళీ కోమాలోకి వెళ్ళిపోయాడు

ఆ రోజు ఏమీ జరగకపోయినా రైటర్ ఎందుకు షాక్ లోకి వెళ్ళాడో అర్ధం కాక పోలీసులు , డాక్టర్లు తలలు పట్టుకున్నారు .

కానీ అప్పటిదాకా గదిలో ఒకమూల నుంచుని నిశ్శబ్దంగా ఇదంతా గమనిస్తున్న ఒక వ్యక్తి చిన్నగా నవ్వుకుంటూ మంకీ క్యాప్ సరిచేసుకుంటూ బయటికి నడిచాడు..
కొంపదీసి అతడు ‘ఘోస్ట్ ‘ రైటర్ కాదు కదా ? ఇంతకీ ఆ రాత్రి ఏం జరిగింది ?

ఇంతకుముందు నేను రాసిన మర్డర్ మిస్టరీ క్రైమ్ స్టోరీ బాగుందని చాలామంది అభిప్రాయాలు పంచుకున్నారు . అందుకే అభిమాన రచ్చబండ కబుర్లు పాఠకుల కోసం నేను రాసిన మరో హర్రర్ థ్రిల్లర్ కామెడీ స్టోరీ ‘ ఆ రాత్రి ఏం జరిగింది ?’ . ఇది కూడా మీకు నచ్చుతుందనే ఆశిస్తున్నాను . చదివి మీ అభిప్రాయం తెలియచేయగలరు . ఈ రచన పూర్తిగా నా స్వంతం . ఇమేజ్ మాత్రం అంతర్జాలం నుంచి సేకరించడం జరిగింది .


పరేష్ తుర్లపాటి


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!