మరో మలయాళం సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ డోస్ ( DOSE ) ఈరోజు( జులై 10 ) ఓటిటిల్లోకి వచ్చేసింది . మలయాళం సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ఓటిటిలోకి వస్తుందనగానే అందరికళ్ళు ఏ డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి స్ట్రీమింగ్ కి వస్తుందో అని వెతుకుతాయి . ఎందుకంటే మలయాళం థ్రిల్లర్ సినిమాలకు ఉన్న క్రేజీ అటువంటిది .
సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీలు తీయడంలో మలయాళం దర్శకులు ముందు ఉంటారనేది వాస్తవం . అయితే అదే సమయంలో కొంతమంది మలయాళం దర్శకులు అత్యుత్సాహంతో బోల్తా పడతారనేది కూడా వాస్తవం . దానర్థం మలయాళంలో వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ మూవీలన్నీ మెప్పిస్తాయని కాదు . అన్ని సినిమాల్లో ఉన్నట్టే వాటిలో కూడా కొన్ని లోటుపాట్లు ఉంటాయి . విమర్శకులు అటువంటి లోటుపాట్లను ఎత్తిచూపించినప్పుడే ఏ భాషలో అయినా మున్ముందు మరిన్ని మంచి సినిమాలు వస్తాయి .
ఈరోజు అమెజాన్ ప్రైమ్ ఓటిటిలో తెలుగులో కూడా అందుబాటులోకి వచ్చిన డోస్ మూవీ ఎలా ఉందో చూద్దాం .
కధేంటంటే ?
వైద్య విద్య చదువుకుంటున్న ప్రకాష్ (సిజు విల్సన్ ) , అరుంధతిలు ( దృశ్య రఘునాథ్ ) ప్రేమలో పడతారు . అయితే వీరి ప్రేమకు ఇంట్లో పెద్దలు ఒప్పుకోకపోవడంతో ప్రకాష్ తన ప్రేమకు బ్రేకప్ చెప్తాడు . అప్పటికే ప్రెగ్నెంట్ అయిన అరుంధతి ప్రకాష్ దూరం అవడంతో డ్రగ్స్ కు బానిస అవుతుంది .
కట్ చేస్తే ,
ప్రకాష్ రజిత అనే అమ్మాయిని పెళ్ళిచేసుకుని వాసుదేవన్ సీఈఓ గా ( జగదీశ్ ) ఉన్న MCH కార్పొరేట్ హాస్పిటల్లో పల్మనాలజిస్ట్ గా ప్రాక్టీస్ మొదలుపెడతాడు . అరుంధతి కూడా ఒక మీడియా పెర్సన్ ని పెళ్ళిచేసుకుని అదే హాస్పిటల్లో కార్డియాలజిస్టుగా జాయిన్ అవుతుంది . అయితే ఆ హాస్పిటల్లో డాక్టర్ ప్రకాష్ వద్ద ట్రీట్మెంట్ పొందుతున్న ఇద్దరు పేషేంట్లు అనూహ్యంగా అనుమానాస్పదంగా మరణిస్తారు . మొదట అందరూ వాళ్ళిద్దరిదీ నాచురల్ డెత్ అనుకుంటారు కానీ అదే తరహా అనుభవం మూడో పేషేంట్ కి కూడా ఎదురవడంతో ఎవరో కావాలని తన పేషేంట్లను మర్డర్ చేస్తున్నారని డాక్టర్ ప్రకాష్ అనుమానపడతాడు . తమ ప్రేమకు బ్రేకప్ చెప్పానని కక్షతో అరుంధతి ఈ మర్దర్లు చేస్తుందని ప్రకాష్ అనుమానపడతాడు . దీంతో ఈ కేసులో మిస్టరీ ఛేదించడానికి సిఐ వివేక్ (అశ్విన్ కుమార్ ) రంగంలోకి దిగుతాడు .
హాస్పిటల్లో పేషేంట్ల వరుస మరణాలకు కారకులు ఎవరు ?
ప్రకాష్ మీద పగతో అరుంధతి ఈ హత్యలు చేస్తుందా ?
కేసును ఇన్వెస్టిగేట్ చేయడానికి రంగంలోకి దిగిన సిఐ వివేక్ మిస్టరీ గుట్టు విప్పుతాడా ?
ఇంతకీ కిల్లర్ ఎవరు ? అనేది మిగతా కథ .
ఎలా ఉంది ?
సినిమా ప్రారంభమే ప్రకాష్ , అరుంధతిలు లవ్ ట్రాక్ తో మొదలౌతుంది . ఇద్దరూ ఒకరినొకరు విడిపోలేనంతగా ప్రేమించుకోవడం , విడిపోయి బ్రేకప్ లు చెప్పుకోవడం వరకు చకచకా జరిగిపోతాయి . అయితే ఇద్దరూ లవ్ చేసుకోవడం వరకు ఓకే కానీ బ్రేకప్ చెప్పాలని ప్రకాష్ నిర్ణయం తీసుకోవడం వెనుక రీజన్ గట్టిగా లేదు . ఇంట్లో పెద్దవాళ్ళు ఒప్పుకోలేదు కాబట్టి , తల్లి హార్ట్ పేషేంట్ కాబట్టి , అనే రొటీన్ కుంటిసాకులతోనే అంత పెద్ద ప్రేమకు బిగినింగ్ లోనే బ్రేకప్ చెప్పేసాడు దర్శకుడు .
సరే , లవ్ ఫెయిల్యూర్ తర్వాత ఇద్దరూ తమకు నచ్చినవాళ్ళని పెళ్ళిచేసుకుని మ్యారేజ్ లైఫ్ లీడ్ చేస్తుంటారు . ఓకే హాస్పిటల్లో ఇద్దరూ డాక్టర్లుగా జాయిన్ అవడం , ప్రకాష్ భార్య ఏదో జబ్బుతో బాధపడుతూ ప్రకాష్ తో పాటే హాస్పిటల్లో ఉండటం వంటి రొటీన్ సన్నివేశాలతో ఫస్టాఫ్ మొదటి ముప్పై నిమిషాలకు పైగా నడుస్తుంది . ఇంతవరకు మనకు కథ మాజీ ప్రేయసి ప్రియుల తగాదాలాగా అనిపిస్తుంది . అప్పటికి క్రైమ్ ట్రాక్ ఎంటర్ అవదు .
ఈ మధ్యలో మన అటెన్షన్ డైవర్ట్ చేయడానికి దర్శకుడు అర్ధరాత్రి టెర్రస్ డ్రామా ఆడతాడు. ఆ హాస్పిటల్లో ఏదో జరుగుతుంది అని ప్రేక్షకులు అనుమానపడాలని దర్శకుడు ఆశించి టెర్రస్ ఎపిసోడ్లు ఇరికించినట్టు ఉంది కానీ ఆ సన్నివేశాల వల్ల థ్రిల్ ఏమీ క్రియేట్ కాలేదు .
అయితే హాస్పిటల్లో జరిగిన రెండు మరణాలను మర్దర్లుగా భావించి డాక్టర్ ప్రకాష్ సొంతంగా ఇన్వెస్టిగేషన్ మొదలెట్టడం , అరుంధతి ఈ హత్యలు చేస్తుందని అనుమానపడటం , ఇన్స్పెక్టర్ వివేక్ కూడా అరుంధతి మీదే అనుమానపడటం వంటి సన్నివేశాలు కధనాన్ని క్రైమ్ మోడ్ లోకి మలుపుతిప్పి ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది . ఎందుకంటే ఇక్కడ ప్రకాష్ , అరుంధతిల మధ్య ఉన్న విభేదాలు కథనానికి సింక్ అవుతాయి . ఇంతవరకు క్రైమ్ ట్రాక్ బాగానే నడిచింది . కానీ అదే సమయంలో కొన్ని ప్రశ్నలు కూడా ఉదయిస్తాయి . ఆ ప్రశ్నలు చివరలో చెప్పుకుందాం .
ఇందాక చెప్పుకున్న టెర్రర్స్ ఎపిసోడ్స్ కాకుండా మన అటెన్షన్ డైవర్ట్ చేయడానికి సీఈఓ మెడికల్ క్రైమ్ ట్రాక్ కూడా ఇరికించాడు . అంత పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ సీఈఓ ఇంకెవరూ దొరకనట్టు ఓ సెక్యూరిటీ గార్డుతో కలిసి ఇల్లీగల్ యాక్టీవిటీ ప్లాన్ చేయడం అస్సలు కుదరలేదు . సీఈఓ అండ్ సెక్యూరిటీ గార్డ్ క్రైమ్ ట్రాక్ ఎబ్బెట్టుగా అనిపిస్తుంది .
ఇక దర్శకుడు క్లైమాక్సులో చెప్పిన ట్విస్ట్ బాగానే ఉంది కానీ అందులో బలమైన సంఘర్షణ మిస్ అయ్యింది . కధకి అంతోఇంతో బలం ప్రీ క్లైమాక్స్ అయినప్పుడు దాన్ని మరింత జాగ్రత్తగా తెరకెక్కించడంలో దర్శకుడు విఫలం అయ్యాడు . పైగా తన భార్యకు అలా అయ్యిందని మిగిలిన పేషేంట్ల విషయంలో ప్రకాష్ తీసుకున్న నిర్ణయం జస్టిఫికేషన్ అనిపించదు . పైగా ఆ రీజన్ కూడా ప్రేక్షకులు వావ్ అని నోళ్లు తెరిచి థ్రిల్ అయ్యేంతగా ఏమీ ఉండదు.
సిఐ వివేక్ కి ఇచ్చిన భారీ ఎలివేషన్లు చూస్తే ఈ క్యారక్టర్ ఏదో మ్యాజిక్కులు చేసేస్తుందని అనుకుంటాం . కానీ చివరికి ఆ సిఐ కూడా హాస్పిటల్ బెడ్ మీద ఉంటాడు . దర్శకుడు వివేక్ క్యారక్టర్ కి ఎలివేషన్లు ఇచ్చినంతగా అతడి పాత్రను డిజైన్ చేయలేకపోయాడు . పైగా అతడు చేసిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చాలా రొటీన్ గా సాగుతుంది . హాస్పిటల్ స్టాఫ్ ను పిలిచి మాట్లాడటం, అరుంధతి తో లై డిటెక్టర్ టెస్ట్ చేయించడం మినహా అతడి ఇన్వెస్టిగేషన్లో కొత్తదనం ఏమీ లేదు .. థ్రిల్ కూడా పంచదు .ఇంకా చెప్పాలంటే ఆ సిఐ కన్నా ప్రకాష్ చేసిన ఇన్వెస్టిగేషనే ప్రొఫెషనల్ గా ఉంది .
ఇక దర్శకత్వ లోపాల గురించి చెప్పుకోవాలంటే కొన్ని ప్రశ్నలు వస్తాయి . సీఈఓ ఒకపక్కన హాస్పిటల్లో ఇల్లీగల్ యాక్టీవిటీస్ చేస్తూ , ఇంకోపక్క ఆయనే స్వయంగా ఎస్పీకి ఫోన్ చేసి హాస్పిటల్లో జరుగుతున్న మరణాల గురించి ఇన్వెస్టిగేట్ చేయమనడం , అలాగే డాక్టర్ ప్రకాష్ కూడా పోలీసులను , ఫోరెన్సిక్ ల్యాబులను వెతుక్కుంటూ వెళ్లడం , కధనానికి అదనపు సంఘర్షణ క్రియేట్ చేయలేకపోయాయి . అలాగే కొత్తగా ఎటువంటి థ్రిల్ ను కూడా పంచలేకపోయాయి .
ఒక సన్నివేశంలో సిఐ వివేక్ ను కలవాలని నిఖిల్ అనే పేషేంట్ తన ప్రియురాలికి చెప్తాడు. అప్పుడు ఆ పేషేంటుకి గడ్డం ఉండదు . గదిబయట ఉన్న సిఐ కి ఆ అమ్మాయి ఈ విషయం చెప్తుంది . సిఐ ఆ గదిలోకి వచ్చేసరికి ఆశ్చర్యంగా అతడికి గడ్డం ఉంటుంది .
ఇక డాక్టర్ ప్రకాష్ , సిఐ వివేక్ ల మధ్య ఫైటింగ్ సన్నివేశాలు మరీ నాసిరకంగా ఉంటాయి . ఇద్దరూ ముక్కులు , మూతులు పగిలేలా కొట్టుకుంటారు . ప్రకాష్ కొట్టిన దెబ్బలకు ఇన్స్పెక్టర్ కింద పడుకుంటాడు . ఈలోపు ప్రకాష్ ఎక్కడికి వెళ్తాడో తెలీదు . కాసేపటికి ఇన్స్పెక్టర్ కి మెలుకువ వచ్చిన తర్వాత ప్రకాష్ ఎక్కడ్నుంచో ఊడిపడతాడు . ఇద్దరూ మళ్ళీ కొట్టుకుంటారు .
ఇక ప్రకాష్ వేలిలో సిరంజ్ పెట్టాలనే ఐడియా దర్శకుడికి ఎలా వచ్చిందో కానీ అస్సలు కుదరలేదు . నిజానికి అతడు డాక్టర్ కాబట్టి ఇంజెక్షన్లు ఇవ్వాలంటే ఎవరికీ అనుమానం రాకుండా నేరుగానే ఇవ్వొచ్చు . అరుంధతి గతంలో కోసేసిన వేలిని దర్శకుడు ఈ విధంగా వాడారని మనం అనుకోవాలన్నమాట .
ఎవరెలా చేసారు ?
ముఖ్యంగా ఈ కథ అరుంధతి , ప్రకాష్ , ప్రకాష్ భార్యల చుట్టూ తిరుగుతుంది . సెకండాఫ్ లో ఇన్స్పెక్టర్ వివేక్ వీళ్ళకి యాడ్ అవుతాడు .
ప్రకాష్ పాత్రలో సిజు విల్సన్ నటన బాగానే ఉంది . ఒకపక్క ప్రొఫెషనల్ డాక్టర్ గా , ఇంకోపక్క నెగిటివ్ షేడ్ లోనూ అతడి బాడీ లాంగ్వేజ్ సరిపోయింది .
అరుంధతి పాత్రలో దృశ్య రఘనాథ్ బాగానే చేసింది . ముఖ్యంగా ప్రకాష్ బ్రేకప్ చెప్పినప్పుడు డ్రగ్స్ కి బానిస అయిన సన్నివేశంలోను , హాస్పిటల్లో డాక్టర్ గానూ పర్ఫెక్ట్ గా నటించింది .
ఇక ఇన్స్పెక్టర్ వివేక్ పాత్రను సరిగా డిజైన్ చేయకపోవడం వల్లనో ఏంటో కానీ అశ్విన్ కుమార్ నటన తేలిపోయింది .
మలయాళ నటుడు జగదీశ్ చక్కటి నటుడే కానీ ఇందులో దర్శకుడు అతడినుంచి నటన రాబట్టుకోవడంలో ఫెయిల్ అయ్యాడు .
సాంకేతికత
సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలకు సరైన బీజీఎమ్ అందించడంలో గోపి సుందర్ ముందుంటారు . ఇందులో కూడా గోపి సుందర్ అందించిన డోస్ సరిపోయింది .
విష్ణు ప్రసాద్ అందించిన ఫోటోగ్రఫీ బాగానే ఉంది .
నిర్మాణ విలువలు కూడా బాగానే ఉన్నాయి .
విశ్లేషణ
డోస్ ఒక సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ జానర్ మూవీ . నిజానికి ఈ జానర్లో మూవీలకు వ్యూయర్షిప్ ఎక్కువగా ఉంటుంది . కానీ కొన్ని దర్శకత్వ లోపాల వల్ల ఈ మూవీ అంతగా థ్రిల్ పంచలేదు . స్లో నేరేషన్ అనేది మన సహనానికి పెద్ద పరీక్ష పెడుతుంది . కధనంలో కొన్ని లాజిక్కులు మిస్ అవడం మైనస్ అవుతుంది .
ఇవ్వాల్సిన మెడిసిన్ డోస్ ఎక్కువైనా , తక్కువైనా పేషేంట్ రిస్కులో పడతాడు . కానీ డోస్ వికటిస్తే ప్రాణాలకే ప్రమాదం . ఇందులో డోస్ వికటించి కథ ప్రాణాలను తీసింది . అమెజాన్ ప్రైమ్ ఓటిటిలో తెలుగులో కూడా అందుబాటులో ఉంది కాబట్టి వన్ టైమ్ వాచ్ కింద ఓ లుక్ వేయండి .
నటీనటులు : సిజు విల్సన్ , దృశ్య రఘనాథ్ , జగదీశ్ , అశ్విన్ కుమార్ తదితరులు
సంగీతం : గోపి సుందర్
సినిమాటోగ్రఫీ : విష్ణు ప్రసాద్
నిర్మాత : శాంతో థామస్
దర్శకత్వం : అభిలాష్ ఆర్ నాయర్
విడుదల : అమెజాన్ ప్రైమ్ (10-07-2026 )
రేటింగ్ : 2.5 /5
